Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

పంచరత్నాలు - జోకులు: గుత్తుల శ్రీనివాస్, బొమ్మలు: మాధవ్

" నిన్ను సత్ప్రవర్తన కింద విడుదల చేస్తున్నామోయ్.....బయటికెళ్ళి స్వేచ్చగా చక్కగా జీవించు..."  ఖైదీతో చెప్పాడు జైలరు.
" థాంక్యూ సార్. సత్ప్రవర్తనతోనే మా యజమానినీ, ఇక్కడ మిమ్మల్నీ నమ్మించాను.... ఫ్యూచర్ లో కూడా సత్ప్రవర్తననే నమ్ముకుంటాను " వంగి వంగి వినయంగా చెప్పాడా బుద్ధిమంతుడు.

****

" ఏవండీ ! మీ అమ్మగారు ఒకటే బాధ పడుతున్నారండీ ! ఎంతకాలమైనా ఆలూ మగలూ, తల్లీ కొడుకులూ, అత్తాకోడళ్ళేనా మొహాలు చూసుకునేది అని ఒకటే నస పెడుతున్నారు."  
పడగ్గదిలో భర్త సుందర్రావుతో చెప్పింది సుందరి.
పెళ్ళయి అయిదారేళ్ళయినా పిల్లలు లేరన్న బాధతో.  
" అవును సుందరీ! నాదీ సేం ఫీలింగ్....మరి మా కొలీగ్ రాణిని తీసుకొచ్చేయమంటావా?" ఆశగా సాలోచనగా అన్నాడు సుందర్రావ్..

****
సుధాకర్ కి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. అది ఆమెతో నేరుగా చెప్పడం ఇష్టం లేక సలహా కోసం ఓ వైద్యుడి దగ్గరికెళ్ళాడు.
“దానికో చిన్న పరీక్ష ఉంది. దాన్ని ప్రయోగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది” అన్నాడా డాక్టర్.
“నేను చెప్పినట్లు చేయండి. మొదట 40 అడుగుల దూరంలో నిల్చుని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. వినిపిస్తుందేమో చూడండి. ఒకవేళ వినిపించకపోతే పది అడుగులు దగ్గరకు వెళ్ళి అదే విధంగా చేసి చూడండి. అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకొచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం సిఫారసు చేస్తాను” అన్నాడు.
ఆ రోజు సాయంత్రం అతను ఇంటికెళ్ళే సరికి భార్య వంట చేస్తూ ఉంది. అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా 40 అడుగుల దూరంలో నిలబడి “ఏఁవోయ్ ఈ రోజు ఏం కూర చేశావ్?” అని అడిగాడు. ఏం సమాధానం వినిపించలేదు.
మళ్ళీ కొంచెం దగ్గరకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. ఉఁహూ సమాధానం లేదు.
అలాగే వంట గది లోకి వెళ్ళి “ఏఁవోయ్! ఇవాళ ఏం కూర చేశావ్?” అడిగాడు గట్టిగా మళ్ళీ.
ఈ సారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చుని “ఏఁవోయ్ ఇవాళ ఏం కూర చేశావని అడిగితే సమాధానం చెప్పవేఁ!!” అన్నాడు విసుగ్గా…
ఆమె కోపంగా “మీకిది ఐదోసారి చెప్పడం, చికెన్ చేశాననీ!!!”  అంది.

****

ఒక దొంగ ఒక దుకాణంలోని లాకర్ ని దోచుకోవాలనుకున్నాడు.
దగ్గరకు వెళ్ళేసరికి దాని తలుపుపైన “దయచేసి తలుపును ఊడదీయడానికి డైనమైట్లు లాంటి వాటిని వాడే పనులు పెట్టుకోవద్దు. తలుపు తెరిచే ఉంది. హ్యాండిల్ ని తిప్పండి చాలు. తెరుచుకుంటుంది”.
దొంగ అలానే తిప్పాడు
అంతే!! వెంటనే ఒక పెద్ద ఇసుక బస్తా వచ్చి మీద పడింది. ఆ ప్రదేశమంతా ఫ్లడ్‌ లైట్ల వెలుగుతో నిండిపోయింది. కుయ్ కుయ్ మంటూ అలారం మోగసాగింది.
ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు దొంగకి.
పోలీసులు అతన్ని స్ట్రెచర్ పై తీసుకువెళుతుండగా అతను ఏదో సన్నగా మూలుగుతున్నాడు
“మనుషులపై నాకున్న నమ్మకం దారుణంగా దెబ్బతింది”

***
ఒక మాస్టారు ఆరో తరగతి పిల్లలకు మహాభారతం కథను బోధిస్తున్నాడు. అందులో కృష్ణుని జన్మ వృత్తాంతం గురించి ప్రస్తావన వచ్చింది.
“సోదరి యొక్క అష్టమ సంతానం చేతిలో తన చావు తప్పదని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్న కంసుడు ఆగ్రహోదరుడయ్యాడు. దేవకీని ఆమె భర్తను కారాగారంలో బంధించమని ఆజ్ఞ జారీ చేశాడు.”
“మొదటి కొడుకు పుట్టాడు. కంసుడు ఆ బిడ్డను విషమిచ్చి చంపేశాడు. రెండో కొడుకు పుట్టాడు. వాణ్ణి ఎత్తైన కొండ మీద నుంచి తోసి చంపి వేయించాడు. ……” చెప్పుకుంటూ పోతున్నాడు.
వారిలో కొంచెం తెలివైన విద్యార్థికి ఒక సందేహం వచ్చింది. బుర్ర గోక్కుంటూ “మాస్టారూ! నాదో చిన్న సందేహం” అన్నాడు
"ఏమిటో చెప్పు....."
“మరి కంసుడికి దేవకికి పుట్టే సంతానం చేతిలో మరణం ఉందని తెలుసు కదా? అయితే వాళ్ళిద్దరినీ ఒకే గదిలో ఎందుకు బంధించాడు?”
మాస్టారికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.
 

 

 

..

మరిన్ని శీర్షికలు
pratapabhavalu