Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ:  జిమ్కాన క్లబ్ లో రెచ్చిపోయి ‘ప్రేమికుల రోజు’ సంబరాలు జరుపుకున్న యువతని అరెస్ట్ చేస్తారు నగర పోలీస్.  మగ, ఆడ తేడా లేకుండా మద్యం, మారక ద్రవ్యాలని  వాడుతున్నట్టు ఆచూకి దొరకడంతో, క్లబ్బుని ముట్టడిస్తారు పోలిస్ లు.   అరెస్టయిన వారిలో రాజకీయ నాయకుల వారసులు,  సినీ ప్రముఖుల ముద్దుబిడ్డలు ఉంటారు..  రంజిత్ సూరి తో పాటు,  భూషణ్ సినీ స్టూడియో అధినేత కుమార్తె – గాయని రాణీ కూడా ఉన్నారు’..... అని  ఇంగ్లీష్ లో న్యూస్ తో పాటు పదేపదే విజ్యువల్స్ కూడా వస్తుండడంతో  చంద్రకళ భరించలేకపోతుంది.  ఆ తరువాత..  

 

“నువ్వెళ్ళి త్వరగా ఇల్లు ఊడ్చేయి కామాక్షి. మేమంతా భూషణ్ గారి ఇంటికి వెళ్ళాలి,” అంది అమ్మ కామాక్షితో.


“మీరు తయారయ్యే లోగా నేను ఉప్మా తిప్పేస్తాను.  కాస్త తినేసి వెళ్ళండి.  పాపం ఎంత అల్లాడి పోతున్నారో ఆ తల్లితండ్రులు.   ఆ ‘రాణి’ అసలు పిల్లా, పిడుగా?  అమ్మాయి ప్రవర్తన అస్సలు నచ్చదు నాకు. జగదీష్ పక్కన లేకపోతే బతకలేను అన్నట్టు ఆ మాటలు, చేష్టలు,”  అందరికీ వినబడేలా తిట్టుకుంటూ లోనికెళ్ళింది కోటమ్మత్త...

**

“ఇదంతా నమ్మశక్యంగా లేదు,” సోఫాలో కూర్చుంటూ నాన్న.

“అయినా జగదీష్ ఏడి?  ఇంత గొడవగా ఉన్నా లేవలేదు...ఏమ్మా కళా, వెళ్లి తలుపు తట్టి చూడు,” అని నాన్న అంటుండగానే, తల వాకిటి నుండి ఎవరో లోనికోస్తున్న  చప్పుడయింది.

గెస్ట్ రూము వైపు వెళ్ళబోతున్న నేను, హాల్లోకి నడిచిన జగదీష్ ని చూసి ఉలిక్కిపడ్డాను.. షర్ట్ మీద రక్తపు మరకలతో, చెదిరిపోయిన జుత్తుతో, నీరస పడిపోయిన అతన్ని చూసి అందరం నిర్ఘాంత పోయాము.

గది మధ్యలోకి వచ్చిన జగదీష్, “అత్తయ్య, మామయ్యా, ఈ రక్తం మరకలు చూసి

భయపడకండి.  నాకే దెబ్బలు తగల్లేదు. పది నిముషాల్లో షవర్ చేసొచ్చి, మీకు అంతా వివరిస్తాను,” అంటూ గెస్ట్ రూము వైపు నడిచాడు.

రాణి గురించి విన్న న్యూస్ కి, జగదీష్ ఈ రకంగా ఇంటికి రావడానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది నాకు.  నాన్న ఆ మాటే బయటికి అన్నారు కూడా. 

పట్టణాల్లో  జరిగే యూత్ పార్టీలు, ఒక్కోసారి ఇలాగే వికటిస్తాయని, అత్తకి వివరించింది, అమ్మ.

**

మరి కాసేపటికి, ఆదుర్దాగా వెయిట్ చేస్తున్న మా మధ్యకు వచ్చి కూర్చున్నాడు జగదీష్. అతనికి కాఫీ కప్పు అందించి, ఎదురుగా కూర్చుంది కోటమ్మత్త. 

కొంచెంగా కాఫీ సిప్ చేసి,  కప్పు పక్కకి పెట్టేసాడు...

మా అందరి వంక చూసాడు.  క్షణం సేపు  ఊపిరి తీసుకుని,  చెప్పడం మొదలు పెట్టాడు.

రాత్రి ఒకిటిన్నరకి, భూషణ్ అంకుల్ ఫోన్ చేసారని,  జిమ్కానా  క్లబ్బులో గొడవ జరిగి, రాణి  పోలీస్ స్టేషన్ కి తరిలించబడిందని చెప్పి,తనకి సాయంగా రమ్మని కోరడంతో, అంకుల్ తో వెళ్లానన్నాడు.

ఎవ్వర్నీ డిస్టర్బ్ చేయవద్దన్న ఉద్దేశంతో, తనకిచ్చిన స్పేర్ ‘కీ’ తో డోర్ లాక్ చేసుకుని వెళ్ళానన్నాడు.

“మరి ఆ గొడవ సంగతి ఏమిటి,  రాణి ఎలా ఉంది?” అడిగారు నాన్న.

“మేము పోలీస్ స్టేషన్ కెళ్ళేప్పటికే, అరెస్ట్ అయిన ఆరుగురిని, హోం మినిస్టర్ – దొర్రాజన్ స్వయంగా తన పూచి మీద బయటకి తెచ్చారట...  రెండున్నర కంతా వాళ్ళు, అక్కడ నుండి కార్లలో వెళ్లిపోయారట....వాళ్ళల్లో రాణి, రంజిత్ ఉన్నారని మాత్రం చెప్పారు.

అంకుల్ స్వయంగా కొన్ని ఫోన్లు చేసాక, రంజిత్ సూరి, తన పార్టీని ఫార్మ్ హౌజ్ కి మూవ్ చేసాడని, తెలిసింది..  

దాంతో అంకుల్ చాలా నిస్సహాయంగా అయ్యారు.

డ్రైవర్ కి ఆ ఫార్మ్-హౌజ్ వివరాలు తెలిసినవే  అవడంతో, అర గంటలో అక్కడికి చేరుకున్నాము.  మేము లోపలికి వెళ్ళేప్పటికి, పార్టీ ఫుల్-స్వింగ్ లో ఉంది,” చెప్పడం ఆపాడు జగదీష్...

“మరి ఈ రక్తం ఏమిటి నీ షర్ట్ మీద... ఎవరు గాయపడ్డారు?” ఆదుర్దాగా అమ్మ.

“అక్కడ పార్టీ జరుగుతున్న హాల్లో, తాగుతూ  పిచ్చిగా డాన్స్ చేస్తున్న పది మంది తప్ప, రాణి కనబడలేదు. వెనుక స్విమ్మింగ్ పూల్ వద్ద కూడా జనం ఉండడంతో, అటుగా వెళ్ళాము. 

కాస్త దూరంగా,  రంజిత్ తో పాటు, రాణి, లీన, రీనా కూడా కూర్చునున్నారు. వాళ్ళందరూ డ్రింక్ చేస్తున్నట్టు గమనించాము.మేము వెనుక నుండి, వాళ్ళ దిశగా రావడం వాళ్ళు గమనించలేదు.    

దగ్గరిగా వెళ్ళేప్పటికి రంజిత్, రాణి గొడవ పడుతున్నారని అర్ధమయింది.  మాటా మాటా అనుకోడం వినబడుతుంది.

‘డామిట్, రాణి, నువ్వు నా పార్టీలకి వస్తావు, నాతో తిరుగుతావు, కాని ఎంత నచ్చజెప్పినా నాతో ఒక్క డ్రింక్ అయినా తీసుకోవు’  అని కేకలేస్తూ లేచి, ఎదురుగా టేబిల్ మీదున్న లిక్కర్ బాటిల్ ని, రంజిత్, నేలకేసి కొట్టడం,  రాణి భయంగా కుర్చీ నుండి లేచి, ఏడుస్తూ పక్కకి తొలగడం ఒక్కసారిగా జరిగింది,” చెప్పడం ఆపి, ఊపిరి తీసుకున్నాడు జగదీష్.

మేమంతా ఊపిరి కూడా తీయకుండా, అతను చెప్పేది వింటున్నాము....

మా వంక చూసి, మళ్ళీ  చెప్పడం మొదలుపెట్టాడు....

“రాణిని ఆ పరిస్థితిలో చూసి, తట్టుకోలేని అంకుల్, ఒక్క ఉదుటున వెళ్లి రంజిత్ కాలర్ పట్టుకున్నారు.  “యూ క్రిమినల్, యూ బ్లడీ ..బాస్టా...ర్డ్,  నువ్వొక చీడ పురుగివిరా,” అని వాడిని గట్టిగా తోసారు.. ఇదంతా ఊహించని రంజిత్, ఆ తోపుకి ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్లో పడ్డాడు.

క్షణాల్లో జరిగిన ఆ సంఘటన... ఆపలేక పోయాను,”, “ఏం చేయాలో తోచక, అంకుల్ వద్దకి పరిగెత్తబోతుంటే,  రాణి దగ్గరగా వచ్చి, నా చేయి పట్టుకుని ఒకటే ఏడుపు,” చెప్పడం ఆపి,నుదుటిపై పట్టిన చెమటని తుడుచుకున్నాడు జగదీష్.

అతన్ని చూస్తూ, జరిగిన సంఘటన ఎంత బాధాకరంగా ఉండుంటుందో ఊహించగలిగాను.

అతని మీద జాలిగా అనిపించింది.

క్షణమాగి, మిగతా సంఘటన వివరించ సాగాడు, జగదీష్. 

“తన కోసం వచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెబుతూ, హిస్టెరికల్ గా అయిపొయింది రాణి. 

ఆమెని పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చోబెట్టి, సముదాయించే లోగా, 

పూల్ నుండి బయటపడి, చేతిలో పగిలిన బాటిల్ తో, అంకుల్ ని అటాక్ చేసాడు రంజిత్.  ఆయన్ని కాలర్ పట్టుకుని దూరంగా ఈడ్చుకుపోయి, బెదిరించడం మొదలుపెట్టాడు వాడు. 

రాణి నుండి నా చేయి విడిపించుకొని,  అంకుల్ వద్దకి వెళ్ళే లోగానే, రంజిత్ తో పెనుగులాటలో ఆయన అరచేయి, మోచేయి కూడా బాగా గాయ పడింది. 

అతి కష్టం మీద అంకుల్ని పక్కకి తీసుకొచ్చేప్పటికి, రంజిత్ ఫ్రెండ్స్ మా చుట్టూ గుమిగూడారు.

వారి నుండి బయటపడి, ఆయన్ని, నేరుగా వాళ్ళ హాస్పిటల్ కి వెళ్లాము,”  చెప్పడం ఆపి, మా వంక చూసాడు.

“మరి ఇప్పుడేమిటి భూషణ్ పరిస్థితి? ఎలా ఉన్నాడు? మూడు రోజుల్లో మలేషియా ప్రయాణం కదా,” అని నాన్న అడిగితే,

“డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకున్నందుకు రాణిని అరస్ట్ చేయడం నిజమా? అని నేను అడిగాను...

“అంకుల్ చేతికి ఎనిమిది కుట్లు పడ్డాయి... మందులు ఇచ్చారు.  చేతి గాయం ఎల్లుండికి బెటర్ అవుతుంది. తరువాత మానేజ్ చేయాలి.  కాని, అసలా టెన్షన్ కి ఆయన ఏమవుతారో అనుకున్నాను,” జగదీష్ వాపోయాడు.... 

అంకుల్ విషయం వినడానికే ఎంతో బాధగా ఉంది... పోతే, ఇక రాణి సంగతి ఎలా ఉందో .... వినాలని జగదీష్ వంక చూసాను...

అది గ్రహించినట్టుగా తలెత్తి నా వంక సూటిగా చూసాడు.

“అదృష్టం ఏమిటంటే,... రాణి బ్లడ్ టెస్ట్ ని బట్టి... షి ఇజ్ క్లీన్... నొ డ్రగ్స్, నొ ఆల్కహాల్ ఇన్ హర్ సిస్టం. షి ఇజ్ ఇన్నోసెంట్.. తన పంతం నెగ్గలేదని అలా పిచ్చిగా ప్రవర్తిస్తుందని మనకి తెలిసిందే కదా!......  పనిలో పనిగా తన సైకాలజిస్ట్ ని కూడా కన్సల్ట్ చేసాము.  ....... ఏమైనా, షి ఇజ్ ఫైన్ నౌ. మీరు సాయంత్రం వెళ్లి ఇద్దర్నీ చూడచ్చు,” అంటూ ముగించాడు జగదీష్..

**

సాయంత్రమయ్యాక, ఫోన్ చేసి, అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాము.  ఆయన్ని చూసి, ఆయనతో మాట్లాడాక, అందరికీ కాస్త బెంగతీరింది.

నీరసంగా ఉన్నా, అంకుల్ ఓపిగ్గామాతో మాట్లాడుతున్నారు. అరచేతి నుండి రిస్ట్ వరకు లోతైన గాయమేనట.  జగదీష్ అండతో బయటపడ్డారే తప్ప, లేకుంటే, పెద్ద ప్రమాదమే జరిగుండేదన్నారు.

అంకుల్ తో మాట్లాడుతుండగా, కిందకి వచ్చింది రాణి.  జగదీష్ ని చూడగానే, అమాంతంగా వాటేసుకుని, పదే పదే థాంక్స్ చెప్పింది. 

క్లిష్ట పరిస్థితి నుండి సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూనే, “నువ్వు నాతో పార్టీకి వచ్చుంటే, అసలు ఇదంతా అయ్యేది కాదు... కాబట్టి, మాకు అలా సాయం చేయడం కూడా నీ బాధ్యతే,” నవ్వుతూ జగదీష్ చేయిపట్టి లాగి, అతన్ని తన పక్కన కూర్చోబెట్టింది.

“రాణీ, తప్పమ్మా, అలా మాట్లాడతావేంటి? ఊరుకో,”  అన్నారు అంకుల్......

పరిణతి లేని రాణి మాటలు, చేష్టలు నాకసలు రుచించలేదు... అంకుల్ మీద కూడా,

ఒక్క క్షణం అసహనంగా అనిపించింది... కానీ, రాణి మీద ఆయనకి ఎటువంటి కంట్రోల్ లేదని గుర్తొచ్చి,  వెంటనే అయన పట్ల జాలిగా అనిపించింది. 

మరి కాసేపటికి, అక్కడి నుండి బయలుదేరుతుండగా, “జగదీష్, ప్లీజ్, రేపు నీవు బ్రేక్ ఫాస్ట్ కి రావాలి.  తప్పదు,” నవ్వుతూ ఇన్వైట్ చేసింది...రాణి..

నాన్నని కూడా వచ్చి కలవమన్నారు అంకుల్.  “బ్రేక్ ఫాస్ట్ అయ్యాక,  టూర్ కి సంబంధించి, ట్రావెల్ డాక్యుమెంట్స్ ఫైల్ చేసి కొన్ని ఫోన్ కాల్స్ చేయాలి, సత్యం.  నేను, నా చేయి అవుట్ ఆఫ్ ఆర్డర్ కదా!” నవ్వారాయన.......

**

టూర్ కి కుట్టించిన కొత్త కాస్ట్యూమ్స్, ఆర్డర్ చేసి తెప్పించిన మేకప్ సామానులతో నా గదంతా చిందర వందరగా ఉంది.. 

పొద్దున్నే, మాతో పాటు కాఫీ మాత్రం తీసుకుని, నాన్నవాళ్ళు బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళాక, ప్యాకింగ్ మొదలుపెట్టాను. ముందుగా డాన్స్ కాస్ట్యూమ్స్, మేకప్ మెటీరియల్ అంతా ఓ సూట్-కేస్ లో, మిగతా బట్టలు మరో సూట్-కేస్ లో ప్యాక్ చేసేప్పటికి గంటలు పట్టింది.

ఆకలిగా అనిపించి నా రూమ్ నుండి హాల్లోకి  వచ్చాను.....

“బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అంటూ  వెళ్ళిన నాన్న, జగదీష్ లంచ్ టైం అవుతున్నా, ఇంకా రాలేదు,”  అన్నాను, సోఫాలో అమ్మ పక్కనే కూర్చుంటూ.

రాణి వాళ్ళింట ఏమి జరుగుతుందోనని, ఎన్నడూ లేనంత ఆదుర్దాగా ఉండడంతో, నాన్నకి ఫోన్ చేసాను. 

నిముషంలో వస్తున్నామన్నారు, నాన్న.

ఫోన్ పెట్టి వెను తిరిగేప్పటికి, నిజంగానే హాల్లోకి నడిచారు నాన్న, జగదీష్. లంచ్ కి తొందర లేదంటూ న్యూస్ పేపర్ అందుకుని సోఫాలో  కూర్చున్నారు నాన్న...

“మా ప్యాకింగ్ పనులు అవుతున్నాయి.  మాస్టారు గారితో మాట్లాడాను.  ప్రయాణానికి ఇంచుమించు రెడీ,” అంది పలకరింపుగా అమ్మ....

“ఇప్పుడు చెప్పండి.  బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళిన వాళ్ళు, భూషణ్ వాళ్ళింట, ఇన్ని గంటలు ఎందుకని  ఉండిపోయారు?  అడిగింది.

చేతిలోని పేపర్ మడిచి పక్కన పెట్టి, సోఫాలో వెనక్కి జరిగి కూచున్నారు నాన్న. నింపాదిగా మా ఇద్దరి వంక చూసారు.

