Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
natyabharateeyam

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Deepavali

శివకాశి - హైమాశ్రీనివాస్

shivakashi

దీపావళి పండుగ అనగానే మనకు గుర్తువచ్చేది శివకాశి .ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువధరకు కావల్సినన్ని టపాకాయలు దొరుకుతాయి గనుక. మనకు చౌకగా లభ్యమయ్యేవంటే మక్కువ ఎక్కువకదా! అందులోనూ దీపావళి అందరి పండుగ.ఈశివకాశి తమిళనాడు లో ఉంది.దీని చరిత్ర తక్కువదేంకాదు దీనికి 600 ఏళ్ల చరిత్రఉంది.  హిందువుల పవిత్రక్షేత్రమైన కాశీ ఉత్తరాదిన ఉంటే దక్షిణాదిన తమిళ నాడులో  రెండు కాశీలు ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి ‘తెన్ కాశి’ రెండోది ‘శివకాశి’. శివకాశి మదురైకి దక్షిణాన ఉంది. 14వ శతాబ్దంలో 'హరికేసరి పరాక్రమ పాండి యన్'ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన వారణాసిలో శివుడిని దర్శించుకొని అక్కడి నుంచి ఒక శివలింగా న్ని తెచ్చి తాను ఉంటున్న 'తెన్ కాశి 'లో ప్రతిష్ఠించాలని భావించాడు. అందుకోసమని వారణాసి నుండీ ఒక శివలింగంతో  తన స్వస్థలానికి వస్తూ మార్గమధ్యంలో విశ్రాతికోసం దారిలో ఉన్నశివకాశిలో  కొంత సమయం ప్రయాణబడలిక తీర్చు కోను ఆగుతాడు. ఈ లింగాన్ని గోవు అక్కడ నుంచి కదలలేదుట! దాంతో ఆయన ఆ లింగాన్ని తన స్వస్థల మైన ‘తెన్ కాశికి’ తీసుకెళ్లలేనని భావించి లింగాన్ని  అక్కడే ప్రతిష్ఠించాడు. దీంతో ఈ నగరానికి’ శివకాశి’ అని పేరొ చ్చిందని ,ఒక కథ ఆలయ చరిత్రను బట్టితెలుస్తున్నది.చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఈ శివకాశి ఉంది.

మనకు అగ్గిపుల్లలేందే ఇల్లుగడవదు,పొయ్యివెలిగించాలన్నా ,దేవునిదీపంపెట్టాలన్నా, దీపావళి టపాసులు కాల్చా లన్నా అన్నింటికీ అగ్గిపుల్ల అవసరం. ఈ అగ్గిపుల్ల  పుట్టినిల్లు చైనా. మనదేశానికీ ఫ్రాన్స్, ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయ్యేవి. 1921 తర్వాత కోల్ కతాలో మొదటిసారి అగ్గిపెట్టెల పరిశ్రమ ఏర్పాటైంది. ఈవిషయంతెలిసి శివకాశి వాస్త వ్యులు  పి.అయ్యానాడార్, ఎ.షణ్ముగనాడార్ అనే ఇద్దరు వ్యక్తులు జర్మనీ నుంచి యంత్రాలను తీసుకొచ్చి శివకాశీ లో అగ్గిపుల్లల పరిశ్రమ ఏర్పాటు చేశారు. అప్పట్లో స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతంగా ఉండటాన విదేశి వస్తు బహిష్క రణ తీవ్రంగాఉండేది..  దాంతో అగ్గిపుల్లలకు డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచీ ఇక్కడ పెద్దఎత్తున అగ్గి పుల్లల తయారీ మొదలైంది. క్రమేపీ ఈ పరిశ్రమల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ 280 అగ్గిపుల్లల చిన్నస్థాయి పరిశ్ర మలు, 3200 కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఏటా 15 కోట్ల అగ్గిపుల్లలు తయారు చేస్తున్నారు. దేశానికి అవ సరమైన అగ్గిపుల్లల్లో 70 శాతం ఈ పరిశ్రమల నుంచే లభిస్తున్నాయి. అగ్గిపుల్లల పరిశ్రమలతో పాటు తర్వాత ఇక్కడ బాణాసంచా పరిశ్రమలు కూడా భారీ ఎత్తున ఏర్పాటయ్యాయి. దాదాపు మూడులక్షల మంది కార్మికులు ఈ పరిశ్ర మలపై అధారపడి జీవనం సాగిస్తున్నారు. శివకాశి శివారులోని 15 పైగా గ్రామాల్లోనూ అగ్గిపుల్లలు, బాణా సంచా పరిశ్రమలుండగా తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు తదితర జిల్లాల నుంచి వేలాది మంది ఇక్కడ వచ్చి పని చేస్తుంటారు. శివకాశిలో అనుమతి పొందిన 630 బాణాసంచా తయారీ పరిశ్రమల్లో 1.3 లక్షల మంది పని చేస్తుండగా అనుమతుల్లేని పరిశ్రమల్లో మరో లక్ష మంది పని చేస్తున్నట్లు సమాచారం.

1960వ సం. దేశంలో నిరు ద్యోగం రాజ్యమేలుతోంది. అందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే ,శివకాశిలో ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా అభివృద్ధి చెందాలని కలిసి నిర్ణయించుకున్నారు. అగ్గిపుల్లలు, బాణా సంచా, ముద్రణ, ఇతర పరిశ్రమల్లో పనిచేస్తూ జీవించసాగారు. గణనీయమైన వృద్ధి సాధించారు. ఈ సమాచారం తెలుసు కున్న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ నగరానికి’ కుట్టిజపాన్’ అనే పేరు పెట్టారు.అప్పటి నుంచి ఇది’ మిని  జపాన్ ‘గా ప్రశస్తి సాధించింది. స్వామికి కాశీ విశ్వనాథుడు అనిపేరు.హరికేసరి పరాంకుశరాజు తరువాత ఆయన రాజ్యాన్ని ఏలిన పాండ్యరాజులు ఈ ఆలయంలో మండపాలు, ప్రాకారాలు, తీర్థం, ప్రహరీ, రథవీధులను ఏర్పాటు చేశారు. .కోరికలను త్యజించడానికి కాశీకి వెళతారు. అంతదూరం వెళ్లలేని వారు ఇక్కడి విశ్వనాథుని దర్శించు కుంటారు. స్వామితో పాటు విశాలాక్షి అమ్మకూడా  భక్తులను తరింపజేస్తుంది.వీరికి మొక్కు కుంటే మనస్సు నిర్మల మవుతుందని భక్తుల విశ్వాసం.

దీపావళి సమీపించే కొద్దీ ఇక్కడి పనివారు ఎక్కువ శ్రమిస్తారు. రాత్రింబవళ్ళూ పనిచేస్తారు.దాంతో కొంతకాలంగా ఇక్కడ చాలా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ నిరుద్యోగులు ఉండరు.100 శాతం ఉపాధి వీరి స్వంతం. ఇక్కడి కార్మికులు పరిశ్రమల్లో రసాయనాల నుంచి  వచ్చేరుగ్మతల నుంచి కాపాడుకునేందుకు ఎక్కువగా అరటి పళ్ళు తింటారు. ఇక్కడి పొడి వాతావరణం టపాకాయల తయారీకి అనుకూలం. వర్షపాతం చాలా తక్కువ. ఉష్ణోగ్రత ఎక్కువ.భారీ వర్షాలు,నదులు, పచ్చని పొలాలు ఇక్కడ కనిపించవు.ఈ బాణాసంచా ఉత్పత్తులను కొన్నింటిని విమానాశ్రయ వర్గాలు కూడా ఉపయోగిస్తాయి. విమానాలు టేకాఫ్ చేసేసమయంలో పక్షులను పారద్రోలడానికి బాణాసంచా కాల్చిపక్షులను బెదిస్తారు. ఈ శివకాశిలో తయారైన బాణాసంచా దీపావళికి దేశమంతటా వెలుగులు విరజిమ్ముతుంది, అపారంగా లాభాలు గడిస్తుంది.మనకు దీపావళి బాణాసంచా అందించే శివకాశిని గురించీ, ఇక్కడ మనకోసం పని చేసే కార్మికులను గురించీ కొంత చెప్పుకోడం ఈసందర్భంగా ఉంచితం కదా!

మరిన్ని శీర్షికలు
weekly horoscope (october17th to  october23rd