Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ఆ అల‌వాటు పెద‌నాన్నే మాన్పించారు- వ‌రుణ్‌తేజ్‌

మెగా ఇంటి నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడంటే ఎన్ని అంచ‌నాలో..??   అభిమానులు ఎన్నో ఊహిస్తారు. ఫైట్లు, డాన్సులు, డైలాగులూ అంటూ లెక్క‌లేసుకొంటారు. మాస్ సినిమా అయితే క‌రెక్ట్ అనుకొంటారు. అయితే వ‌రుణ్‌తేజ్ ఎంట్రీ భిన్నంగా సాగింది. మాస్ ట‌చ్ ఉన్న ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చాడు వ‌రుణ్‌. డాన్సుల్లేవుగానీ డైలాగులు, న‌ట‌న‌తో ఆక‌ట్టుకొన్నాడు. ఫైట్లూ చేశాడు. మొత్తానికి తొలి చూపులోనే న‌చ్చేశాడు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా వైపు వెళ్ల‌కుండా ఓ మంచి ప్ర‌య‌త్నం చేశాడు. ముకుంద ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా ఈ కొత్త హీరో ఇష్టాయిష్టాలూ, అభిరుచులూ, వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ఆరా తీసింది గో తెలుగు. ఆ సంగతులు ఇవీ..

*  తొలి సినిమాతోనే మెగా ప్రిన్స్ అనే బిరుదు అందుకొన్నారు..
- ఆ మాట వింటే కంగారు పుడుతుంది.. న‌న్ను వ‌రుణ్ అనే పిల‌వండి.. చాలు.. (న‌వ్వుతూ)

* కెమెరా ముందుకొచ్చిన తొలి క్ష‌ణాల్లో టెన్ష‌న్ ప‌డ్డారా?
- ఎందుకుండ‌దండీ.. ఫుల్లుగా.  ఎవ‌రేమ‌నుకొంటారో అన్న కంగారు ఉండేది. సెట్లో నా గురించి ఏమైనా అనుకొంటారేమో..?  అంద‌రూ నావంకే చూస్తారేమో.. నా గురించే మాట్లాడుకొంటారేమో అనిపించేది. అందుకే సీన్ అయిపోయాక అటూ ఇటూ చూసేవాడ్ని. ఆల‌స్యంగా అర్థ‌మైన విష‌యం ఏమిటంటే... సెట్లో ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీగా ఉంటారని.. కామెంట్లు చేసుకొనేంత తీరిగ్గా ఉండద‌ని.

* టెన్ష‌న్ త‌గ్గ‌డానికి ఏం చేశారు?
- ముందు ఫైట్లు తీసేశాం. దాంతో కెమెరా ముందు ఎలా ఉండాలి అన్న విష‌యంపై అవ‌గాహ‌న వ‌చ్చింది. కంగారు తగ్గింది.

*  తెర‌పై మిమ్మ‌ల్ని మీరు చూసుకొన్న‌ప్పుడు ఏం అనిపించింది. ఏ విభాగంలో బెట‌ర్‌గా పీల‌య్యారు..?
-  నా పెర్‌ఫార్మెన్స్ నాకు సంతృప్తినిచ్చింది. ఫైట్స్ ఉన్నా.. స్టైలీష్ గానే తీశారు. డాన్స్‌లు చేసే అవ‌కాశం అంత‌గా రాలేదు.

* మెగా హీరోలంటే డాన్సులు కూడా కావాలి అనుకొంటారు క‌దా.?
- ఔను. కాక‌పోతే ముకుంద‌లో ఆ అవ‌కాశం రాలేదు. దానికి తోడు నేను కూడా డాన్సుల‌పై దృష్టి పెట్ట‌లేదు. దాని కోసం కాస్త శిక్ష‌ణ తీసుకోవాలి..

* ముందు నుంచీ సినిమాలంటే ఇష్ట‌మా?
- చాలా. ఎందుకంటే ఇంట్లో అంతా సినిమా వాతావ‌ర‌ణ‌మే క‌దా. రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ అయిన వెంట‌నే నేను కూడా రంగంలోకి దిగాల్సింది. కానీ శిక్ష‌ణ తీసుకొవ‌డానికి టైమ్ ప‌ట్టింది. ఆ త‌ర‌వాత మంచి క‌థ కోసం ఎదురుచూశాం. మొత్తానికి మంచి సినిమాతోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాను.

* సినిమాల్లోకి రాక‌పోయుంటే..?
- ఎంబీఏ చేసుకొనేవాడ్ని.

* చ‌దువంటే అంతిష్ట‌మా?
- ఔను. చిన్న‌ప్పుడు బాగా చ‌దివేవాడ్ని. ఫ‌స్ట్ క్లాస్ స్టూడెంట్‌ని. ఎప్పుడూ 80 శాతం మార్కులు వ‌స్తుండేవి.

* మ‌రి ఆట‌పాట‌లు..
- బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. బ్యాట్మెంటెన్ కూడా నేర్చుకొన్నా. స్విమ్మింగ్ నా హాబీ.

* బాగా ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కులెవ‌రు?
- వినాయ‌క్‌, రాజ‌మౌళి, పూరి జ‌గ‌న్నాథ్‌... ఇలా అంద‌రూ నాకిష్ట‌మే. కార్తికేయ‌, స్వామిరారా సినిమాలు చూశా. చాలా బాగా తీశారు. కొర‌టాల శివ మిర్చి చూసి ఆయ‌న అభిమాని అయిపోయా.

* మీ ఇంట్లో చాలామంది హీరోలున్నారు.. మీలో మీకే పోటీనా?
- అబ్బే.. మేం ఎప్పుడూ అలా అనుకోం. ఎవ‌రి సినిమాలు వాళ్ల‌వే. కాక‌పోతే ఒక‌రికి మ‌రొక‌రు స్ఫూర్తినిస్తారు.

* న‌చ్చిన హీరోలెవ‌రు?
- ప్ర‌భాస్ అంటే చాలా ఇష్టం. త‌న  ఫైట్స్ సూప‌ర్బ్‌గా ఉంటాయి.

* మీరు చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తారా?
- ఆ అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా.  ఇది వ‌ర‌కు నేను చాలా బ‌రువు ఉండేవాడ్ని. ఇప్పుడు బాగా త‌గ్గా. శ‌రీరం ఇప్పుడిప్పుడే అదుపులోకి వ‌స్తోంది. కొంత‌ విరామం తీసుకొన్నాక సిక్స్ ప్యాక్ ట్రై చేస్తా.

* మీ కెరీర్ విష‌యంలో చిరంజీవి, ప‌వ‌న్ లు ఎలాంటి స‌ల‌హాలిస్తారు?
- న‌న్ను బాగా మెటివేట్ చేసింది పెద‌నాన్న‌గారే. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోమంటుంటారు. క్ర‌మశిక్ష‌ణ ముఖ్యం అని చెప్తుంటారు. నాకు ఆల‌స్యంగా నిద్ర‌లేచే అల‌వాటు ఉండేది. పెద‌నాన్న‌గారే మాన్పించారు. ఇక బాబాయ్‌ని చూస్తూ పెరిగా. ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌ల‌హాలివ్వ‌రు. ఆయ‌న నిజాయ‌తీ నాకు బాగా న‌చ్చుతుంది.

* చేయ‌బోయే సినిమాలేంటి?
- పూరి జ‌గ‌న్నాథ్‌, క్రిష్ ఇద్ద‌రితోనూ సినిమాలు చేయాలి. ఏది ముందో చెప్ప‌లేను..

* ఒకే ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ..

- కాత్యాయిని
మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Mukunda