Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: అభిరాంకు  ఆమె నంబర్ ను బట్టీ ఆమెకు సెల్ సర్వీసులందించే మొబైల్ కంపెనీ తెలుసు.  పర్సనల్ డిటైల్స్ తెలుసుకోవడానికి  సెల్ కాం కంపెనీకి వెళ్తాడు. కానీ అక్కడ పనిచేస్తున్న ఓ యువతి "ఒకరి పర్సనల్ డిటైల్స్ మేం బయటపెట్టము. కంపెనీ రూల్స్ కి వ్యతిరేకం"  అని చెప్తుంది.   ఆమెకు నచ్చజెప్పి, బతిమాలి ఎట్టకేలకూ పేరు కనుక్కుంటాడు.. ఆ తరువాత..   

 

ఆ ఒక్క ప్రశ్నకి ఎన్నో ఆన్సర్లిచ్చాడు అభిరామ్‌. తను కాల్‌ చేయక పోవడంతో ఎంత బాధ పడ్డాడో...నంబర్‌ పట్టుకుని డిటైల్స్‌ కోసం ఎంతలా ప్రయత్నించాడో చెప్పుకొచ్చాడు.

నవ్వింది గలగలా ప్రతిమ.

ఆ సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి అభిరామ్‌కి. ఆమె స్నేహం పెరిగి పెద్దదవడం...ఓ శుభ ముహూర్తాన ఒకర్నొకరు చూసుకోవడం...కలిసి సాయంత్రాలు ఖర్చు చేయడం...అన్నీ అన్నీ అతడి మనో ఫలకం పై ప్రగాఢ ముద్రనే వేసాయి. డిగ్రీ పాసై ఓ ప్రైవేట్‌ కంపెనీలో మంచి పొజిషన్‌లో చేరాడు తను. ఆమె కూడా తన సృజనకు పట్టం కట్టే సినిమా కంపెనీలోనే క్రియేటివ్‌ హెడ్‌గా చేరింది. అయితే, ఆమె గురించి అన్ని విషయాలూ తనకు సంపూర్ణంగా తెలీలేదనే విషయం తెలుసుకునే సరికే...తన చుట్టూ ఎన్నెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తానొటి తలిస్తే విధి ఒకటి తలుస్తుందన్నట్లు...ప్రతిమ తో జీవితం పంచుకోవాలనుకుంటే...అది జరగ లేదు సరి కదా, ప్రతిమ జీవితమే తనని అడుగడుగునా వెంటాడుతోంది.

హఠాత్తుగా తను చనిపోవడం దగ్గర్నుంచీ ఎదురైన సంఘటనల్ని తలచుకోవాలంటేనే అతడికి గుండె ధైర్యం చాలడం లేదు. ప్రతిమ చనిపోవడాన్ని జీర్ణించుకో లేక పోతున్నాడు అభిరామ్‌. అంతకు మించి...ఆమె తండ్రి నుంచి ఎదురవుతున్న టార్చర్‌నీ అస్సలు భరించలేక పోతున్నాడు.

‘‘‘మీ చుట్టూ జరిగే నేరాలు, ఘోరాల్ని బుల్లి తెరపై యధా తథంగా ఆవిష్కరిస్తూ...హత్యలు, అత్యాచారాలు, అన్యాయాలకు గురి కాకుండా ఉండేలా మిమ్మల్ని చైతన్య పరిచేందుకు  మీ ముందుకొస్తోంది ! సరి కొత్త క్రైం బులెటెన్‌....‘నిఘా! త్వరలో...త్వరలో’’ ఖంగుమనే గొంతుతో వరలక్ష్మే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చింది. ఖాకీలు, లాఠీలు, నిలువెత్తు నల్లటి కోటు ధరించిన డిటెక్టివ్‌ల నీడల్ని విచ్చలవిడిగా వాడుతూ ప్రోమో రెడీ అయింది.

‘‘ఇక, బాస్‌కి చూపించి ఓకే చేయించి ప్లే చేయడమే మిగిలింది’’ అనుకున్నాడు తేజ. ఇన్‌ పుట్‌ ఎడిటర్‌ సుధామకి కూడా ప్రోమో నచ్చింది.‘‘ఇక, ఫస్ట్‌ ఎపిసోడ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేయడమే?’’ అన్నాడు సుధామ తేజ భుజం తడుతూ.‘‘ఔను...ప్రతిమ మృతికి సంబంధించి మన దగ్గర కొన్ని ఇన్‌పుట్స్‌ ఉన్నాయి. లేటెస్ట్‌గా ఇంకొన్ని యాడ్‌ చేసి ఇంట్రెస్టింగ్‌ గా స్క్రిప్ట్‌ రాయాలి...’’ అన్నాడు తేజ.

తన క్యాబిన్‌ లోంచి సుధామ వెళ్లగానే ప్రతిమ ఆలోచనల్లో మునిగి పోయాడు తేజ.  ప్రతిమ మొదటి సారి పరిచయమైన మొదటి క్షణం దగ్గర్నుంచీ జరిగిన ప్రతి ఒక్క సన్నివేశం అతని ఆలోచనలపై ప్రభావితం చేస్తున్నాయి. సిద్దార్ధని తరచూ కలుసుకునే రోజుల్లో....ఆరు నెలల కిందట ఓ రోజు,

సిద్దార్థ ఆఫీసులో తేజ ఉండగా సడన్‌ గా ఫోన్‌ రింగైంది.

కాల్‌ అటెండ్‌ చేసాడు సిద్దార్థ. అవతల్నుంచి లేడీ వాయిస్‌ స్పష్టాస్పష్టంగా బయటకి వినిపిస్తోంది.

‘‘సిద్దార్ధ గారూ! అర్జెంట్‌ గా మీరోసారి మా ఆఫీసుకి రాగలరా?’’ అట్నుంచి రిక్వెస్ట్‌.‘‘ష్యూర్‌..తప్పకుండా. ఇంతకీ విషయమేంటో?’’‘‘కాన్ఫిడెన్షియల్‌. ఫోన్‌లో చెప్పేది కాదు. మీరొస్తే మీ సమక్షంలో అన్ని విషయాలూ వివరిస్తాను. కారు పంపించనా?’’‘‘నోనో...అక్కర్లేదు. ఈ సిటీ ఈదేందుకు నాకున్న ఈ చిన్న కారు చాలు’’

‘‘ఎంత సేపట్లో మిమ్మల్ని ఎక్స్‌పెక్ట్‌ చేయ గలను?’’

‘‘నేనుండేది లక్‌డి-కా-పూల్‌ లో...మీరుండేది ఫిల్మ్‌ నగర్‌లో. ఏ ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుంటే థర్టీ మినిట్స్‌లో మీ క్యాబిన్‌లో మీకు హలో చెప్తాను. సరేనా’’ అన్నాడు సిద్దార్ధ.

‘‘ప్లీజ్‌...! మీ కోసమే వెయిట్‌ చేస్తుంటా’’ ఆ తర్వాత కాల్‌ కట్‌ అయింది.

ఆసక్తిగా చూస్తున్న తేజాతో అన్నాడిలా...‘‘కొత్త క్లయింట్‌. ఈ మధ్యనే పరిచయమైంది. ఆ అమ్మాయి అజంతా గుహలోంచి పారిపోయిన శిల్పంలా ఉంటుంది..’’

‘‘అమ్మాయా?’’

‘‘జస్ట్‌ ట్వంటీ ఫైవ్‌. ఆంటీ అనలేం కదా!’’ నవ్వాడు సిద్దార్థ.

‘‘అలాగా...అయితే, నేనూ ఆ అజంతా సుందరిని చూడాల్సిందే’’

‘‘నువ్వూ వస్తావా?’’

‘‘నువ్వు రమ్మంటే...వస్తాను. కానీ, కాన్ఫిడెన్షియల్‌ మేటరేమో?’’

‘‘నువ్వు క్లోజ్‌ ఫ్రెండ్‌వి. నాకైతే అభ్యంతరం లేదు. కానీ, ఆ క్లయింటేమనుకుంటుందో?’’

‘‘నీ అసిస్టెంటని చెప్పు...’’ సజెషనిచ్చాడు తేజ.

‘‘ఓకే...నువ్వూరా’’ ఆహ్వానించాడు సిద్దార్థ. నిజానికి వాళ్లిద్దరి పరిచయం చాలా చిత్రంగా జరిగింది.

ఓ మర్డర్‌ కేసుని ఇంటిలిజెంట్‌గా ఇన్విస్టిగేట్‌ చేసి హంతకుల్ని పట్టుకున్న సిద్దార్థని కంగ్రాట్స్‌ చెప్పేందుకు వచ్చాడోసారి తేజ. ఎలక్ట్రానిక్‌ మీడియాలో క్రయిం రిపోర్టర్‌ గా తనని తాను ఇంట్రడ్యూస్‌ చేసుకున్నాడు.

అదే సమయంలో ఓ ఇంటర్వ్యూ కూడా అడిగాడు.

ప్రతిగా నవ్వాడు సిద్దార్థ.

ఆ తర్వాత ఆ నవ్వుకు అర్ధం చెప్తూ`‘‘నాలాంటి డిటెక్టివ్‌లు పబ్లిసిటీకి ఎంత దూరముంటే అంత మంచిది. మాదంతా అజ్ఞాతంగా చేసే పరిశోధనే. నలుగురిలో గుర్తింపు...స్టార్‌ స్టేటస్‌ వచ్చిందా? ఇక, ప్రొఫెషన్ నుంచి తప్పుకోవడమే’’ అన్నాడు.

ఇంచుమించు ఇద్దరి వయసూ ఇరవై అయిదు, ఇరవై ఆరు మధ్యే ఉండడంతో పాటు పెళ్లి పేరుతో బంధనాలు లేక పోవడం కూడా ఇద్దరికీ కలిసొచ్చిన అంశం. దాంతో యూత్‌ ఫుల్‌ ఫీలింగ్స్‌ షేర్‌ చేసుకోవడంతో చనువు పెరిగింది.

ఆ పై...చేస్తున్న ప్రొఫెషన్‌ కూడా ఇద్దరి మధ్య అందమైన స్నేహ వారధిని నిర్మించింది. వృత్తి లోని క్లిష్టతను అధిగమించేందుకు  అడపా దడపా ఒకరి సాయం ఒకరు తీసుకుంటుంటారు.

జరిగిన క్రయిం సమాచారం వెలుగు లోకి తేవడం రిపోర్టర్‌గా తేజ వృత్తి బాధ్యతైతే...ఆ ఇన్సిడెంట్‌ మిస్టరీని వెలికి తీయడం డిటెక్టివ్‌గా సిద్దార్ధ వృత్తి. జటిలమైన కేసుల్లో సలహాలు సంప్రదింపులు జరుపుకోవడం  ఆత్మీయత బలపడుతున్న కొద్దీ వారిద్దరి మధ్య ఆనవాయితీగా మారింది. సిద్దార్థ తండ్రి కూడా మంచి డిటెక్టివ్‌. ఆ వారసత్వాన్నే అంది పుచ్చుకున్నాడతడు.

‘పరిశోధన అంటే చీకట్లో నల్ల పిల్లిని వెతకడం లాంటిదే నంటుంటాడు సిద్దార్థ తేజాతో సరదాగా.

‘‘ఆ కనిపించని నల్ల పిల్లి పొడవు, బరువు, ఆకారాన్ని వర్ణించడమే మీడియా పని’’ తేజా కౌంటరిస్తుంటాడు.

‘‘ఆ అజంతా సుందరికేం ఇబ్బంది కలగదు కదా!’’

‘‘ఏ విషయంలో?’’

‘‘నా విషయంలోనే...మీ ఇద్దరి మధ్య నేనొస్తున్నాను కదా!’’ అప్పుడే ఫిల్మ్‌ నగర్‌ మలుపు తిరుగుతున్న కారును సడన్‌గా ఆపేసాడు సిద్దార్థ.కారెందుకాగిపోయిందన్నట్లు చూసాడు తేజ.

‘‘దిగు...’’అన్నాడు సిద్దార్థ..తేజ వైపున్న డోర్‌ తెరుస్తూ.

‘‘ఏం?’’

‘‘మా ఇద్దరి మధ్య నువ్వెందుకు?’’ అన్నాడు సిద్దార్థ.

‘‘సారీ...’’ చెప్పాడు తేజ.

‘‘సగం దూరం వచ్చాక ఆ డౌటెందుకు?’’

‘‘సారీ చెప్పానుగా..ప్లీజ్‌’’

‘‘నిజానికి క్లయింట్స్‌ దగ్గరికి నేనెవర్నీ తీసుకెళ్లను. కారణం..వారి గోడు చెప్పుకోడానికి ప్రైవసీ కావాలి. మూడో వ్యక్తి ఉంటే మాట్లాడేందుకు ఇబ్బంది పడతారు. విషయ సేకరణ నాక్కూడా కష్టమే. కానీ...క్రయిం రిపోర్టర్‌గా నీకు నా ప్రొషెషన్‌లోని సాధక బాధకాలు తెలుసు. ఇబ్బంది కలిగితే నీ అంతట నువ్వే తప్పుకుంటావన్న భరోసాతోనే నా తోడుగా నిన్ను తీసుకెడుతున్నాను...’’ అంటూ యాక్సిలేటర్‌ని కాలితో బలంగా నొక్కాడు సిద్దార్థ.

ఫిల్మ్‌ నగర్‌ వైపు కారు వేగంగా దూసుకుపోయింది.

అవంతిక కాంప్లెక్స్‌,

ఫిల్మ్‌ నగర్‌లో ప్రఖ్యాతి గాంచిన భవన సముదాయం. విశాలమైన ఆవరణలో నిర్మితమైన ఏడంతస్తుల భవంతి. ప్రతి అంతస్తులోనూ ఫిల్మ్‌ ఆఫీసులే కాదు...కొన్ని ఇతర కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఆ కాంప్లెక్స్‌ సెల్లార్‌లోకి సిద్దార్థ కారు ప్రవేశించింది. అలర్టయిన సెక్యూరిటీ గార్డు విజిల్‌ ఊదుతూ...కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌ వైపు డైరక్షనిచ్చాడు. ఆ ప్లేస్‌లో కారాపిన తర్వాత సిద్దార్థ, తేజ కారు దిగారు.‘‘ఎక్కడికి సార్‌?’’ సెల్యూట్‌ చేస్తూ అడిగాడు సెక్యూరిటీ గార్డ్‌.

‘‘వాగ్దేవి ప్రొడక్షన్స్‌..’’ సిద్దార్థ చెప్పగానే లిఫ్ట్‌ చూపిస్తూ`‘‘సెవంత్‌ ఫ్లోర్‌...’’ చెప్పాడతడు.

‘‘థాంక్యూ...’’ అంటూ లిఫ్ట్‌ లోకి వెళ్లారిద్దరూ. ఒక్కో ఫ్లోర్‌ ఒక్కో ప్రపంచాన్ని తలపిస్తోంది. హడావుడిగా అటూ ఇటూ కదుల్తున్న జనంతో ప్రతి ఫ్లోర్‌ సందడిగా ఉంది. ఆ కాంప్లెక్స్‌ పరిసరాల్ని చూస్తుంటే సడన్‌ గా కులీ కుతుబ్‌ షా గుర్తొచ్చాడు సిద్దార్థకి.

‘‘మేరా షహర్‌ లోగోంసే మమూర్‌కర్‌ రఖియాజా...తూ దరియామే మీర్‌, యా నమీ’’

‘‘సాగర గర్భంలో అసంఖ్యాకంగా కదలాడే చేపల వలె...నా నగరం నిండా జనం సంచరించేలా వరమివ్వు తండ్రీ’’ అని కులీ కుతుబ్‌ షా అల్లాను ప్రార్ధించాడట. ఆ ప్రార్ధన ఫలితమేమో...జంట నగరాల్లో ఏ కూడలి చూసినా జనం...జనం...ప్రభంజనం. అవంతిక కాంప్లెక్స్‌లో కూడా అదే దృశ్యం ఆవిష్కృతమవుతోంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika