Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
desth mistery

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ:  తీరా ఇల్లు చేరబోయే సమయానికి మాటు వేసి వున్న మరో గ్రూపు చేతిలో తీవ్రం గా గాయపడతారు విరాట్, సహస్రలు. స్పృహ తప్పిన సహస్రను భుజం పై వేసుకుని అక్కడినుంచి ఏదోలా  బయటపడతాడు విరాట్. ఒక చెత్తకుప్ప పక్కన చాపను చాటుగా చేసుకుని పడిపోయి విశాలకి ఫోన్ చేస్తాడు. ఆ తరువాత......

ఒక నంబర్ కి ఫోన్ చేసింది.

‘‘ఏమిటే... ఈ టైంలో గుర్తొచ్చానా ఫోన్ చేసావ్?’’ అటు నుంచి ఒక లేడీ గొంతు పరిహాసంగా అడిగింది.

ఆ గొంతు తాలూకు లేడీ పేరు గుణ దీపిక.

ఆమె ప్రస్తుతం ఎం జి ఆర్ వైద్య కళాశాలలో సర్జన్ గా పనిచేస్తోంది. శస్త్ర చికిత్సలో మంచి పేరుంది. అలాగే ఇంటి దగ్గర క్లినిక్ వుంది. మేడ పైన కాపురం కింద అంతా ఆస్పత్రి. శస్త్ర చికిత్సకు అన్ని వసతులు వున్నాయి.

‘‘గుర్తు రావటం కాదు నీ హెల్ప్ కావాలి. చాలా అర్జంటు’’ అంది విశాల.

‘‘ఏ విషయంలో చెప్పవే? నీ గొంతు అదోలావుంది. మమ్మీ క్షేమమే కదా?’’ వెంటనే అడిగింది గుణ దీపిక.

‘‘అంత టైం లేదు. నాక్కావలసిన వాళ్ళిద్దరూ చాలా ప్రమాదంలో వున్నారు. ఓగంట లోపే వాళ్ళని తీసుకొస్తున్నాను. ఆపరేషన్ అవసరం పడొచ్చు. అంతా రెడీ చేసుకునుండాలి.......’’

‘‘ఆగాగు...........నువ్విలా రెండు ముక్కల్లో చెప్పేస్తే ఎలా అర్ధమవుతుంది......’’

‘‘ఇంతకుమించి చెప్పే టైంలేదు.  ప్లీజ్..........వాళ్ళని నువ్వే కాపాడాలి....’’ అంటూ ఏడ్చేసింది విశాల. తనకు తాను కంట్రోల్ చేసుకోవటం కష్టంగా వుంది.

‘‘ఒకె ఒకె ఏడవకు. రెండే రెండు ప్రశ్నలడుగుతాను చెప్పు’’ అంది అవతిలి గుణదీపిక.

‘‘అడుగు’’ అంది కళ్ళు తుడుచుకుంటూ.

‘‘వాళ్ళిద్దరూ ఎవరు? స్త్రీలా....  పురుషులా?’’

‘‘ఒక మగ ఒక ఆడ’’

‘‘బ్లడ్ గ్రూపు ఏమిటి?’’

‘‘అతని బ్లడ్ గ్రూప్ ఎబి పాజిటీవ్, ఆమె బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్?’’

‘‘బట్ ఈ విషయం చాలా రహస్యంగా ఉండాలి. అంతా తర్వాత చెప్తాను గెట్ రెడీ’’ అంటూ లైన్ కట్ చేసి చక చకా మెట్లు దిగుతుండగా చందు ఫోన్ చేసాడు.

ఒక్క క్షణం ఆలోచించింది విశాల. వాళ్ళని కార్ లోకి చేర్చటం తన ఒక్క దానివల్ల సాధ్యం గాక పోవచ్చు. నమ్మకమైన ఒకర్ని వెంట తీసుకు రమ్మని విరాట్ చెప్పాడు. చందూ కన్నా నమ్మకమైన వాళ్ళెవరు? అందుకే చందూని రమ్మని చెప్పి మాట్లాడి లైన్ కట్ చేసింది. కిందకు వచ్చే సరికి తల్లి కాంచనమాల ఇంకా మెలకుగానే వుంది కారు తాళాలు తీసుకొని బయటకు బయలు దేరిన కూతుర్ని చూసి ఆశ్చర్య పోయింది.‘‘ఏంటే?... అసలే సిటీలో పరిస్థితులు బాగా లేవు ఈ టైంలో ఎక్కడికి బయలు దేరావ్?’’ అంది కోప్పడుతూ.

‘‘విరాట్ ఫోన్ చేసాడు మమ్మీ. తొందరగా వచ్చేస్తాను చాలా అర్జంట్. మీరు పడుకోండి వచ్చేస్తాను’’ అంటూ మరో మాటకి అవకాశం యివ్వకుండా కారు స్టార్ట్ చేసి బయటకు దూకించింది.

రెండు నిమిషాల్లోపే కారు ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్ ముందు ఆపి చందూ కోసం ఎదురు చూసింది. మరో అయిదు నిముషాల్లో చందూ బైక్ అక్కడికి శరవేగంతో దూసుకొచ్చింది.

‘‘ఫాలోమి చందూ’’ అంటూ కారును ఎగువకు పోనిచ్చింది. ఆ కారుని బైక్ మీద అనుసరించాడు చందూ.

అప్పటికి సమయం పదకొండు దాటడం మూలంగా పాండిబజార్ నిర్మానుష్యంగా ఉంది. ఏవో కొన్ని వెహికిల్స్ తిరుగుతున్నాయి.కొంత దూరం ఎగువకు వెళ్ళాక.కారుని ఎడం పక్క వీధిలోకి పోనిచ్చింది విశాల. ఆ ఏరియా గాడాంధకారంలో వుంది. లోనకు వెళ్ళేకొద్ది ఎక్కడా కరెంటు లేదు. వీధి దీపాలు నిద్ర పోతున్నాయి. వీధుల్లో జన సంచారం కన్పించటం లేదు. హెడ్ లైట్ల కాంతిలో ముందుకు పోతున్నారు.అర డజను వీధులు దాటిపోయాక ఒక చోట కుడి పక్క వీధిలోకి తిరిగింది కారు. ఆ వీధి నేరుగా ప్లే గ్రౌండ్ వద్ద చెత్త కుండీ వద్దకు చేరుస్తుంది. సమీపంలోకి వచ్చేసామన్న ఫీలింగ్ తో విశాల గుండె వేగంగా కొట్టుకోనారంభించింది. సహస్ర విరాట్ లు ఎలా వున్నారో తెలీదు. క్షణ క్షణానికి ఆమెలో ఆరాటం పెరిగిపోతోంది. అదే సమయంలో ఎడం పక్క వీధిలోంచి ఒక పోలీస్ జీప్ రివ్వున వచ్చి వీధి మొగలో ఆగింది ఓ మైగాడ్! అంటూ కారు స్లో చేసింది విశాల.

ఒక కానిస్టేబుల్ దిగి...

లాఠీ వూపుతూ కారు ఆపమని సైగచేసాడు.

అతనికి సమీపంలో కారు ఆపింది విశాల. కారు పక్కనే తన బైక్ ఆపాడు విరాట్. కారు హెడ్ లైట్ల కాంతిలో జీప్ లో డ్రయివరు గాక మరో యిద్దరు కానిస్టేబుల్స్ మాత్రమే కన్పిస్తున్నారు. యస్సైగాని సర్కిలు గాని  లేరు. పెట్రోలింగ్ కి పోలీసులే వచ్చినట్టున్నారు. కారు ఆగగానే జీప్ లోంచి మరో యిద్దరు పోలీసులు దిగి కారు వద్దకొచ్చారు.

విశాల సైడ్ గ్లాస్ దించి

వాళ్ళని కోపంగా చూసింది

‘‘ఇది కర్ఫ్యూ ప్రాంతం కాదు గదా. కారెందుకాపారు? మీ యస్సై ఎవరు? ఇలా పిలు?’’ కోపంగా అరిచింది. మరో కానిస్టేబుల్ బైక్ వంక చూస్తూ ‘‘ఏయ్ మిస్టర్ బైక్ దిగు ఎవరు నువ్వు, ఈ టైంలో ఎక్కడికి?’’ అంటూ దబాయించాడు.

‘‘హలో! ఇటురా అతను నా కజిన్. మాట్లాడదలచుకుంటే నాతో మాట్లాడు. కం హియర్’’ అంది అధికార స్వరంతో.

‘‘అది కాదు మేడం, ఈ టైంలో మీరూ....’’ కొంచెం తగ్గి నసిగాడు దగ్గరకొచ్చిన పోలీసు.

‘‘మీ యస్సై ఎక్కడ?’’ అడిగింది.

‘‘లేరు మేడం. మేమే పెట్రోలింగ్ తిరుగుతున్నాం. కరెంటు లేదు. అటు ప్లేగ్రౌండ్ వెనక అడ్డరోడ్డులో కొంతసేపటి క్రితం కాల్పులు జరిగి నలుగురు చనిపోయారు. వేన్ బురద గుంటలో కూరుకుపోయింది. మా యస్సై కొందరు పోలీసులు అక్కడ వుండి ఆ రోడ్ బ్లాక్ చేసారు. మీరటు వెళ్ళలేరు. ఇంతకీ మీరీ టైంలో ఎక్కడికి మేడం?’’ అంటూ అడిగాడు.

అతడి మాటలతో విశాలకి అర్ధమైపోయింది. ఏం జరిగి వుంటుందో...

‘‘ముందే మీరిలా అడిగితే సమాధానం చెప్పేదాన్ని. పార్కు రైట్ సైడ్ లోపలి వీధిలో మా బంధువులున్నారు. విజయా ఆస్పత్రిలో మా తాత గారికి ఆపరేషన్ జరుగుతోంది. బంధువుల్ని తీసుకెళ్ళటానికి వెళ్తున్నాం. బైక్ మీద మా కజిన్ ఉన్నాడు. అతనికి రూట్ తెలీదు అందుకే కారు వెంట వస్తున్నాడు. కాస్సేపట్లో వెళ్ళిపోతాం. చాలా ఇంకేమన్నా చెప్పాలా?’’ అంటూ హుందాగా చిన్న అబద్ధం చెప్పింది. ఆమె మాటతీరు హుందా తనం పోలీసుల అనుమానాల్ని చెల్లా చెదరుచేసాయి.

‘‘ఇంకేం చెప్పక్కర్లేదు మేడం. మీరు వెళ్ళండి’’ అంటూ సెల్యూట్ చేసాడు. మొదటి కానిస్టేబుల్.

‘‘రాత్రిళ్ళు కష్టపడి డ్యూటీ చేస్తుంటారు మీరు. ఇంద వెళ్ళి టీ తాగండి’’ అంటూ అయిదు వందల నోటు అతడి చేతిలో వుంచింది విశాల. పోలీసుల ముఖాలు ప్రసన్నమయ్యాయి.

‘‘ముందు ఈ ప్రాంతంలో కరెంటు సరి చేసి లైట్లు వెలిగేలా చూడండి’’ అంటూ కారును ముందుకు పోనిచ్చింది. చందూ బైక్ స్టార్ట్ చేసి అనుసరించాడు.  పోలీసులు జీప్ ఎక్కగానే అది పక్క రోడ్ లోకి వెళ్ళి పోయింది. మరో రెండు నిముషాల్లో కారు రివ్వున వచ్చి ప్లే గ్రౌండ్ పక్కన చెత్తకుండీ సమీపంలో ఆగింది. చందూ కూడ వచ్చి బైక్ దిగాడు.

విశాల కారు లైట్లు ఆఫ్ చేసి కిందకు దిగింది ఓసారి చుట్టూ చూసింది. పోలీసు జీప్ ఎటు పోయిందో దాని జాడ లేదు.

‘‘ఏంటమ్మా ఇక్కడ ఆగిపోయావ్? మన వాళ్ళిద్దరూ ఎక్కడ?’’ విషయం తెలీని చందూ చుట్టూ చీకట్లలోకి చూస్తూ అడిగాడు.

‘‘అన్నయ్యా కంగారుపడకు. వాళ్ళిక్కడే వున్నారు. పోలీస్ జీప్ తిరగి వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి కమాన్?’’ అంటూ టూర్చి లైటు ఆన్ చేసి కుప్ప తొట్టి పరిసరాల్ని గాలించనాంభించింది’.

‘‘వాళ్ళిక్కడున్నారా!’’ ఆమెను అనుసరిస్తూ నమ్మలేనట్టడిగాడు చందూ.

‘‘అవును, సరిగా చూడు ఇద్దరూ స్పృహలో లేరు’’ అంటూ హెచ్చరించింది.

ఇద్దరూ రెండు సార్లు ఆ కుప్ప తొట్టిని దాని వెనక చెత్త చెదారాన్ని చుట్టివచ్చారు. కాని విరాట్ సహస్ర జాడలేదు.

‘‘వాళ్ళిక్కడ లేరేమో’’ అనుమానంగా అన్నాడు చందూ.

‘‘ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. వన్ మినిట్ ’’ అంటూ తన సెల్ అందుకొని విరాట్ సెల్ కి ఫోన్ చేసింది.

మరుక్షణమే...

కుండీ వెనక నుంచి ఫోన్ రింగవుతున్న శబ్బం విన్పించింది. ఫోన్ ఆన్లోనే ఉంచి శబ్దం విన్పిస్తున్న వైపు అడుగులేసారు. భరింపరాని దుర్వాసనతో కూడిన ఆ చెత్త కుప్ప వెనక విరాట్ సహస్రలు వున్నారంటే చందూ నమ్మలేక పోయాడు, కాని ఫోన్ రింగవగానే నమ్మకం ఏర్పడిరది. ఆ శబ్దం ఒక పాత చాప కిందనుంచి వస్తోంది. తనే ముందుకెళ్ళి చాపను తొలగించాడు అంతే.

రక్త సిక్తమైన శరీరాలతో

స్పృహ లేని స్థితిలో

శవాల్లా పడున్న ఆ జంటను చూడగానే

గుండె పగిలి పోతున్నంత బాధతో అలాగే విరాట్ పక్కన కూలబడి పోయి బావురుమని ఏడ్చేసాడు చందూ. విశాల కళ్ళు అశృ ధారలు కురిపిస్తున్నాయి. కాని ఇది ఏడ్చే సమయం కాదు. వెంటనే వాళ్ళిద్దర్నీ తీసుకొని సేఫ్ గా అవతలికి వెళ్ళి పోవాలి. చందూ భుజంమీద చెయ్యేసి ధైర్యం చెప్పింది.

‘‘మనకి అట్టే టైంలేదు. ఏడుస్తు కూచుంటే పనులు కావు. ఇద్దర్నీ ముందు కారులోకి చేర్చాలి. కమాన్’’ అంది ధైర్యం తెచ్చుకుంటూ.ఆమె మాటలతో ధైర్యం తెచ్చుకున్నాడు చందూ. లేచి కళ్ళు తుడుచుకున్నాడు. ముందుగా సహస్రను భుజాలు పట్టి లేపాడు చందూ. విశాల కాళ్ళు పట్టుకుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళి కారు వెనక సీట్లో పడుకోబెట్టి డోర్ వేసుకుని తర్వాత విరాట్ భుజాలు పట్టిలేపి భుజం మీద వేసుకుని కారు వద్దకు మోసుకొచ్చాడు చందూ. అతడ్ని ఫ్రంట్ సీట్లో పడుకోబెట్టింది. విరాట్ తలను తొడమీద ఉంచుకుంది. డోర్ మూసి కారు స్టార్ట్ చేసింది ఎప్పటిలాగే ఆ కారును అనుసరించాడు చందూ.

విశాల ఫోన్ చేసి వాళ్ళిద్దరూ ప్రమాద పరిస్థితిలో ఉన్నారంటే బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు అనుకున్నాడు గాని ఇలా ప్రాణాపాయస్థితిలో ఉన్నారనుకోలేదు. ఏం జరుగుతోంది? అసలేం జరిగింది? ఇద్దరూ గండం గడిచి బ్రతుకుతారా? దారిలో ఏ అవాంతరం లేకుండా కారు ఉస్మాన్ రోడ్ కొచ్చి ఓల్డ్ మాంబళంలో ప్రవేశించాక గాని విశాల మనసు కుదుట పడలేదు. కారును నేరుగా గుణి దీపిక క్లినిక్ వైపు దూకించింది.

కోయంబత్తూరు...

విరాట్ తండ్రి వెంకటరత్నం నాయుడు గారు చెన్నైలో గొడవలు జరుగుతున్న సమయానికి ఆయన కోయంబత్తూరులో లేడు. పని మీద కుంభకోణం వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ రాత్రి పదకొండున్నర గంటలయింది. అప్పటికి ఇంట్లో అంతా నిద్రపోతున్నారు.నాయుడు గారు స్నానం చేసి భోంచేసే సరికి అర్ధరాత్రయింది. భార్య మంగతాయారు భోజనం వడ్డించింది. భోంచేసాక కాస్సేపు టివిలో వార్తలు చూసి పడుకోవటం ఆయన అలవాటు.

చెన్నైలో గొడవలు జరుగుతున్నాయని దారిలో విన్నాడు. గాని అసలు విషయం ఆయనకింకా తెలీదు. యధాలాపంగా టివి ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టగానే చెన్నైలో రాత్రి ఏడు గంటల తర్వాత తేనాం పేట గుండా శిఖామణి వాడి కుర్రాళ్ళు ప్రత్యర్ధులతో మొదలైన గొడవకు సంబంధించి కొన్ని క్లిప్పింగులు చూపిస్తున్నారు. వాటిని చూస్తూ నిర్ఘాంతపోయారు వెంకట రత్నం నాయుడు గారు.

ఒక క్లిప్పింగ్ లో స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ ఫైటింగ్ లో తన చిన్న కొడుకు విరాట్ వున్నాడు. పక్కన ఒక అందమైన అమ్మాయి రౌడీలతో హోరా హోరీ పోరాడుతూ బిజీగా వుంది. అంతకన్నా మరో ఆశ్చర్యకరమైన విషయం విరాట్ కనబడగానే కాళ్ళు చేతులు కట్టి మరీ వాడ్ని కోయంబత్తూరు తీసుకు రమ్మని తను చెన్నై పంపించిన తన మిల్లు కార్మికులు మునుసామి మిగిలిన వాళ్ళుకూడ ఆ పోరాటంలో తలమునకలై ఉండటం. వాళ్ళకి సాయంగా మరి కొందరూ కన్పిస్తున్నారు.

అది చూడగానే వెంకట రత్నం నాయుడు ఒక్కసారిగా కోపంతో భగ్గుమంటూ భార్యను పిలిచాడు.

‘‘ఏమిటండీ........మీరింకా పడుకోలేదా? ఏం కావాలి?’’ అంటూ వచ్చిందావిడ.

‘‘ఏం కావాలా!..... ఓసి నీ దుంపతెగ. లోకం ఏమైపోయినా మీకక్కర్లేనట్టుంది. టివిలో వార్తలు చూసావా?’’ అనడిగాడు నాయుడు.‘‘అయ్యొ రామ నేనెక్కడ చూసానండీ? భక్తి ఛానల్ చూసి పడుకున్నాను. అంతలో మీరొచ్చారు ఇంతకీ ఏమైంది?’’

‘‘భక్తి తప్ప ఇంకేమీ అక్కర్లేదే నీకు, చెన్నైలో గొడవల గురించే నీకు తెలిసినట్టు లేదు. వెళ్ళు..... వెళ్ళి పెద్దోడ్ని లేపి తీసుకురా’’ అనరిచాడాయన.

మంగ తాయారుకి భర్త ఎందుక్కోప్పడుతున్నాడో ఏం జరిగిందో తెలీక హడావుడిగా వెళ్ళి నిద్ర పోతున్న పెద్ద కొడుకు విక్రాంత్ ని లేపి తీసుకొచ్చింది.‘‘ఏరా, చెన్నైలో గొడవ జరిగింది. నువ్వు టివిలో వార్తలు చూడలేదా?’’ రాగానే కొడుకును అడిగాడు వెంకట రత్నం నాయుడు.‘‘లేదండి’’ అన్నాడు పెద్ద కొడుకు.

‘‘ఇప్పుడు చూడండి! మన విరాట్ చెన్నైలో చేస్తున్న ఘన కార్యం ఏమిటో చూడండి. గొడవతో మన వాడికి ప్రత్యక్ష సంబంధం వుంది. ఇంట్లో ఇంత మంది వున్నారు. ఎవరూ టివిలో వార్తలు చూడలేదు. నాకు ఫోన్ చేసి చెప్పలేదు. వాడ్ని తీసుక రమ్మని పంపిస్తే వీళ్ళు వాడితో చేరిపోయారు. అక్కడి పరిస్థితి ఏమిటో తెలీదు. డామిట్ ఒక్కరికీ బాధ్యత లేదు’’ అంటూ విసురుగా వెళ్ళి ఫోన్ అందుకున్నాడు.టి వి లో ఇప్పుడు ఎదురుగా ఆ సంఘటన తాలూకు దృశ్యాలు చూసాక గాని ఆయన ఎందుకంత కోప్పడుతున్నాడు అర్ధం కాలేదు. అక్కడున్న వాళ్ళలో విరాట్ పక్కన పోరాడుతున్న అమ్మాయి ఎవరో వూహించింది నాయుడు గారి భార్య మంగ తాయారు మాత్రమే. సహస్రను స్వయంగా చూడలేదు. గాని ఆమె గురించి విరాట్ ద్వారా గతంలోనే అంతా తెలుసుకుందావిడ. అసలా గొడవేమిటో అక్కడ ఏం జరుగుతుందో తెలీక ఒక్కసారిగా ఆందోళన గురయ్యారంతా.

వెంకట రత్నం నాయుడు మునుసామి సెల్ కి ఫోన్ చేసాడు.

అప్పటికే అర్ధరాత్రి దాటింది సమయం.

అక్కడ చెన్నైలో మందు కొట్టి మునుసామి నిద్ర పోతున్న సంగతి ఈయనకు తెలీదు. విరాట్ సహస్రలు ఇంటికి రాలేదన్న టెన్షన్ లో అక్కడ వాళ్ళంతా చాలా సేపటిగ్గాని నిద్ర పోలేదు. విశాలకు ఫోన్ చేసి చందూ బయటి కెళ్ళటంతో ఆ తర్వాత అంతా నిద్ర పోయారు. దాంతో ఫోన్ రింగవుతోంది. గాని ఎత్తటం లేదు.

యూ బ్లడీ ఫూల్........తియ్యరా ........ఫోన్ తియ్యరా అని విసుగుక్కొంటూ వరసగా ఫోన్లు కొడుతునే వున్నాడు. నాలుగో సారి చేయగానే అప్పుడు ఫోన్ ఎత్తారు కాని ఎత్తింది మునిసామి కాదు బండ శివ! నిద్ర మత్తులో వున్నట్టున్నాడు.

‘‘నీ ఎంకమ్మా ఎవడ్రా అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. అన్న నిద్రపోతున్నాడు. పొద్దుటే చెయ్యి’’ అంటూ స్విచ్చాఫ్ చేయబోయాడు.‘‘అరే బండ శివా మందెక్కువయిందా నిద్ర ఎక్కువైందా వెధవా నేన్రా మీ  వెంకటరత్నం నాయుడ్ని. అర్ధమైందా? మునుసామిని లేపు.  మీరంతా ఇప్పుడెక్కడున్నారు?’’  కోపంతో అరిచాడు వెంకటరత్నం నాయుడు. నాయుడు గారి గొంతు వింటూనే అదిరి పడి నిద్ర పోతున్న మునుసామిని లేపి ఫోన్ చేతికిచ్చి తప్పుకున్నట్టున్నాడు. ఈ సారి మునిసామి గొంతు విన్పించింది. ‘‘నమస్తే పెద్దయ్య గారూ నమస్తే’’ అంటూ. మాటలు ముద్ద ముద్దగా వస్తున్నాయి.

‘‘మునుసామి నేను చెప్పిందేమిటి మీరు చేస్తున్నదేమిటి?’’ గద్దించాడు వెంకటరత్నం నాయుడు.

‘‘నిద్రపోతున్నాం సార్. ఇంకేం జేసినాం?’’

‘‘ఇప్పుడెక్కడున్నారు...?’’

‘‘హోటల్ గదిలోనే వున్నాం సార్’’

‘‘విరాట్ ఎక్కడ’’

‘‘తెలీదు సార్. ఇంకా దొరక లేదు’’

‘‘అబద్దాలు చెప్పటం ఎప్పట్నుంచి నేర్చుకున్నావ్? చెన్నై వెళ్ళి మీరు వెలగబెట్టిన కార్యం ఇదన్నమాట. చిన్నోడు దొరకలేదని ఇన్ని రోజులూ నాతో అబద్దం ఎందుకు చెప్పావ్?’’ కోపంతో అరిచాడు వెంకటరత్నం నాయుడు.

‘‘చినబాబు కోసమే అబద్ధం చెప్పాను పెద్దయ్యగారూ’’ వినయంగా అటు నుంచి బదులిచ్చాడు మునుసామి.

‘‘ఆ గొడవతో మీకేంటి సంబంధం మీరెందుకెళ్ళారు? చినబాబు ఎందుకెళ్ళాడ్రా...?’’

‘‘ఆ అమ్మాయి సహస్ర కోసం’’

‘‘సహస్ర ఎవరు? ఆ గొడవలో ఫైట్ చేస్తున్న పిల్లా?’’

‘‘అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కాపాడుకోవాలి గదా!’’

‘‘ఎవరా సహస్ర?  ఆ పిల్ల వివరాలేమిటి?’’

‘‘అడిగి పొద్దున్న చెప్తాను. నిద్రముంచుకొస్తోంది’’ అంటూ అవతల మునుసామి పెద్దగా ఆవులించిన శబ్దం విన్పించింది. దాంతో నాయుడి గారి కోపం తారా స్థాయికి చేరుకుంది.

‘‘మర్యాదగా చెప్తావా లేదా? చెప్పలేదంటే మీ అందర్నీ పనిలోంచి తీసేస్తాను’’ అంటూ బెదిరించాడు.

‘‘ఆ పనేదో పొద్దుట చేయండి సార్....... నా వల్లకాదు...... నిద్ర........’’

మును సామి లైన్ కట్ చేసాడు. అంతే కాదు బండశివను పిలిచి తమ వాళ్ళ సెల్ ఫోన్లన్నీ స్విచ్చాఫ్ చేయించాడు. దాంతో నాయుడుగారు మిగిలిన వాళ్ళలో ఎవడికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తోంది. ఈ రాత్రికి వాళ్ళిక లైన్ లోకి రారని అర్ధమైపోయింది. దాంతో ఆ కోపం ఈ కోపం ఇంట్లో వాళ్ళమీద చూపించాడు.

‘ చిన్నోడిని నెత్తికెత్తుకున్నందుకు ఏం చేసాడో చూసావా? బంగారం లాంటి మేనకోడల్ని కాదని పారిపోయి మూడేళ్ళుగా తప్పించుకున్నాడు. చివరికి చెన్నైలో ఎవరో దిక్కుమాలిన పిల్లని లవ్ చేసి అనవసర గొడవల్లో ఇరుకున్నాడు. వీడ్ని ఏంచేయాలి?’’ అంటూ మండిపడ్డాడు.ఆ మాటలకి మంగతాయారుకి కోపం వచ్చింది.

‘‘మమ్మల్ని ఏమన్నా అంటే అనండి. వాళ్ళనంటే వూరుకోను. ఆ పిల్ల మీరనుకుంటున్నట్టు దిక్కు మాలిందీ కాదు. అనాధా కాదు’’ అంది.ఆ మాటతో వెంకటరత్నం నాయుడు గారి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. గబగబా భార్య దగ్గరకెళ్ళాడు.

‘‘అంటే.... వాళ్ళ గురించి నీకు ముందే తెలుసా? అయితే చెప్పు ఎవరా అమ్మాయి? ఎవరి తాలూకు?’’

‘‘చెప్పను’’

‘‘చెప్పాలి’’

‘‘చెప్పనంటున్నాగా’’ అంటూ గబగబా తన గదలోకి వెళ్ళిపోయిందావిడ. చెప్తే నాయుడు గారికి బిపి పెరిగి కోపం తారా స్థాయికి పోతుందని ఆమెకు తెలుసు.

భార్య మొండి వైఖరికి విసిగిపోతూ పెద్ద కొడుకు విక్రాంత్ వంక చూసాడు వెంకటరత్నం నాయుడు.

‘‘లాభం లేదురా నేను వెంటనే చెన్నై వెళ్ళాలి. మార్నింగ్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చెయ్యి’’ అన్నాడు.‘‘ఒకె డాడీ నేను ఏర్పాటు చేస్తాను. మీరు పడుకోండి’’ అన్నాడు విక్రాంత్. ఇంతలో తిరిగి డోర్ లోకొచ్చింది మంగతాయారు. కొడుకుని చూస్తూ ‘‘ఒకటి కాదు రెండు బుక్ చేయి. నేనూ చెన్నై వెళ్తున్నాను’’ అంది.

‘‘నేను మీ వెంటరాను. విడిగానే వెళ్తాను’’ అంది తనూ పట్టుదలగా.

‘‘ఎక్కడికెళ్తావ్? అంటే...... నీకు వాళ్ళ అడ్రస్ తెలుసు కదూ?’’

‘‘తెలుసు. కాని చెప్పను.’’

‘‘చెప్పకపోతే.....  ఒకె.... డైవర్స్.....  నీకు విడాకులిచ్చేస్తాను.’’

‘‘సర్లే, ఈ వయసులో మనం డైవోర్స్ తీసుకుంటే అంతా మనల్నిచూసి నవ్వుతారు. మీకా శ్రమక్కర్లేదు, నేను మా పుట్టింటి కెళ్ళిపోతాను.’’‘‘ఆహా ఇప్పుడే వెళ్తావా చెన్నై వెళ్ళొచ్చాక వెళ్తావా?’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్