Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

గ్రాడ్యుయేషన్

                                                   

అమెరికాలో గ్రాడ్యుయేషన్ సెరిమనీకి చాలా విలువ ఇస్తారు.  మా అబ్బాయి యమ్.యస్. పూర్తయ్యాక గ్రాడ్యుయేషన్ సెరిమనీకని 2008లో మొదటిసారి మేము అమెరికా వెళ్ళాము.  ఆ భారీ ఏర్పాట్లు, ఆ జనం, ఆ హంగామా అంతా చూసి కళ్ళు తిరిగాయనుకోండి.  మీ ఎవరికన్నా ఆ అవకాశం వుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి.  గ్రాడ్యుయేషన్ కి అంటే వీసా కూడా తొందరగా దొరుకుతుందంటారు.

మా అబ్బాయి డెట్రాయిట్ లోని లారెన్స్ టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్ లో యమ్.యస్. ఆటోమొబయిల్స్ పూర్తి చేశాడు.  తెలిసినవారు ఈ సమయంలో వీసా తొందరగా దొరుకుతుందంటే అప్లై చేశాము.  వచ్చింది.  వీసా వచ్చింది కదాని నేను, మావారు బయల్దేరి వెళ్ళాము.  పైగా, మా అమ్మాయి కూడా అప్పుడు అక్కడే వున్నది.

గ్రాడ్యుయేషన్ రోజు ముందు రోజు యూనివర్సిటీలో హై టీ ఇచ్చారు.  స్టూడెంట్స్ కీ, పేరెంట్స్ కీ అందరికీ.  అందరికీ ఒకే సారి పెట్టేసి నానా కంగాళీ చెయ్యలేదు.  ఆ రోజు ఒక్కో డిపార్టుమెంటుకీ ఒక్కో సమయంలో మూడు బేచెస్ గా ఇచ్చారు.  ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ తోటీ, పేరెంట్స్ తోటీ ఆ సమయం అంతా గడిపారు. ఇంజనీరింగు వాళ్ళకి సాయంకాలం 4 గం. ల నుంచీ, 6 గం. ల దాకా.  మేమెన్నడూ చూడని రకరకాల కేక్స్, డిజర్ట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్, కాఫీ ... ఎన్ని రకాలో.  ఎంత గ్రాండ్ గా ఎరేంజ్ చేశారో.

స్టూడెంట్స్ హడావిడిగా తిరుగుతూ, ప్రొఫెసర్స్ తో మాట్లాడుతూ, పేరెంట్స్ ని పరిచయం చేస్తూ, వారి జీవితాలలో మరచిపోలేని రోజుగా దానిని మలచుకున్నారు.  సరే ఫోటోల సంగతి చెప్పనే అక్కరలేదుకదా.  ప్రొఫెసర్లంతా కూడా పేరెంట్స్ తో చాలా చక్కగా మాట్లాడుతూ, వాళ్ళ పిల్లలగురించి చెబుతుంటే, తల్లిదండ్రులకి అంతకన్నా ఆనందం ఏముంటుందండీ 

మర్నాడు గ్రాడ్యుయేషన్ డే.  డెట్రాయిట్ లోని కోబో సెంటర్ లో ఏర్పాటు చేశారు కాన్వొకేషన్.  చాలా పెద్ద భవంతి.  ఈ కాన్వొకేషనేకాక వేరే రక రకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి.  వీళ్ళ కాన్వొకేషన్ ఆ భవనంలోని ఒక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు.  ఎంత పెద్దదో అది   ఆ స్టేడియం అంతా లైట్లు.  చాలా హంగామా చేశారు.  4 వేల మందికి పైనే పడతారు జనం.  మధ్యాహ్నం 1-30 నుంచీ 5-00 గం. ల దాకా జరిగింది ప్రోగ్రామ్. 

మాలాంటి గెస్ట్స్ అంతా చుట్టూ వున్న గేలరీ లో కూర్చున్నాం.   అంత పెద్ద గేలరీ నిండి పోయింది.  మ్యూజిక్ బేండ్ సంగీతాన్నందిస్తూ వుండగా,  సరిగ్గా సమయానికి,  డీన్స్ అంతా స్టేజ్ మీదకొచ్చారు.  తర్వాత గ్రాడ్యుయేట్స్ అంతా, ఒక వింగ్ తర్వాత ఇంకొక వింగ్ ని ఎనౌన్స్ చేస్తుంటే వచ్చారు.  ఆ రోజు డిగ్రీ తీసుకున్నది 648 మంది.  వాళ్ళందరి పేర్లతో బుక్ లెట్ ఇచ్చారు.  పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళని ఒక్కొక్కళ్ళనీ పిలిచి స్టేజ్ మీద డిగ్రీ ఇచ్చారు.  అక్కడివారు చదువుకి, గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఇచ్చే విలువ, అంత భారీ ఎత్తున జరిగిన ఆ సభ, ఇవ్వన్నీ చాలా సంతోషమనిపించాయి. 

ఆ రోజు అక్కడ శ్రీ శరద్ పవర్ కి హ్యూమన్ రిసోర్సెస్ లో హానరరీ డాక్టరేట్ ఇచ్చారు.

అంతకు ముందు రోజు ఒక మాల్ కి వెళ్తే అక్కడ సేల్స్ వుమన్ అడిగింది గ్రాడ్యుయేషన్ కి వచ్చారా అని.  అవును అంటే మా అబ్బాయీ నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతాడు.  నేనిప్పటినుంచీ చాలా ఎక్జయిటెడ్ గా వున్నాను, ఎంత బాగుంటుందో కదా అన్నది.  బహుశా ఇదివరకు అక్కడి పిల్లలలో చాలామంది చిన్నతనంలోనే తల్లి దండ్రులకు దూరంగా వుండి సంపాదన మొదలు పెట్టటంతో పెద్ద చదువులు చదివేవారు కాదనుకుంటాను.  ఇప్పుడు వారికీ చదువు విలువ తెలుస్తున్నది అనిపిస్తున్నది.

సభ తర్వాత అందరికీ ఒక పెద్ద హాల్ లో సాఫ్ట్ డ్రింక్, బిస్కెట్స్, కాఫీ ఇచ్చారు.  ఆ హాల్ గోడలన్నీ అద్దాలే.  వాటిలోంచి చూస్తే పక్కనే వున్న డెట్రాయిట్ రివర్, రివర్ అవతల ఒడ్డున కెనడా .. దృశ్యం చాలా అందంగా వున్నది.  కెనడా కనుచూపుమేరలో కనబడుతున్నా అక్కడికి వెళ్ళటానికి వేరే వీసా కావాలి.

పొట్ట పూజ కూడా అయ్యాక డెట్రాయిట్ నది ఒడ్డున నడిచాము.  ఎంత బాగున్నదో!   పక్క భవంతి జనరల్ మోటార్స్ వారిది.  వాళ్ళ కార్లన్నీ డిస్ప్లే లో వున్నాయి.  అన్నట్లు ఈ ప్రాంతాన్నంతా డెట్రాయిట్ డౌన్ టౌన్ అంటారు.

ఆ ప్రాంతంలో 13 పెద్ద పెద్ద బిల్డింగులున్నాయి.  ఆ 13 బిల్డింగులను కలుపుతూ ట్రామ్ తిరుగుతూ వుంటుంది.  ఈ చివరినుంచి ఆ చివరికి దాని ప్రయాణం సమయం 13 నిముషాలేనట.  పైగా ప్రతి 5, 10 నిముషాలకొక ట్రామ్ వున్నది.  అందుకని ఆ భవంతులదాకా కార్లల్లో వచ్చిన వుద్యోగస్తులందరూ వారికి దగ్గరున్న భవంతి దగ్గర కారు పార్కు చేసి ఆ భవంతుల్లో ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా ట్రామ్ లోనే వెళ్తారు.  ప్రజల పెట్రోలు, సమయం ఆదా అవటమేకాక పొల్యూషన్ కూడా వుండదు. 

ఇక్కడ టికెట్స్ బదులు టోకెన్స్ తీసుకోవాలి.  అక్కడవున్న మిషన్ లో సరిపడా డబ్బులు వేస్తే టోకెన్ వస్తుంది.  దానిని గేట్ దగ్గర వున్న స్లాట్ లో వేస్తే గేట్ కున్న అడ్డం తొలగించుకుని వెళ్ళవచ్చు.

విదేశాలలో తిరిగే మన రాజకీయ నాయకులకి ఇలాంటి ప్రజోపయోగ పధ్ధతులేమీ కనబడవనుకుంటా. 

మరిన్ని శీర్షికలు
vignahara ganapati