Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉగాది ప్రత్యేకం - సిరాశ్రీ

సీస పద్యం:
పలుకుయొకటి గాని పలు కుల్కులను చిల్కు
          తీపి యాసల మేటి తెలుగు గడ్డ   
శత్రు పక్షమునకున్ స్వాతంత్ర సమరాన
          చేదు రుచిని చూపి చెలగె గడ్డ  
చిలిపి పద్యాలనే చిలుకుచు వేలేండ్లు
           పులుపు పంచి ముదము పొంగు గడ్డ
పౌరుషమ్మును పెంచి పోషించు తీరులో
            ఒగరు నిండిన గొప్ప పొగరు గడ్డ

మనసు విరిసి మురిసి మమకారముప్పొంగ 
ఆరు రుచులు కలయు అబ్బురమ్ము
మన యుగాది చూడ మాధురీ పర్వము 
శ్రీ విజయమొసగును సిరులు మీకు

గజల్
ప్రతి ఏడు ఒక ఉగాది ఉరికొస్తుంది
కొత్త కొత్త ఆశలేవొ మొలిపిస్తుంది

భావి ప్రగతికుగాది సూచననిస్తూ
లేత మావి చిగురు పూత చూపిస్తుంది

ఋతువులారు సమరీతిన నడవాలంటూ
ఆరు రుచులు ఉగాది తినిపిస్తుంది

మానవాళి పచ్చగ కలిసుండాలంటూ
కోకిల ఉగాదిగీతి వినిపిస్తుంది

సంస్కృతినే గుర్తుచేసి ఈ ఉగాది తట్టి లేపి
పధ్ధతిగా పంచాంగం కొనిపిస్తుంది

సిరాశ్రీ ! మనసు పొరలు దులిపిననాడే
ఈ ఉగాది పండుగలా అనిపిస్తుంది

 

మరిన్ని శీర్షికలు
go telugu song by gajal srinivas