Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ: భూషణ్ అంకుల్ ఇంటికి డిన్నర్ కి వెళతారు చంద్రకళ, వాళ్ళ అమ్మానాన్నా.  విజయ్ భూషణ్ స్టూడియోలో  చంద్రకళ కూచిపూడి ప్రదర్శన ఒక పండుగలా సాగుతుంది. ఆ తరువాత....... 

 

.ఏ డాన్స్ నచ్చిందో, ఏ పాట బావుందో అని అమ్మా, అత్తయ్య మధ్య డిస్కషన్ అవుతుండగా, భూషణ్ అంకుల్ వాళ్ళు మా వద్దకు వచ్చారు.  వాళ్ళ వెంటనున్న పెద్దాయన్ని, కోదండం అయ్యర్ – ‘హరివిల్లు’  టి.వి  చానల్  ప్రొడ్యూసర్ గా, మాకు పరిచయం చేసారు భూషణ్ అంకుల్.  నేను, అమ్మ లేచి ఆయనకి నమస్కరించాము..  రాణి కూడా వచ్చి ఆయన్ని “గుడ్ యీవనింగ్’ అంటూ గ్రీట్ చేసింది.

“మీ ఇద్దరూ కూడా సంగీత, నృత్యాల్లో  ఆరితేరిన ఆర్టిస్టుల్లా  పర్ఫాం  చేసారు... మీతో మంచి టి.వి షో చేయిస్తాను,” అంటూ బ్లెస్ చేసారు కోదండం గారు.... .

**

వచ్చిన గెస్ట్స్ అంతా వెళ్ళిపోయాక,   మేము మాత్రమే మిగాలాము అక్కడ..

ప్రోగ్రాం జరిగిన తీరుకి, చెప్పలేనంత  హ్యాపీగా ఉంది అందరికీ...

భూషణ్ అంకుల్, నీరు ఆంటీ దగ్గరగా వెళ్లి ‘థాంక్స్’ చెప్పాను.

“అలా కాదు, బ్లెసింగ్స్ తీసుకోవాలి పద్దతిగా,” అంది నా వెనుకే ఉన్న అమ్మ.

“భూషణ్ అంకుల్ మేడ్ యువర్ డ్రీం కమ్ ట్రూ కళా,” అన్నారు నాన్న.

పాదాలంటి  నమస్కరించబోతే, అంకుల్ నా భుజాలు పట్టి ఆపారు.

“చూడు కళా, తల్లితండ్రులకి, గురువుకి పాదాభివందనం చేసావుగా, చాలు.

నీలో ఉన్న ఈ టాలెంట్ తో నువ్వు బాగా పైకి రావాలని ఆశిస్తాను.  అందుకు నేను నా వంతు సహాయం  చేస్తాను.  నువ్వు మాకు మరో బిడ్డ లాంటి దానివే.  నువ్వు, రాణి ఇద్దరు వృద్దిలోకి రావాలి,” అంటూ ఆశీర్వదించారు.

రాణి చేత అమ్మ పాదాలకి నమస్కారం చేయించి, ‘గురుదక్షిణ’  కానుకలు అందించారు అంకుల్ వాళ్ళు.

**

స్టూడియో నుండి బయలుదేరి, కబుర్లు చెప్పుకుంటూ, ఇల్లు చేరాము.

కాంప్లెక్స్  గేట్ ముందు అమ్మ నాకు దిష్టి తిప్పేసింది.

అర్ధరాత్రి  దాటినా, సంతోషంతో నిద్ర పట్టడంలేదు.  నా ‘డాన్సింగ్ డ్రీమ్స్’ నిజమవ్వడానికి మా అమ్మ, నాన్న ఎంత చేస్తారో కదా! అని మనసంతా వాళ్ళంటే ప్రేమతో నిండిపోయింది... మరి భూషణ్  అంకుల్  ప్రోత్సాహం కూడా అంతే ముఖ్యంలా ఉంది.  అంకుల్,  ముందునుండీ నేనంటే ఆప్యాయంగా ఉంటారు కదా అనిపించింది... “ఐ యాం గ్రేట్ఫుల్  టు హిం,” అనుకున్నాను.

‘వేదిక’  మీద  నాట్యం  చేసేప్పుడు  నాకు  కలిగేంత  ఆనందం,  నా నృత్యం చూస్తున్నవారికి కూడా కలుగుతుందని  అనిపిస్తుంది.  ఒక్కోసారి, నా నాట్యం  చూస్తున్న వారందరి ముఖాల మీద చిరునవ్వు ఉందనిపిస్తుంది.

డాన్స్  చేస్తున్నంతసేపు  నేనెలా  ఫీల్  అయ్యానో, ఎంత  బాగానిపించిందో ఆలోచిస్తూ మరేప్పటికో  నిదురపోయాను.

**

మరునాడు  తెల్లారుజామున,  ట్రావెల్ వాన్ లో తిరుపతి బయలుదేరాము.  కన్నన్, మీనాక్షి కూడా వెంట వస్తున్నారు. దారి పొడుగునా అమ్మ పాటలు, మణత్తయ్య మాటలతో ప్రయాణం సరదాగా ఉంది.

**

ప్రతి యేడు తిరుపతి,  శ్రీశైలం, బెజవాడ కనకదుర్గ గుళ్ళకి  తప్పక వెళుతూనే ఉంటాము.  ప్రతియేడూ  సత్యనారాయణ వ్రతం  చేస్తారు  అమ్మా నాన్నా.  నాన్నకి దైవభక్తి ఎక్కువేనంటుంది  అమ్మ..

మునుపటి ప్రయాణాల ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుపతి చేరాము...

కొండపైన కాటేజీల్లో దిగి, స్నానాలు చేసి అందరం తయారయ్యాము.

గుడికి వెళ్లబోతుంటే, అత్తయ్య నా మెడలో ముత్యాల హారం  వేసింది.

అది చూసిన అమ్మ, “అంత విలువైన వస్తువు చిన్నపిల్లకి వేయవద్దు వదినా, ఇప్పుడేమి అవసరం,” అంది  అత్తయ్యతో.

“కాదనకు శారదా,  అంత బాగా డాన్స్ చేసినందుకు కళకి ఈ హారం మా కానుక.  అదీకాక, చంద్రకళ మా కోడలు పిల్ల,” అన్నారు అక్కడే ఉన్న రాంమామయ్య.

**

తిరుపతి, దిగువ తిరుపతి లో అన్ని దేవుళ్ళ దర్శనాలు చేసుకొని ఆ మరునాడు బయలుదేరి, ఇల్లు చేరాము.  పెద్ద అలసటగా లేకపోయినా, డాన్స్, పాట క్లాసుల నుండి రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాము.

**

సమయమంతా అత్తయ్య వాళ్ళతో గడుపుతున్నాము.

రాణి కూడా వచ్చి మాతో కాసేపు గేమ్స్ అవీ ఆడుతుంది.  రాణీతో ఓ రోజు వాళ్ళ స్టూడియోలో  హిందీ సిమిమా ప్రీవ్యూకి,  మళ్ళీ ఓ సారి వాళ్ళ ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళాము.

**

తెల్లవారితే,  అత్తయ్య వాళ్ళ ఢిల్లీ  ప్రయాణమనగా  భూషణ్  అంకుల్  వాళ్ళింటికి, మరోసారి  డిన్నర్ కి  వెళ్ళాము..తిరుపతిలో, తమకి కాటేజీల నుండి దైవ దర్శనం వరకు, ఏర్పాట్లు చేసినందుకు భూషణ్ అంకుల్ కి, ‘థాంక్స్’ చెప్పారు రాంమామయ్యా, నాన్న కూడా.వర్ధంతి  ప్రోగ్రాం ఫోటోలు చూపించింది రాణి.... చాలా బాగా వచ్చాయి.. మా ప్రదర్శన గురించి కొన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీష్  న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్స్ చూపించారు అంకుల్.   మా గురించి, మా ఇద్దరి టాలెంట్  గురించి  గొప్పగా పొగిడారట.  అమ్మా నాన్న కాసేపు అన్నీ చదివారు.

“మీ నాన్న సంతోషానికి అవధుల్లేవు కళా,” అన్నారు అంకుల్.

“రాణికి, నీకు కలిపి ‘జెమిని టి.వి’ వారి ఇంటర్వ్యూ  ప్లస్  పర్ఫార్మెన్స్  ఏర్పాటు చేయబోతున్నాను,  మీ స్కూల్ మొదలయ్యే లోపే,”  మళ్ళీ  నాతో  భూషణ్  అంకుల్.

వావ్,  నీ ‘టి వి షో’ నా? గ్రేట్,” అంటున్న జగదీష్  వైపు చూసారు అంకుల్....

“సరే, నీ సంగతి చెప్పు జగదీష్.   నీవు హాండ్సమ్ ఫెల్లోవే.  ఆసక్తి ఉంటే, సినిమా హీరో అవ్వచ్చు,”  అన్నారు.

నో అంకుల్.  నేను సర్జన్ అవుతాను,”  అని వెంటనే జవాబిచ్చాడు జగదీష్.

“సంతోషం.  నోబుల్ ప్రొఫెషన్.  ప్రౌడ్ ఆఫ్ యు, జగదీష్,” అన్నారు అంకుల్.

డిన్నరయ్యాక, మరికాసేపు అక్కడే ఉండి, డిస్నీ మూవీ చూసి ఇంటికి వచ్చేసాము.   అర్దరాత్రి  దాటేవరకు, అందరం  హాల్లో కూచుని కబుర్లు  చెప్పుకున్నాం.

**

మమ్మల్ని  ఢిల్లీ  రమ్మని మరీ మరీ చెప్పి,  సాయంత్రం  ఆరింటికి  అత్తయ్యావాళ్ళు  బయలుదేరిపోయారు.    

వాళ్ళు వెళ్ళాక,  ఇల్లంతా ఖాళీగా, ఎప్పుడూ లేనంత డల్ గా అనిపించింది... ఊహ తెలిసాక ఇలా రిలేటివ్స్  రావడం, క్లోజ్  ఫ్రెండ్స్ లా అనిపించడం,  ఇదే మొదటి సారి. 

జగదీష్ వచ్చిన ఫస్ట్ డే  ఎలా పట్టనట్టుగా ఉన్నాడో,  వెళ్ళేనాటికి  మేమంటే  ఎంత ఇష్టంగా ఉన్నాడో  అని తలుచుకున్నాను.  నా డాన్స్ అంటే కూడా ఇష్టమని చెప్పాడు కదా! అనుకున్నాను.

మరునాడు డాన్స్ క్లాస్ పొద్దున్నే ఉందని గుర్తొచ్చి,  భోంచేసి, త్వరగా పనులు ముగించి, బెడ్ మీద వాలాను....

**

క్లాసుకి వెళ్లేముందు, కాసేపు సిటింగులో అమ్మ పక్కనే  కూర్చుని  టి.వి  చూస్తున్నాను.

కామాక్షి, మీనాక్షిల అమ్మ - అంబుజ వచ్చింది.  మా ఎదురుగా  గోడకానుకుని  క్రింద కూర్చుంది.

“డాన్స్ చానా బాగా ఆడిందమ్మా, మీ పాప,” అందామె అక్కడే ఉన్న నన్ను చూస్తూ.

“భూషణ్  బాబుగారు, అమ్మగారు నిత్యం పాపని పొగుడుతారని,  రాణమ్మ  మండి  పడిపోతున్నారు.  ఆ విషయంగా బాబుగారికి,  రాణమ్మకి   రోజు గొడవే,” అంది నవ్వుతూ, అంబుజ.

అది విని, అమ్మ కూడా సప్రైజ్ అయిందనుకుంటా.

“చిన్నపిల్లలేవే అంబుజా.  ఇద్దరూ బాగా చేసారు,” అన్నది అమ్మ.

“సరేగాని, మొన్నామధ్య  – అడ్వాన్సులు తీసుకున్నావు గుర్తుందా? అడిగింది అమ్మ. టైం అవడంతో,  నేను  క్లాసుకు  వెళ్ళిపోయాను..

**   

క్లాసులో కాస్త హడావిడిగానే ఉంది.  మాస్టారు ఫోన్ మీదున్నారు.  మామూలుగా వెనుక హాల్లో క్లాస్ చెప్పే  శేషు మాష్టారు కూడా తన శిష్యులతో సహా, పెద్దహాల్లోనే ఉన్నారు.

మాష్టారు ఫోన్ పెట్టేసి మా వంక చూసారు...

“చెప్పండి సార్ నిజమేగా!” అన్నారు శేషు మాస్టారు.

శివరామశర్మ మాస్టారు చిరునవ్వుతో, ”ఔను ... కల్చరల్ సెక్రెటరీ, కళా వెంకట్రావు గారే ఫోన్ మీద...ఈ యేడు కళారంగంలో - ‘పద్మశ్రీ’  అవార్డ్  గ్రహీతగా  నా  పేరు  అనౌన్స్  చేసారు....అవార్డు ఢిల్లీ లో అందుకోవాలి.  ఇక్కడ సన్మాన సభ చేస్తారంట.  ఆ సందర్భంగా మనం ఓ మంచి నృత్య నాటిక చేయాలంటున్నారు,” అన్నారు మాస్టారు.

అందరం  క్లాప్  చేసి మా సంతోషాన్ని ఆయనకి తెలియజేశాం. క్లాస్ ముగిసి ఇంటికెళ్ళేప్పటికి,  అమ్మ టి.వి  చూస్తుంది... మాస్టారి అవార్డు న్యూస్ చెప్పాను.  అమ్మ కూడా చాలా సంతోషించింది.  అంతటి అవార్డు రావడం మామూలు సంగతి కాదని, అయన నాకు గురువు కావడం అదృష్టమేనంది.

**

మాస్టారికి  ‘పద్మశ్రీ’  అవార్డు రావడాన్ని మరునాడు మా డాన్స్ స్కూల్లో సెలెబ్రేట్ చేసాము.   అవార్డు  అందుకున్నాక  సమ్మర్ లో చెన్నై యూనివర్సిటీ హాల్లో,  స్టూడెంట్స్  తో  పెద్దఎత్తున  ప్రోగ్రాం  చేయాలని  నిశ్చయించామన్నారు  గురువుగారు.

ఆ డాన్స్ డ్రామా పేరు ‘శ్రీ కృష్ణావతారం’. 

అందులో,  ‘కాళీయమర్ధనం’  అంశంలోని  కృష్ణుడిగా నన్ను ఎంపిక చేసారంట.  కష్టమైన జతులుంటాయని,  నాకు మంచి  లయజ్ఞానం ఉన్నందువల్ల,  నన్ను ఎన్నుకున్నారని,  శేషు మాస్టారు మాకు చెప్పినప్పుడు  నేను చెప్పలేనంత హ్యాపీగా ఫీలయ్యాను.  అందరికీ  కాస్ట్యూమ్స్, వేషం  అన్నీ మాస్టారే తెప్పిస్తారంట. నలభై మంది పార్టిసిపెంట్స్ ఉంటారంట. త్వరలో స్కూల్స్ రి-ఓపెన్ అయ్యాక డాన్స్ డ్రామాకి  ట్రైనింగ్  మొదలవ్వచన్నారు. మా అందరికీ చాలా ఉత్సాహంగా అనిపించింది.  ఇంకా పది రోజుల్లోనే స్కూల్ మొదలు.

“అంటే రెగ్యులర్ డాన్స్  క్లాస్ లో  ‘శ్రీ కృష్ణావతారం’  ప్రాక్టీస్  మొదలవుతుంది... ‘నృత్యహేళి’ గ్రూప్  ప్రాక్టీసు మాత్రం ఆదివారాలు యధాతధం అన్నారు,”  మాస్టారు గారు నాతో...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
desth mistery