Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

 జరిగినకథ: ఫోన్లో కృష్ణ చెప్పిన సంకేత స్థలానికి చేరుకుంటాడు అభిరాం. తనెందుకు బాధపడుతున్నాడో తెలుసుకుని ఆశ్చర్యానికిలోనవుతాడు అభిరాం. అతని బాధకు కారణం తనకు కాబోయే భార్య ప్రతిమను తను  ప్రేమిస్తున్నానని  చెప్తాడు.  ప్రతిమని వదిలేయి. బతుకుతావు. బాగుపడతావు’’ అని వార్నింగ్ ఇస్తాడు కృష్ణ. . ఈలోగా ఎవరో అభిరామ్ తలపై వెనునుంచి  ఇనుపరాడ్ తో బలంగా బాదుతారు.   ఆ తరువాత..

రెండ్రోజులుగా ప్రతిమ కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదు అభిరామ్. ఆమె దగ్గర్నుంచీ ఎన్నో మెసేజ్లు వచ్చాయి. దేనికీ రిప్లయి ఇవ్వడం లేదు. కారణం... ఒళ్లు నొప్పులు, జ్వరంతో అభిరామ్ ఆస్పత్రిపాలయ్యాడు. ఆస్పత్రిలో ఉండగా కృష్ణ అతడిని కలిసాడు.

‘‘వద్దురా అభీ! మనలాంటి మధ్యతరగతి వాళ్లకి ప్రేమలు అచ్చిరావు. నువ్విలా ఆస్పత్రిలో ఎందుకున్నావో తెలుసా? కారణం...ప్రతిమే. ఔను...డైరక్ట్ గా ఆ ప్రతిమే నిన్ను కొట్టించిందని అర్ధం కాదు. ప్రతిమతో నీ ప్రేమ నచ్చనివాళ్లు ఆమె నుంచి నిన్ను దూరం చేసేందుకు నీపై దాడి చేసారు. ముందు నన్ను ట్రాప్ చేసి...నాతో నీకు ఫోన్ చేయించి ట్యాంక్ బండ్ కు నిన్ను రప్పించి చావచితక బాదారు. ఆమె నీకు పరిచయమై కేవలం కొన్ని నెలలే అయింది. ఆమె లేకుండానే ఇన్నేళ్ల జీవితం గడిపావు. ఇకముందు గడపలేవా?’’ అడిగాడు కృష్ణ.

‘‘ఊహూ...ఒక్క క్షణం కూడా గడపలేను’’

‘‘ఏం?’

‘‘ఏమంటే...అదే ప్రేమంటే’’ అన్నాడు తన్మయంగా అభిరామ్.

‘‘ఆమెతో ప్రేమంటే...చావుతో చెలగాటమే. మృత్యువుతో ముఖాముఖే. కాలకూటవిషమున్న సర్పాన్ని కౌగిలించుకోవడమే. నీకు తెలుసే ఉంటుంది...ఆమె నేపధ్యం ఏంటో?’’

‘‘తెలుసు...ఆమె మనలాంటి వ్యక్తే. నువ్వనుకుంటున్నట్లు సంపన్నురాలు కాదు. సిటీ బస్సుల్లోనే తిరుగుతుంది. ఓ సినిమా కంపెనీలో పనిచేస్తుంటుంది. అంతే!’’

‘‘కాదేమో...ఒక్కసారి ఆమె ఎవరో అడుగు. లేడీ బాషాకున్నంత ఫ్లాష్ బ్యాక్ చెప్తుందేమో?’’ అన్నాడు కృష్ణ.

ఆ తర్వాతి రోజు`

‘‘ఐ జస్ట్ వాంట్ టు బీ క్లోజ్ టు యూ!

ఐ మిస్ యువర్ టచ్ అండ్ యువర్ కిస్!

ఐ మిస్ యువర్ ఫన్ టైమ్స్ టుగెదర్

ఐ మిస్ అవర్ స్వీట్ టాక్స్...సింప్లీ ఐ మిస్ యూ!!’’ అంటూ ప్రతిమ దగ్గర్నుంచి మెసేజ్ వచ్చింది.

ఆ సాయంత్రమే ప్రతిమని కలిసాడు అభిరామ్. తలకి కట్టు...నీరసంగా ఉన్న అతడిని చూసి ఆందోళన చెందింది ప్రతిమ.జరిగిందేమిటో చెప్పి సానుభూతి పొందాలనిపించలేదతడికి. ప్రతిమను తాను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమతోపాటు వచ్చే కష్టాలు, కన్నీళ్లను కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాడు. తననెవరో కొట్టారని...దానికి కారణం నువ్వేనని చెప్పి ఆమె మనసునొప్పించాలనుకోలేదు.

అందుకే, అందమైన అబద్దం చెప్పాడు. బైక్ మీద వేగంగా వెళ్తుంటే సడన్ గా ఓ వెహికిల్ వస్తే తప్పించబోయి కిందపడ్డానని ఇంట్రెస్టింగ్ గా ఓ స్టోరీ చెప్పుకొచ్చాడు.

‘‘అంతేనా!’’ అనుమానంగా అడిగింది ప్రతిమ.

‘‘అంతే! ఎవరైనా కొట్టారని అనుమానమా?’’

‘‘ఆ దెబ్బలవీ చూస్తుంటే ఎవరో కొట్టినట్లే ఉంది?’’

‘‘ఎవరు కొట్టి ఉంటారు?’’

‘‘అభీ! నీకెవరైనా శత్రువులున్నారా?’’

‘‘ఉన్నారు...’’

‘‘ఎవరు?’’

‘‘ప్రియమైన శత్రువు...నువ్వే’’ ఆమె కళ్లలో కళ్లు పెట్టి తమకంగా చూస్తూ అన్నాడు అభిరామ్. నవ్వింది నక్షత్రాల్లాంటి కళ్లని చికిలిస్తూ.  ప్రతిమతో ఏర్పడిన దగ్గరితనం...మాటలు, నవ్వులు, అనునిత్యం ఆమె పంపే మెసేజ్లు అన్నీ గుండె భరిణెలో దాచుకున్న అత్తరు పరిమళాలు. అవన్నీ గుర్తుకొస్తుంటే... ఓ పక్క సెల్ రింగవుతున్నా లిఫ్ట్ చేసి ‘హలో..!’ అనడానికి ధైర్యం చాలడం లేదు అభిరామ్ కి. అయినా, వదలకుండా వరుసపెట్టి కాల్ వస్తుంటే...చివరాఖరికి పిడికెట్లో గుండెపెట్టుకుని ..‘‘హలో!’’ అన్నాడు అభిరామ్.‘‘యూ స్టుపిడ్! నీ వల్లే నా కూతురు జీవితం నాశనమైంది. చివరికి ఈ లోకంలోనే లేకుండా పోయింది. నా నుంచి నా ప్రియమైన కూతుర్ని దూరం చేసిన నిన్ను వదలను. ఏడేడు లోకాల్లో దాగున్నా నిన్ను వెతికి పట్టుకుని మరీ నీ అంతు చూస్తాను....’’అది కచ్చితంగా ఫణిభూషణరావు గొంతే. ఉరుము ఉరిమినట్లు, పిడుగుపడ్డట్లు హడలెత్తిస్తోంది ఆ గొంతు. వినలేక కాల్ కట్ చేసి...ఫోన్ స్విచ్చాఫ్ చేసాడు అభిరామ్.

సెల్ ఫోన్ సంగీతంలా హాయి హాయిగా మొదలైంది ప్రతిమతో పరిచయం, స్నేహం.  ఒకరు పల్లవైతే...మరొకరు చరణం. సడన్ గా ఫోన్ చేసి ఓ ‘అపాత మధురా’న్ని అలవోకగా ఆలపించేది. వీణ తీగె కన్నా సన్ననైన కంఠధ్వని ఆమెది. ఏ దూర తీరాల్లో ఉన్నా...ఆమె నోట పల్లవిస్తున్న పాట పల్లకిలా తన మనసును మోసేది. ఆ పాట వింటూ పరవశమయ్యే తనూ ఊరికే ఉండేవాడు కాడు. పారితోషికంగా మరో పాటని పాడేవాడు.

సెల్ ఫోన్ లో అటూ ఇటూ సుశ్రావ్యంగా సాగే గాన లహరి అది. అంతేనా! అడపాదడపా అల్లరల్లరిగా పంపించుకునే రొమాంటిక్ మెసేజ్లూ అనంతానంత దూరాల్ని అతి దగ్గర చేసేవి. మనసుకి నచ్చిన సెల్ ఫోన్ కబుర్లలో ఎన్ని సుప్రభాతాలు, ఎన్ని సుషుప్తుల్ని ఖర్చు చేసారో...కట్టిన ఫోన్ బిల్లులకే తెలుసు. అసలు ఈ మిస్ తో మిస్డ్ కాల్ పరిచయం అంచెలంచెలుగా ఎదిగింది. ఆ రోజుల్ని తలచుకుంటే గుండెల్నిండా కుండెడు అమృతం తొలకరినట్లుంటుంది.

ప్రతిమే పరిచయం కాకపోతే జీవితం మరోలా ఉండేదేమో?

అప్పటికి అయిదేళ్ల కిందటి పరిచయాలు తెరలు తెరలుగా గుర్తొస్తున్నాయి అభిరామ్ కి. తల్లీ తండ్రీ విలేజ్ లో ఉంటూ వ్యవసాయపనులు చూసుకుంటుంటే...తను మాత్రం  సిటీలో హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుతుండేవాడు. అంతేకాదు...రిలీజైన ప్రతి సినిమా చూడడం..ప్రేమలో పడిన నాయికానాయకుల్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధించడం...ఎదురుగా కనిపించే ప్రతి ఆడపిల్లతో ప్రేమలో పడిపోతుండడం...వయసు చేసే ఈ తరహా తమాషాల్లో సదా  మునిగితేలుతుండేవాడతడు. 

ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ అతడిని ఉన్న చోట ఉండనిచ్చేది కాదు. మనసెరిగిన ఓ ఆడపిల్లతో అతి సన్నిహితంగా మెలగాలనీ అనుక్షణం తలచేవాడు. ‘ఆడది...। అనే మూడక్షరాల మాటున దాగున్న రహస్యాన్ని తెలుసుకోవాలననుకునేవాడు.

అలాంటి సమయంలోనే...ఒక్క మిస్డ్ కాల్ అభిరామ్ జీవితాన్నే మార్చేసింది.

ఆ రోజు ఉదయాన్నే అదే పనిగా సెల్ ఫోన్ రింగవుతుంటే బద్దకంగా లిఫ్ట్ చేసాడు అభిరామ్. నిద్రమత్తునంతా వదలకొడ్తూ స్వీట్ వాయిస్.‘‘హలో వనజా...నేను’’

‘‘ఎవరూ!’’ లేడీవాయిస్ కి ఒక్కసారి ఉలిక్కిపడుతూ అడిగాడు.

‘‘మీరెవరు...వనజ లేదా?’’ అడిగింది ఆ వాయిస్.

‘‘సారీ..రాంగ్ నంబర్’’ సమాధానం చెప్పకుండా పెట్టేసాడు అభిరామ్. అయినా, అతడి చెవుల్లో మధురిమలొలుకుతూ మారుమోగుతోంది అదే గొంతు. పొద్దున్నే పొరపాటున బాలీవుడ్ నుంచి శ్రేయా ఘోషల్ కానీ ఫోన్ చేయలేదు కదా! అనుకున్నాడు తేనలొలికే ఆ స్వరాన్ని మళ్లీమళ్లీ నెమరు వేసుకుంటూ. పేరు తెలీదు..ఊరు తెలీదు...ముఖం చూడలేదు. కేవలం స్వరపరిచయమే. ఆ కాస్త పలకరింపుకే ఇన్ని వేల పులకింతలా? మాటిమాటికీ  ఇలాంటి పలవరింతలు వెల్లువెత్తుతున్నాయంటే...ఒంటిపై ‘వయస్సునామీ’ పోటెత్తుతున్నట్లే. గుండెల్లో యవ్వనతుఫానులు వెర్రెత్తుతున్నట్లే. చిన్నిచిన్ని సంగతులకే మనసు సందడిస్తూ సౌందర్యోపనిషత్ని స్మరిస్తోందంటే తేడా ఏదో వరించివచ్చినట్టే. ఎదురయ్యే అందాల్ని కళ్ల కెమెరాతో ‘క్లిక్’మనిపించడం, మనోయవనికపై ముద్రించుకుని తనివితీరా ఆస్వాదించడంతో మొదలైన వ్యాపకం చిత్రాతిచిత్రంగా ఉంది. ఆలోచనా సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఒక్కో అలని అందుకోవాలనే ఆరాటంలో అభిరామ్ తలమునకలై ఉండగా`మళ్లీ మరోసారి సెల్ ఫోన్ సరిగమలొలికించింది.

లాస్ట్ లో ‘వన్ ఫోర్త్రీ...’! ఆ అంకెల్ని ఆంగ్లాక్షరాల్లోకి తర్జుమా చేస్తే...ఒక్కసారిగా ఒళ్లు రaల్లుమంది అభిరామ్కి.

‘‘హలో...’’అన్నాడు.

‘‘నిజంగా వనజ అక్కడ లేదాండీ?’’

‘‘సారీ...నాపేరు అభి...అభిరామ్! మీరు వెతుకుతున్న వనజెవరో ఈ నంబర్లో లేరు...’’ చెప్పాడు అభిరామ్.

‘‘అర్జంట్ గా ఆమెని కలవాలి..ఎలా?’’

‘‘మీరు నోట్ చేసుకున్న నంబర్ తప్పయి ఉంటుంది...’’

‘‘ఔను...బస్సెక్కే హడావుడిలో తను నంబర్ చెప్పింది. ఓ నంబర్కి మరో నంబర్ నోట్ చేసుకుని ఉంటాను’’

‘‘ఓ ఐడియా...’’ అన్నాడు అభిరామ్.

‘‘చెప్పండి...’’

‘‘ఫస్ట్ ఫైవ్ నంబర్లు వదిలేయండి. చివరి అయిదు నంబర్లలోనే తేడా ఉండి ఉంటుంది. ఆ నంబర్ల పై నంబర్ కింద నంబర్ మార్చి మార్చి ట్రయ్ చేయండి. అర్జంట్గా కలవాల్సిన మీ వనజ దొరకొచ్చు....’’

‘‘వర్కవుట్ అవుతుందా?’’

‘‘వైల్డ్ గెస్ సుమా! బహుశా వర్కవుట్ అవొచ్చు. ఒకసారి నాకలాగే వర్కవుటైంది. మనలో చాలామంది నంబర్లు నోట్ చేసుకోవడంలో తరచు చేసే పొరపాట్లే అవి...’’ చెప్పాడు అభి.

‘‘ఓకే...’’అందామె.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti