Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ


జరిగినకథ: అపర్ణ మిస్టరీ కేసులో  పురోగతి గురించి విచారిస్తాడు చానల్ హెడ్ నరసిమ్హం. కవరేజ్ గురించి తేజ చెప్పిన సమాచారం అతనికి సంతృప్తిని కలిగించదు. కేసు మిస్టరీ ఛేదించేవరకూ తమ వంతు పాత్ర కొనసాగిస్తూనే వుండాలని అంటాడు. తన కేబిన్ లో కూర్చుని యధాలాపం గా  గేటు కేసి చూసిన తేజాకి సెక్యూరిటీ తో ఎవరో అపరిచిత వ్యక్తి గొడవపడడం కనిపిస్తుంది. అతన్ని తన దగ్గరికి పంపించమని సెక్యూరిటీకి చెబుతాడు.   ఆ  తరువాత......

 

‘‘తెలీసీ తెలీకుండా చానెల్‌లో నా గురించి అవాకులు, చవాకులు పేలుతుంటే విషయం కనుక్కుందామని వచ్చానిక్కడికి’’ కోపంతో ముక్కు పుటాలెగరేస్తూ అరిచి మరీ చెప్తున్నాడతడు.

‘‘నెమ్మదిగా ఫోన్‌లో మాట్లాడండి. అంతలా అరిచి మీరు శ్రమ పడక్కర్లేదు. ఇంతకీ మీరేమంటారు? యాంకర్‌ వరలక్ష్మిని కలవాలంటారు అంతేనా?’’

‘‘అవును...’’

‘‘మీకో సంగతి తెలీదు. ఆవిడ ఈ చానెల్‌లో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివే యాంకర్‌ మాత్రమే. ఆవిడ్ని కలుసుకుంటే మీ సందేహాలు తీరవు. అసలు మీ సమస్యేంటో చెప్తే పరిష్కారం దొరుకుతుంది. ఇంతకీ, వరలక్ష్మి మీగురించి మీరనుకున్న అవాకులు, చవాకులు ఏ ప్రోగ్రామ్‌లో పేలింది...’’ అడిగాడు తేజ.

‘‘అదేదో క్రయిం బులెటెన్‌. ఎవరో ఎక్కడో అదృశ్యమైతే ఆ నేరాలు, ఘోరాలు నా కంటగడతారేంటీ?’’ మళ్లీ అరిచాడతడు. క్రయిం బులెటెన్‌ అనేసరికి  తనకు సంబంధించి వ్యవహారమేనని తేజాకి అర్ధమైంది.

‘‘సెక్యూరిటీకి ఫోన్‌ ఓసారివ్వండి’’ అని అతడితో చెప్పి ఫోన్‌ సెక్యూరిటీ అందుకోగానే...‘‘అతడ్ని నా క్యాబిన్‌లోకి పంపించు’’ అంటూ ఆదేశించాడు తేజ. మరో అయిదు నిముషాల్లో అతడు తేజా క్యాబిన్‌లో ఉన్నాడు. వయసు పాతికేళ్లలోపుంటాయి. టక్‌ చేసున్నాడు. కోపం మనిషిని స్ధిరంగా నిలవనీయదన్న విషయాన్ని అతడి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

‘‘రండి...కూచోండి’’ ఆహ్వానించి తనెదురుగా ఉన్న కుర్చీని చూపించాడు తేజ.

‘‘నేను కూచోడానికి రాలేదు. విషయం తేల్చుకోవడానికి వచ్చాను’’

‘‘అదే తేల్చుకుందురుగానీ. ఆ తేల్చుకోవడానికైనా కాస్త మాట్లాడుకోవాలి కదా! అందుకే, కూల్‌గా కాసేపు కూచుంటే అన్ని విషయాలు తేలతాయి’’ అంటూ కాలింగ్‌ బెల్‌ నొక్కగానే వచ్చిన ఆఫీస్‌ బాయ్‌కి చాయ్‌ ఆర్డరిచ్చాడు తేజ. ఎదురుగా ఉన్న కుర్చీలో అతడు కూచుంటూనే`‘‘నాకు మీ మర్యాదలేం అక్కర్లేదు’’ అన్నాడు కటువుగా.

‘‘మీరు చాయ్‌ తాగకండి. మీపేరు చెప్పుకుని మరో కప్పు నే తాగుతాను’’ అన్నాడు తేజ నవ్వేసి. తర్వాత`‘‘ఇప్పుడు చెప్పండి మీ సమస్యేంటో?’’ అడిగాడు.

‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అపర్ణ స్టోరీ మీరు ప్లే చేసారు కదా! ఇక, అప్పట్నుంచీ నాకు ప్రాబ్లెమ్‌ స్టార్టయింది. ఓపక్క పోలీసులు, మరో పక్క ఇరుగుపొరుగువాళ్లంతా నన్ను దోషిని చూసినట్లు చూస్తున్నారు. ఇక, ఖాకీలైతే ఇన్విస్టిగేషన్‌, ఇంటారేగాషన్‌పేరుతో నిత్యం వేధిస్తున్నారు. ఇంతకీ నేను చేసిన నేరమేంటీ? ఆరోజు ఎయిత్‌ ఫ్లోర్‌లో ఆమెతో లిఫ్ట్‌ షేర్‌ చేసుకోవడమే పాపమై నన్ను వెంటాడుతోంది’’ కన్నీరొక్కటే తక్కువన్నట్లు లబోదిబోమంటున్నాడు. మీడియా దృష్టిలో పడాలని చాలామంది కోరుకుంటుంటారు. తద్వారా సమాజంలో పేరుప్రతిష్టల్ని సముపార్జించాలని చూస్తుంటారు.

అయితే, తమగురించి ప్రచారమంతా పాజిటివ్‌గానే సాగాలని ఆశిస్తారు. అభిలషిస్తారు. నెగిటివ్‌ అంశాలతో తమ పేరు ముడిపడి మీడియాలో ప్రసారమైతే, అందులోనూ అప్పటివరకూ మీడియాకెక్కని ఓ సామాన్యుడికే ఈ అనుభవం ఎదురుపడితే ఎలా ఉంటుందో ఇతడిని చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఔను...‘నలుగురితో  నారాయణ, గుంపులో గోవిందా’ అనుకుంటూ తనపని తాను చేసుకునే మధ్యతరగతి మనిషి. హైటెక్‌సిటీలోని ఎంఎన్‌సీ  ఉద్యోగి. ఓ ఫ్రెండ్‌ని కలిసేందుకు వచ్చి ఇలా పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయాడు. ఆ ఇన్సిడెంట్‌ జరిగిన దగ్గర్నుంచీ అపర్ణతోపాటు లిఫ్ట్‌లో ఉన్న ఇతడి గురించి మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. అపర్ణ లిఫ్ట్‌లో కనిపించడమే చివరిసారి కావడం, ఆ తర్వాత అదృశ్యమవడంతో సంఘటనకు ప్రాముఖ్యత పెరిగింది. ఆమెతో చివరిసారి లిఫ్ట్‌లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరా? అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. దాంతో, ఇటు మీడియాతోపాటు అటు పోలీసులు కూడా ఇతడి గురించి ఆరాలు తీయడం మొదలెట్టారు. చివరాఖరికి పోలీస్‌స్టేషన్‌ గడపెక్కాల్సి వచ్చింది.

‘‘చేయని నేరానికి నేనెందుకు శిక్ష అనుభవించాలి? ఆ అపర్ణ ఎవరో నాకు తెలీదు. ఆమె అదృశ్యమవడానికి కారణాలేంటో అస్సలు తెలీదు. అలాంటి నన్ను అపర్ణ అదృశ్యంతో ముడిపెడుతూ వార్తాకథనాలల్లడం, పోలీసులు కూడా అపర్ణ ఏమైంది? ఎక్కడుందంటూ వరుస ప్రశ్నలతో కుళ్లబొడవడం...చాలు. ఈ స్టోరీకి ఇక్కడే పుల్‌స్టాప్‌ పెట్టండి. అపర్ణకీ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆవిడెవరో నాకు తెలీదు. ఈ విషయం మీ మీడియా ద్వారానే ప్రజలకు మళ్లీ చెప్పండి. మీరు సృష్టించిన రభస కారణంగా మానసిక శాంతి కోల్పోయాను. చక్కగా ఉద్యోగం చేసుకునే వాడిని...లీవ్‌లు పెట్టి అజ్ఞాతంలో కూరుకుపోయాను. మా ఇంటి తలుపెవరు తట్టినా హడలి ఛస్తున్నాను.  టీవీస్క్రీన్‌పై కనిపిస్తూ...అపర్ణ అపహరణ లో ఆగంతకుడి పాత్రేమైనా ఉందా? గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకొచ్చిన తర్వాత కూడా అపర్ణని ఆ ఆగంతకుడు అనుసరించాడా? అతడితో అపర్ణకు అంతకుముందే పరిచయముందా? అది కేవలం పరిచయమేనా...లేక, అంతకుమించిన స్నేహం...మనసిచ్చి పుచ్చుకోవడంలాంటి దగ్గరితనం కూడా ఉందా? ఆ రాత్రి వాళ్లిద్దరూ కలిసే వెళ్లారా? వెళ్తే...ఎక్కడికి వెళ్లారు? అంటూ లక్ష యక్ష ప్రశ్నలేసే యాంకర్‌ వరలక్ష్మిని కలిసి ఇలా నన్నెందుకు వేధిస్తున్నావని అడగాలనే ఇక్కడికి వచ్చాను. ప్లీజ్‌! నాకూ కనిపించకుండా పోయిన ఆ అపర్ణకు ఏ సంబంధం లేదు...’’ అంటూ తేజా రెండు చేతులు పట్టుకుని దీనంగా అర్ధిస్తున్నాడతడు.

‘‘ఓకే...ఓకే! మీ బాధను అర్ధం చేసుకున్నాను. ఎవరో తెలీని మీపై కక్షగట్టి ప్రిపేర్‌ చేసిన స్టోరీ కాదది. ఆరోజు లిఫ్ట్‌లో ఆ అమ్మాయితో మీరుండడం కాకతాళీయమే కావచ్చు. కానీ, క్రయిం ఇన్విస్టిగేషన్‌ అన్ని కోణాల నుంచీ సాగుతుంది కదా! అసలు విషయం తేలేవరకూ ఆ ఇన్సిడెంట్‌లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వాములైన ప్రతిఒక్కరూ అనుమానితులే. మీడియాలో మీ ప్రస్తావన రావడం బట్టే కదా...ఆమెతో సంబంధం లేదనే వివరణ ఇచ్చుకునేందుకు మీకు వీలు చిక్కింది. ఎదురైన ప్రతి సమస్యలోనూ పరిష్కారం వెదకాలి కానీ, ప్రతిదాన్నీ సమస్యగా చేసుకోకూడదు’’ అన్నాడు తేజ ఓదార్పుగా.

‘‘ఒడ్డున ఉన్నవాళ్లు ఎన్నయినా చెప్తారు. ఈతరానివాడిని. నీళ్లలో మునిగి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నాను. ప్లీజ్‌, సేవ్‌మీ!’’ అన్నాడతడు.

‘‘ఒక్కసారి వెనక్కి తిరిగి టీవీ స్క్రీన్‌పై మా చానెల్‌ చూడండి. స్క్రోలింగ్‌లోని అక్షరాలు చదవండి’’ అన్నాడు తేజ.

‘‘సంచలనం సృష్టించిన అపర్ణ కేసులో మరో ట్విస్ట్‌. అపర్ణ అదృశ్యమైన ఆరాత్రి లిఫ్ట్‌లో చివరిసారి ఆమెతో గడిపిన అజ్ఞాతవ్యక్తి మన స్టూడియోలోనే ఉన్నారు. అపర్ణ అదృశ్యంతో తనకేమీ సంబంధం లేదంటున్న ఆ వ్యక్తి చెప్పే సంచలన విశేషాలు మరికాసేపట్లో...’’ స్క్రోలింగ్‌లో అక్షరాలు వేగంగా కదుల్తున్నాయి.

‘‘ఇప్పుడే మీతో మాట్లాడుతున్నా కదా...అప్పుడే ఆ అక్షరాలు’’

‘‘మీతో మాట్లాడుతూనే స్క్రోలింగ్‌ డిపార్ట్‌మెంట్‌కి మెసేజ్‌ పెట్టా. వెంటనే స్క్రీన్‌పై డిస్‌ప్లే అయింది’’చెప్పాడు తేజ.

‘‘మళ్లీ అదేం ట్విస్ట్‌. ఆ అమ్మాయితో నాకే సంబంధం లేదని ఓపక్క నేచెప్తుంటే...ఆ రాత్రి లిఫ్ట్‌లోల చివరిసారి ఆమెతో గడిపిన అజ్ఞాత వ్యక్తి..అంటూ మళ్లీ నన్ను ఇరికిస్తున్నారు. ఆమె గురించి అస్సలు నాకేం తెలీని నేను సంచలన విశేషాలు ఏం చెప్తాను?’’ అడిగాడతడు.

‘‘మీరు ఏం చెప్తే అదే సంచలనం. ఎందుకంటారా? ఆరోజు అపర్ణని చివరిసారి చూసింది మీరు. ఆ తర్వాతే ఆమె కనిపించకుండా  పోయింది. ఆమె కనిపించకుండాపోవడానికి మీరు కారణం కాకపోవచ్చు. కానీ, ఆమె కనిపించిన చివరిసారి ఆమెతో మీరుండడమే మీ ప్రత్యేకత. ఆరోజు ఆమె లిఫ్ట్‌లో ఎలా ఉంది? ఏ డ్రస్‌ వేసుకుంది. చీర కట్టుకుందా? లేక, పంజాబీ డ్రెస్‌ వేసుకుందా? ఆరాత్రి డ్యూటీనుంచి లాగౌట్‌ అయిన ఆ క్షణాల్లో ఆమె మూడ్‌ ఎలా ఉంది? ఆమె ముఖంలో ఉల్లాసం కనిపించిందా? లేక, ఏదైన బాధతో విలవిల్లాడుతున్నట్లు ఆందోళనగా ఉందా? ఇలాంటి చిన్నిచిన్ని ప్రశ్నలకు ఆన్సరిస్తే సరిపోతుంది...’’ చెప్తున్నాడు తేజ.

‘‘అంటే...మీ దగ్గర న్యాయం జరుగుతుందనీ, నేనెదుర్కొంటున్న ఓ సమస్యకి పరిష్కారం లభిస్తుందని ఆశించి మీ దగ్గరికి వస్తే...మళ్లీ నన్ను ఊబిలోకి తోస్తున్నారు. ఈ తరహా ప్రశ్నలే పోలీసులూ అడిగారు. వాటికి సమాధానం ఇవ్వలేకనే మిమ్మల్ని ఆశ్రయించాను. ఇక్కడ మీరు కూడా అవే ప్రశ్నల్తో కుళ్లబొడుస్తున్నారు. పైగా, చానెల్‌లో ఇంటర్వ్యూ అంటూ కెమెరా ముందుకు లాక్కెళ్తున్నారు. ఖాకీల్ని, జర్నలిస్ట్‌ల్ని నమ్మకూడదని రుజువు చేస్తున్నారు...’’ ఆవ్యక్తి లబోదిబోమంటున్నాడు.

‘‘అలా బాధపడకండి. ఆ ఇన్సిడెంట్‌ తర్వాత మీ గురించి నానారకాలుగా అనుకుంటున్నవాళ్ల నోళ్లు మూయాలంటే...ఇప్పుడు మీరు కెమెరాని ఫేస్‌ చేయాల్సిందే. ఇంటర్వ్యూ పేరుతో మా చానెల్‌ ఇంటరాగేషన్‌ని ఎదుర్కోవాల్సిందే. మేమడిగే క్వశ్చన్లకి ఆన్సరివ్వాల్సిందే. అప్పుడే మీకూ అదృశ్యమైన అపర్ణకీ ఏ సంబంధం లేదని కుండబద్దలు కొట్టినట్లు ఈ యావత్‌ సమాజానికి అర్ధమయ్యేట్లు మేం టెలికాస్ట్‌ చేస్తాం. మీకు తెలిసిన ప్రతి ఒక్కర్నీ ముఖాముఖి కలిసి వివరాలు, వివరణ ఇచ్చే బదులు ఒకే ఒక్కసారి మా స్టూడియోలో మాట్లాడండి. మీపై ఉన్న సర్వ సందేహాలకూ సమాధానం దొరుకుతుంది...’’అని నచ్చచెప్పి అతడ్ని స్టూడియోవైపుకి నడిపించాడు తేజ. మరికొద్ది నిముషాల్లోనే ఇంటర్వ్యూ స్టార్టయింది. మీడియా ప్రపంచంలో వార్తా సంచలనాలు సృష్టించడంలో తనదైన ముద్ర వేసుకున్న చానెల్‌ సిక్స్‌టీన్‌ అపర్ణ గురించి అస్సలు తెలీని ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి మరీ బుల్లితెర సెలబ్రెటీగా మార్చేసింది. గంటకు పైగా ఆ కార్యక్రమం ప్రసారమైనా... అపర్ణ అపహరణకి సంబంధించి ఒక్క క్లూ అయినా లభించలేదు సరికదా...ఈ ఇన్సిడెంట్‌పై వ్యూయర్స్‌ క్యూరియాసిటీని లైవ్‌లో ఉంచడంలో మాత్రం సెంట్‌పర్సంట్‌ సక్సెస్‌ సాధించింది. అపర్ణను లిఫ్ట్‌లో అనుసరించిన వ్యక్తే ఆమె అదృశ్యానికి కారణం కాదంటే... ఈ కథ వెనుక అసలు సూత్రధారి ఎవరు? అన్నదే పోలీసులు ఛేదించాల్సిన ప్రశ్న అనే ముక్తాయింపుతో ఆ ముఖాముఖి ముగిసింది. అన్నట్లు...ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసింది ఎవరో కాదు...యాంకర్‌ వరలక్ష్మే.

‘‘కొత్త కాన్సెప్ట్‌...కొత్త ప్రోగ్రాం... పాత స్టోరీ’’ చిన్నమెదడు చితికిపోయేలా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు తేజ.  బాస్‌ చెప్పిన కాన్సెప్ట్‌  కాబట్టి...నెర్వస్‌గా ఫీలవుతున్నాడు. ప్రోగ్రామ్‌ని స్పెషల్‌గా తీర్చిదిద్దాలన్న తపనతో తల్లడిల్లిపోతున్నాడు. కానీ..ఎక్కడ, ఎలా మొదలెట్టాలా అనే విషయంలోనే అతడికి క్లారిటీ మిస్సవుతోంది.

ఎవరికీ తెలీని విషయం అందరికీ చెప్పడం తేలికే. అందరికీ తెలిసిన విషయం ఒక్కరినైనా ఒప్పించేలా చెప్పడానికి కావల్సినంత క్రియేటివిటీ కావాలి. పాతస్టోరీ రీప్లే చేస్తున్నట్లు తెలిస్తే  రిమోట్‌కి పనిచెప్పేస్తారు. ఆడియన్స్‌  చానెల్‌ స్క్రీన్‌కే అతుక్కుపోవాలంటే...కచ్చితంగా కంటెంట్‌ కావాలి.

ఫస్ట్‌ బులెటెన్‌ కంటెంట్‌ ఖరారైపోయింది...ఆ ఆలోచన రాగానే  అతడి కళ్లముందు ప్రతిమే కదలాడుతోంది. ప్రతిమ కేసులో సర్వ సమాచారం తనకే కాదు, వ్యూయర్స్‌కి తెలుసు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti