Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ : అలసటవల్ల కలిగిన అనారోగ్యంతో రెండు మూడు రోజులు నీరసించిపోతుంది చంద్రకళ. ఆ తర్వాత వివిధ చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలూ, వాటి తాలూకు రెస్పాన్స్ తో ఉత్సాహంగా గడుపుతుంది...డిసెంబర్ 12న తన బర్త్ డే చాలా ఆనందంగా జరుగుతుంది...    ఆ తర్వాత.....

గురువుగారు ‘పద్మశ్రీ’ అవార్డు అందుకొని, ఢిల్లీ నుండి తిరిగొచ్చారు.  వెనువెంటనే,  ఆయన   బృందమంతా బిజీ అయిపోయారు.  ‘శ్రీ కృష్ణావతారం’ నృత్య నాటిక కోసం మ్యూజిక్ కాంపోజిషన్,  నృత్యాంశాల కూర్పు - ప్రాక్టీసులతో అందరిలో ఉత్సాహాన్ని నింపారు.  ప్రదర్శనకి, అమ్మ చేత కూడా శ్లోకాలు పాడించనున్నారు.క్రిస్టమస్ హాలిడేస్ అవగానే, ప్రోగ్రాం ప్రాక్టీసులు మొదలయ్యాయి..

కాళీయుని శిరస్సు పై నర్తించే కృష్ణుడుగా,  నేను చేసేది  పదకొండు నిముషాల నర్తనం - కొత్తరకంగా కూర్చారు మాస్టారు. 

“తాళాలు, గతులు, జతులు, సంగతులు మారుతూ – శ్లోకంతో ముగియడం, ఓ కొత్త పద్దతిలో ఉంది నీ జతి,” అంది అమ్మ.

అమ్మకి  ఎంతో నచ్చింది.  దగ్గరుండి  ప్రాక్టీసు చేయిస్తుంది.సమ్మర్ బ్రేక్ రాగానే ఉంటుందట  ప్రోగ్రాం.  అదే వారంలో ‘టెరిటోరియల్ ఆర్మీ డే’ ప్రోగ్రాం కూడా.

**“

రోజూ పేరున్న ఆర్గనైజేషన్స్  ఒకళ్ళన్నా  ఫోన్ చేస్తున్నారు, మన కళ  ప్రోగ్రాం  కోసం,” అన్నారు నాన్న 

ఓ రోజు భోంచేస్తుండగా.“ నమ్మలేకుండా ఉన్నాను.   ఇంత చిన్నపిల్లని, ప్రొఫెషనల్ గా పర్ఫామ్  చేయమని ఇంత మంది అడగడం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది.  నిజంగానే చంద్రకళలో ఏదో ఉంది,”  నవ్వుతూ అమ్మ.“ఔను,  మమ్మీ,  దేర్ ఇజ్ ఎ డెవిల్ ఇన్ హర్, దట్ వాంట్స్ టు డాన్స్ ఆల్ ద టైం,” అన్నాడు పెద్దగా నవ్వుతూ వినోద్.“అయితే, నువ్వు డెవిల్ కి బ్రదర్,” అన్నాను వాడితో.

“కళకి, ఈ  ప్రోగ్రాములకి   రెమ్యునరేషన్ కూడా అందుతుంది.  మరి దాని ఇష్టం.   అంతా తనకే... షి ఇజ్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్ నౌ,”  నా వంక చూసారు నాన్న.

“ఈ యేడు భూషణ్ వాళ్ళ స్టూడియోలో కల్చరల్ ప్రోగ్రాం ఎలాగూ చేస్తాము.  మదురై ఆర్ట్-ఫెస్టివల్లో మన కళ, రాణి పాల్గొనడానికి అప్లికేషన్లు పంపబోతున్నానని చెప్పాడు, భూషణ్.  పోతే, మైలాపూర్ ఫైనార్ట్స్ వారి దసరా ప్రోగ్రాం ఒకటి ఒప్పుకున్నాను. అమ్మావారి గురించిన సాహిత్యం, నృత్యాలు కావాలని వారి రిక్వెస్ట్.  ఇప్పుడింకా జనవరి కదా! వీటన్నిటికీ టైం ఉంది,” అన్నారు నాన్న.

“నీకు ‘ఓకే’ నా కళా?” అడిగారు నన్ను.

“అఫ్ కోర్స్,”  అన్నాను  ఉత్సాహంగా.

**

రాణి స్కూల్లో అప్పుడప్పుడు జగదీష్ గురించి ఏదో ఒక కబురు చెబుతుంది. ఇంటికొచ్చి, ఆ కబుర్లన్నీ అమ్మకి తప్పకుండా వినిపిస్తుంటాను. అమ్మతో చెప్పేప్పుడు మాత్రం జగదీష్ పేరుకి ‘బావ’ అని తగిలించడం మర్చిపోను.

**

శనివారం  పొద్దున్నే రొజూ కన్నా  పెందరాళే  అమ్మ పిలుపుతో మేల్కొన్నాను.

“బ్రేక్ ఫాస్ట్ కి త్వరగా రండి అందరూ.  చంద్రకి డాన్స్ రిహార్సల్స్,  వినోద్ కి క్లబ్ లో ‘హారి పాటర్ ‘మూవీ’  ఉన్నాయి.  ఇద్దరికీ  టైం అవుతుంది,” అంటూ పిలిచింది అమ్మ.

ఐదు నిముషాల్లో, నాన్న సహా అందరం డైనింగ్ దగ్గరకెళ్ళాము.  మామూలుగా శనివారాలు ‘కిచిడి’ చేస్తుంది.  అందులోకి అమ్మ స్పెషల్ - కొబ్బరి పచ్చడి,  సాంబార్....

అందరికీ  వడ్డించింది.  తిని ఎలా ఉన్నాయో చెప్పమంది.  నాతో మాత్రం, “కాస్త లైట్ గానే తిను.  డాన్స్ చెయ్యాలిగా,  లేదంటే హార్లిక్స్ మాత్రం తాగి వెళ్ళు.   లంచ్ కి తినవచ్చు నీకిష్టమైన ‘కిచిడి’,” అంది అమ్మ.

అమ్మ వంక గుర్రుగా చూసాను... కానీ ఆమె అన్నది అర్ధమయ్యింది...నా వంక చూసిన అమ్మ మాత్రం నవ్వేసింది.

“వినోద్, నిన్ను కన్నన్ కారులో డ్రాప్ చేస్తాడు.  వచ్చేయాలన్నప్పుడు  క్లబ్  నుండి ఫోన్ చేయి,” చెప్పింది వాడికి.

“ఇంకొంచెం తినండి,”  అంటూ నాన్నకి రెండోసారి కిచిడి వడ్డించి, పక్కనే కూర్చుంది.

“చూడండి,  శివరామశర్మ మాస్టారు మన చంద్రకి ఎంతో  శ్రద్ధగా నాట్యం నేర్పిస్తున్నారు. ఆయన స్పెషల్ క్లాసుకి ఫీజు కూడా తీసుకోడంలేదు.  ఆయనకి గురుదక్షిణగా పట్టు పంచెలు, క్యాష్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను.  రేపు ఆదివారం ఆ పని చేస్తా,” అంది అమ్మ నాన్నతో.

నేను హార్లిక్స్ మాత్రం తాగేసి క్లాసుకి వెళ్ళిపోయాను.

**

మరునాడు,  పొద్దున్నే  ట్రేలో పళ్ళు, పట్టుపంచలు, ఒక కవరు సర్దింది అమ్మ. క్లాసు  టైంకి ముందే ట్రే తీసుకొని  వెళ్ళాము.“గురువుగారికి  నమస్కరించు చంద్రా,”   అంది అమ్మ.  పాదాలంటి  నమస్కరించాను.

“ఇదంతా ఏమిటమ్మా,”  అన్నారు మాస్టారుగారు.

“మా తృప్తి కోసం మాస్టారు. కృతజ్ఞతగా మీకు చిన్న కానుక.  ఇంత చిన్న వయసులో, చంద్ర ఇంత చేయగలుగుతుందంటే, కేవలం మీరు దానిపైనుంచిన శ్రద్ధ, విశ్వాశం వల్లనే.  గురువుగారి ఋణం తీర్చుకోలేము,” అంటూ నా చేత మేము తెచ్చిన  ట్రే ఆయనకి ఇప్పించింది అమ్మ.

“చూడండీ శారద గారు,  వయస్సుతో నిమిత్తం లేని మంచి టాలెంట్, శ్రద్ధ  మీ అమ్మాయిలో ఉన్నాయి.  నా  స్టూడెంట్  తేజశ్విని  కళలున్నాయి  మీ అమ్మాయిలో.   నృత్యమంటే  ఉన్న ఆసక్తికి తోడు,  మీ నుండి అందుతున్న సహకారం  చంద్రకళ  పూర్వజన్మ సుకృతం.  మనం  మరో  తేజశ్విన్ని  తయారు చెయ్యవచ్చు.   మీకు, నాకు కూడా కీర్తిని తెచ్చిపెడుతుంది  మన చంద్రకళ,”  అన్నారు నన్ను ఆశీర్వదిస్తూ,  మాస్టారు.

అమ్మ కళ్ళల్లో ఆనందం చూసాను.

**

ప్రోగ్రాం  ప్రాక్టీసులు  కూడా అయ్యి ఇంటికి వచ్చేసరికి, లంచ్ తినకుండా నా కోసమే ఆగారు  నాన్నా వాళ్ళు.  అమ్మ చేసిన వంటల ఘుమఘుమలతో ఆకలి రెట్టింపయ్యింది.

ప్రతి సండే  సాంబార్, ఎగ్ పులుసు, బెండకాయ వేపుడు... భోజనమయ్యాక మాంగో ఐస్ క్రీం  సహా స్పెషలే.  ......అన్నీ నాకిష్టమైనవే...క్లాస్ గురించే కబుర్లు చెబుతూ  లంచ్  కానిచ్చాను.

ఐస్ క్రీం తింటూ, అందరం సిటింగ్  రూములో టి.వి ముందు చేరాము.

డోర్ బెల్ మోగితే, నేనే వెళ్ళి తలుపులు తీసాను.

మా మాస్టారుగారే.   “ఏమ్మా నాన్నగారు ఉన్నారా?” అంటూ లోపలికి వచ్చారు.

“రండి శర్మగారు,” అంటూ నాన్న లేచి ఎదురొచ్చారు.

చేతిలోని కవర్ ని, కాఫీ టేబిల్ మీద ఉంచి, సోఫాలో కూర్చున్నారాయన. అమ్మ ఏదో అనబోయింది. “చూడండి మేజర్ గారు,  ఇలా ఇంత డబ్బు పాపతో ఇప్పించడం ఏమిటండి? నేను తీసుకోలేను.  గౌరవంతో ఇస్తున్నారు  కాబట్టి,  పట్టు పంచెలవరకు  తీసుకుంటాను,” అన్నారాయన.

“అలా కాదు మాస్టర్ గారు,  మీరు స్పెషల్ క్లాస్ కూడా చెపుతున్నారు.  దానికి మీరు ఏమీ తీసుకోరు,”  ఇంకా ఏదో అనబోయింది అమ్మ....

“ఇప్పుడు  చంద్రకళకి తన సొంత బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది మాస్టారు.  కాబట్టి మీ ఫీజు ఏమీ తక్కువ కాకుండా ఇచ్చుకోనివ్వండి,” అన్నారు నాన్న.

“లేదండీ, చంద్రకళ డబ్బుని డాన్స్ దుస్తులకి వాడండి.  నన్నింక  ఫీజు అదీ అంటూ కించపరచకండి...మాములుగా గ్రూప్ లెసెన్ కి కడుతున్నారుగా. అది చాలు,” అన్నారు.

“పోతే, మరో సంగతి.  వచ్చే యేడు నుండి ‘నృత్యహేళి’  ప్రదర్శనల  ఏర్పాట్లు  ఉంటాయని సూచించారు సాంస్కృతిక సంఘం వారు.  మంచి సభా వేదికలివి.  చంద్రకళకి, మీకు అన్ని ఏర్పాట్లు మన మంజరి, కాంచనలతో  పాటే ఉంటాయి,” అన్నారాయన అమ్మతో. అమ్మావాళ్ళు ఆయన చెప్పేది వింటున్నారు...నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది...

“సమయం ఉంది కాబట్టి,  ఆలోచించి ఏర్పాట్లు చేసుకోండి.  ఉంటానమ్మా,” అంటూ సోఫా నుండి పైకి లేచారాయన. ఆయన్ని పంపి తలుపు  వేసుకుని వచ్చారు నాన్న.  సీరియస్ గా ఆలోచిస్తున్న అమ్మ పక్కనే సోఫాలో కూర్చున్నారు.“చూడు శారద,  గొప్ప పేరున్న గురువు, ఈ అవకాశాలు అరుదుగా లభిస్తాయి.  మా చిన్నక్క - కోటమ్మ, ఖాళీగానే  ఉంది.  ‘నీ  దగ్గరే  ఉంటానురా తమ్ముడు,’ అంటూ ఉంటుంది

నాతో.  పిలిస్తే ఎప్పుడైనా వస్తుంది.. కొంత కాలం మన దగ్గర,  అన్నింటా సాయంగా, వినోద్ కి  తోడుగా ఉంటుందిలే....,” అన్నారు నాన్న.

*******

మంచి గ్రేడ్స్ తో పాస్ అయ్యి, నేను నైన్త్ స్టాండర్డ్ కి వచ్చాను... సమ్మర్ హాలిడేస్ మొదటి వారంలోనే, చాలా  పబ్లిసిటీతో, మాస్టారి గారి - ‘కృష్ణావతారం’,  నాన్న వాళ్ళ టెరిటోరియల్ ఆర్మీ ప్రోగ్రాములయ్యాయి. 

“శ్రీ కృష్ణావతారం” డాన్స్ బ్యాలెట్ లో నా పర్ఫార్మెన్స్ గురించి అన్ని పేపర్స్- మంచి రీవ్యూ ఇచ్చాయి.  ‘కూచిపూడి పట్ల నాకున్నది  అంకితభావమని,  ధీటైన తాళ జ్ఞానం నా నృత్యానికి ఆయువు పట్టని’  మెచ్చుకున్నాయి కొన్ని రీవ్యూలు..

అమ్మా, నాన్నా పొంగిపోయారు. “డాన్స్ చేసింది నా కూతురైతే, నన్నో పెద్ద ‘స్టార్’ లాగా  చూస్తున్నారు  మా ఆర్మీ కేడర్,” అంటూ నవ్వారు నాన్న, ఆర్మీ ప్రోగ్రాం జరిగాక....

*******

దాదాపు ప్రతివారం టి.వి. లోనో, న్యూస్ పేపర్లోనో  నా ఫొటో, డాన్స్ రీవ్యూ వస్తుండడంతో, బయటకి వెళ్ళినప్పుడు నన్ను జనం గుర్తు పడుతున్నారు.

ఒకటి రెండు సార్లు గుడిలో, షాపింగ్ మాల్ లో నాకు  దగ్గరగా వచ్చి, కొందరు ఆడవాళ్ళు  నా చేతులు పట్టుకుని మాట్లాడిన సందర్భాలు చూసారు నాన్న.

అలాటి ఓ సంఘటన జరిగిన రోజు, నాకు ఫాన్-ఫాలోయింగ్ ఎక్కువయిందని, అసంఖ్యాకంగా అభిమానులు పెరుగిపోతున్నారని టీజ్  చేస్తూనే,  ఇంటికొచ్చాక, నాన్న కొత్తగా కొన్ని రూల్స్ పెట్టారు ...

‘తోడు లేనిదే, నేను ఎవరిళ్ళకీ వెళ్ళకూడదని,  ఒంటరిగా ఎవరితోనూ మాట్లాడకూడదని,  తమతో తప్ప వేరెవరితోనూ మెలగవద్దని’  సూచించారు.  నిజానికి, నేను  ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళడాలు లాంటివి చాలా అరుదు...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti