Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విరాట్ నుంచి ఫోన్ వచ్చిన మరుక్షణం నుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తూ క్షణం కూడా వృధా చేయకుండా వేగంగా విరాట్-సహస్రలున్న ప్రదేశాన్ని చేరుకుంటుంది విశాల. ఆమెను అనుసరిస్తున్న చందూకి అయోమయంగా అనిపిస్తుంది....వాళ్ళిద్దర్నీ కారులో అతి జాగ్రత్తగా డా.గుణదీపిక హాస్పిటల్ కి చేరుస్తారు. సమయానికి వైద్యం అందడంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతారు విరాట్-సహస్రలు...అక్కణ్ణుంచి వాళ్ళిద్దనీ తన ఇంటికి తీసుకెళుతుంది విశాల. ఆ తర్వాత......


నువ్వు వీళ్ళనిక్కడికి రాత్రికి రాత్రి తీసుకు రావటమే మంచిదయింది. ఉదయం అయిదు గంటలకి పోలీసులు వచ్చి ఎంక్వయిరీ చేసి వెళ్ళారు. మనం వెరీ లక్కీ. వీళ్ళిక్కడున్నట్టు ఎవరికీ తెలీకూడదు. విజిటర్స్ ని ఆపితే మంచిది. వస్తాను’’  అంటూ బయలుదేరి వెళ్ళిపోయింది డాక్టర్ గుణదీపిక.

డాక్టర్ గుణదీపికను సాగనంపాక....
తిరిగి మేడమీది విరాట్ గదిలోకొచ్చింది విశాల....
బెడ్ మీద విరాట్ పక్కన కూచుంది....
విరాట్ ముఖంలోకి చూసింది....
ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది.....

విరాట్ ముఖం....

జుత్తు నిమిరి మీదికి వంగి నుదురు ముద్దాడిరది....
రాత్రి సంఘటనతో తమకి గొప్ప గండం గడిచినట్టయింది. విరాట్ లేకపోతే తను బ్రతికేదా? సహస్రకేమన్నా జరిగుంటే విరాట్ బ్రతికేవాడా? ప్రాణ స్నేహితురాలయినందుకు డాక్టర్ గుణదీపిక చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోలేదు. పచ్చగా మేలిమి బంగారు ఛాయలో మెరుస్తున్న విశాలమైన విరాట్ ఛాతీని చూస్తుంటే మనసులో మోహపు తెరలు పురివిప్పుతున్నాయి. వయసు కోరికలు అలజడి కలిగిస్తున్నాయి. అతడి ఛాతీని ముద్దాడి అలాగే ఛాతీమీద తలాన్చుకొని ఉండి పోయింది.

ఆమె కంటి కొనల నుండి ముత్యాల్లా జాలువారిన కన్నీరు అతడి ఛాతీని నును వెచ్చగా తడుపుతోంది. అలా ఎంత సేపు ఉండి పోయిందో విశాలకే తెలీదు. రాత్రి సరిగా నిద్ర లేమి వల్ల అలాగే మత్తుగా అతడి ఛాతీమీద నిద్రలోకి జారుకుంది.

చాలా సేపటికి.... 

విశాల కన్నీరు విరాట్ కి....

స్పృహ వచ్చేలా చేసింది....

చాలా సడెన్ గా స్పృహ తెలిసింది విరాట్ కి....

కళ్ళు తెరవగానే....

పైన గిర్రున తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కన్పించింది. తలంతా దిమ్ముగా వుండి కాస్సేపు ఏం జరిగింది తను ఎక్కడున్నాడు ఏదీ గుర్తు లేకుండా పోయింది. తిరిగి కళ్ళు మూసుకొని విల్ పవర్ ను కూడ గట్టుకొనే కొద్ది క్రమంగా జరిగిన సంఘటనలన్నీ ఒక్కటొక్కటిగా గుర్తురానారంభించాయి. చివరిగా తను విశాలకు ఫోన్ చేయటం వరకే గుర్తుంది. తర్వాత ఏం జరిగిందీ తెలీదు. తిరిగి కళ్ళు తెరిచాడు.
తన ఎడం భుజం గాయానికి ట్రీట్ మెంట్ చేసి బాండేజ్ వేయ బడిన్ది. డౌట్ లేదు విశాల తమను కాపాడిన్ది. సహస్ర............. సహస్రకెలా వుంది? సహస్ర గుర్తు రాగానే ఆందోళనతో, పక్కన తన ఛాతి మీద తల వాల్సి నిద్ర పోతున్న విశాల వంక చూసాడు. అతడు కదలటం గమనించి దిగ్గున లేచి కూచుంది విశాల. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. ఆమె పలకరించే లోపలే ‘‘సహస్ర..........సహస్ర ఎక్కడ విశాలా...........తనెలా వుంది?’’ లేచి కూచోడానికి ప్రయత్నిస్తు ఆత్రంగా అడిగాడు.

‘‘కంగారు పడకు విరాట్ తనూ క్షేమంగా వుంది. పక్క గది లోనే వుంది. స్పృహ రావటానికి లేటవుతుందని డాక్టర్ చెప్పింది. రిలాక్స్’’ అంది.
‘‘నేను చూడాలి విశాలా. తననోసారి చూస్తే గాని మనసు కుదుట పడదు. ప్లీజ్ నన్ను ఆ గదిలోకి తీసుకెళ్ళూ.’’ అన్నాడు లేవటానికి ప్రయత్నిస్తూ. ఎడం చేయి బాండేజ్ మూలంగా కుడిచేయి వాలుగా లేవలేకపోతున్నాడు. అతనికి తన చేయి అందించింది విశాల. బెడ్ దిగిన విరాట్ కి శరీరం నీరసంతో తూలుతోంది కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అన్ని వికారాలు సర్దుకోడానికి కొంత టైం పడుతుంది. ముఖ్యంగా ఏమన్నా తినాలి. నిన్న మధ్యాహ్నం ఎప్పుడో చేసిన భోజనం తర్వాత ఆహారం ఏమీ తీసుకునే అవకాశమే లేకపోయింది.

విశాల భోజనం మీద చెయ్యి వేసి ఆసరా తీసుకొంటూ ఆమె వెంట పక్కగదిలోకెళ్ళాడు విరాట్ ఓ పక్కకు తిప్పి రాత్రి ఎలా పడకేసిన సహస్ర అలాగే పడుంది బెడ్ మీద. తలను చుట్టూ బాండేజ్. అలాగే తల నుంచి నిలువుగా చాచుకొని చుట్టి మరో బాండేజ్ ఉంది. చూడ్డానికి గాఢమైన నిద్రలోవున్నట్టుంది. నెమ్మదిగా వచ్చి సహస్ర పక్కన కూచున్నాడు విరాట్. విశాల వంక చూసాడు. చీర జాకెట్లో నుదుట కుంకుమతో అప్పుడే విరిసిన గులాబీలా వుంది విశాల.

‘‘సహస్రకి విభూది కుంకుమ నుదుట వుంచింది ఎవరు?’’ అడిగాడు.

‘‘నేనే...... ఉదయమే పడవళని గుడికెళ్ళి మీ యిద్దరి పేరున అర్చన చేయించి వచ్చి నీకు అక్కకి విభూది నుదుట పూసిబొట్టు పెట్టాను. మురుగన్ దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది. మీకు గుణం కాగానే గుడికి వచ్చి నూటొక్క టెంకాయ కొడతానని కూడ మొక్కుకున్నాను’’ చెప్పింది విశాల.

‘‘రాత్రి............. నీకు ఫోన్ చేసాక తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఏం జరిగింది...? మమ్మల్ని కాపాడిన డాక్టర్ ఎవరు? పోలీసులకు తెలీకుండా నీకు ఎలా సాధ్యపడిన్ది?’’

‘‘చెప్తాను. నువ్వు ఎలాంటి టెన్షన్ లేకుండా కూచో. కూచోడం కాదు వెళ్ళి బ్రష్ చేసుకురా. ఈ లోపల నేను కిందకెళ్ళి నీకు టిఫిను కాపీ తెస్తాను. చాలా బలహీనంగా వున్నావ్. నిన్న ఎప్పుడో భోంచేసుంటావ్ కమాన్, నీ గదిలో కొత్త బ్రష్షు అవీ వుంచాను’’ అంటూ విరాట్ ని సహస్ర పక్క నుంచి లేపింది.

‘‘నిజంగా..............సహస్రకే ప్రమాదం లేదుకదా?’’ సందేహ నివృత్తి కోసం మరోసారి అడిగాడు.

‘‘లేదు విరాట్. తను సేఫ్ భయపడాల్సిదేం లేదు. ఇంకో రెండు మూడు గంటల్లో తనకీ స్పృహ వస్తుంది. మీకు ఆపరేషన్ చేసింది ఎవరో కాదు నా క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ గుణదీపిక. నా మాట నమ్ము’’ అంది విశాల.

విరాట్ కి విశాల పట్ల ప్రేమ ద్విగుణీకృతమైంది.

రాత్రి విశాల సాహసించక పోయుంటే ఈ పాటికి సహస్ర తను, ఎక్కడో కుప్ప తొట్టి వెనక చెత్తలో అనాథ ప్రేతల్లా పడుండేవారు. అది తలుచుకొగానే దు:ఖం పొంగుకొచ్చింది ఉన్నట్టుండి. విశాలను కౌగిట పొదువుకొంటూ ఏడ్చేసాడు. విశాల ప్రేమగా అతడ్ని ముద్దాడి కళ్ళు తుడిచింది.

‘‘వద్దు విరాట్ నాకు ధైర్యం చెప్పిన నువ్వు ఇప్పుడిలా ఏడవకూడదు. ఇది మనం సంతోషించాల్సిన సమయం. ప్లీజ్ నువ్విలా ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది’’ అంది గుండెల్లో ముఖం దాచుకొంటూ.

‘‘లేదు విశాలా కాస్సేపిలా కౌగిట ఉండనీ. నీ స్వచ్ఛమైన ప్రేమను గుర్తించటంలో చాలా అలక్ష్యం చేసాను. క్షమించు. నా ఫోన్ రాగానే రాత్రి నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో ఎంత రిస్కు తీసుకున్నావో వూహించగలను నీకు సాయంగా ఎవరో వచ్చుండాలి. ఎవరు?’’ అడిగాడు.
‘‘చందూ అన్నయ్యొచ్చాడు. రాత్రి నీపక్కనే పడుకున్నాడు. ఉదయం ఇంటికెళ్ళాడు. మీకు బట్టలు అలాగే దీక్షను తీసుకొస్తాడు’’ అంది.
‘‘ఇది మీ యిల్లే కదూ?’’

‘‘అవును. ఇంతకన్నా మీకు సేఫ్ ప్లేస్ ఉండదు. ఆస్పత్రిలో ఉంచమంటే నేనే తీసుకొచ్చేసాను. అయిదు గంటలకి పోలీసులు ఆస్పత్రికి వచ్చి ఎంక్వయిరీ చేసి వెళ్ళారట. సిటీలో అన్ని ఆస్పత్రుల్ని చెక్ చేస్తున్నారు. ఒకె. తర్వాత మాట్లాడుకుందాం. ముందు ముఖం కడుక్కో. కమాన్’’ అంటూ విరాట్ ని అతడి గదిలోకి తీసుకెళ్ళి వదిలి కిందకు వెళ్ళింది విశాల.

విరాట్ బాత్రూం కెళ్ళి ఫ్రషప్ అయి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని వచ్చి కూచున్నాడు. కాస్సేపటికి రెండు కప్పులలో వేడి వేడి కాఫీ తీసుకొచ్చింది విశాల. ఒకటి విరాట్ కిచ్చి తనొకటి తీసుకుని ఎదురుగా సోఫాలో కూచుంది. ఇంతలో విశాల తల్లి కాంచన మాల తనకు ఓపిక లేక పోయినా విరాట్ స్పృహలోకొచ్చాడని తెలిసి  రెండు ప్లేటుల్లో వేడి వేడి ఇడ్లీ గారెలు చట్నీ ఒక ప్లాస్కు నిండా టీ పోసి తీసుకొచ్చి ఎంతో ఆదరంగా విరాట్ ను పరామర్శించింది.

‘‘నీకు ఇంకా స్పృహ రాలేదని విశాల కూడ ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు విరాట్. ఇద్దరూ టిఫిను తీసుకుని టీ తాగండి. సహస్ర గురించి బెంగపడకు. తనూ స్పృహలోకి వచ్చేస్తుంది’’ అని ధైర్యం చెప్పి కిందకు వెళ్ళిపోయిందావిడ.

‘‘సహస్ర గురించి మీ అమ్మగారికి అంతా తెలుసా? నిన్నెమీ అడగలేదా?’’ టిఫిన్ తీసుకునేటప్పుడు అనుమానం వచ్చి అడిగాడు.
‘‘మమ్మీకి అంతా తెలుసు’’ అంది విశాల.

‘‘చెప్పాగా మమ్మీ డాడీలది లవ్ మేరేజ్. ఇరు తరుఫు బంధు వర్గం అంగీకరించక పోవటంతో చెన్నై వచ్చేసి ఇక్కడ స్థిర పడ్డారు. డాడీ టైలరింగ్ లో మాస్టర్ అయితే కొద్ది మంది స్టాఫ్  తో రెడీమేడ్ దుస్తుల తయారీ ఆరంభించారు. అదృష్టం కలిసొచ్చింది. ఈ రోజు మూడు వందల కుటుంబాలు మా గార్మెంట్స్ కంపెనీ మీద ప్రత్యక్షంగా ఆధార పడి బ్రతుకుతున్నాయి. డాడీ పోయే నాటికే నేను డిగ్రీ చదివి ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేసి డిప్లామా తీసుకున్నాను. డాడీ పోగానే కంపెనీ బాధ్యత నా మీద పడిన్ది.

మాకు అష్టయిశ్వర్యాలున్నా బంధు వర్గం లేరు. వాళ్ళు ఎక్కడున్నారో మమ్మీకి తెలుసు కాని చెప్పదు. తనకు నేను నాకు తను అంతే. అందుకే మా మధ్య దాపరికాలుండవు ఎందుకో మమ్మీకి నువ్వు చాలా నచ్చావ్. సహస్ర గురించి తెలిసినా అభ్యంతరం చెప్పలేదు. నాకు మొగుడు రావటం ముఖ్యం. అందుకే అభ్యంతరం చెప్పలేదనుకుంటా’’ అని నవ్వింది.

‘‘ఇందుకే అప్పుడప్పుడూ మా గురువు గారు అంటుండే వారు నీ నెత్తిమీద రెండు సుడులున్నాయి చిన బాబు, నీకిద్దరు పెళ్ళాల యోగం తప్పదనేవాడు. అదే నిజమైంది’’ అంటూ తనూ నవ్వాడు విరాట్.

‘‘ఎవరా గురువు?’’ విరాట్ కి మంచి నీళ్ళ గ్లాసు అందిస్తూ అడిగింది విశాల.

‘‘ఇంకెవరు? మా ఇంట్లో వున్న మునుసామి నాయుడు.’’

టిఫిను ముగించి నీరు తాగాడు విరాట్. తర్వాత విశాల రాత్రి జరిగింతా వివరించింది.

‘‘ఒకె ప్రస్తుతానికి ఈ టాబ్లెట్స్ రెండు వేసుకొని టీ తాగి విశ్రాంతి తీసుకో. మీకు బయటికెళ్ళి మెడిసన్ తేవాల్సుంది. నేను వెళ్ళొచ్చేస్తాను’’ అంటూ విరాట్ కి టాబ్లెట్స్ ఇచ్చి టీ గ్లాసు అందించింది.

‘‘ఏయ్ చందూ వస్తాడుగా. తను తెస్తాళ్ళే. నువ్వెందుకు వెళ్ళటం?’’ అన్నాడు విరాట్.

‘‘ఏం బాబు నేను ఖర్చు పెట్టకూడదా? నేవెళ్ళొచ్చేస్తాను. టేక్ రెస్ట్’’ అంటూ కాళీ ప్లేట్లు గ్లాసులు అన్నీ తీసుకొని కిందికెళ్ళిపోయింది విశాల. విరాట్ మరోసారి సహస్ర గదిలోకి వెళ్ళాడు. ఆమెలో చలనం లేదు. ఆలాగే పడుకునుంది. ప్రేమగా బుగ్గలు నిమిరి నుదురు ముద్దాడి కాస్సేపు అక్కడే కూచున్నాడు. తర్వాత తన గదిలో కొచ్చి ఇలా పడుకున్నాడో లేదో వెంటనే గాఢ నిద్ర లోకి జారుకున్నాడు.

కారులో బయటి కెళ్ళిన విశాల గంట లోపలే మెడిసిన్స్ తీసుకొని ఇంటికొచ్చేసింది. మేడ మీది కెళ్ళి చూస్తే విరాట్ తిరిగి నిద్రపోతూ కన్పించాడు. రాత్రంతా నిద్ర లేమితో తనకూ కళ్ళు మూతలు పడుతున్నాయి. దాంతో తన గదిలోకి పోయి పడుకుంది వెంటనే.
దీక్షను తీసుకొని చందూ తన బైక్ మీద వచ్చి చేరుకున్నాడు. గోస్వామి కాలనీకి వెళ్ళి ఇంట్లో అందరికీ జరిగింది చెప్పి పరిస్థితి వివరించాక తను స్నానం చేసి బట్టలు మార్చుకొని దీక్షను వెంట పెట్టుకొచ్చే సరికి ఈ టైమైంది. అప్పటికే సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది. వెంట ఒక ఏర్ బేగ్ లో విరాట్ సహస్రలకు దుస్తులు కూడ తీసుకొచ్చారు.

విశాల తల్లి కాంచన మాలకు దీక్షను పరిచయం చేసాడు చందూ. విరాట్ కు స్పృహ వచ్చిందని టిఫిను చేసి తిరిగి నిద్ర పోతున్నాడని కాంచనమాల వివరించాక కొంత మన స్థిమితం ఏర్పడిన్ది. ఆవిడతో చెప్పి ఇద్దరూ మేడ మీదకు వచ్చారు.

గాఢ నిద్రలో ఉంది విశాల. మూడో గదిలో విరాట్ కూడ నిద్ర పోతూ కన్పించాడు. ఇద్దరూ మధ్యలోని సహస్ర గదిలోకొచ్చారు.  అచేతనంగా పడున్న ప్రాణ స్నేహితురాలు సహస్రను చూసి దు:ఖంతో గొంతు పూడుకు పోగా పక్కనే కూచుండి పోయింది దీక్ష. ఆమెకు ధైర్యం చెప్పి తనను సహస్ర వద్దే ఉంచి విరాట్ గదిలోకెళ్ళాడు చందూ.

మామూలుగా అయితే విరాట్ ను లేపేవాడు కాదు. పరిస్థితులు విషమించాయి. చందూ మనసులో ఆందోళనగా వుంది. అందుకే విరాట్ ను తట్టి లేపాడు.

కాస్సేపటికి కళ్ళు తెరిచాడు విరాట్.

‘‘సారీరా...........ఒక ముఖ్యమైన విషయం నీతోచెప్పాలి. అందుకే లేపాను.’’ అంటూ ఒక ఛేర్ ని దగ్గరకు లాక్కుని కూచున్నాడు. అతడి ముఖంలో ఆందోళన చూడగానే ఏదో జరిగిందని గ్రహించాడు విరాట్. వెంటనే లేచి కూచుంటూ ‘‘ఏమైంది ?’’ అనడిగాడు.

‘‘చెన్నైలో ఆరంభమైన గొడవ ఇప్పుడు మధురైకి పాకి పోయింది’’ చెప్పాడు చందూ.

‘‘నువ్వేమన్నా ధర్మాకు ఫోన్ చేసి మాట్లాడావా?’’

‘‘మధురైలో గొడవలేమిటి? దేని గురించి? రెండు మూడు రోజులవుతోంది వాడితో మాటాడి. నాకు స్పృహ వచ్చింది కూడ మూడు గంటల క్రితమే. అసలేమైంది? ఎవరెవరికి గొడవలు’’

‘‘సహస్ర తండ్రి మహ దేవనాయకర్ వర్గం, త్యాగరాజన్ వర్గం తలపడ్డంతో మధురై ప్రస్తుతం అట్టుడికినట్టు ఉడికిపోతోంది. నువ్వోసారి వెంటనే టివి వార్తలు చూడ్డం మంచిది’’ అన్నాడు.

‘‘డామిట్’’ అంటూ నుదురు రుద్దుకున్నాడు విరాట్.

చందు ధర్మ ప్రస్తావన ఎందుకు తెచ్చాడో ఇప్పుడర్ధమైంది. ధర్మ చెప్పకుండా మహా దేవ నాయకర్ కి  విషయం తెలిసే అవకాశమే లేదు. బహుశ చెన్నైలో గొడవ టివిలో చూసి త్యాగరాజన్ ప్లాన్ ప్రకారం సహస్రను చంపడానికి తన కుర్రాళ్ళతో దాడి చేసుంటాడని ధర్మా పొరబాటు పడుండాలి. దాంతో మహ దేవ నాయకర్ కి జరిగిన విషయాలు చెప్పుంటాడు. లేకపోతే ప్రశాంతంగా వుండే మధురైలో ఈ రెండు వర్గాలూ తలపడే అవకాశమే లేదు.

‘‘ఎప్పుడు జరిగిందిది?’’ చందుని అడిగాడు విరాట్.

‘‘ఉదయం తొమ్మిది గంటల తర్వాతే ఆరంభమై ఉంటుంది. నేనింటికెళ్ళే సరికి టివిలో స్క్రోలింగ్ మొదలయింది. కాస్సేపటికే అక్కడి పరిస్థితి మీద ప్రత్యక్ష ప్రసారాలు ఆరంభమయ్యాయి. అది చూడగానే కదిరేషన్ తమ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నాడు. వెంటనే ఇద్దర్ని మాత్రం ఇక్కడ్నుంచి మిగిలిన వాళ్ళతో తమ వేన్ లో బయలుదేరి వెళ్ళిపోయాడు.’’|

‘‘పద నేను వెంటనే టివి చూడాలి’’ అంటూ బెడ్ దిగాడు విరాట్.  మేడ మీద విశాల గదిలోతప్ప మిగిలిన గదుల్లో టివి లేదు. ఆ గదిలో విశాల నిద్ర పోతోంది.

విరాట్ ముందుగా వెళ్ళి విశాలను నిద్ర లేపాడు.

‘‘విరాట్ ఆర్ యు ఒకే’’ కంగారుగా లేచి కూచుంటూ అడిగింది విశాల.

‘‘ఒకె డియర్ డోన్ట్ వర్రీ, కాస్సేపు టివి చూడాలి మధురైలో పరిస్థితి బాగ లేదు. దీక్ష సహస్ర గదిలోవుంది. వెళ్ళి కాస్సేపు అక్కడ కూచో’’ న్నాడు.
‘‘మధురైలో ఏమైంది?’’ తెల్లబోతూ అడిగింది.

క్లుప్తంగా విషయం చెప్పి టివి ఆన్ చేసాడు విరాట్. విశాల దీక్ష వచ్చిందనగానే అటు వెళ్ళింది. చందూ విరాట్ లు టివి ముందు కూచుని న్యూస్ చానల్ ని ఆత్రంగా చూడనారంభించారు. 

*******************************************

మధురై...!

ఆ ఉదయం ఏడు గంటలకు మహ దేవ నాయకర్ కు ఫోన్ చేసిన పదో నిముషంలో ధర్మ  బైక్ అక్కడికి చేరుకుంది. నలుగురికీ తెలీకూడదనే ఉద్దేశంతో పైన బాల్కనీలో కూచున్నాడు మహా దేవ నాయకర్. ధర్మ రాగానే పైకి రమ్మని చేయి వూపాడు.
ధర్మ లోన కొచ్చేసరికి నాయకర్ భార్య మూగంబికై ఆప్యాయంగా పలకరించింది. ఆమెతో రెండు మాటలు మాట్లాడి గబ గబా మెట్ల వెంట బాల్కనీలో కెళ్ళాడు. 

‘‘రా రా ధర్మ, ఆలా కూచో నీ కోసం ప్రయాణం ఆపాను. నాకు తెలీని విషయాలన్నావ్ అవేమిటో త్వరగా చెప్పు. ఇంతకీ మా అమ్మాయిని లవ్ చేసిన కుర్రాడు నీక్లోజ్ ఫ్రెండన్నావ్ పేరేమిటి ఎక్కడివాడు?’’ అనడిగాడు మహ దేవ నాయకర్.
‘‘అంకుల్ అతని గురించి తర్వాత చెప్తాను గాని ముందు నాకో విషయం చెప్పండి. మీ అమ్మాయి లక్ష్మీ సహస్ర రచయిత్రి సహస్రని మీకు తెలుసు గదా?’’

‘‘సందేహమా? ఆ విషయం తెలిసిందే గదా’’

‘‘మరి.................జర్నలిస్టు లహరి కూడ తనే అని మీకు తెలుసా?’’

ఈ ప్రశ్నకు బిత్తర పోయి చూసాడు మహా దేవ నాయకర్? నమ్మలేకపోయాడు.

‘‘ఏమిట్రా అబ్బాయ్ పొద్దునే జోకులేస్తున్నావ్ నేను కూడ జర్నలిస్టు లహరి ఫాన్ ని. ఆమె రాసిన ఎన్నో రాజకీయ విశ్లేషణలు వ్యాసాలు చదివిన వాడ్ని. ఏ రోజూ సహస్ర డాడీ మీరు అనుకుంటున్న లహరి నేనే అని చెప్పలేదే?’’

‘‘లహరి ఎవరో అనుకుంటున్నాం గాబట్టి ఆమె ధైర్యాన్ని సాహసాన్ని మెచ్చుకొంటున్నారు. అదే మీ అమ్మాయని తెలిస్తే మెచ్చుకోగలరా? ఆడపిల్లవు ఈ జర్నలిజం నీకెందుకు త్యాగరాజన్ లాంటి వ్యక్తితో గొడవలెందుకు. అంటూ తిట్టి ఇంట్లో కూచోబెట్టేవారు. అందుకే ఈ విషయాన్ని మీకు తెలీకుండా గోప్యంగా  ఉంచింది. ఇందులో కీలకమైన వ్యక్తి ఎ.యస్.పి ప్రకాష్. మా చేతిలో చావు దెబ్బలుతిని ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చెన్నై నుండి విరాట్ ఫోన్ చేసి నాకు చెప్పే వరకు నిజానికి ఈ విషయాలేవీ నాకూ తెలీదు. నాకు తెలిసినంత వరకు చెప్తాను వినండి’’ అంటూ ధర్మ జరిగిందంతా చెప్తుంటే అంతటి మహా దేవ నాయకర్ కూడ స్టన్నయి పోయి వింటూ కూచున్నాడు. చివరిగా....
‘‘అంకుల్ మీరు తెచ్చిన సంబంధం ఇష్టంలేక సహస్ర ఇల్లొదిలి వెళ్ళిపోయిందని ఇంతకాలం మీరనుకుంటున్నారు. ఆ రోజు నిజం గానే ఆ సంబంధం ఇష్టం లేదు. మీరు పట్టుదలగా నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేసారు. అటు చూస్తే త్యాగరాజన్ మనుషులు తనను చంపే ప్రయత్నంలో ఉన్నారు. కోర్టు మెట్లు ఎక్కనివ్వరు. ఈ రెంటి నుంచి తప్పించు కోవటం కోసమే తను వెళ్ళిపోయింది. చెన్నైలో తన స్నేహితురాలు దీక్ష ఇంట్లో ఉంటోంది.

మూడు రోజులుగా విరాట్ నాకు ఫోన్ చేయలేదు. రాత్రి చూస్తే ఇలా జరిగింది. టివిలో ఆ యిద్దరూ తప్పించుకున్నట్టు ప్రచారం చేస్తున్నా ఇంత వరకు ఇంటికి చేరనట్టు తెలిసింది. విరాట్ పక్కనుండగా సహస్ర కేమీ కాదు. ఇద్దరూ గొప్ప ఫైటర్స్. విరాట్ తన ప్రాణాలొడ్డి కాపాడుకుంటాడు. ఎట్టయప్ప పంపిన ధనగిరి మనుషులవల్ల సాధ్యం గాక పోవటంతో త్యాగరాజన్ తేనాంపేట గుండా శిఖామణికి ఆ బాధ్యతను అప్పగించి వుండాలి దాని ఫలితమే నిన్నటి మారణ హోమం.

ఇప్పుడు నేను, మా ఫ్రెండ్ పాతిక మంది ప్రత్యేక బస్సులో ఏం జరిగిందో తెలుసుకోడానికి చెన్నై వెళ్తున్నాం. ఇప్పుడు కూడ మీకు నిజం తెలీక పోతే తర్వాత తెలిసే అవకాశం ఉండదని ఇలా వచ్చాను. ఇవాళ న్యూస్ పేపర్ మీరు చూసారో లేదో ధనగిరి మనుషుల్లో గన్ షూటర్స్ విక్కీ డేవిడ్ లతో బాటు ఫైరింగ్ లో మరి కొందరు చావగా ధనగిరి తప్పించుకున్నాడని వాళ్ళ వేన్ బురద గుంటలో పడి కొందరు మరణించారని పేపర్లో వచ్చింది. మరో ముఖ్య వార్త ఏమంటే....

ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీకి ఇంకో మూడు మాసాలు గడువు కోరిన సెంట్రల్ గవర్నమెంట్ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తిరస్కరించి వెంటనే విచారణ చేపట్ట వలసిందిగా ఆదేశించింది. కొద్ది రోజుల్లోనే ఈ కేసు తిరిగి మధురై కోర్టులో విచారణ కొచ్చే అవకాశం వుంది. ఈ లోపలే ఈ కేసును చెన్నై హైకోర్టుకు బదిలీ చేయమని మధురైలో తనకు రక్షణ లేదని సహస్ర సుప్రీం కోర్టుకు అభ్యర్ధిస్తే మంచిది. చెన్నైలో ప్రశాంతంగా పనులవుతాయి కాబట్టి.

ప్రస్తుతం మీరు చెన్నైరావటం ముఖ్యం కాదు. నేను వెళ్ళాక పరిస్థితి చూసి మీకు ఫోన్ చేస్తాను. ఈ లోపల మీరోసారి త్యాగరాజన్ కి గట్టి వార్నింగ్ ఇస్తే మంచిదనుకుంటాను. సో........నేను వెళ్ళొస్తాను. అక్కడ బస్సు దగ్గర కుర్రాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తుంటారు.’’ అంటూ లేచాడు ధర్మ.

‘‘ఒకె. నీ మాటలు నమ్ముతున్నాను. నిజంగానే ఈ విషయాలేవీ ఇంత వరకు నాకు తెలీదు’’ అంటూ తనూ లేచాడు. మహ దేవ నాయకర్.
‘‘ఆ ఎ.యస్.పి ప్రకాష్ కి మూడిన్ది. వాడ్ని పట్టుకుంటే మొత్తం కథ బయటికొస్తుంది. నా కూతుర్ని బ్లాక్ మెయిల్ చేసి నా యింటికే అల్లుడయిపోవాలన్నంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది? తేల్చుకుంటా. ఇప్పుడే బయలుదేరతా. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను మర్చిపోకు’’ అంటూ హెచ్చరించాడు.

‘‘అలాగే అంకుల్ వస్తాను’’ అంటూ కదిలాడు ధర్మ.

ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery