Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

సినిమా పరిశ్రమలో ఏ శాఖలోనైనా వర్క్ చేసే ప్రతివ్యక్తికీ చేతిలో ఎప్పుడూ ఒక సినిమా ఉండాలి. తననితాను ప్రూవ్ చేసుకోవడానికి, ఓ ఆర్నెల్లో, ఏడాదో తను సర్వైవ్ అవ్వడానికి. అందుకని ఏ నిర్మాతైనా కొంతడబ్బు రెడీ చేసుకుని షూటింగ్ ఫ్లాన్ చేస్తే, సాధారణంగా ఏ ఆర్టిస్టూ, టెక్నీషియనూ అయినా డబ్బుకన్నా ముందు పని చేయడాన్నే ఎంచుకుని, వచ్చి వర్క్ చేస్తారు. బాగా డిమాండ్ లో ఉన్న ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు తప్పించి. కానీ ఆ సినిమా పూర్తయి రిలీజు దగ్గరికొచ్చేసరికి నిర్మాతకీ, వర్క్ చేసిన వాళ్లకీ అందరికీ డబ్బు చేతికందాలి. ఎందుకంటే, ఆ సినిమా ఆడుతుందో, లేదో తెలీదు. మళ్లీ ఇంకో సినిమా చేతికందేవరకూ పర్సనల్ లైఫ్ ని నెట్టుకు రావాలి కాబట్టి. ఈస్థితిలో నిర్మాతకి చాలా సామర్థ్యం కావాలి. ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ వచ్చాక ఆడియో మార్కెట్ పడిపోయింది. టీవీ ఛానల్స్ ఎక్కువయ్యాక శాటిలైట్ బిజినెస్ పెరిగిందిగానీ థియేటర్ బిజినెస్ తగ్గింది. ప్రముఖ హీరోలు లేని సినిమాలు కొత్తగా ఉండి ఆకట్టుకుంటే తప్పించి, రిలీజ్ చెయ్యటమే గగనమైపోయింది. ఆడవాళ్లు, నడివయస్కులు, అంతకన్నా పెద్దవాళ్లు, పిల్లలు సినిమాలకి రావడం తగ్గి, టీవీలకి, కంప్యూటర్లకి ఎడిక్ట్ అవ్వడం ఎక్కువైపోయింది. ఇవన్నీ సినిమా బిజినెస్ ని తగ్గించే ఫ్యాక్టర్స్ అయితే, థియేటర్ల, మల్టీప్లెక్స్ ల రెంట్లు, టిక్కెట్ల ధరలు పెరగడం, లోకేషన్ల కాస్ట్ లు పెరగడం, ఆర్టిస్టుల, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు పెరగడం, సొసైటీలోనే అన్నింటి ధరలూ ఇతోధికంగా పెరగడం, లైఫ్ స్టైల్ 'పాష్' గా మెయిన్ టెయిన్ చెయ్యాల్సిన అవసరాలు (బిజినెస్ వైప్) రావడం - వీటివల్ల సినిమా నిర్మాణ వ్యయం ఆకాశాన్నంటుతోంది. అన్నీ సహజంగా వచ్చిన మార్పులే. కానీ ఏదీ నిర్మాతని సుఖపరిచేలా లేదు. అప్పు చేయకుండా, వడ్డీ కట్టకుండా సినిమా తీసే నిర్మాతలు ఇవాళ తెలుగులో లేరు. నిర్మాత ట్రేడ్ ని ఫాలో అయ్యి సినిమాలు తీయాలి. దర్శకుడు ఆడియన్స్ ని ఫాలో అయ్యి సినిమాలు తీయాలి. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటే, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మంచి సినిమాలు, లాభసాటిగా తీయొచ్చు. ఆడియెన్స్ కి, ట్రేడ్ కి లింక్ తెగిపోయి చాలా ఏళ్లయింది. వందరోజులు, నూట యాభై రోజులు, నూట డబ్భై రోజులు, రెండు వందల రోజులు, మూడొందల అరవై అయిదు రోజులు - ఇలా ఆడేవి మునుపు బాగున్న సినిమాలు, ప్రేక్షకుడు బ్రహ్మరధం పట్టిన సినిమాలూ. సరిగ్గా సినిమా పుట్టిన వందేళ్ళకి సినిమాకి వందరోజుల 'రన్' లేదు. వెయ్యి థియేటర్లు, రెండు వేల థియేటర్లు ఖాళీగా అట్టే పెట్టుకుని రెండు, మూడు వారాలు అన్ని థియేటర్లలో ఒకేసారి రిలీజ్ చేస్తే ఆ సినిమాకి వచ్చిన రెవెన్యూ రీత్యా అది హిట్టో, ఫట్టో డిసైడ్ చేయడం జరుగుతోంది. ఇందులో ప్రేక్షకుడికి నచ్చడం, నచ్చకపోవడం ఏముంది? సినిమాని ప్రేమించేవాడు ఏ సినిమా అయినా ఎలా ఉందో తెలుసుకోడానికి ముందు రోజు వెళ్తాడు. అది మౌత్ టాక్ గా స్ప్రెడ్ అయి హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం జరిగేది.

అప్పడు దర్శక, నిర్మాతలకి జనం పల్స్ తెలిసేది. వాళ్ళేం కోరుకుంటున్నారో అర్ధమయ్యేది. ఇప్పుడు మొదటిరోజు కలెక్షన్లు చెప్పేస్తాయి మొదటివారం ఎంతొస్తుందో. ప్రేక్షకుడి పల్స్ ని బట్టి సినిమాలు తీస్తే కథల్లో ప్రేక్షకుడు మెచ్చే అంశాలు పెట్టి రాసుకోవడం జరిగేది. మార్కెట్ ని శాటిస్ఫై చేయడానికి సినిమాలు తీస్తే ఒకే కథ పదిహేనుమంది స్టార్ హీరోలతో పదిహేనుసార్లు తీయొచ్చు.

ట్రేడ్ అనేది షేర్ మార్కెట్ లాంటిది. రోజురోజుకీ మారుతుంది. ప్రేక్షకుడి నాడి అన్నది శాశ్వతంగా ఉండే కళాత్మక వ్యాపారం. దాన్ని వదిలేయాల్సి రావడం, స్థిరత్వం లేని ట్రేడ్ ని ఫాలో అవ్వడం అవివేకమే అయినా ఈరోజుల్లో అనివార్యం. ఇలాగే ఇంకో పదేళ్ళు కొనసాగితే, ఒకప్పుడు డైనోసార్ అనే జాతి ఉండేదంట అని చరిత్ర పాఠాల్లో చెప్పుకున్నట్టు, తెలుగు సినిమాకి ఒకప్పుడు నిర్మాత అనే పోస్ట్ ఒకటుండేదంట. ఆయనే డబ్బు పెట్టి సినిమా తీసేవాడంట, అని చరిత్రలా చెప్పుకోవాల్సివస్తుంది. నష్టం వస్తుందని తెలిసి డబ్బెందుకు పెట్టాలి? అన్న ఆలోచన తెలుగు సినిమా నిర్మాతల్లో చాలామందికి ఇప్పటికే వచ్చింది. మిగిలిన కొద్దిమందిదీ అదే పరిస్థితి. పరిశ్రమకి ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా టాప్ హెడ్స్ అందరూ కూర్చుని ఒకపరిష్కారం కనుగొనేవారు. ఇప్పుడు టాప్ హెడ్స్ చాలా ఎక్కువమంది అయిపోయారు. ఎవ్వరికీ పక్కవాడి సలహా రుచించనంత ఈగో. సీనియర్లకి, అనుభవజ్ఞులకి గౌరవం ఇవ్వటం అవమానంగా భావించే రోజులివి. నిర్మాత దొరికితే చాలనుకున్న రోజుల నుంచి, ఎవరు దొరికితే వాళ్లని నిర్మాతలుగా చేసేసి చేతులు దులిపేసుకునే దుస్థితి. ఇవన్నీ పరిష్కారం లేని సమస్యలే. మార్పు ఎప్పుడూ వచ్చేప్పుడు కఠినంగా ఉంటుంది. అలవాటయ్యాక సులభంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మానవ సమాజ తీరుతెన్నులే మారుతున్న దశ కాబట్టి - ఆ మార్పుల సునామీలో సినిమా పరిశ్రమ కొట్టుకుపోకుండా తట్టుకొని నిలబడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. డిమాండ్ ని బట్టి సఫ్లై అన్న సాధారణ మార్కెట్ సిద్ధాంతం ఇవాళ్టి సినిమా పరిశ్రమకి అప్లై కాదు. ప్రేక్షకుడికి ప్రయారిటీ ఎంటర్ టైన్ మెంట్ లో సినిమా పదోస్థానంలో కూడా లేదిప్పుడు.

రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు మొబైల్ యాప్స్ లో సినిమాని డౌన్ లోడ్ చేసుకుని చూడడమే సినిమా మార్కెట్ గా డెవలప్ అయ్యే రోజు త్వరలోనే రావచ్చు.

ఎవరి కళాతృష్ణకి కాసులు రావాలన్నా కావల్సింది ప్రేక్షకుడి రెండుకళ్ళనీ కట్టిపడెయ్యడమే. కానీ అంతకంటే సినిమా పరిశ్రమ మొత్తం కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవలసింది - నిర్మాతని, నిర్మాణ సంస్థని.

(మళ్ళీ వచ్చేవారం మరిన్ని విశేషాలతో...)

 

మీ
వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
Remix