Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

జరిగిన కథ : కవరేజ్ మాత్రమే తమ బాధ్యత కాదనీ, కేసులోని నిజాలు నిగ్గుతేలేదాకా పరిశోధించడంలో ఖాకీడ్రస్ లేని పోలీసుల్లా పోరాడాలన్న బాస్ నరసిమ్హం పెట్టించిన పరుగుతో అపర్ణ కేసులో కదలిక వస్తుంది వాళ్ళ స్టాఫ్ లో....తన ఫ్రెండ్ డిటెక్టివ్ సిద్ధార్థను కలుస్తాడు తేజా.....ఆ తర్వాత.....

‘‘సరే బాబా! మీడియాకున్న ప్రైవసీతో నిజాలు నిగ్గు తేలుస్తావ్? అందువల్ల ఏం సాధిస్తావ్?’’

‘‘ఇలాంటివి పునరావృత్తం కాకుండా హెచ్చరికలా ఈ ప్రోగ్రాం తీర్చిదిద్దుతాం...’’అని అంటుండగానే ఇన్వెస్టిగేషన్ చేయబోయే ప్రతిమ కేసులో ఎవరికీ తెలీని కోణంలా...సిద్దార్థ క్యాబిన్ బయట ఓ వ్యక్తి నిల్చున్నాడు. తెల్ల బట్టలు ధరించిన ఆ వ్యక్తి హుందాగా కనిపిస్తున్నాడు. అటో అడుగు, ఇటో అడుగు వేస్తూ...మధ్య మధ్యలో సిద్దార్థ క్యాబిన్ లోకి తొంగి చూస్తూ హడావుడి పడుతున్నాడతడు.

అతడి చేతిలో ఓ ఫొటో ఉంది.

ఆ ఫొటోనే అతడు మాటి మాటికీ చూస్తున్నాడు. వీలైనంత తొందరగా సిద్దార్థను కలవాలనే తాపత్రయం అతడి కదలికల్లో కనిపిస్తోంది.‘‘క్లయింట్ వచ్చినట్లున్నాడు..’’ అన్నాడు తేజ, సిద్దార్థ చూపుల్ని పసికట్టి.

‘‘ఔను...’’అంటూ బెల్ నొక్కాడు సిద్దార్థ. ఆఫీస్ బాయ్ లోనికి వచ్చి...బయటకి వెళ్లి ఆ తర్వాత అతడ్ని లోనికి పంపించాడు.

‘‘ఏం పని మీద వచ్చారు?’’ అన్నాడు సిద్ధార్థ కుర్చీ లోంచి కాస్త ముందుకు వంగి. అయినా, అతడిలో ఏ మాత్రం కదలిక లేదు. లోనికి వచ్చిన అతడు సిద్దార్థకు నమస్కరించి తేజా పక్కనున్న కుర్చీలో మోమాటంగా కూచున్నాడు. గోడకు వేలాడుతున్న కేలండర్లలో బొమ్మల్ని, వాల్ క్లాక్ లోని సెకన్ ముల్లు కదలికల్ని, టేబుల్ పై ఉన్న పుస్తకాల్ని, పేపర్ వెయిట్, కాగితాల్ని...చూపుల్తో చుట్టేస్తూ కాలక్షేపం చేస్తున్నాడే తప్ప పెదవి విప్పి మాట్లాడేందుకు ప్రయత్నించడం లేదు.

ఆ చిన్ని గదిలో మరో మనిషి ఉన్నాడనే అతడు పెదవి విప్పడం లేదని సిద్ధార్థకే కాదు, తేజాకి కూడా అర్ధమైంది. 

‘‘మీరు మాట్లాడండి. నేను బయట వెయిట్ చేస్తా’’ అంటూ లేచాడు తేజ.

‘‘ఫర్వాలేదు...’’ పైకి ఆ వ్యక్తి అన్నా...లేచి వెళ్తున్నందుకు అతడి కళ్లలో మెరుపు తేజా చూపుల్ని దాటిపోలేదు.

వరండాలోకి వస్తూ తేజా అతడి గురించే ఆలోచిస్తున్నాడు. ‘ఇతడినెక్కడో చూసినట్టుంది. ఉరుకుల పరుగుల జీవన యానంలో ఓ క్షణం సేపు ఎదురు పడిన గుంపులో ఒకడిగా కాకుండా...అతడిని చాలా, చాలా దగ్గరగా చూసిన గుర్తు. ఆ గొంతు కూడా విన్నట్టే ఉంది. అంటే... అతడితో మాట్లాడే ఉంటాడు.

అయితే...ఎప్పుడు, ఎక్కడ కలిసిందీ తేజాకి గుర్తు రావడం లేదు.

డిటెక్టివ్ దగ్గరికి వచ్చాడంటే...చేతిలో ఎవరిదో ఫొటో కూడా ఉందంటే...కచ్చితంగా రహస్య పరిశోధనే.

ఏమై ఉంటుంది?

ఓ పక్క ఆసక్తి...మరో పక్క అవసరం లేని విషయాన్ని అంతగా తలకెక్కించుకోవడమెందుకనే భావన...క్షణకాలం సతమతమయ్యాడు తేజ.ఖాకీ ఠాణాల చుట్టూ కాకుండా...సిద్దార్థ ఆఫీసు చుట్టూ తిరిగితే హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీలెన్నో చానెల్ తెరకెక్కించొచ్చు.  నేరం..పరిశోధన నాణేనికి బొమ్మ బొరుసులాంటివే. జరిగిన ప్రతి నేరాన్నీ పరిశోధన అనుసరిస్తూనే ఉంటుంది. కొన్ని పరిశోధనలు వెంటనే ఫలితాలిస్తే...మరికొన్ని పరిశోధనలు మందకొడిగా సాగుతూనే ఉంటాయి. ఇంకొన్ని...మధ్యలోనే ఆగి కళ్లముందు శేష ప్రశ్నలెన్నింటినో మిగులుస్తాయి.

ఆ చివర్నుంచీ ఈ చివరివరకూ కారిడార్లో తిరుగుతూ తేజా ఆలోచిస్తుంటే`

అక్కడ...గదిలో ఆ ఇద్దరూ మాటల అడవిలో చిక్కుకుపోయారు.

ఆ వ్యక్తి చెప్తున్న దానికి రియాక్షన్ అన్నట్లు...ఒక్కసారి ఉలిక్కి పడిన సిద్దార్ధ కుర్చీలోంచి లేచాడు.

‘‘ఏంటీ...ఈ అమ్మాయిని వెతికి పెట్టాలా?’’ ఆశ్చర్యంగా అడుగుతున్నాడు సిద్దార్థ.

‘‘ఔన’న్నట్లు తలూపాడతడు, ఆనందరావు.

ఇండస్ట్రీలో సౌండ్ ఇంజనీర్ గా వృత్తిని ప్రారంభించి ఇప్పుడో ప్రొడక్షన్ హౌస్ చైర్మన్ కి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.

ఆయన చూపులు, మాట తీరు చూస్తే మతి స్థిమితం లేనివాడని ఎవరూ అనుకోరు. కానీ...వ్యవహారమే అనుమానం కలిగిస్తోంది.

అందుకే, ‘ఎక్కడ్నుంచి వచ్చారు?’’ నెమ్మదిగా అడిగాడు సిద్దార్థ...డైరక్ట్ గా ‘ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి వచ్చారా?’ అని అడగలేక.

‘‘ఈ సిటీలోనే ...వనస్థలిపురంలోని ఇంటినుంచే... ఏం అలా అడుగుతున్నారు?’’ నవ్వుతూ అడిగాడతడు.

‘‘మీ వివరాలు కూడా తెలియాలి కదా!’’ అన్నాడు సిద్దార్ధ.

‘‘మీరు తెలుసుకోవాల్సినవి నా వివరాలు కావు...ఈ అమ్మాయి వివరాలు’’

‘‘ఔనా, భలే చెప్పారు! ఇంతకీ  ఈ అమ్మాయి కనిపించడం లేదంటారు. ఎక్కడుందో తెలీదంటారు. వెతికి పట్టుకోమంటారు’’ అడిగాడు సిద్దార్థ.

‘‘అదేగా చెప్తోంది. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు ప్రతిమ. చాలా కాలం నుంచి కనిపించడం లేదు. ఈ సిటీలోనే ఉందని తెలిసింది. మీరు  వెతికిపెట్టాలి’’ వివరంగా చెప్పాడతడు.

‘‘ఇంతకీ ఈ అమ్మాయి మీకేమవుతుంది?’’

‘‘నాకు కూతురు లాంటిది...’’

‘‘లాంటిదే కానీ...మీ కూతురు కాదు కదా!’’

‘‘మా బాస్ కూతురు...నాకూ కూతురు లాంటిదే’’

‘‘ఈ అమ్మాయి చనిపోయింది. ఆ సంగతి మీకు తెలీదా?’’ సిద్దార్థ ప్రశ్నతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడతడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని అన్నాడిలా`‘‘ఆ సంగతి మీకెలా తెలుసు?’’

‘‘మీరు వెతకమని చెప్తున్న ప్రతిమ నాకూ బాగానే తెలుసు. ఆమె ఓ కేసు అప్పగిస్తే డిటెక్టివ్ గా పని చేసిపెట్టా. ఆ తర్వాత కొద్ది రోజులకే అనూహ్యంగా ఆమె చనిపోయింది. అది హత్యో, ఆత్మహత్యో..మొత్తానికి అనుమానాస్పద మృతే’’

‘‘అవన్నీ నాకూ తెలుసు...ఆమె అంత్యక్రియలకు నేనూ హాజరయ్యాను’’ చెప్పాడతడు.

‘‘మీ బాస్ కి మరో కూతురు కూడా ఉందా?’’ మరో ప్రశ్న సంధించాడు సిద్దార్థ.

‘‘లేదు, ఒక్కర్తే కూతురు’’

‘‘ఒక్కర్తే కూతురు. ఆ అమ్మాయి కూడా  చనిపోయింది. ఆ సంగతి ఆమె అంత్యక్రియల్ని చేసిన మీకూ, మీ బాస్ కీ తెలుసు. అన్నీ  తెలిసీ అమ్మాయిని వెతికి పెట్టమంటూ నా దగ్గరికి వచ్చారు’’ నవ్వాడు సిద్దార్థ.

‘‘నిజానికి మాకూ అంతు పట్టని మిస్టరీ ఇది. నేనూ మా బాస్ ఈ అమ్మాయి ప్రతిమని కళ్లారా చూసాం’’

‘‘చనిపోయిన తర్వాతే?’’

‘‘ఔను. ఆమె చనిపోయి ఇంచుమించు ఆరు నెలలవుతోంది. కానీ, ఈ అమ్మాయిని  రెండు వారాల క్రితం చూసాం’’

‘‘ఓ మనిషిని పోలిన మనుషులు లోకంలో ఏడుగురుంటారంటారు. బహుశా, ప్రతిమ పోలికలున్న మరో అమ్మాయిని మీరు చూసి ఉంటారేమో? పరాగ్గా చూసి ప్రతిమే అనుకుని ఉంటారేమో?’’

‘‘నోనో...ఆమె కచ్చితంగా ప్రతిమే. అచ్చం తనలాగే ఉంది’’

‘‘మీ కళ్ల ముందే చనిపోయి బూడిదై పోయిన అమ్మాయి మళ్లీ మీకెలా ఎదురు పడుతుంది?’’

‘‘అదే మా డౌటు. ప్రతిమ చనిపోయింది. కాదు కాదు, బతికే ఉంది. ఇదే సిటీలో ఇండికా కార్లో తిరుగుతూ అప్పుడప్పుడూ కనిపిస్తూ...అంతలోనే మాయమవుతూ దోబూచులాడుతోంది. దాగుడు మూతలాడుతూ మా బాస్ కి నిద్ర కరువు చేస్తోంది.  నిజంగా మాకు కనిపిస్తున్న ఆ యువతి ప్రతిమేనా?’’ తనలో తాను ప్రశ్నించుకుంటున్నట్లు సిద్దార్థను అడిగాడు ఆనందరావు.

‘‘ఏమో...ఆ అమ్మాయిని చూసిన మీకే తెలియాలి’’ అంటూనే మరో ప్రశ్న సంధించాడు సిద్దార్ధ`‘‘ఆ అమ్మాయిని ఎక్కడ చూసారు. ఐ మీన్...సిటీలో ఏ ప్రాంతంలో ఆమె మీకు కనిపించింది’’

‘‘ఓసారి పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర ఇండికా కార్లో వెళ్తూ కనిపించింది. రెండ్రోజుల కిందట కోటీ హరిద్వార్ దగ్గర అదే కార్ లో మళ్లీ ఆమెని చూసాం. మొదటిసారి చూసినప్పుడు మా కళ్లని మేమే నమ్మలేకపోయాం.. నిజమో, కలో తెలీని భ్రాంతి కలిగింది. రెండోసారి చూసినప్పుడు చూసింది నిజమనే నిర్ధారణకు వచ్చాం. ఔను...మా బాస్ కూతురు బతికే ఉంది’’

‘‘మరి, చనిపోయినదెవరు?’’

‘‘ఆ సంగతి తేల్చాల్సింది మీరే’’ అన్నాడు ఆనందరావు.

ఆ సమాధానానికి నవ్వొచ్చింది సిద్దార్థకి.

చిత్రంగా ఉందీ కేసు.  ఇలాంటి కేసు ఒక్కటొస్తే చాలు...పరిశోధనా వృత్తి వీడి పరుగు లంకించుకోవడానికి.

‘‘అంటే...’’అర్ధం కానట్టు చూసాడు సిద్దార్థ అతనివైపు.

ఆకాశం మేఘావృత్తమై సన్నగా వర్షిస్తున్న ఆ వేళలో అతడొచ్చి మెదడుకు పదును పెడ్తున్నాడు.

‘‘ఆ అమ్మాయిని చూసినప్పుడే పట్టుకోవాల్సింది. ఈ ఫొటో పట్టుకుని ఇక్కడిదాకా వచ్చే శ్రమ మీకు తప్పేది’’

ఈ మిస్టరీ వచ్చేవారం దాకా......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్