“ఏముంది శారదా... చేతి నొప్పి వల్ల భూషణ్ ప్రస్తుతం ఏమీ చేయలేడుగా!  అందుకని ముందుగా,  ట్రావెల్ డాక్యుమెంట్స్,  ఆంధ్ర సభ వారి లెటర్స్, అన్నీ ఫైల్ చేసాము.  బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళే ముందు, జగదీష్ ని, ఒక విజ్ఞప్తి చేసాడు భూషణ్,” క్షణమాగారు నాన్న.

“ఏమిటట?” అడిగింది అమ్మ.

“అదే,రంజిత్ సూరి అని రాణి ఫ్రెండ్ ఉన్నాడుగా.  వాడి స్నేహాన్ని వదులుకోమని, ఎలాగైనా రాణికి నచ్చజెప్పమని, జగదీష్ చేతులు పట్టుకున్నాడు,”  అంటూ మౌనంగా పక్కనే ఉన్న జగదీష్ చేతిపై తట్టారు.

నేను, అమ్మ వంక చూసాను... ఆమె కుతూహలంగా వింటుంది.

“ఇక ఆ వెంటనే, మేడ మీదున్న రాణిని, కిందకి పిలిపించారు.  ఆ అమ్మాయి వచ్చాక, మరో సర్ప్రైజ్ ఇచ్చారు మన జగదీష్ కి... తమ మెడికల్ స్కూల్ యాడ్-హాక్ కమిటీలో– యూత్ అడ్వైజర్ పొజిషన్ ఆక్సెప్ట్ చెయ్యమని, జగదీష్ ని రిక్వెస్ట్ చేసారా తండ్రీ కూతుళ్ళు. 

కృతజ్ఞతతో,  గౌరవపూరితంగా, జగదీష్ కి, వారందిస్తున్న హానరరీ  పొజిషన్ అట, అసలా ఆలోచన రాణీదేనట,” క్షణమాగారు నాన్న. 

“ఇక ఆ తరువాత, పది రకాల ఐటం సో బ్రహ్మండంగా బ్రేక్ ఫాస్ట్ చేసాము.... దగ్గరుండి కొసరి, కొసరి వడ్డించారు కూడా...

అది కూడా అయ్యాక, హాల్లో మేము టూర్ విషయాలు డిస్కస్ చేస్తుంటే,  మా ఎదురుగా సిటవుట్ లో, రాణితో మాట్లాడాడు జగదీష్....

అరగంట తరువాత కూడా, వెళతానని అతను బయలుదేరిన ప్రతిసారి, చేయి పట్టి కూర్చోబెట్టేసింది  ఆ అమ్మాయి. 

మరో పావు గంట చూసి, పనుందంటూ నేనే మన వాడిని తీసుకొని, బయట పడ్డాను,”  ముగించారు నాన్న.

అందరినీ ఓ సారి పరికించి చూసి, సోఫా నుండి పైకి లేచారు.....

“ఇప్పుడాకలిగా ఉంది కదూ, జగదీష్.  పద.  భోంచేస్తూ మాట్లాడుదాములే,” అంటూ డైనింగ్ వైపు నడిచారు.

**

లంచ్ చేస్తున్నంత సేపు అందరం మౌనంగా ఉన్నాము...

నాన్న చెప్పిన విషయాలు, మనసులో మరింత గుబులు పుట్టించాయి..

జగదీష్ నా వాడేనని ఆనందంగా మనసు గంతులు వేస్తున్న సమయంలో, ఇలా రాణి మా జీవితాల్లోకి చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది......

“ఏమర్రా?  ఉలుకు పలుకు లేకుండా, అలా తినడం మీదే దృష్టి పెట్టారు?” అంటూ అందరికీ పాయసం కప్పుల్లో వేసి అందించింది కోటమ్మత్త.

నాన్నే సంభాషణ మొదలు పెట్టారు...”జగదీష్, ఇలా అంటున్నానని ఏమనుకోకు బాబు... నీవు రాణి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఆమె శ్రేయస్సు, బాధ్యత నీకు మోయలేని బరువు కావచ్చునేమో.  నీకది మంచిది కాదు,”  ఆగారు....

జగదీష్ మౌనంగా వింటున్నాడు.

“భూషణ్ పైన జాలిపడాలో, కోపగించుకోవాలో తెలీడం లేదు నాకు... కూతిర్ని కట్టుబాటులో ఉంచలేక సతమవుతున్నాడు,” మళ్ళీ నాన్న.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery