Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue315/809/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి)..... ఆ రోజు ఆదివారం. అబ్బాస్ ఇచ్చిన డెడ్ లైన్ నిన్నటితో ముగిసింది. అతను ఇచ్చిన వారం రోజుల గడువు మిత్రవింద ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. ధైర్యంగా తండ్రితో తన ప్రేమ విషయం చెప్పలేకపోయింది. ఈ రోజు పదిగంటలకు అబ్బాస్ ఇంటికి వస్తానని చెప్పాడు. అబ్బాస్ చెప్పాడంటే ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. అతన్ని ఎలా ఆపాలో మిత్రవిందకు అర్ధం కాలేదు. ఉదయం నుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది కాని ఎలాంటి ఆలోచన తట్టలేదు.

కిచెన్ లో విశాలాక్షి వంటతో కుస్తీ పడుతోంది. వసంతసేన ఎప్పటిలాగే ఎవరితోనో చాటింగ్ చేస్తుంది. చక్రపాణి ఆరుబయట కూర్చుని పేపర్ చదువుతున్నాడు. అందరు హాయిగా తమ తమ పనులను ఎంజాయ్ చేస్తున్నారు, ఒక మిత్రవింద తప్ప. ఆమె కిటికి దగ్గర నిలబడి మెయిన్ గేటు వైపు చూస్తుంది. గేటు దగ్గర చిన్న చప్పుడు విన్నా ఉలిక్కిపడుతోంది. అబ్బాస్ వచ్చాడేమో అనుకుని హడలిపోతుంది.
    క్షణాలు నిమిషాలు గడుస్తున్నాయి.

మిత్రవింద నిరీక్షణ ఫలించింది. గేటు దగ్గర చప్పుడయింది. మిత్రవింద ఉలిక్కిపడి చూసింది. అప్పుడే గేటు తేరుచుకుని లోపలికి వస్తున్నాడు అబ్బాస్. ఆమె ఊహించినట్టుగా అతను సివిలియన్ డ్రస్సులో లేడు. పూర్తిగా డిపార్ట్ మెంట్ యూనిఫారమ్ లో ఉన్నాడు. మిత్రవింద గజగజ వణికిపోయింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆమె ఊహ ప్రకారం ఇంకా కొంచం సేపట్లో అబ్బాస్ ఆమె ప్రేమ విషయం చెప్తాడు. దాంతో ఇంట్లో పెద్ద విస్పోటనం జరుగుతుంది. దాని పరిణామం ఆమె అనుభవించబోతుంది. అది తలుచుకుంటే ఆమెకు కాళ్ళు చేతులు ఆడటం లేదు.

లోపలికి వచ్చిన అబ్బాస్ గంభీరంగా నడుస్తూ చక్రపాణి దగ్గరకు వెళ్ళాడు. పూర్తి యూనిఫారమ్ తో ఠివిగా  తన వైపు వస్తున్న అబ్బాస్ ను ఆశ్చర్యంగా చూశాడు.

“నా పేరు జహీర్ అబ్బాస్”అన్నాడు అబ్బాస్.

“కూర్చోండి”అని కుర్చీ చూపించాడు చక్రపాణి.అబ్బాస్ కూర్చుని ఎదురుగా చూశాడు. కిటికి దగ్గర నిశ్చలంగా ఉంది మిత్రవింద. ఏం జరగబోతుందో అన్న భయంతో విలవిలలాడిపోతుంది ఆమె. ఒక్క క్షణం పాటు ఆమెను చూసి తరువాత చక్రపాణి వైపు చూశాడు.

“నా పేరు మీకు ఇంతకుముందే చెప్పాను. నేను పాకిస్ధాన్ డిఫెన్స్ సర్వీసులో క్యాప్టన్ గా పనిచేస్తున్నాను”అన్నాడు అబ్బాస్.

“అలాగా చాల సంతోషం. నా వల్ల మీకేం సహయం కావాలి”అడిగాడు చక్రపాణి.    ఒక పాకిస్ధాన్ మిలిట్రి ఆఫీసర్ తనని వెతుక్కుంటు ఎందుకు వచ్చాడో చక్రపాణికి అర్ధం కాలేదు.

“ఏ విషయం అయిన ముక్కు సూటిగా చెప్పటం నాకు అలవాటు. అందుకే ఉపోద్ఘాతం లేకుండా అసలు విషయానికి వస్తాను. నేను మీ అమ్మాయి మిత్రవింద ప్రేమించుకున్నాం. ఆమెను పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నాను. మీ అనుమతి కోసం వచ్చాను”అన్నాడు. ఒక సునామి అల తాకినట్టు ఒక్కసారిగా అదిరిపడ్డాడు చక్రపాణి. పిచ్చివాడిలా అబ్బాస్ వైపు చూశాడు.

“మీరు చెప్పేది నిజమా”అన్నాడు తేరుకుంటు.

“అవును. మా పరిచయం అయి దాదాపు ఆరునెలలు కావస్తోంది. ఈ విషయం మీకు చెప్పమని మిత్రవిందకు ఎన్నో సార్లు చెప్పాను. కాని ఆమె ఎందుకో చెప్పలేకపోయింది. దానికి కారణం అధైర్యం కాదు. మీరు ఆమె గురించి చీప్ గా అనుకుంటారని భావించింది. తను పెళ్ళికి తొందరపడతుందని మీరు అపార్ధం చేసుకుంటారని భావించింది. అందుకే చెప్పలేకపోయింది. అది ఆమె సంస్కారం కాని భయం కాదు. మా ప్రేమ విషయం మీ దగ్గర నుంచి దాచాలని మాకు ఎప్పుడులేదు. ఈ రోజు కాకపోయిన రేపయిన మా విషయం మీకు తెలుస్తుంది. ఎవరో ఒకరు చూసి మా గురించి మీకు చెప్పవచ్చు. ఇలా జరగటం మాకు ఇష్టంలేదు. అందుకే నేను రావలసివచ్చింది.ఇది జరిగింది. మీకు ఇష్టమైతే మా పెళ్ళి జరుగుతుంది. లేకపోతే లేదు. కాని మా స్నేహం మాత్రం అగదు. మేమిద్దరం ఎప్పటిలాగే స్నేహంగా ఉంటాం. మీరు మనసారా ఒప్పుకుంటేకాని ఈ పెళ్ళి జరగదు.”అంటు ముగించాడు.

కిటికి దగ్గర నిలబడిఉన్న మిత్రవింద అంతా గమనిస్తోంది. ఆమెకు అబ్బాస్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కాని అది తన గురించే అని మాత్రం గ్రహించింది. తండ్రి రియాక్షన్ కోసం చూస్తోంది. కాని ఆమె ఊహించనిట్టుగా ఏం జరగలేదు. చక్రపాణి కొంచం కూడా స్పందించలేదు. కోపంతో ఊగిపోలేదు. అబ్బాస్ ను తిట్టలేదు. దానికి బదులుగా ఆయన లేచి నిలబడ్డాడు. ఒకసారి అబ్బాస్ వైపు చూసి ఇప్పుడే వస్తాను”అని చెప్పి లోపలికి వెళ్ళాడు.

అంతకుముందే విశాలాక్షి తలుపు దగ్గర నిలబడిఉంది. జరుగుతున్న డ్రామాను గమనిస్తోంది. ఆమెకు విషయం అర్ధం కాలేదు. కాని అబ్బాస్ మాత్రం ఆమెకు తెగనచ్చాడు. లోపలికి వచ్చిన చక్రపాణి భార్య చెయ్యిపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. అతను మిత్రవిందను గమనించలేదు. కనీసం ఆమె వైపు చూడను కూడా లేదు.

మిత్రవిందకు మాత్రం గుండెలు దడదడలాడుతున్నాయి.క్షణాలు నిమిషాలు భారంగా గడుస్తున్నాయి. బయట అబ్బాస్ కాచుకుని ఉన్నాడు. కిటికి దగ్గర మిత్రవింద బొమ్మాలా నిలబడిఉంది. వసంతసేన  తన అక్క పక్కన వచ్చి నిల్చుంది.

అయిదు నిమిషాలు గడిచాయి. గదిలోంచి చక్రపాణి విశాలాక్షి బయటకు వచ్చారు. చక్రపాణి మొహం ఇప్పుడు చాల ప్రశాంతంగా ఉంది. అతని మొహంలో సంతోషంతో కూడిన చిరునవ్వు కదులుతోంది. విశాలాక్షి కూడా చాల ఆనందంగా ఉంది.

మిత్రవింద ఆశ్చర్యంగా చూసింది. కూతురివైపు ఒక సారి చూసి అబ్బాస్ దగ్గరకు వెళ్ళాడు చక్రపాణి.

“మీ అమ్మగారికి చెప్పారా”అడిగాడు కూర్చుని.

“ఎప్పుడో చెప్పాను. ఆవిడ సంతోషంగా ఒప్పుకుంది. కాని ఒక షరతు పెట్టింది”అన్నాడు అబ్బాస్. షరతు అన్న మాట వినేసరికి కొంచం కంగారుపడ్డాడు చక్రపాణి

“ఏమిటా షరతు”అన్నాడు మెల్లగా.

“మీరు మనసారా ఈ పెళ్ళికి ఒప్పుకుంటేనే పెళ్ళి జరుగుతందని చెప్పింది ఆవిడ. లేకపోతే జరగదని ఖచ్చితంగా చెప్పింది” అన్నాడు అబ్బాస్. చక్రపాణి చల్లగా నవ్వాడు.

“నేను మనసారా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పండి.ఈ రోజే పంతులుగారిని కలిసి ముహుర్తం నిర్ణయిస్తాను”అన్నాడు చక్రపాణి.

“ఇంకో విషయం”అన్నాడు అబ్బాస్.

“చెప్పండి.”

“మాకు ఒక్క రుపాయి కూడా కట్నం వద్దు. పెళ్ళి మీ తాహతుకు తగినట్టు చెయ్యండి. అనవసరమైన ఆర్బాటం హంగు వద్దు.” అన్నాడు.    ఆ మాటల పన్నీటి జల్లులా తోచాయి చక్రపాణికి. కట్నంతో మామను పీడించుకుతినే అల్లుళ్ళు ఉన్న ఈ రోజులలో కట్నం వద్దని చెప్పటం నిజంగా గొప్ప విషయం. అది అబ్బాస్ సంస్కారాం మానవత్వం తెలియచేస్తున్నాయి.

“అలాగే మీ ఇష్టం”అన్నాడు చక్రపాణి.

“ఇంకో విషయం. పెళ్ళయిన తరువాత మీరు ఇక్కడ ఒంటరిగా ఉండనవసరంలేదు. మీరు రిటైర్ అయిన తరువాత మా దగ్గర వచ్చి ఉండండి. మీ రెండో అమ్మాయి గురించి మీరు బాధవడవలసిన అవసరం లేదు. ఆమె పూర్తి బాధ్యత నాది. ఆమెను బాగా చదివించి మంచి అబ్బాయిని చూసి పెళ్ళిచేస్తాను. నాకు మా అమ్మ తప్ప ఎవరులేరు. బందువులు చుట్టాలు ఉన్నారో లేరో కూడా తెలియదు. వాళ్ళు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. మీరే మాకు ఆత్మీయులు. మీరు మాతో కలిసి ఉంటే మా అమ్మ కూడా ఎంతో సంతోషపడుతుంది. నిజానికి ఇది నా ఆలోచన మాత్రమే కాదు మా అమ్మ అభిప్రాయం కూడా”అన్నాడు అబ్బాస్.

చక్రపాణికి సంతోషంతో నోట్లోంచి మాట రాలేదు. విపరీతమైన ఆనందం కలిగినప్పుడు విపరీతమైన బాధ కలిగినప్పుడు మాట పెగిలి రాదు. గొంతుకు ఏదో అడ్డం పడినట్టుగా ఉంటుంది. ప్రస్ధుతం చక్రపాణి పరిస్ధితి ఇంచుమించు అలాగే ఉంది. ఒకదాని వెనుక ఒకటి  సంతోషం కలిగించే వార్తలు వింటున్నాడు అతను. వాటి ఉదృతిని తట్టుకోవటం అతనికి కష్టంగా ఉంది.

“ఇక నేను బయలుదేరుతాను”అంటు లేచాడు అబ్బాస్.

“ఉండు బాబు, భోజనం చేసి వెళుదువు కాని”అన్నాడు చక్రపాణి.

“వద్దండి. కతికితే అతకదని అంటారు. పైగా నాకు చాల అర్జంట్ పనుంది. మరోసారి వచ్చినప్పుడు తప్పకుండ భోజనం చేస్తాను. వస్తాను”అని వెళ్ళిపోయాడు అబ్బాస్. అప్పుడుకాని మిత్రవింద తేరుకోలేదు. జరిగినదంతా ఆమెకు ఒక కలగా ఉంది. తండ్రి ఇంత సామ్యంగా ఒప్పుకుంటాడని ఆమె ఊహించలేదు. ఏది ఏమైన తండ్రి తన ప్రేమ విషయంలో సానుకూలంగా స్పందించాడు. అది చాలు ఆమెకు. అంతకంటే ఆమె కోరుకునేది ఏం లేదు. మిత్రవింద ఈ రకమైన ఆలోచనలతో ఉంటే అప్పుడే చక్రపాణి లోపలికి వచ్చాడు.మిత్రవింద అమాంతం అతని కాళ్ళమీద పడిపోయింది.

“ఏమిటమ్మా ఇది. లే”అంటు మెల్లగా కూతరిని లేననెత్తాడు.

“నన్ను క్షమించండి నాన్న”అంది మిత్రవింద కళ్ళనీళ్ళు పెట్టుకుంటు.

“ఎందుకు క్షమించటం. నువ్వేం తప్పుచేశావని”లాలనగా అడిగాడు.

“మా ప్రేమ విషయం మీకు వెంటనే చెప్పలేదు.చెప్పకూడదని కాదు. సిగ్గుపడి చెప్పలేదు. నువ్వు నన్ను తిడతావని కొడతావని నేను భయపడలేదు. నా గురించి చాల తేలికగా అనుకుంటావని సిగ్గుపడ్డాను అంతే”అంది మిత్రవింద.

“ఇందులో నీ తప్పేం లేదు. నీ పరిస్ధితిలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. అబ్బాస్ చాల మంచివాడు. సంస్కారవంతుడు. అతనిలాంటి అల్లుడు దొరకటం నా అదృష్టం. ఒక మంచి భర్తను మాత్రమే కాకుండ మానవత్వం ఉన్న గొప్ప మనిషిని ఎన్నుకున్నావు. నాకు చాల సంతోషంగా ఉందమ్మా”అన్నాడు చక్రపాణి.

“కాని అతను మతస్ధుడు కాడు నాన్న. కనీసం మన దేశస్ధుడు కూడా కాడు.”“అయితే ఏం. కాని మంచి మంచివాడు. మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు.”

“కాని మీరు ఆ రోజు ప్రసాద్ అంకుల్ కూతరి విషయంలో చాల కోపంగా స్పందించారు. కాని ఇప్పుడేమో”అని సందిగ్ధంతో ఆగిపోయింది మిత్రవింద.

“నీ అనుమానం అదా. అది వేరు ఇదివేరు. నేను అతను ముస్లిం అని కోపగించుకోలేదు. అతని పిరికితనం చూసి అసహ్యించుకున్నాను. నిజంగా అతను అమ్మాయిని ప్రేమించిఉంటే ధైర్యంగా పెద్దవాళ్ళకు చెప్పేవాడు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మంచి మాటలతో ఒప్పించటానికి ప్రయత్నించేవాడు. అది కూడా వీలికానప్పుడు అప్పుడు రహస్యంగా పెళ్ళి చేసుకోవటం తప్పు కాదు. కాని ఆ అబ్బాయి అలాంటి ప్రయత్నం కొంచం కూడా చెయ్యలేదు. కనీసం ప్రసాద్ తో మాట్లాడలేదు. ఏకంగా ప్రసాద్ కూతురిని లేవదీసుకుపోయాడు. ఎవరికి తెలియకుండ రహస్యంగా పెళ్ళిచేసుకున్నాడు.

కాని అబ్బాస్ అలా ప్రవర్తించలేదు. నా అనుమతి కోసం తిన్నగా నా దగ్గరకు వచ్చాడు. నిజానికి అతను తలుచుకుంటే నీకు మాయమాటలు చెప్పి లొంగదీసుకునేవాడు. లేదా రహస్యంగా పెళ్ళిచేసుకునేవాడు. కాని అతను రెండు చెయ్యలేదు. చాల హుందాగా నా దగ్గరకు వచ్చి తన ప్రేమ విషయం చెప్పాడు. పైగా నేను మనసారా ఈ పెళ్ళికి ఒప్పుకుంటేనే శుభకార్యం జరుగుతుందని చెప్పాడు. లేకపోతే తను నువ్వు మంచి స్నేహితులుగా ఉండిపోతామని అన్నాడు. అతని గొప్ప మనస్సుకు ఇంత కంటే వేరే ఉదాహరణ ఏముంటుంది. నిన్ను నిజాయితిగా ఇష్టపడ్డాడు కనుకనే ధైర్యంగా నా ఎదుటికి రాగలిగాడు. ఇదంతా ఆలోచించే నేను వెంటనే పెళ్ళికి ఒప్పుకున్నాను”అని పూర్తిచేశాడు మిత్రవింద.

“కాని ఈ పెళ్ళికి మన బందువులు స్నేహితులు వస్తారా నాన్న”అంది మెల్లగా మిత్రవింద.

“రాకపోవచ్చు. అంతే కాదు నన్ను వెలివేసిన వెయ్యవచ్చు. అయిన నేను పట్టించుకోను బాధపడను. ఈ విషయం తెలిసి వసంతకు మంచి సంబంధాలు రాకపోవచ్చు. అయిన నేను భయపడను. వసంత బాధ్యత పూర్తిగా అబ్బాస్ తీసుకుంటానని చెప్పాడు. కొడుకైన అల్లుడైన నాకు అతనే కదా. అందుకే అన్ని బాధ్యతలు అతని మీద పెట్టాను”అన్నాడు చక్రపాణి.

ఆ మాటలతో కొంచం స్వాంతన కలిగింది మిత్రవిందకు.

అబ్బాస్ అందరికి తెగ నచ్చేశాడు. ముఖ్యంగా వసంతసేనకు మరింత నచ్చాడు.

“అక్కా బావచాల బాగున్నాడు. లైన్ వెయ్యమంటావా”అంది నవ్వుతూ.

“ప్రయత్నించు నువ్వే ఓడిపోతావు. అబ్బాస్ నన్ను తప్ప ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు”అంది నవ్వుతూ.

ఆ రోజు ఇంటిల్లిపాది సంతోషంతో ఊగిపోయారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అదే రోజు చక్రపాణి వెళ్ళి పంతులుగారిని కలుసుకున్నాడు. అతను మిత్రవింద జాతకం జాగ్రర్తగా చూసి అన్నాడు.

“వచ్చేనెల పదిహేను తారీఖున మంచి ముహుర్తం ఉంది. చాల దివ్వంగా ఉంది”అన్నాడు.

అదే తేదికి ఖాయం చేశాడు చక్రపాణి.

మిత్రవింద, అబ్బాస్ ల పెళ్ళి ఎలా, ఎక్కడ జరుగుతుందో తెలియా లంటే వచ్చేశుక్రవారం వరకు వేచి చూడాల్సిందే...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్