Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
padyam - bhavam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - *** వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

ఆముక్తమాల్యద ప్రబంధ నాయిక ఐన గోదాదేవి నాలుగు ఆశ్వాసాల తర్వాత ఐదవ ఆశ్వాసంలో మాత్రమే పాఠకుల ముందుకు  వచ్చింది. విశేషించి రాయల వర్ణనా చమత్కృతి ఔన్నత్యంలో ఆకాశాన్ని తాకింది ఈ ఆశ్వాసంలో. అందుకని కొద్దిగా వివరంగా ఈ ఆశ్వాసాన్ని పరిశీలిస్తున్నాము మనం.

ఉవిదనిద్దంపుజంఘల సవతుఁ గోరి 
కలమగర్భంబు లడఁచు లోఁ గంటకములు 
చాతురుల మించి మరి దివసక్రమమున 
నిలువ కవి బాహిరములైనఁ దలలు వంచు

జంఘలు అంటే పిక్కలు. కలమ గర్భములు అంటే 'వరి' పొట్టలు, వరి కంకులు. వరి కంకులు ఆకారంలో పిక్కల్లాగా ఉంటాయి! కానీ వారి కంకులకు చిన్ని చిన్ని ముళ్ళు ఉంటాయి. మేమూ ఆమె పిక్కల్లానే ఉన్నాముకదా, మాకేం తక్కువ అని కాబోలు ఆ  వరికంకులు ఆమె పిక్కలతో పోటీ పడడానికి, సాటి రావడానికి ప్రయత్నిస్తూ తమ దోషము ఐన ముళ్ళను దాచిపెట్టడానికి ప్రయత్నం  చేస్తున్నాయి, కానీ ఎంతకాలం అలా చేయగలవు? పూర్తిగా పొట్టలకు వచ్చిన కంకులు తమ ముళ్ళను దాయలేక, అవి బయట  పడేప్పటికి, సిగ్గుతో తలలు వంచుకుంటాయి, తమ ముళ్ళను చూసి ఆత్మన్యూనతా భావంతో. యిది అందమైన చమత్కారం ఈ పద్యంలో

ఇంతవరకూ బాగానే ఉంది, ఇందులో మరీ చమత్కారమైన విశేషం ఏమిటంటే పిక్కలమీద, చేతులమీద రోమాలుఉండడం స్త్రీలకు  అందమూ కాదు, శరీర సాముద్రికా శాస్త్రం ప్రకారం శుభ లక్షణమూ కాదు, అది ధ్వనిగా తెలియజేస్తున్నాడు రాయలు! 

ఇల గల వస్తు సంతతుల కెల్లను గచ్చిడు మత్స్వభావ పా
టలరుచి యింక వేర యొక డా లిడవచ్చునె లక్కనీట మ
మ్మలమిన దెంతముగ్ధ యిది యంచు బదాబ్జము లంగుళీముఖం
బుల నగునట్లు మించు నఖముల్మెరయన్ గొమరారునింతికిన్ 

నూతన యవ్వనప్రాంగణంలోకి అడుగుబెట్టిన బాలిక కనుక, సౌందర్యంపై శ్రద్ధ ఉండడం సహజమే. అందుచేత తన పాదాలకు రంగు, మెరుపు రావడంకోసం, పాదాలకు ఏ అనారోగ్యమూ రాకుండా ఉండడంకోసం కూడా, గోదాదేవి తన పాదాలను లక్కనీటితో  అలంకరించుకున్నది. అది గమనించాయి ఆమె పాదాలు. ప్రపంచంలో ఉన్న 'వస్తువులు అన్నిటికీ వన్నెను ఇచ్చే ఎఱ్ఱని పాదాలము మేము, మాకే వేరే లక్కనీటితో దాన్ని ఇవ్వడానికి ఈ పిచ్చి పిల్ల ప్రయత్నిస్తున్నది' అని ' లేత ఎఱ్ఱని గోళ్ళు అనే  దంతాలు కనిపించేట్లు' ఆ ఎఱ్ఱని పాదాలు నవ్వుతున్నాయి అన్నట్లు, ఎఱ్ఱని పాదాలు, లేత ఎఱ్ఱని గోళ్ళు ఉన్నాయి ఆమెకు!

లలనోపరిపదకచ్ఛప 
ములు బలిమిమెయిన్ గజప్రభూతగతి శ్రీ 
విలసనము గొనగగాదే 
కలిగెన్ గజ కచ్ఛపోగ్ర కలహంబుర్విన్ 

గజ కచ్ఛప కలహము అనే నానుడి, ఐతిహ్యం ఉన్నది ప్రపంచంలో. అంటే ఏనుగుకూ, తాబేలుకు జరిగిన యుద్ధం. గోదాదేవి మీగాళ్ళు తాబేటి ప్పల్లా ఉంటాయి. ఆమె నడక మత్త గజపు నడకలా ఉంటుంది, ఆమె ఊరువులు ఎలాగూ ఏనుగు తొండాల్లా ఉండే సంగతి  తెలిసిందే,  కనుక సహజంగానే ఆమె మీగాళ్లకు ఊరువులకు పరస్పరం అసూయ వలన కలహం కలిగింది. ఆ కలహాన్నే గచ కచ్ఛప  కలహం అని చెప్పుకుంటున్నది ప్రపంచం!  

తరుణితనుకాంతియెదుట నూతన హరిద్ర 
తులకురాలేక యత్యంత మలినమయ్యె
నౌటఁగా రాత్రి యన నిశ యనఁ దమిస్ర 
యన నిశీథిని యన క్షప యనఁగఁ బరఁగె  

హరిద్ర అంటే పసుపు, నూతన హరిద్ర అంటే కొత్త పసుపు, అంటే అప్పుడే పిండిగా కొట్టిన పసుపు. పసుపును తడిచేసిన తర్వాత, అది ఎండిన  తర్వాత క్రమక్రమంగా పైనుండి నల్లగా మారుతుంది. గోదాదేవి శరీర కాంతి మిసమిసలాడే పసుపు రంగులో ఉంటుంది. ఆ శరీర కాంతితో పోటీ పడి  సాటి రాలేక, కొత్త పసుపు బాధతో మలినమయ్యింది, పసుపు ముఖం మ్లానమయ్యింది, ఆ నల్లని పసుపే రాత్రిగా మారింది, దాన్నే ఆ రాత్రినే  నిశ, తమిస్రము, నిశీథిని, క్షప అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు! 

(కొనసాగింపు వచ్చేవారం)   

*** వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
Pachi Mirchi Roti Pachadi: Tasty & Easy