Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
appreciations for minugurulu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrydayam

దేవలోకంలో ఇంద్రసభ - వేయి కళ్ళున్న దేవేంద్రుడికి ఇంకో కన్ను కావాలనిపించినట్టుంది. తెలుగు సినిమా నటరాజుకి ఒక కన్ను పీకేశాడు. ఆ కన్ను  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. ఎన్టీఆర్. నటరాజు నవ్వుకున్నాడు. నా దగ్గర అప్పుతీసుకున్నావ్. నీకు వేయికళ్ళున్నా వేస్ట్ అని. మళ్లీ చాలా ఏళ్ళ తర్వాత దేవేంద్రుడికి నటరాజు ఇంకో కన్ను మీద కన్ను పడింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారిని పిలిపించేసుకున్నాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అప్సరసలని ఆస్వాదించాలంటే  వేయిన్నొక్క కళ్ళున్నా దేవేంద్రుడికి సరిపోలేదు. ఎవర్ గ్రీన్, రొమాంటిక్ హీరో కళ్లతో వాళ్లని చూడాలనిపించినట్టుంది. తెలుగు సినిమాలోకానికి అంధత్వాన్ని ఇచ్చి ఇంద్రత్వాన్ని చాటుకున్నాడా టక్కరి.

ఓ మామూలు వ్యక్తి జీవితంలో 20 ఏళ్లు నేర్చుకుంటే, మరో 20 ఏళ్లు తన కృషితో ఒక స్థానానికొస్తాడు. మరో 20 ఏళ్లు ఆ స్థానంలో తన కృషి ఫలితాన్ని అనుభవిస్తూ పనిచేస్తాడు. ఇంక 60 పైబడ్డాక రిలాక్స్ అయ్యి శేషజీవితాన్ని తన చిన్నప్పటి విశేషాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాడు. గట్టిగా సగటువ్యక్తి తనదైన ముద్ర తన పనిమీద వేసేది రెండో 20 ఏళ్లే - కానీ, ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే 91 ఏళ్ల జీవితంలో 74 ఏళ్లు నటనారంగంలో తన ముద్రని వేస్తూ, తను జీవించిన 91 ఏళ్లకిమించి మనకి కొన్ని వందల అద్భుత చిత్రాలని సజీవంగా కానుకిచ్చారు. అక్షరాలు కూడా సరిగా దిద్దనివ్యక్తి తెలుగువాడి మనో యవనికపైన చరిత్రని సువర్ణాక్షరాలతో రాశారు. అ, ఆలు నేర్చుకోని వ్యక్తి అక్కినేని ఆలోచనలు (అ,ఆ, లు) రాసి తెలుగు సమాజానికి నైతిక విలువల దిశానిర్దేశం చేశారు.

నటుడిగా నవరసాలు పలికించడం అభ్యాసంతో రావచ్చు. కానీ వాటిల్లో ఒకేసారి రెండు, మూడు రసాలని అర్ధవంతంగా అభినయించడం, అధ్యాపకులకే సాధ్యం అవుతుంది. శృంగారాన్ని, హాస్యాన్ని, విరహాన్ని, బాధని, త్యాగాన్ని, కరుణని, రౌద్రాన్ని సందర్భానుసారం విడివిడిగాను, కలివిడిగాను ప్రదర్శించిన నటోపాధ్యాయుడు శ్రీ అక్కినేని.

కొందరిని పొగడటానికి భాష చాలదు. కొందరిని ఎంత భాష ఉపయోగించి పొగిడినా భావం చాలదు. అక్కినేని గారి గురించి రాయడానికి లెక్కలేనన్ని ఉపమానాలున్నాయి.

91 సంవత్సరాలు తెలుగు సమాజం అనే క్లాస్ రూమ్ లో పౌరులనే విద్యార్ధులకి సుందరమైన, స్ఫూర్తివంతమైన పాఠం జరుగుతోందా. హటాత్తుగా యముడి మహిషపు లోహపు గంట మోగింది. పాఠం పూర్తయింది. సమాజం బాధపడింది. అప్పుడే అయిపోయిందా అని. కానీ, విద్యార్ధులు ఏడాదికోసారి మారతారు. పాఠం మాత్రం అదే. ఈ పాఠం ఓ చరిత్ర. అక్కినేని గారనే మహనీయుడి జీవిత చరిత్ర. బాగా చదివి అర్ధం చేసుకున్న విద్యార్ధులు జీవితంలో పాసవుతారు. లేనివాళ్లు జీవితంలో ఫెయిలౌతారు.

కుటుంబ సభ్యుల సంఖ్యనిమించి ఆత్మీయులు సంఖ్యని పదింతలు పెంచుకోవడమే 'లెజెండ్' లక్షణం. నాగేశ్వరరావు గారు రియల్ 'లెజెండ్'. నాగార్జునగారిని 'నేనున్నాను', 'బాస్' చిత్రాలు నేను డైరెక్ట్ చేస్తున్న టైమ్ లో ఆ నాలుగేళ్ళూ నేను నాగేశ్వరరావు గారిని చాలాసార్లు కలిసేవాణ్ని. భక్తితోనూ, గౌరవంతోనూ ఎక్కువ మాట్లాడలేకపోయేవాణ్ని. కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఏ  ఒక్క ప్రయత్నమూ చేయని ముందు, డిగ్రీ అవ్వగానే హైదరాబాద్ లో నేను కలిసిన మొదటి సినిమా వ్యక్తి శ్రీ అక్కినేని గారే. అపాయింట్మెంట్ తీసుకుని ఇంటికివెళ్ళి కలిసాను. ఆయన్ని డైరెక్ట్ చేస్తానని, కథ రెడీగా ఉందని, ఆయనకి నచ్చి ఓకే అంటే నిర్మాతని ఆయన సజెస్ట్ చేసినా సరే, నన్ను చేసుకోమన్నా సరే అన్నాను. నా అపరిపక్వతకి ఆయన అనుభవం నవ్వుకుందో, కోప్పడిందో నాకర్ధం కాలేదుగానీ, చాలా సహనంగా, సౌమ్యంగా, స్పష్టంగా నాతో చెప్పారు. నిర్మాత ఒప్పుకోవాలంటే రెండు మూడు సినిమాలైనా సహాయ దర్శకుడిగా చేసిన అనుభవం ఉండాలని. ఆ తర్వాతే శ్రీ సుబ్బిరామిరెడ్డి గారిని, శ్రీ మోహన్ బాబుగారిని కలిసి ఫలితం కనిపించక చెన్నై వెళ్లి రావికొండలరావుగారి ద్వారా సింగీతం గారి 'బృందావనం' సినిమాకి అప్రెంటిస్ గా చేరాను. నాగేశ్వరరావుగారి అనుభవమే కరెక్ట్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకి బాగా పనిచేశాకే దర్శకున్నయ్యాను.

నాగార్జున్ గారు రొమాంటిక్ హీరో మాత్రమే కాదు, చాలా రెస్పాన్సిబుల్ పెర్సన్ కూడా. ఆయన సంస్కారం, కలుపుగోలుతనం, విజన్... అన్నీ వాళ్ళ నాన్నగారి నుండి సంక్రమించిన సంపదలు.

నా చిన్నప్పుడు మా తాతగారు (శ్రీ వాడ్రేపు సత్యనారాయణ గారు) చెప్పారొకసారి. ఒక తరం తరం అంతా ఇళ్లల్లో మగపిల్లలుపుడితే నాగేశ్వరరావు అని, ఆడపిల్లలు పుడితే సావిత్రి అని పేరు పెట్టుకున్నారని.

ఇంతకంటే ప్రభావశీలులు ఎవరుంటారు? పైగా ఇప్పుడున్నన్ని ప్రసారమాధ్యమాలు, ప్రచార సాధనాలు లేని రోజుల్లో.

ఎంతోమంది సాటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకీ ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చే నాగార్జునగారికి నాగేశ్వరరావు గారు కొండంత బలం. అందుకే ఆయన చిన్నపిల్లాడిలా అలా బాధపడుతుంటే చూసినవాళ్ళ కన్నీళ్లాగలేదు.

నాగేశ్వరరావు గారు ప్రతి మనిషిలాగే 6x3 చదరపు గజాలలో శాశ్వతంగా నిద్రిస్తున్నట్టే ఉన్నా, 6 కోట్ల పైచిలుకు తెలుగువాళ్ల హృదయాలలో 3 కాలాల్లోనూ శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు.

అందుకే మొక్కవోని ఆత్మబలంతో లెక్కలేని విజయాలు, పురస్కారాలు, బిరుదులు అందుకొన్న అక్కినేనికి నా హృదయంతో అశ్రునివాళి.

ఆదరించడం, ఇంటికి పిలిచి అన్నం పెట్టి, డబ్బులో, బట్టలో, గిఫ్ట్ లుగా ఇచ్చి పంపడం.

పదిమంది యోగక్షేమాలూ కనుక్కోవడం. ఈ పెద్దరికం పరిశ్రమలో చాలామంది మిస్సయ్యారు.

'మనం' సినిమా దర్శకుడు ఈతరంలో చాలా అదృష్టవంతుడని నా ఫీలింగ్. వారికి నా శుభాభినందనలు.



మీ
వి.ఎన్. ఆదిత్య.

మరిన్ని సినిమా కబుర్లు
anthaku minchina vijayam sadhinchalede