Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue316/812/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

 

(గత సంచిక తరువాయి)..... మిత్రవింద ఇంటి నుంచి బయటకు వచ్చిన అబ్బాస్ వెంటనే శ్రీనగర్ బయలుదేరాడు. అతను క్యాబ్ లో శ్రీనగర్ చేరుకునే సరికి మద్యాహ్నం నాలుగు గంటలైంది. నిజానికి అతను స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వచ్చాడు. అఫీషియల్ పని పూర్తయిన తరువాత ఆ విమానాన్ని వెనక్కి పంపించేశాడు. పర్సనల్ పనికి స్పెషల్ విమానం ఉపయోగించటం అతనికి ఇష్టం లేదు. అందుకే తన సిబ్బందిని ఆ విమానంలో ఇస్లామాబాద్ పంపించేశాడు.

తను రెండు రోజుల తరువాత వస్తానని తన సూపీరియర్ ఆఫీసర్స్ కు మెసెజ్ చేశాడు. క్యాబ్ ఫేర్ చెల్లించి లోపలికి నడిచాడు. అక్కడ నుంచి అతను తిన్నగా ఇస్లామాబాద్ వెళ్ళటం కుదరదు. ఇండియా నుంచి పాకిస్ధాన్ కు డైరక్టు ఫ్లయిట్ లేదు. సౌది అరేబియా వెళ్ళి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ లో వెళ్ళాలి. ఇది రెండు దేశాలకు చాల అసౌకర్యంగా ఉంది. ఈ విషయం గురించి ప్రాక్టికల్ గా తెలుసుకోవాలని అబ్బాస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఆ అవకాశం ఇప్పుడు కలిగింది. షెడ్యుల్ టైం ప్రకారం ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది. అదే రోజు అతను సౌది అరేబియా రియాద్ నుంచి ఇస్లామాబాద్ చేరుకున్నాడు. ఏయిర్ పోర్ట్ నుంచి అతను ఇంటికి వెళ్ళలేదు. తిన్నగా కల్నల్ ఆఫీసుకు వెళ్ళాడు. సెక్యురిటీ గురించి తను రాసుకున్న రిపోర్ట్ ను ఆయనకు ఇచ్చాడు. ఆ తతంగం అంతా పూర్తి అయ్యేసరికి సాయంత్రం అయింది. అప్పుటికే బాగా అలసిపోయాడు అబ్బాస్. రెండు రోజుల నుంచి విశ్రాంతి లేకుండా ప్రయాణం చేశాడు.

అతని శరీరం మనస్సు బాగా డస్సిపోయింది. అతను ఇంటికి చేరుకనే సరికి బాగా పొద్దుపోయింది. పెళ్ళి శుభవార్త చెప్పాలని తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆమె హాయిగా మంచం మీద నిద్రపోతుంది. గాఢంగా నిద్రపోతున్న తల్లిని లేపాలా వద్దా అని క్షణం కాలం సందిగ్ధంలో పడ్డాడు అబ్బాస్. చివరకు లేపటానికే నిశ్చయించుకున్నాడు. మంచం దగ్గరకు వెళ్ళి మెల్లగా తట్టాడు. రెండు సార్లు తట్టేసరికి మెల్లగా కళ్ళు తెరిచింది షబ్నమ్. ఎదురుగా అబ్బాస్ ను చూసి లేచి కూర్చుంది. “ఏమిటి బాబూ, ఎప్పుడు వచ్చావు” అంది. “ఇప్పుడే వచ్చానమ్మా. అంతా పూర్తయ్యే సరికి ఈ వేళ అయింది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నిద్ర లేపాను” అన్నాడు అబ్బాస్. “ఏమిటి” ఆశ్చర్యంగా అడిగింది. “మిత్రవింద తండ్రి గారిని కలుసుకున్నాను. అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడాను. మా పెళ్ళికి ఆయన మనసారా ఒప్పుకున్నారు. పంతులు గారితో మాట్లాడి ముహుర్తం నిర్ణయించి చెప్తానని అన్నారు” అన్నాడు అబ్బాస్. షబ్నమ్ చల్లగా నవ్వింది.

శుభం. త్వరలోనే కోడలు పిల్ల మన ఇంటికి వస్తుందన్నమాట” అంది ఆవిడ నవ్వుతూ. “అవునమ్మా. నా గురించి మిత్రవింద గురించి చెప్పిన తరువాత ఆయన ఒక్క మాట కూడా ఆనలేదు. సంతోషంతో మా పెళ్ళికి ఒప్పుకున్నాడు” అని జరిగినదంతా చెప్పాడు. “చాలా సంతోషం బాబూ. ఎంత త్వరగా మీ పెళ్ళి జరిగితే అంత మంచిది. మిత్రవిందది గొప్ప జాతకం. నువ్వు ఆమెను పరిచయం చేసుకున్న వెంటనే నీకు ప్రమోషన్ లాంటిది వచ్చింది. అదే ఆమె ఇంట్లో కాలు పెడితే అన్ని శుభాలే జరుగుతాయి. ఆ నమ్మకం నాకుంది. మీరిద్దరు కలకాలం సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను” అంది కొడుకు చెయ్యి పట్టుకుని. “నీ కోరిక తప్పకుండా తీరుతుంది అమ్మా” అన్నాడు అబ్బాస్. తల్లితో మాట్లాడి తన గదిలోకి వచ్చాడు అబ్బాస్. వేసుకున్న బట్టలు విప్పి నైట్ డ్రస్సు వేసుకున్నాడు. టైం అర్ధరాత్రి దాటి పది నిమిషాలైంది. ఈ టైంలో మిత్రవింద మేలుకుని ఉందో నిద్ర పోతుందో తెలియదు. అయిన ఆమెతో మాట్లాడాలనిపించింది అబ్బాస్ కు. అందుకే కాల్ చేశాడు. ఆశ్చర్యంగా మిత్రవింద నిద్ర పోలేదు.

అతని కాల్ కోసమే ఎదురు చూస్తున్నట్టు మేలుకునే ఉంది. మొదటి రింగ్ పూర్తి కాకుండానే రెస్పాండ్ అయింది. “ నీ కాల్ కోసమే కాచుకుని ఉన్నాను ” అంది మిత్రవింద మెల్లగా. “ ఇప్పుడే అమ్మకు శుభవార్త చెప్పాను. చాల సంతోష పడింది ” అన్నాడు అబ్బాస్. “ఈ రోజు నాకు ఎంతో హాయిగా ఉంది అబ్బాస్. మనస్సులో భారం అంతా దిగి పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఇన్ని రోజులు పడిన టెన్షన్ చేత్తో తీసి వేసినట్టుగా ఉంది. నాన్న గారు ఇంత తొందరగా మన పెళ్ళికి ఒప్పుకుంటారని భావించలేదు ” అంది మిత్రవింద. “ నాకు అలాగే ఉంది ” అన్నాడు అబ్బాస్. ఆ తరువాత వాళ్ళ సంభాషణ భవిష్యత్తు గురించి సాగింది.


( ఆ ప్రేమికుల కల నేరవేరేనా? వాళ్ళిద్దరు దంపతులయ్యేనా?? మిత్రవింద తండ్రీ, అబ్బాస్ కు ఆమోద ముద్ర వేసినంతనే వాళ్ళ పెళ్ళికి అవాంతరాలన్నీ తొలగినట్లేనా?? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఎదురుచూడాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani