Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

దొరసాని - చిత్రసమీక్ష

dorasani movie review

చిత్రం: దొరసాని
నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక, కన్నడ కిషోర్, వినయ్ వర్మ, శరణ్య తదితరులు.
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
సంగీతం: ప్రశాంత్‌ విహారి
నిర్మాతలు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని
నిర్మాణం: బిగ్‌ బెన్‌, మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దర్శకత్వం: కెవిఆర్‌ మహేంద్ర
విడుదల తేదీ: 12 జులై 2019

క్లుప్తంగా చెప్పాలంటే..
దొర కూతురు 'చిన్న దొరసాని' దేవకి (శివాత్మిక రాజశేఖర్‌)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు పేద కుటుంబంలో పుట్టిన, అలాగే తక్కువ కులానికి చెందిన రాజు. కథాగమనంలో దేవకి కూడా, రాజుని ఇష్టపడుతుంది. దొరకు తెలియకుండా ఈ ఇద్దరి ప్రేమాయణం సాగుతుంటుంది. ఓ సందర్భంలో దొరకి, తన కుమార్తె ప్రేమ వ్యవహారం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమయ్యింది.? చిన్న దొరసానితో రాజు ప్రేమ ఏమవుతుంది.? తన ప్రేమను గెలిపించుకునేందుకు చిన్న దొరసాని దేవకి ఏం చేసింది.? దొర కుమార్తెను ప్రేమించిన రాజు పరిస్థితేంటి.? ప్రేమని గెలిపించుకునే క్రమంలో రాజు పడ్డ పాట్లు ఏంటి.? అన్నవి తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..
తొలి సినిమానే అయినా ఆనంద్‌ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్‌గా కన్పించాడు తెరపైన. అతనికిదే తొలి సినిమా అంటే ఎవరూ నమ్మలేరు. చిన్న చిన్న లోటుపాట్లు వున్నా కూడా, ఓవరాల్‌గా తొలి సినిమాతో మంచి మార్కులేయించుకున్నాడు ఆనంద్‌ దేవరకొండ. చాలా సన్నివేశాల్లో ఆనంద్‌ నటన ఆశ్చర్యపరుస్తుంది. తొలి సినిమాగా కమర్షియల్‌ సబ్జెక్ట్‌ని ఎంచుకోకుండా, తన నటనా ప్రతిభకి పరీక్ష పెట్టే కథని ఎంచుకున్నందుకు అతన్ని అభినందించి తీరాల్సిందే.

శివాత్మిక రాజశేఖర్‌కి కూడా ఇదే తొలి సినిమా నటిగా. అయినాగానీ, ఆమె తనదైన నటనతో మెప్పించింది. హావభావాల్ని పలికించడంలో తనదైన ప్రత్యేకతను చాటింది. సహజత్వం ఆమె నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. లీడ్‌ పెయిర్‌ నటనతో సినిమాకి వెయిట్‌ బాగా పెరుగుతుంది.

కథ మరీ కొత్తదేమీ కాదుగానీ, నేపథ్యం సినిమాతో ప్రేక్షకుడ్ని కట్టిపడేస్తుంది. స్క్రీన్‌ప్లే బావుంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్‌ విషయంలో అక్కడక్కడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బావుండేది. మ్యూజిక్‌ బావుంది. సినిమా మూడ్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా కుదిరాయి. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కించారు.

కొత్త నటీనటులతో ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకోవడమే పెద్ద సాహసం. ఈ క్రమంలో దర్శకుడు పెద్దగా తడబాటుకు గురి కాకపోవడం అభినందనీయం. కమర్షియల్‌ హంగుల జోలికి పెద్దగా పోకుండా, నమ్మిన కథని తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌.. రెండూ ఇంట్రెస్టింగ్‌గానే సాగుతాయి. కథలో ఫీల్‌, లీడ్‌ పెయిర్‌ మధ్య కెమిస్ట్రీతోపాటు ఆ ఇద్దరూ తమకు ఎదురైన విపరీత పరిస్థితులకు ఫీలయిన పెయిన్‌.. ఇవన్నీ కట్టిపడేస్తాయి. స్వచ్ఛమైన ప్రేమలోని ఫీల్‌ని ఆడియన్స్‌ ఆస్వాదించేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కమర్షియల్‌ అంశాల్ని ఆశించేవారిని కాస్త నిరాశపర్చొచ్చు.

అంకెల్లో చెప్పాలంటే.. 3.5/5

ఒక్క మాటలో చెప్పాలంటే..
ఆకట్టుకునే రాజు అండ్‌ దొరసాని ప్రేమ!

మరిన్ని సినిమా కబుర్లు
churaka