Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

విఘ్నహర గణపతి ( ఓఝర్ గావ్ ) - కర్రా నాగలక్ష్మి

 

మనం  యే శుభ కార్యం తలపెట్టినా విఘ్నాలు కలుగకుండా వుండాలని విఘ్నహర వినాయకుడిని పూజిస్తాము . వినాయకునికి విఘ్నహర వినాయకుడు అని పేరెందుకు వచ్చిందో తెలుసుకుందాం , దాంతో పాటు విఘ్నహర వినాయకుని స్వయంభూ కోవెల యెక్కడుందో కుడా తెలుసుకుందాం .

అష్ఠ గణపతులలొ ఐదవది గా చెప్పబడే విఘ్నహర గణపతిని గురించి తెలుసుకుందాం . 

విఘ్నహర గణపతి పూణే జిల్లాలో జున్నార్ తాలుకాలో వున్న ఓఝర్ గావ్ లో కుకడి నదీ తీరాన వుంది . పూణే నాశిక్ హైవే మీద పూణే కి సుమారు 80 కిమీ. . దూరం లో , హైవే మీద నున్న నారాయణ గావ్ నుండి 9 కిమీ.., జున్నారు టౌనుకి 8 కిమీ.. దూరంలో  కుకడి నది పైన కట్టిన యెద గావ్ ఆనకట్ట కి దగ్గరగా వుంది .  యీ కోవెల తూర్పు ముఖంగా వుంటుంది . కోవెల చుట్టూ  పెద్ద రాతి ప్రహారి గోడ వుంటుంది . ముఖద్వారం పైన డుండి విన్నాయకుని విగ్రహం , ముఖ్య ద్వారాలు ఉత్తర దక్షిణా ముఖాలు గా వుంటాయి . ప్రహారి గోడ మీద నిలబడితే శివనేరి కోట , గిరిజా గణపతి వెలసిన లైణాద్రి గుహలు కనిపిస్తాయిట . ముఖద్వారానికి ఇరువైపులా పెద్ద పెద్ద ద్వారపాలకుల విగ్రహాలు లోపలకు వెళితే రెండు పెద్ద రాతి దీప స్తంభాలు వుంటాయి . ద్వారానికి రెండువైపులా ప్రార్ధనా గదులు వుంటాయి . ఇరవై అడుగుల గదిలొ డుండిరాజ గణపతి , పదడుగుల గదిలో పాలరాతితో చెయ్యబడ్డ పెద్ద మూషికం వుంటాయి . రాతితో నిర్మింప బడ్డ గర్భగుడి , రాతి స్తంభాల సహాయంతో గోళాకారం గా నిర్మింప బడ్డ పైకప్పు . విఘ్నహర వినాయకుని విగ్రహం యిరు ప్రక్కలా ఇత్తడి సిద్ది బుద్ది విగ్రహాలతో కొలువై ఉంటాడు . అన్ని అష్ఠ గణపతి విగ్రహాలలాగే యిది కుడా స్వయంభూ గా వెలసినది . అష్ఠ గణపతులకు గల మరో పోలిక ఏమిటంటే అన్ని గణపతులు సింధూరం పూసి వుంటాయి . 

విఘ్నహర గణపతికి కళ్ల స్థానం లో జాతి పచ్చలు నుదుట , నాభి కి  వజ్రాలు పొదగ బడి వుంటాయి . గర్భ గుడి బయట పరమేశ్వరుడు నంది కొలువై వుంటారు .కోవెల వెనుక తెల్ల జిల్లేడు మొక్కలు మానులుగా పెరిగి వుంటాయి . గర్భ గుడి శిఖరంపైన బంగారు రేకు తో తాపడం చేసి వుంటుంది . 1833 లో పేష్వా బాజీ రావు --1 కి అన్నదమ్ముడు , సైన్యాధి పతి అయిన చీమాజీ అప్ప పొర్చుగీసు పై యుద్ధం లో ' వాసై , కోటను గెల్చుకొన్న విజయానికి చిహ్నం గా గర్భ గుడి శిఖరాన్ని పై బంగారు తాపడం చేయించేడు . 

యిక స్థల పురాణం తెలుసుకుందాం .

ముద్గల పురాణం , స్కంద పురాణం ప్రకారం గా  హేమావతి రాజ్యాన్ని పరిపాలించే అభినందనుడు భూలోక శాంతికై యాగం చేస్తూ వుంటాడు . యాగానికి ముందు అందరు దేవీ దేవతలను పూజించిన అభినందనుడు యింద్రుని ప్పుజించడం మరచి పోతాడు . యీ చర్యకు ఆగ్రహించిన ఇంద్రుడు " కాలుడు " ని యాగ భంగం చేసి రమ్మని పంపుతాడు . " కాలుడు " అన్ని రకములైన ఆటంకములను కలుగ జేస్తూ వుంటాడు . అందుకు అతనిని విఘ్నుడు అని పిలవడం మొదలు పెడతారు . అభినందనుడు విఘ్నేశ్వరుని కై తపస్సు నాచరించి , వినాయకుని ప్రసన్నుని చేసుకొని తన యాగమునకు కలుగుతున్న విఘ్నాలను గురించి చెప్పి , తన యాగం నిర్విఘ్నం గా సంపన్న మయేటట్లు చేయమని కోరుతాడు . వినాయకుడు విఘ్ను ని  తో యుద్ధం చేసి అతనిని ఓడించి అభినందుని యాగము  సంపన్న మయేటట్లు చేస్తాడు . ఓటమి వొప్పుకొన్న కాలునకు వినాయకుడు తన గణాలో స్థానం కల్పిస్తాడు . కాలుడు తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చేయమనగా విఘ్నహర వినాయకుడిగా అదే ప్రదేశం లో స్వయంభూ గా వుద్భవించేడు . 

యీ కోవెలలో వినాయక చవితి , వినాయక జయంతి , సోమావతి అమ్మావాస్య లలో విశేష పూజలు నిర్వహిస్తారు .           

మరిన్ని శీర్షికలు
weekly horoscope 30th october to 5th november