Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

మహిళా దర్శకులు

lady directors

'మీనా!' విజయనిర్మల నిర్మించి, దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 40 ఏళ్ళు. ఒక హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించి, ఒక చిత్రానికి దర్శకురాలిగా మారడం అంటే మామూలు విషయం కాదు. 'మీనా' చిత్రంతో దర్శకురాలిగా మారి దాదాపు 43 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించడం ఒక్క విజయనిర్మలకే సాధ్యం. 'మీనా', ఆ తర్వాత 'దేవదాసు, దేవుడే గెలిచాడు, హేమా హేమీలు, భోగి మంటలు, రామ్ రాబర్ట్ రహీమ్, నేరము - శిక్ష, సంఘం చెక్కిన శిల్పాలు, ఇలా 43 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ లో కెక్కారు.

* దక్షిణ భారతదేశంలో ఉన్నంతమంది మహిళా దర్శకులు బహుశా హిందీ చిత్రరంగంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఆ మహిళా దర్శకులు ఎవరంటే -

* 1953లో బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి 'చండీరాణి' చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషలో ఒకేసారి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 'అంతా మనమంచికే, అసాధ్యురాలు, విచిత్ర వివాహం,' వంటి 8 చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు.

* మహానటి సావిత్రి 1968లో 'చిన్నారి పాపలు' సినిమాకు దర్శకత్వం వహించి, ఆ తర్వాత 'చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం' సినిమాలు తెలుగులో, 'కుళందై ఉళ్ళం, ప్రాప్తం' అనే రెండు తమిళ సినిమాలకు దర్శకత్వం వహించారు.

* 1968 లోనే ప్రఖ్యాత నటి జి. వరలక్ష్మి 'మూగ జీవులు' సినిమాకు దర్శకత్వం వహించారు.

* 'సూపర్ హిట్' పత్రికాధిపతి, జర్నలిస్ట్ శ్రీమతి జయ 'చంటిగాడు' సినిమాతో మొదలుపెట్టి 'ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ' మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించారు.

* లిరిక్ రైటర్ చంద్రబోస్ అర్ధాంగి, ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శ్రీమతి సుచిత్ర 2007 లో దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో 'పల్లకిలో పెళ్ళికూతురు' సినిమాకు దర్శకత్వం వహించారు.

* 'ఆహుతి, తలంబ్రాలు, అంకుశం, స్టేషన్ మాస్టర్, మగాడు' తదితర సినిమాల్లో హీరో రాజశేఖర్ కు జోడీగా నటించి, ఆ తర్వాత నిజజీవితంలోను జోడీ అయిన శ్రీమతి జీవిత రాజశేఖర్ హీరోగా 'శేషు, సత్యమేవ జయతే, మహంకాళి' సినిమాలు తీశారు.

* భారతదేశంలో గర్వించతగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన అర్ధాంగి, అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నటి సుహాసిని 'రోజా' ఫేం అరవింద్ స్వామితో 'ఇందిర' అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

* తెలుగులో 'గాయం, రాత్రి, రావుగారిల్లు' తదితర సినిమాల్లో, తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్ అయిన 'మౌనరాగం, అంజలి, క్షత్రియ పుత్రుడు' మొదలగు సినిమాల ద్వారా మంచినటిగా చిరపచితురాలైన నటి రేవతి దర్శకురాలిగా 'మిత్ర మై ఫ్రెండ్, ఫిర్ మిలేంగే' సినిమాలు తీశారు.

* మురళీమోహన్ హీరోగా, మోహన్ బాబు విలన్ గా నటించిన చిత్రం 'పొట్టేలు పున్నమ్మ'. ఇందులో హీరోయిన్ గా నటించిన శ్రీప్రియ మలయాళంలో వచ్చిన ఓ చిత్రం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో నిత్యామీనన్ హీరోయిన్ గా 'మాలిని 22' అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

* 'చక్రవాకం, మొగలి రేకులు' తదితర టి.వి సీరియల్స్ దర్శకురాలు మంజులా నాయుడు 'కనులు మూసినా నీవాయె' సినిమాలు తీశారు.

* 'సితార, అన్వేషణ, ఆలాపన, స్వర్ణ కమలం, శ్రీనివాస కళ్యాణం' తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించిన భానుప్రియ స్వతహాగా నాట్య కళాకారిణి. సంగీత భరిత నేపధ్యంలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నట్లు ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. కానీ సినిమా ప్రారంభం కాలేదు. భవిష్యత్తులో ఏమన్నా దర్శకత్వం చేయొచ్చును.

మరిన్ని సినిమా కబుర్లు
2013 soundaryanjali