Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

 జరిగిన కథ: అర్ధరాత్రి విశాలకు తన బావను చూడాలనిపించి, అతని గది దగ్గరికి వెళ్ళి  ఓరగా తీసి వున్న తలుపులోంచి బావను చూస్తూ అలాగే నిలబడిపోతుంది. ఈ లోగా అటు పక్కన ఏదో అలికిడి వినిపించి చూసేసరికి చీకటిలో ఏదో ఆకారం పైపులు ఎక్కుతూ కనిపిస్తుంది.. వెంటనే బావను వెళ్ళి తట్టి లేపుతుంది... ఆ తరువాత..    

అటు ఇటు రోడ్డు పక్కగా కొన్ని కార్లు పార్కు చేయబడున్నాయి. వడివడిగా ఇళంగోని సమీపించాడు ధనగిరి.

‘‘ఏమిట్రా. నువ్వు చెప్పేది నిజమేనా!’’ ఉత్సాహంగా అడిగాడు.

‘‘అవునన్నా నిద్ర పోతుంటే చంపి తల నరికి తెచ్చాను. చూడు’’ అంటూ సంచీని నమ్మకంగా ధనగిరికిచ్చాడు ఇళంగో. ధనగిరి నమ్మాడు.

సంచిలో సహస్ర శిరస్సును ముఖాన్ని చూడాలన్న కుతూహలంతో సంచి విడదీసి లోనకు చూసాడు. వీధి లైటు కాంతిలో సంచి అడుగున శిరస్సు బదులు రెండు ఇటుక రాళ్ళు కన్పించాయి. కోపంతో ముఖం ఎర్రబడగా సంచిని కిందపడేసి ఇళంగో వంక చూడబోయాడు, కాని`

అప్పటికే ఆలస్యమైపోయింది.

ఇళంగో చేతిలో ప్రత్యక్షమైన డాగర్‌ పిడి వరకు గుండెల్లో దిగబడిపోగా ‘మోసం... దగా...’ అనరిచాడు ధనగిరి. అరుస్తూనే జేబులోంచి రివాల్వర్‌ తీసి ఇళంగోని షూట్‌ చేసాడు. క్లోజ్‌ రేంజ్‌లో షూట్‌ చేయటంతో బుల్లెట్‌ ఇళంగో ఛాతినుండి వెన్నులోంచి బయటికి దూసుకుపోయింది. నేలకు ఒరిగిపోతూనే మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు ధనగిరి. అంతే అటు ధనగిరి ఇటు ఇళంగో చెరో ప్రక్క నేలకు విరుచుకుపడి ప్రాణాలు వదిలారు. రివాల్వర్‌ మోతలు వాళ్ళ చావు కేకలతో ప్రశాంతంగా వున్న ఆ ప్రాంతం ఒక్క సారిగా మారుమోగింది.

సరిగ్గా అక్కడికి వంద అడుగుల దూరంలో ఒక పక్కగా ఆగుంది విశాల కారు. ఫ్రంట్‌ సీట్లో కూచొని జరిగిందంతా చూస్తూనే ఉంది, కారు దిగలేదు. జరిగిన పరిణామానికి విరాట్‌ ఆశ్చర్యపోలేదు. కాని విశాల షాక్‌తో శిలాప్రతిమలాగయిపోయింది.

‘‘కారు స్టార్ట్‌ చేసి వెనక్కి తిప్పు, మన కారును ఎవరూ గుర్తించకముందే ఇక్కడ్నుంచి వెళ్ళి పోవాలి. క్విక్‌.’’ అంటూ విరాట్‌ హెచ్చరించటంతో షాక్‌ నుంచి బయటపడి కారు స్టార్ట్‌ చేసింది విశాల. క్షణంలో రివర్స్‌ తీసుకుని వేగంగా ఎగువకు పోనిచ్చింది. హత్య జరిగిన చంద్రా హోటల్‌ ప్రాంతానికి చుట్టు పక్కల వాళ్ళు పరుగులెత్తుకొచ్చేసరికి విశాల డ్రైవ్‌ చేస్తున్న కారు చాలా దూరం వెళ్ళిపోయింది.

‘‘బావా. ధనగిరి ఇళంగోని చంపేస్తాడని ముందే తెలుసా?’’ దారిలో అడిగింది విశాల ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.

చిన్నగా నవ్వాడు విరాట్‌.

‘‘తెలుసు. పంచతంత్రం అని మనకు నీతి కథలున్నాయి. అందులో ఒక తంత్రాన్ని ప్రయోగించాను. అది వర్కవుటయింది. మన చేతికి మట్టి అంటకుండానే ఇద్దరూ అయిపోయారు.’’ అన్నాడు.

‘‘కాని ఇళంగో... పాపం చిన్నవయసు...’’ అంది విశాల.

‘అవును, వయసు చిన్నదే కాని సహస్రను చంపాలని వచ్చాడు. పాము చిన్నదయినా పెద్దదయినా పగ బట్టిందంటే ఎప్పటికయినా ప్రమాదమే. నిర్ధాక్షిణ్యంగా చంపేయాలి.’ అన్నాడు విరాట్‌.

కారు వేగంగా ఓల్డ్‌ మాంబళం దిశగా దూసుకు పోతూనే వుంది.

***********************************

కీల్పాక్కం!

పాత భవనం.

సమయం ఉదయం ఏడు గంటలు.

మబ్బులు పట్టిన ఆకాశంలో సూర్యుడింకా తొంగి చూడ్డం లేదు. వాతావరణం చలి చలిగా ఆహ్లాదంగా వుంది.

ఆ సమయంలో హడావిడిగా మేడ మీదకొచ్చాడు ఎట్టయప్ప. మనిషి కొంచెం గాభారాగా వున్నాడు. వాడు వచ్చే సరికి ఆరు బయట డంబుల్స్‌తో వ్యాయామం చేస్తున్నాడు త్యాగరాజన్‌ వంటి మీద పైజామా మాత్రం వుంది. షర్టు లేదు. విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన దండాలు. చేస్తున్న వ్యాయామానికి శరీరం చెమటలతో తడిసింది.

ఎట్టయప్పను చూసి డంబుల్స్‌ కింద పెట్టాడు త్యాగరాజన్‌. తాడు పైనుంచి టవల్‌ అందుకొని చమటలు తుడుచుకొంటూ ముందు కొచ్చాడు. ‘ఏంట్రా ఏదో షాక్‌లో వున్నట్టున్నావ్‌. పీడకల ఏదన్నా వచ్చిందా? ఏమైంది?’ అనడిగాడు సీరియస్‌గా.

‘‘ఇప్పుడే టివి వార్తలు చూసొస్తున్నాను సర్‌. ఘోరం జరిగింది. ధనగిరి రాత్రి చనిపోయాడు’’ వచ్చిన విషయాన్ని బాధగా చెప్పాడు ఎట్టయప్ప.

నమ్మలేనట్టు చూస్తూ టవల్‌ భుజంమీద వేసుకున్నాడు జగన్మోహన్‌.

‘‘నిజమా... వాడు చనిపోవటం ఏమిట్రా? ఎలా జరిగింది?’’ అంటూ అడిగాడు.

‘‘వాడే కాదు. ఇళంగో కూడా చనిపోయాడు. చంద్రా లాడ్జి బయట రాత్రి ఎప్పుడో రోడ్డు పక్కన గొడవ పడినట్టున్నారు. ఇళంగో డాగర్‌తో పొడవగా ధనగిరి రివాల్వర్‌తో షూట్‌ చేసాడు. అలా ఒకరినొకరు చంపుకున్నారు. టివిలో సంఘటనా స్థలాన్ని శవాల్ని చూపిస్తున్నారు. అరుపులు విని లాడ్జి సెంట్రీ అక్కడికొచ్చేసరికే వాళ్ళిద్దరూ చనిపోయారట. ఆ సమయంలో అక్కడికి కొంత దూరంలో ఒక కారు బయలుదేరి వెళ్ళిపోడం సెంట్రీ చూసాట్ట. కాని నంబరు తెలీదు. ఆ కారుకి ఈ హత్యలకి ఏదన్నా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారట’’ అంటూ టివిలో విన్న విషయాలు చెప్పాడు ఎట్టయప్ప.

ఆ విశేషాలు విని త్యాగరాజన్‌ ఏ మాత్రం ఆశ్చర్య పడలేదు. చిన్నగా నవ్వి... ‘‘పోలీసుల అనుమామాలన్ని నిజం కావురా. ఏదో టైంలో ఏదో కారు బయలు దేరి పోతూనే ఉంటుంది. బట్టతలకి బొటన వేలికి ముడి వేస్తానంటే ఎక్కడో కార్లో వున్నవాళ్ళేం చేస్తారు? ఇంతకీ ధనగిరి మనుషులెంతమంది మిగిలారు. వాళ్ళేమయ్యారు?’’ అనడిగాడు.

‘‘ఇద్దరు వేరే గదిలో నిద్ర పోతున్నారట సర్‌. హత్యల గురించి తెలీగానే వాళ్ళద్దరూ పోలీసులకు బయపడి తెల్లవారక ముందే గది వదిలి పారిపోయారట. వాళ్ళ గురించి కూడా పోలీసులు గాలిస్తున్నారట. ఈ రోజు టివి ఆన్‌ చేయగానే స్పెషల్‌ న్యూస్‌ యిదే’’ అన్నాడు ఎట్టయప్ప.‘‘కాని ఇది మనకు ఏమాత్రం ఉపయోగ పడే న్యూస్‌ కాదు. అవునా?’’ అనడిగాడు త్యాగరాజన్‌.అవునన్నట్టు తలూపాడు ఎట్టయప్ప.

‘‘సో... మనం ఎలాగూ ధనగిరిని వదులుకున్నాం. వేస్ట్‌ ఫెలోస్‌ ఛస్తే ఏంటి బతికితే ఏంటి! మర్చిపో. వాళ్ళ గురించి మర్చిపో. హర్యానా షూటర్స్‌ ఎల్లుండి ఉదయం దిగుతున్నారు. నీకు లోకల్‌ మనుషుల్ని వేరే ఏర్పాటు చేయటానికి కాస్సేపట్లో మనిషి వస్తాడు. మీరు తొందరగా రెడీ అయితే వాడి వెంట వెళ్ళి ఆ పనులు చూడొచ్చు. గెట్‌ రెడీ. వెళ్ళు’’ అన్నాడు ఆర్డర్‌ వేస్తున్నట్టు.

గంగిరెద్దులా తలూపి వెళ్ళిపోయాడు ఎట్టయప్ప. వాడు వెళ్ళగానే టవల్‌ భుజాన వేసుకొని స్నానానికి వెళ్ళి పోయాడు త్యాగరాజన్‌.

***********************************

ఉదయం ఏడు గంటల సమయం.....

మునుసామి స్నానాదికాలు ముగించి తెల్ల లుంగీ షర్టు ధరించి పూజ కూడ ముగించుకొని నుదుట విభూది పూసుకున్నాడు. హాల్లోకొచ్చే సరికి కమ్మటి కాఫీ వాసన ముక్కు పుటాల్ని తాకింది. బండ శివ కిచెన్‌లో పనులు చూస్తున్నాడు. వాడికి తోడుగా చందూ కూడా అక్కడే వున్నాడు. ఇద్దరూ కూడా వండి వార్చటంలో మాస్టర్లు. ఇక వేరే చెప్పాలా.. అర్జంటుగా కాఫీ తాగే ఉద్దేశంతో కిచెన్‌ వైపు అడుగులు సారించాడు మునుసామి. దీక్ష సహస్రకు తోడుగా విశాల ఇంట్లోనే ఉంటోంది. ఇద్దరూ షాపింగ్‌ మాల్‌ జాబ్‌కి రిజైన్‌ చేసేసారు. విరాట్‌ లాంగ్‌ లీవ్‌లో ఉన్నాడు. చందూ మాత్రం ఆఫీస్‌కి వెళ్తున్నాడంతే. దీక్ష ఇంటికి కాపలా కోసం కదిరేశన్‌ కొందరు తన మనుషులతో ఇక్కడ ఉంటున్నాడు. మిగిలిన మనుసామి మనుషులు కదిరేశన్‌ మనుషులు అంతా లాడ్జిల్లోనే ఉంటూ వచ్చిపోతున్నారు.

మునుసామి కిచెన్‌ డోర్‌లో కాఫీ కోసం అడుగు పెట్టబోతుండగా కాలింగ్‌ బెల్‌ మోగింది. పొద్దుటే ఎవరొచ్చారో అర్థం కాలేదు. విసుక్కొంటునే వెళ్ళి డోర్‌ తెరిచాడు.

తలుపు తెరిచీ తెరవగానే పెద్ద షాక్‌.

ఎదురుగా ఆరడుగుల గంభీర రూపం, వెంకట రత్నం నాయుడు గారు నిలబడున్నారు. పక్కన ఆయన ధర్మపత్ని మంగ తాయారు. ఆ వెనకే పెద్ద కొడుకు విక్రాంత్‌ పక్కన భార్య ఇద్దరు పిల్లలు మెట్లెక్కి వస్తున్నారు. పోర్టికోలో రాజ హంసలా నిలబడుంది వారు వచ్చిన బెంజ్‌ కారు. డ్రయివరు డిక్కీ లోంచి సామాన్లు దించుతున్నాడు. సకుటుంబంగా వచ్చేసాడాయన.

తను చూస్తోంది కలో నిజమో అర్థం కాలేదు మునుసామికి. కళ్ళు నులుముకొని చూసాడు. సందేహం తీరిపోయింది. ‘‘పెద్దయ్య గారు. మీరా!’’ అన్నాడు తేరుకుంటూ.

‘నేనేరా. ముందు లోనకు పద.’’ అన్నాడు గంభీరంగా వెంకట రత్నం నాయుడు.

‘‘నేనాగనుగదా. వెళ్ళి పోతున్నాను’’ అంటూ వెనక డోర్‌ వైపు పరుగెత్తాడు మునుసామి.

‘‘ఒరే ఆగరా’’ అంటూ లోనకొచ్చేసాడు వెంకట రత్నం నాయుడు.

‘‘ఆగను గాక ఆగను. ఎందుకాగాలి? ఒరే వెధవా నీకు చెప్పిందేమిటి చేసిందేమిటి? చినబాబును కాళ్ళు చేతులు కట్టి కోయంబత్తూరు తీసుకు రమ్మంటే వాడికి వత్తాసు పలుకుతూ ఉండి పోతావా.. నీ కాళ్ళు విరగ్గొడతాను. చేతులు విరిచేస్తానంటూ మీ చేత చీవాట్లు తినడానికా. నేనే తప్పు చేయలేదు. నే వెళ్ళిపోతాను’’ పెద్దగా అరుస్తూ వెనక డోర్‌ దాటి బయటికెళ్ళి పోయాడు మునుసామి.

‘‘ఆగుతావా లేదా నిజం గానే కాళ్ళు విరిచేస్తాను’’ అంటూ తనూ వెనక డోర్‌ లోంచి మునుసామిని పెద్ద పెద్ద అంగలతో తరుముకెళ్ళాడు వెంకట రత్నం నాయుడు.

ఈ లోపల నవ్వుకొంటూ మిగిలిన కుటుంబ సభ్యులంతా లోనకొచ్సేసారు. కిచెన్‌ లోంచి గొంతు విని గబగబా బయటకొచ్చిన బండ శివా ‘‘అమ్మ నమస్కారం రండి రండి.’’ అంటూ అందర్ని పలకరించాడు.

‘‘అమ్మా ఇతని పేరు చందూ అని మన చిన బాబు ఫ్రెండు. ఉసిలం పట్టి గ్రామం...’’ అంటూ చందూని పరిచయం చేస్తుంటే` ‘‘చందూ తెలీక పోడం ఏమిట్రా. ఏమయ్యా చందూ. నువ్వూ ఇక్కడే ఉంటున్నావా?’’ అంది మంగ తాయారు.

‘‘అవునమ్మా. విరాట్‌ తను పని చేసే ఆఫీస్‌ లోనే నాకూ ఉద్యోగం ఇప్పించాడు. రండి కూచోండి. పెద్దయ్య గారు మునుసామి గొడవ పడేట్టున్నారు చూసొస్తాను.’’ అంటూ చందూ బయటకి పోతుంటే ఆపిందావిడ.

‘‘నువ్వేం కంగారు పడకయ్యా. వాళ్ళ గొడవ కొత్త కాదు చూస్తుండు’’ అంది. అలా లోన పలకరింపలు జరుగుతుండగా బయట... మునుసామి ఆగనంటే ఆగనంటూ వెంకట రత్నం నాయుడ్ని ఇంటి చుట్టూ తిప్పుతున్నాడు.

‘‘ఆ కొట్టేస్తాడండీ... చిన్నప్పుడు రాళ్ళతో మామిడికాయలు కొట్టిన వయసనుకుంటున్నాడు. ఏదీ కొట్టు చూస్తాను’’ అంటూ నడక వేగం పెంచాడు మునుసామి.

‘‘ఈ బండ వెధవతో ఛస్తున్నా. ఇలా కాదు’’ అనుకుంటూ వెనక డోర్‌ లోంచి లోనకొచ్చేసి వీధి గుమ్మం దాటి అరుగు మీద కూర్చున్నాడు. అది గమనించని మునుసామి ఇంటిని చుట్టి వస్తూ దొరికిపోయాడు.

‘‘ఇదన్యాయం. దుర్మార్గం. నా వెనక రావలసిన మీరు ఇలా అడ్డ దారినొచ్చి పట్టుకోవడం నేనొప్పుకోను’’ అన్నాడు ఉడుక్కొంటూ మును సామి. ‘‘నోర్ముయ్యరా. పిచ్చి వేషాలు నువ్వూను’’ కసురుకున్నాడు వెంకట రత్నం నాయుడు.

‘‘అది కాదు పెద్దయ్య గారు....’’

‘‘చంపేస్తాను వెధవాని వెధవ మర్యాదలూ నువ్వూను. ఇక్కడుంది మనమేగా బయటి వాళ్ళేవరూ లేరుగా. మామూలుగా పిలుస్తావా రెండు తగిలించనా?’’

‘‘వద్దులేరా బాబు. నువ్వు కొట్టినా కొడతావ్‌. ఈ మయసులో మనం గొడవ పడ్డం చూసేవాళ్ళకు బాగుండదు. అయినా లేడికి లేచిందే ప్రయాణమన్నట్టు ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేయటమేనా. ఫోన్‌ చేయొచ్చుగా’’ అంటూ అరుగు మీద కూచున్నాడు. ‘‘చెప్తే ఏం చేస్తావ్‌? బ్యాండు మేళంతో స్వాగతం పలుకుతావా. ముఖం చూడు. ఓ సిగరెట్‌ ఉంటే ఇలాపడెయ్‌’’ అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ‘‘ఏరా వదిన చేత నన్ను తిట్టిస్తే గాని నీకు మనశ్శాంతి ఉండదా? నేను సిగరెట్లు మానేసాను. లేవు’’ అన్నాడు మునుసామి.

‘‘ఒరే నువ్వు సిగరెట్లు మందు మానేసానంటే చీమలు తుమ్ముతాయి గాని ఇవ్వరా’’

‘‘ఏంటీ చీమలు కూడా తుమ్ముతాయా?’’

‘‘నువ్వు చూళ్ళేదా. సరిగా చూడు తుమ్మి ముందు కాళ్ళతో మూతి తుడుచుకుంటాయి. కాదంటే మనలా చప్పుడు రాదు’’.

‘‘సర్లే నావేమీ నీలా ఏనుగుకాళ్ళు కాదుగాని సిగరెట్లు లేవు’’ అంతే.

‘‘అరే ఇమ్మంటుంటే’’ అంటూ మునుసామి జేబులోంచి లాక్కుని సిగరెట్‌ ముట్టించుకున్నాడు వెంకట రత్నం నాయుడు.

‘‘ఒరే! ఇక్కడున్న మూడు రోజులూ నాకు స్వాతంత్య్రం వచ్చినట్టే. రోజుకి రెండు సిగరెట్లు రాత్రికి ఒక పెగ్గు మందు పర్మిషన్‌ తీసుకున్నాలే’’ గుంగెల నిండా పొగ పీల్చి వదులుతూ చెప్పాడు వెంకట రత్నం నాయుడు.

‘‘అంటే.... రాత్రికి మందు పార్టీ వుందా?’’

‘‘ఉంది. మూడేళ్ళ తర్వాత చిన్నోడ్ని చూడబోతున్న ఆనందం రా. ఎవరితో చెప్పక. రాత్రికి గప్‌ చిప్‌ గా బార్‌కెళ్ళొచ్చేద్దాం.’’

ఉన్నట్టుండి లేచి పోబోయాడు మునుసామి.

భుజం పట్టి లాగి కూచోబెట్టాడు వెంకట రత్నం నాయుడు.

‘‘ఎక్కడికిరా?’’ అనడిగాడు.

‘‘ఏం లేదురా. నిజంగా నీకు సర్మిషనుందో లేదో ఓసారి వదిన్ని అడిగొస్తాను’’.

‘‘ఏంటి నా మాట మీద నమ్మకం లేదా?’’

‘‘లేదా అంటే.... లేదంతే’’

‘‘ఇప్పుడు నువ్వు నా మాట నమ్మాల్సిందే’’

‘‘అది కాదురా బాబూ’’

‘‘ష్‌. నోర్ముసుక్కూర్చో. ఇంతకీ ఈ ఇల్లెవరిది? అద్దె కొంపా?’’

‘‘ఛ ఛ మీదేరా. చినబాబు ఎప్పుడో దీన్ని కొనేసాడు.’’

‘‘వాడు లోపలున్నాడా? ఆ అమ్మాయి... సహస్ర. తనెక్కడుంది?’’

‘‘ఇద్దరూ ప్రస్తుతం ఇక్కడ లేరు. ట్రీట్‌మెంట్‌ చేస్తున్న ఆస్పత్రికి దగ్గరగా వుంటుందని ప్రస్తుతం అక్కడే ఓ ఇంట్లో ఉంటున్నారు. మీరు కోయంబత్తూరు లో అర్థరాత్రి ఎప్పుడు బయలుదేరారో. మీరు స్నానాలు చేసి కాఫీ, టిఫిన్లు ముగిస్తే అందరం విరాట్‌ వద్దకెళ్దాం. లోనకి పద’’ అంటూ లేచాడు మునుసామి. అంతే గాని పొరబాటున కూడా కాంచన మాల గురించో విశాల గురించో చిన్నమెత్తు కూడా చెప్పలేదు. వెంకట రత్నం నాయుడు సిగరెట్‌ వూది పారేసి మునుసామి వెంట లోనకు నడిచాడు. మునుసామి లోనకు రాగానే విక్రాంత్‌ పిల్లలిద్దరూ తాతయ్యా! అంటూ అతడి చంక ఎక్కేసారు. అంతా పలకరింపులు కుశల ప్రశ్నలు అయ్యాక ముందుగా కాఫీ తాగారు. వచ్చిన వాళ్ళకు విరాట్‌, చందూ గదుల్ని కేటాయించి లగేజి లోన పెట్టించాడు చందూ. వాళ్ళంతా లోనకెళ్ళగానే మునుసామి బయట కొచ్చి విరాట్‌ సెల్‌కి ఫోన్‌ చేసాడు.

‘‘చెప్పండి గురువుగారు. నేనే మీకు ఫోన్‌ చేద్దామనుకుంటున్నాను’’ అన్నాడు అటు నుంచి విరాట్‌.

‘‘దేనికి? మీ మమ్మీ డాడీ వచ్చినట్టు కలేమన్నావచ్చిందా?’’ ఉత్సాహంగా అడిగాడు మునుసామి.

‘‘అదేం కాదు. రాత్రి సహస్రకి మరో గండం గడిచింది’’ అంటూ రాత్రి జరిగిన సంఘటన క్లుప్తంగా చెప్పాడు విరాట్‌. అది విని షాకయ్యాడు మునుసామి.‘‘లాభం లేదు చిన బాబూ అక్కడ కూడా మన వాళ్ళిద్దర్ని సెంట్రీలుగా వేద్దాం లేదంటే ఇలాంటి ప్రమాదాల్ని ఫేస్‌ చేయక తప్పదు’’ అన్నాడు. ‘‘నేనూ అదే ఆలోచిస్తున్నాను...’’ ‘‘సరిసరి నేవచ్చాక ఆలోచిద్దాం గాని ఇప్పుడు ఫోన్‌ చేయటానికి కారణం వుంది. ఇంత క్రితమే మమ్మి డాడి వచ్చారు. వెంట అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు అంతా దిగి పోయారు.’’ ‘‘నిజంగానా...’’ ‘‘కొంప దీసి అబద్ధం అనుకుంటున్నావా ఏంటి చినబాబు. నిజంగానే వచ్చారు. అంతా స్నానాలకి వెళ్ళారు. కాఫీ టిఫిన్లు ఇక్కడ జరిగి పోతాయనుకో. భోజనం ఏర్పాట్లు అక్కడా? ఇక్కడా? ఆ విషయం అడుగుదామనే ఫోన్‌ చేసాను.’’

‘‘భోజనాలకు ఇక్కడికొచ్చేయండి. ఆ ఏర్పాట్లు విశాల చూసుకుంటుంది. ఇంతకీ అసలు విషయం చెప్పేసావా? అత్తయ్య గురించి, విశాల గురించి...’’ ‘‘లేదు లేదు. చివరి క్షణం వరకు ఆ విషయం సస్పెన్స్‌లోనే ఉంచాలి. టిఫిన్లు తిని వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకున్నాక పన్నెండు గంటలకి అక్కడికొస్తాం’’. ‘‘అప్పటి దాకా ఎందుకు. పదకొండు ఆ ప్రాంతానికి వచ్చేయండి. మమ్మి నాకు ఫోన్‌ చేసినా అదే చెప్తాను.’’ ‘‘ఒకే చిన బాబు’’ అంటూ లైన్‌ కట్‌ చేసాడు మునుసామి.

***********************************

ఓల్డ్‌ మాంబళం`

ముదలియార్‌ స్ట్రీట్‌`

కాంచన మాల నివాసం.

ఉదయం కోయంబత్తూరు నుంచి అంతా బయలు దేరి వచ్చిన వార్త తెలీగానే అక్కడ హడావుడి మొదలైపోయింది. విందు భోజనాలకి చక చకా ఏర్పాట్లు చేయించింది విశాల.

తను ముందుగానే వాళ్ళ కంట పడకూడదన్న ఉద్దేశంతో విరాట్‌ సహస్ర వద్దే ఉండిపోయాడు. వెంకట రత్నం నాయుడు గారికి దీక్ష తెలుసు. ముందుగా తనను గుర్తు పడతారని తనూ సహస్రతోనే  ఉండి పోయింది దీక్ష. విశాల పెద్దగా ఆర్భాటం లేకుండా సింపుల్‌గా సాంప్రదాయ బద్ధంగా చక్కగా డిజైన్‌తో కూడిన చీర జాకెట్‌ ధరించి మెడలో సన్నటి బంగారు గోలుసును మాత్రం వేసుకుని బంధు వర్గం రాక కోసం ఎదురు చూస్తోంది.

హడావిడిలో బాగా నలిగి పోయింది మాత్రం తల్లి కాంచన మాల. ఓ ప్రక్కన చిర కాలం తర్వాత అన్నగారి కుటుంబాన్ని చూడబోతున్న ఆనందం, మరో పక్క తన ముఖాన్ని ఎలా చూపించాలన్న సంకోచంలో ఆవిడ ఉక్కిరి బిక్కిరవుతోంది. అంత వరకు బయట తిరిగినా, పదకొండున్నర గంటలకి వాళ్ళంతా బయలు దేరారని తెలీగానే తన గదిలోకి వెళ్ళి పోయి తలుపు దగ్గరగా మూసుకుంది.

సరిగ్గా పన్నెండు పది నిముషాలు కావస్తుండగా ముందుగా కారు గేట్లోకి తిరిగి నేరుగా పోర్టికోలో కొచ్చి ఆగింది. విశాల గబ గబా కారు వద్దకెళ్ళింది.

ఫ్రంట్‌ సీట్లోంచి ముందుగా మును సామి ఆ వెనకే వెంకట రత్నం నాయుడు కారు దిగారు. వెనక సీట్లోంచి మంగ తాయారు, కోడలు నాలుగేళ్ళ బాబు రెండేళ్ళ పాప అంతా కారు దిగారు.

‘‘నమస్తే మావయ్యా. రండి రండి’ అంటూ తనను ఆహ్వానిస్తున్న విశాలను అబ్బురంగా చూసాడు వెంకట రత్నం నాయుడు. తననే కాదు, రండి అత్తయ్యా రండి రండి!’’ అంటూ తన భార్య మంగ తాయారును, ‘‘రా అక్కా’’ అంటూ తన కోడల్ని ఎంతో తెలిసినట్టు కలివిడిగా చిరునవ్వుతో ఆహ్వానిస్తున్న అందమైన అమ్మాయి ఎవరో అర్థం గాక బుర్ర చించుకొంటున్నాడాయన. పైగా మునుసామిని చూస్తూ ` చిన మావయ్యా , పెద బావ వచ్చారన్నారు ఎక్కడా? అంటూ ఆరా తీస్తోంది.

‘‘వస్తున్నాడమ్మా వెనకే వేన్‌లో చందూ వెంట వస్తున్నాడు’’ అంటూ బదులిచ్చాడు మునుసామి. ఇక సస్పెన్స్‌ భరించ లేక మునుసామిని పక్కకి లాకి` ‘‘ఏమిట్రా యిది. ఆస్పత్రి దగ్గర్లో అంటే అద్దె కొంపనుకున్నాను. చూస్తే ఇదేదో సొంత ఇంటిలా వుంది. పైగా ఇంత అందమైన అమ్మాయి మమ్మల్ని ఆహ్వానిస్తోంది. వరసలు కలిపి పిలుస్తోంది. ఏమిటిదంతా.. సహస్ర ఈ అమ్మాయేనా?’’ అడిగాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery