Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ: అందరూ కలిసి భూషణ్ అంకుల్ వాళ్ళింటికి డిన్నర్ కి వెళ్తారు. పార్టీ హాలంతా అతిధులతో నిండిపోతుంది.  భూషణ్ అంకుల్, నీరూ ఆంటీ వచ్చి  అందర్నీ పలకరిస్తారు.   కళ్ళు జిగేల్ మనే లాంటి మెరిసిపోయే  వైట్  పరికిణీ వోణి ,  అలాగే జ్యువలరీ కూడా చక్కగా అలంకరించుకుని వస్తుంది రాణి. భూషణ్ అంకుల్ పార్టీలో చంద్రకళని పొగుడుతూ “చైల్డ్ ప్రాడజీ” గా ఎన్నో పత్రికలు ప్రశంసించాయని ఆశీర్వదిస్తూ చంద్రకళని వచ్చి ఈ ‘అభినందన’ కేక్ కట్ చేయమని కోరుతాడు. భూషణ్ అంకుల్ తన గురించి చేసిన అనౌన్స్ మెంట్ కి,  జరుగుతున్న  విషయానికి, చంద్రకళ ఆశ్ఛర్యానికి లోనవుతుంది.   ఆ తరువాత...   

 

“వినోద్ బాబు, చంద్రా ఇటు వినండి.  రేపు పొద్దున్నే నాన్న ఫ్లైట్. నాన్న వెళ్ళేప్పుడు మీరు ఏడుపు ముఖాలతో ఉండకూడదు....ఎయిర్ పోర్టులో కూడా నవ్వుతూ ‘బై’ చెప్పాలి,” అంది అమ్మ డిన్నర్ దగ్గర.

“అవును, రేపు నాకు సెండ్-ఆఫ్  ఇవ్వడానికి, మా కర్నల్ నాగ రత్నం ఫామిలీ, మరి కొందరు ఆఫీసర్స్ వస్తారు.  వాళ్ళ ముందు ఏడుస్తూ కాకుండా డిగ్నిఫైడ్ గా ఉండాలి మీరు,” నవ్వారు నాన్న.

డిన్నరయ్యాక, అర్ధరాత్రి  వరకు నాన్నతో కబుర్లు చెబుతూ గడిపాము.... తను సెటప్ చేయబోయే రైఫెల్ షూటింగ్ క్యాంప్, ట్రైనింగ్ గురించి కొంత వివరించారు.

**

నాన్న భూటాన్ చేరి, క్వార్టర్స్ లో  సెటిల్ అయ్యారని తెలిసాక, అమ్మ కాస్త రిలాక్స్ అయింది.  సాయంత్రమయ్యాక,  మైలాపూర్ లోని అమ్మవారి ఆలయానికి వెళ్ళాము.

అర్చన చేయించి, తిరిగి వస్తూ దారిలో భూషణ్ అంకుల్ వాళ్ళింటి వద్ద ఆగాము.

గేటులో నుండి లోనికి వెళుతుంటే, సిట్-అవుట్  లో రాణి,  కనబడింది.  ఆమెకెదురుగా చేతిలో కాఫీ కప్పుతో, కూర్చునున్న ఒకతినితో, నవ్వుతూ మాట్లాడుతుంది.

మమ్మల్ని చూసి, లేచి ఎదురొచ్చింది.  “లోపలికి రండి” అంటూ తనతో మాట్లాడుతున్న వ్యక్తిని, యాక్టర్ - మహేందర్ సూరి కొడుకు – రంజిత్ సూరిగా పరిచయం చేసింది.

“పదండి ఆంటీ, లోపల కూర్చోండి,” అంది మా చేతుల్లోని ప్లాస్టిక్ బాగ్స్ వంక చూస్తూ.

“రేపటి నుండి స్కూల్స్ కదా!  గుడికెళ్ళి వస్తున్నాము.... ఇదిగోమ్మా మీక్కూడా ...ప్రసాదం, లోపల పెట్టు,” తన చేతిలోని ఒక బ్యాగ్ అందించింది అమ్మ....

“థాంక్స్ ఆంటీ,  అమ్మని పిలుస్తాను,” అంటూ వెళ్ళిన రాణి  వెనుకే నడిచి,  సిటింగ్ రూములో కూర్చున్నాము.

“వినోద్ కొత్త బుక్స్ కి కవర్స్ వేసి,  లేబిల్స్ రాస్తానని ప్రామిస్ చేసానమ్మా. త్వరగా వెళ్ళిపోదాం.  ఐనా ఆంటీతో  ఫోనులో మాట్లాడచ్చుగా,” అంటుండగానే ఆంటీ వచ్చింది......

“శారద,  సత్యగారు  క్షేమంగా భూటాన్ చేరారుగా!” అంది మా ఎదురుగా కూర్చుంటూ.  అంబుజని పిలిచి, అమ్మకి  తనకి  కాఫీ, నాకు జ్యూస్, తెమ్మని చెప్పిందామె.

ఇంతలో, డ్రెస్ మార్చి కిందకొచ్చిన రాణి, “మామ్ నేను రంజిత్ తో క్లబ్ కు వెళుతున్నా.  పది సార్లు కాల్ చేయకు. నేను వచ్చే టైంకే వస్తాను.  బై,” అంటూ దూసుకు వెళ్ళింది.

“చూడమ్మా రాణీ,” వాళ్ళమ్మ పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయింది రాణి..

అంబుజ తెచ్చిన  ట్రే నుండి, కాఫీ అందుకుంటూ, “ఇదేమో మాట వినదు, భూషణ్ గారు నన్ను కోప్పడతారు, ఎలాగో ఏంటో,” తనలో తను అనుకున్నట్టంది నీరూ ఆంటీ.

మరో నిముషానికే, హడావిడిగా అంకుల్ బయట నుండి వచ్చారు.  వస్తూనే, చేతిలోని బ్రీఫ్-కేస్ నేల మీదకి విసిరారు.  చాలా అప్సెట్ గా ఉన్నారు.

“ఆ క్రిమినల్ రంజిత్ గాడితో ఎక్కడికి వెళుతుంది రాణి? నువ్వు ఏమనలేదా నీరూ? ఆపలేక పోయావా?” అన్నాక, మేమున్నామని గ్రహించి, క్షణం సేపు మౌనం వహించారు. వచ్చి మా ఎదురుగా సోఫాలో కూర్చున్నారు.  ఆంటీ అందించిన వాటర్ సిప్ చేసి, తలెత్తి, మా వంక చూసారు.

“సారీ శారద గారు... ఆ రంజిత్ గాడు చాలా రెక్లెస్ ఫెలో అని అందరికీ తెలుసు.  ఎంత చెప్పినా, రాణి అర్ధం చేసుకోదు,” అంటూ తల పట్టుకున్నారు అంకుల్...

“పర్వాలేదు, మీరు కానివ్వండి.  మేము మళ్ళీ వస్తాము,”  అంటూ నేను, అమ్మ అక్కడినుండి బయట పడ్డాము.

**

స్కూల్ రి-వోపెన్ అయిన రెండో రోజున, ఇంటికి వస్తూనే, వంట చేయిస్తున్న అమ్మకి, స్కూల్ కబుర్లు చెప్పసాగాను.......

హైస్కూల్  క్లాసెస్ కొత్త బిల్డింగ్ లో ఏర్పాటు చేసారని, ఫెసిలిటీ చాలా బాగుందని,  వచ్చిన  కొత్త  టీచర్స్ అందరినీ కూడా మేమింకా కలవలేదన్నాను.

నా కబుర్లు వింటూ, వేయించిన బొరుగులు బౌల్లో వేసి నాకందించింది అమ్మ.

“సెకెండ్ డే ఆఫ్ స్కూల్ కదా!.... పెద్దగా హోం వర్క్ కూడా లేదు,” అంటూ హాల్లోకి  వచ్చి, టి.వి చూస్తూ కూర్చున్నాను.

డోర్-బెల్ మోగితే,  తలుపు తీసాను. అంబుజ లోనికొచ్చింది. చాలా నీరసంగా హాల్లో వరకు కాలీడ్చుకుంటూ  వచ్చి  గోడకానుకుని  కింద కూర్చుంది.  పాదానికి  కట్టు  వేసుంది.

“కాలుకేమయింది అంబుజా?” అడిగాను.

“ఏం చెప్పను తల్లీ? నడవలేకుండా ఉన్నా,”  అని అంబుజ అంటుండగానే, అమ్మ హాల్లోకి  వచ్చింది.

కాలు చాపుకొని కూర్చున్న ఆమెని చూసి, “ఏమయింది, అంత కట్టు వేసావు?” అడుగుతూ,

కాబినెట్  నుండి లెక్క పుస్తకం అందుకుని సోఫాలో కూర్చుంది అమ్మ.

”ఏం చెప్పనమ్మా?  దెబ్బ తగిలినప్పుడు చూడకపోతివి నా బాధ.  మూడు రోజుల పాటు పనిలోకి కూడా పోలేదుగా,” అంది. “అదే,

ఏమయిందని అడుగుతున్నా,” అంది అమ్మ.

“ఏం చెప్పమంటావు? చెపితే నీకు, నాకు కూడా ఇబ్బందే.  ఏమీ లేదులే తల్లీ,”  క్షణమాగింది. “లెక్క చూసి జీతం ఇప్పించడమ్మా. జ్వరం వచ్చినట్టుగా ఉంది.  ఇంటికి పోతా,”  అంది అంబుజ పాదం మీదున్న కట్టుపై చేత్తో రాస్తూ.

“చంద్రా,  వినోద్ లేచాడేమో చూడు, స్కూల్ నుండి వచ్చాక, కొత్తగా పడుకుండిపోతున్నాడు” అంది అమ్మ, నన్ను అవతలికి వెళ్ళమన్నట్టు.

“వంకర మాటలు కాకుండా తిన్నగా చెప్పు.  నీ కట్టుకి కారణం ఏమిటంటే, నాకు ఇబ్బందంటావే?” అంది అమ్మ కటువుగా.ఒక్క క్షణం ఊర్కుంది అంబుజ.

పక్కకెళ్ళినా, నాకు  అంతా వినబడుతూనే వుంది.  పొర లాంటి కర్టన్ లోంచి కనబడుతూనే వుంది.

“కోప్పడమాకమ్మ, నాకు  బతుకునిచ్చిన  అయ్యగారు  భూషణ్ బాబు.  ఆళ్ళ  విషయాలు  ఈడ  నీకు  చెప్పాలంటే  కష్టం కాదా? అంది.“సరేలేవే,  మాకు సంబంధం  లేని  విషయాలు  చెప్పద్దులే,” అంటూ “ఇదో నీ అడ్వాన్స్ పోగా, నీ ఇద్దరి పిల్లల జీతం,”  అంటూ అంబుజకి డబ్బిచ్చింది అమ్మ.

అమ్మకి దగ్గరగా జరిగి, డబ్బందుకుని నడుముకున్న సంచీలో కట్టింది అంబుజ.

“నా నోట్లో గింజ నానదుగా శారదమ్మా! మీకు సంబంధం ఉన్న విషయమే తల్లీ, అందుకే అట్టాగన్నా,” అంది అంబుజ.

అమ్మతో పాటు, నేనూ వింటున్నాను.

“మొన్న  బాబు గారింట  సంబరాలయిన  తెల్లారి, నేను ఎప్పటిలా  చీకటితో ఆరింటికి  పనికెళ్ళానా?  వంటింటి  తలుపు గుండా  లోనికెళ్ళి  పొయ్యి కాడ శుభ్రం చేసుకున్నా.

రోజూలా  ఫ్రిజ్  నుండి  కూరలవీ  తెచ్చుకోడానికి,  వంటింట్లో  నుంచి  భోజనాల గదిలోకి   అడుగేసాను.  లైట్ స్విచ్ వరకు వెళ్ళేలోగానే,  కసక్కున  కత్తుల్లా  పాదంలోకి  ఏదో దిగింది.  బాధతో  కేకేసేప్పటికి,  హాల్లో ఉన్న అమ్మగారు, బాబుగారు వచ్చి  గదిలో  లైట్లు వేసారు.  లైట్ల వెలుగులో చూస్తే,  రక్తమోడుతున్న నా పాదంలోకి దిగిపోయిన ఓ పెద్ద గాజు ముక్క....

గదంతా, పగిలిన కాఫీ కప్పులు, విరిగిన గాజు పెంకులు, ప్లేట్లు, సీసాలు, ఒకటి కాదు.

తెగిన నా పాదం చూసి, ఇద్దరు కంగారు పడ్డారు.  నన్ను కుర్చీ మీద కూకుండ బెట్టి, పరుగున లోని కెళ్ళి  మందుల డబ్బా తెచ్చారు అయ్యగారు.

అమ్మ నా కాలు మీద గాయానికి దూది అద్ది, గట్టిగా తడి గుడ్డ  చుట్టి, కార్లో వరకు సాయం పట్టింది... బాబు గారే నన్ను కార్లో ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

ఆయనే చెప్పారు జరిగిన ఇషయమంతా.  పార్టీ అయిన తెల్లారు జామునే, తల భారంగా ఉందని  కాఫీ  కలుపుకొని  భోజనాల బల్ల కాడ కూచున్నారట  బాబుగారు.

ఆ టైంలో రాణమ్మ  కిందకొచ్చి,  ఆయనతో  గొడవ పడ్డదంట.

తనకి  చెప్పకుండా  మన  చంద్రకళ తో  కూడా  ఆ దినం కేక్  కోయించినందుకు కోప్పడి,  తన పార్టీ  నాశనమయిందని కేకలేసిందట, ఆ రాణమ్మ. నానా రభస చేసి, గుణపాఠం నేర్పిస్తానని బాబు గారిని బెదిరిస్తూ, భోజనాల గదిలో చేతికందినవన్నీ పగల గొట్టిందంట.  అమ్మ గారొచ్చి, ఇద్దర్నీ బలవంతంగా  అక్కడినుంచి  ముందు  హాల్లోకి  తీసుకెళ్ళారంట.  రాణమ్మని అదిలించి,  మేడ మీదకి పంపినారంట. ఇగ  అప్పుడే  నేనెళ్ళినట్టున్నా.  ఇట్టా కాలు గాయం చేసుకున్నా,”  అంది అంబుజ.

ఆమె చెప్పిన విషయం  విని, నేను, అమ్మ షాక్ అయ్యాము.  ఏమనుకోవాలో తెలియక, ఆలోచనల్లో ఉండిపోయాను.

**

నాన్న  భూటాన్  నుండి రోజూ, రాత్రిపూట  ఫోన్ చేస్తారు.

అత్తయ్య వాళ్ళు కూడా తరుచుగా  మాట్లాడుతూనే ఉన్నారు.

భూషణ్ అంకుల్ ఏర్పాటు  చేసిన  టి.వి ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు, ఒక్కోటి  బాగా జరుగుతున్నాయి..

రాబోయే అకడెమిక్ ఇయర్ నుండి స్పోర్ట్స్ తగ్గించేసి, డాన్స్ మీద మరింత దృష్టి పెట్టాలని అనుకున్నాము నేను, అమ్మా కూడా.

**

మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ వారి దసరా ప్రోగ్రాం కి ఐటమ్స్ అన్నీ సెట్  చేసారు  మాస్టారు గారు.ప్రాక్టీసులు మొదలయ్యాయి.

దసరా పండుగ ఆఖరి రోజున ‘కామరాజ్ కలై ఆరంగం’ లో, సాయంత్రం ఆరు గంటలకి ప్రోగ్రాం జరగనుంది.

**

పండుగ రోజు పొద్దున్నే పూజ ముగించి ప్రసాదం, బ్రేక్ ఫాస్ట్ అయ్యేప్పటికి, భూషణ్ అంకుల్ వచ్చారు.

సాయంత్రం ఆరు గంటలకి జరగనున్న ప్రోగ్రాం వివరాలు అమ్మతో మాట్లాడి, తాము ముందుగానే ఆడిటోరియంకి వచ్చి కలుస్తామని చెప్పి వెళ్ళారు.

ప్రోగ్రాం కి నాన్న దగ్గర లేక పోవడం కష్టంగా ఉంది.....

**

మేము  గ్రీన్-రూములో ఉండగా, ఆర్గనైజర్  రావుగారు మమ్మల్ని కలిసి, ఓ సారి ‘వేదిక’ చూసి ఏదైనా మార్చాలంటే చెప్పమన్నారు. వెళ్ళి చూశాము.  ఇరు ప్రక్కల,  ఆలయ ద్వారంలా,  గుడి లోనే నాట్యం చేస్తున్నట్టు ఉండేలా ఏర్పాటు చేసారు.  అందంగా ఉంది...

“ఈ ఆడిటోరియం ఈ రోజున నిండిపోతుంది శారద మేడమ్.  మా సభ్యులే పదిహేను వందల మంది.  సభ్యులు కాని వారు కూడా వస్తారని అంచనా. మా వాళ్ళంతా  చంద్రకళ పాప నాట్యం చూడాలని ఎదురు చూస్తున్నారు. అందుకే యేడాది క్రితమే మీ ప్రోగ్రాం అడిగి, ఫిక్స్ చేసాము.  అమ్మ వారి డాన్సులే చేయమని అడిగింది కూడా దసరా పండుగకనే. మీడియా వాళ్ళ కవరేజ్  బాగా ఉంటుంది. అలాగే, ప్రోగ్రాం రీవ్యూస్ అన్ని ప్రముఖ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ పత్రికల్లో వస్తాయి మేడమ్,” అన్నారు రావు గారు.

ఆయన మాటలు వింటూ, ‘అందుకేగా, ఈ నాటి  ప్రోగ్రాంకి  ‘దేవీ స్తోత్ర మాలిక’ అని టైటిల్ పెట్టించింది అమ్మ’ అనుకున్నాను. గత ఏడాదిగా మాస్టారు ప్రత్యేకంగా నేర్పిన ఐటమ్స్ అన్నీ ‘అమ్మవారివే’  –  ‘అమ్మవారి’  ముఖంలో కనబడే లాలిత్యం, రౌద్రం, లాంటి విభిన్న భావాలని  సునాయాసంగా చూపించ గలగడం ముఖ్యమని చెబుతూ ప్రాక్టీసు చేయించింది అమ్మ.  అందు కోసం కొన్ని అమ్మవారి సినిమాల డివిడి లు కూడా చూసాను.

******

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్