Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ:  జెస్సికా గురించి సంపూర్ణంగా తెలుసుకుంటాడు తేజా. ఆమె ఉన్న స్ట్రీట్‌ లోకి వచ్చేస్తారు ఇద్దరూ. ఈ చుట్టూ కనిపించే భవంతుల్లో తన రెసిడెన్సీ ఏదో చెప్పు అని సవాల్‌ విసిరుతాడు  సిద్దార్థ. ఆ తరువాత.. 

 

.‘‘బహుశా...ఆ కారు ఫణి భూషణ రావుకి చెందిన కారేమో?’’ ఇద్దరిలో ఓ అనుమానం. ఆ అనుమానం నిజమన్నట్లుగానే ఆ కారు జెస్సికా ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. చూడ్డానికి కరడు కట్టిన రౌడీల్లా ఉన్నారు. దురుసుగా గేటు తెరచి, దూకుడుగా ఇంట్లోకి జొరపడ్డారు. ఆ ఇంట్లో జెస్సికా ఒక్కర్తే ఉందా? వేరే వారెవరైనా తోడుగా ఉన్నారా ?  లోనికి దూసుకు వెళ్లిన ఈ ఇద్దరు రౌడీ ఫెలోస్‌ ఏం చేయ బోతున్నారు? ఈ సందేహమే ఇటు సిద్దార్థకి, అటు తేజాకి కలిగింది.

‘‘సిద్దార్థను నమ్మించడానికి అల్లిన కట్టు కథ కాస్తా నిజం కాబోతోందా? మొత్తానికి ఏదో జరగ బోతోంది’’అనుకున్నాడు తేజ. ఒకట్రెండు సార్లు కారు స్టార్ట్‌ చేసినట్లు పెద్ద బిల్డప్పే ఇచ్చాడు సిద్దార్థ. తర్వాత విసురుగా వెహికిల్‌ లోంచి దిగి బానెట్‌ తెరిచి రిపేర్‌ చేస్తున్నట్లు నటించ సాగాడు. సిద్దార్థ ఎత్తుగడను తేజ అర్ధం చేసుకున్నాడు. అయితే, తను మాత్రం బయటకు రాకుండా కార్లోనే కూర్చుని డైలీ చదువుతున్నట్లు ఫోజు కొడుతూ బిల్డింగ్‌ లోపల స్పష్టాస్పష్టంగా కదలాడుతున్న నీడల్ని గమనిస్తున్నాడు. కొద్ది క్షణాల తర్వాత ఆ ఇంట్లోంచి అరుపులు, కేకలు వినిపించసాగాయి. ఒక్క ఊదుటున సిద్దార్థ ముందుకు కదలబోయి అంతలోనే ఆగాడు.

‘‘ఏం...?’’ కళ్లతోనే ప్రశ్నించాడు తేజ.

‘‘మన జోక్యం ఇప్పుడే వద్దు. అసలు నిందితులు తప్పించుకుంటారు’’అతడికి మాత్రమే వినిపించేలా నెమ్మదిగా చెప్పాడు సిద్దార్థ.

‘‘ఔను...అదీ నిజమే! జెస్సికా ఇంటికి వచ్చింది రౌడీ ఫెలోస్‌. వీళ్లని ప్రయోగించిన సూత్రధారి తెర వెనుకే ఉండి పోయాడు. అతడ్ని పట్టుకుంటేనే కానీ అసలు నిజాలు వెలుగులోకి రావు’’అనుకున్నాడు తేజ. సిద్దార్థ కారును బాగు చేస్తూనే ఉన్నాడు. తేజ డైలీ చదువుతూనే ఉన్నాడు. లోనుంచి అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. కాసేపటి తర్వాత లోనికి వెళ్లిన ఇద్దరు దుండగులు జెస్సికాను ఇంచుమించు మోసుకొస్తున్నట్లు బలవంతంగా బయటకి తీసుకొచ్చారు. ఆ వెంటనే భవంతి ముందు ఆపి ఉంచిన కార్లోకి ఆ అమ్మాయిని గట్టిగా నెట్టడమే తరువాయి ఆ ఇద్దరూ కార్లోకి వెళ్లి డోర్‌ వేసుకున్నారు. ఆ తర్వాత మెరుపు వేగంతో కారు స్టార్టయి బాణంలా ముందుకు దూసుకు వెళ్లింది.

‘‘సిద్దార్థా..హరియప్‌! ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేసారు’’అరిచాడు తేజ. సిద్దార్థ కూడా అలర్టయి ఒక్క ఊదుటున డ్రైవింగ్‌ సీట్లో కూలబడి కారు స్టార్ట్‌ చేసి నేలకు తగిలేలా యాక్సిలేటర్‌ని బలంగా తన్నాడు. అప్పటికే దుండగుల కారు ఆ స్ట్రీట్‌ దాటి పోయింది.

‘‘ఓ గాడ్‌! అనుకున్నట్లే జరిగింది’’అన్నాడు తేజ. ముందు దుండగుల కారు...వెనుక అంతే వేగంతో ఆ కారును వెంటాడుతూ సిద్దార్థ కారు.  సిటీలోని ట్రాఫిక్‌ పంజరాల్ని ఛేదించుకుంటూ రెండు కార్లు పరిగెడుతున్నాయి. ఓ అమ్మాయి కిడ్నాపై ఆపదలో ఉందని తెలీని జనం ఉరుకుల పరుగుల జీవనంలో పడి తల మునకలవుతోంది. నిజానికి, నగర దృశ్యం అంతే! ఎవరి గోల వారిదే.

 

సిద్దార్థ సెల్‌ ఫోన్‌ రింగైంది. జెట్‌ స్పీడ్‌ తో పరుగులు తీస్తున్న ముందు కారు నే టార్గెట్‌ చేస్తూ డ్రైవ్‌ చేస్తున్న సిద్దార్థ ఎడం చేత్తో అలవోకగా ఫోన్‌ ఎత్తి` ‘హలో ! ’ అన్నాడు.

‘‘హలో!  నేను జూబ్లీ హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ సి ఐ సుకుమార్‌ ని ’’

‘‘సుకుమార్‌ గారూ! బాగున్నారా?’’ అడిగాడు సిద్దార్థ.

‘‘ఏం బాగో ? రోజు రోజుకీ పెచ్చరిల్లి పోతున్ననేరాలు, ఘోరాల్లోనే జీవితం అయి పోతోంది’’

‘‘ఔనంతే! మనం ఎంచుకున్న ప్రొఫెషన్‌ మనల్ని శాసిస్తోంది. సొసైటీ కళ్లు కప్పి మోసం చేస్తున్న దొరల్లాంటి దొంగల్ని ఛేజ్‌ చేయడంలో చెప్పలేనంత థ్రిల్‌ ఉంది కదూ ’’సిద్దార్థ కౌంటరిస్తుంటే తేజ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు`‘‘జరుగుతున్న సీన్‌ కి మీ ఇద్దరి కాన్వర్వేషన్‌ కి అస్సలు సింక్‌ అవడం లేదు ’’

‘‘కరెక్ట్‌! అన్నట్లు సుకుమార్‌ గారూ! మీరు ఎందుకు ఫోన్‌ చేసారో తెలుసుకోవచ్చా?’’

‘‘మీరే కదా! పోలీస్‌ సాయం కావాలంటూ మా కమిషనరేట్‌ కి ఫోన్‌ చేసారు. విషయమేమిటా? అని నేను మీకు ఫోన్‌ చేస్తున్నాను’’

‘‘కమిషనర్‌ గారు మీకు అసైన్‌ చేసారా? ఈ సమయంలో మీ సాయం మాకెంతో అవసరం’’

‘‘ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు?’’  అడిగాడు సుకుమార్‌.

‘‘ఓ ఇంపార్టెంట్‌ కేసులో కొంత మంది చేజ్‌ చేస్తూ ఇప్పుడే పటాన్‌ చెరు దాటి ముంబై హైవే కొచ్చాం. మీరూ మీ సైన్యంతో రంగంలోకి దూకితే బాగుంటుంది’’

‘‘ఓకే...అలాగే! ఇప్పుడే ఈ క్షణమే కార్య క్షేత్రంలోకి దూకుతాం. మధ్య మధ్యలో మీరెక్కడున్నారో చిన్న మెసేజ్‌ పెట్టండి. మాకు రావాల్సిన దారి తెలుస్తుంది’’ రిక్వెస్ట్‌ చేసాడతడు.

‘‘ఓ...అలాగే’’అన్నాడు సిద్దార్థ.

ఇంతలో ముందు వెళ్తున్న కారు ఒక్క సారి సడన్‌ బ్రేక్‌ వేసి ఆగింది.

‘‘మనం ఫాలో అవుతున్నామని వాళ్లకి డౌటొచ్చిందంటావా?’’ అడిగాడు తేజ.

‘‘కచ్చితంగా వచ్చే ఉంటుంది. తప్పు చేస్తున్న వాడు తను దొరక్కుండా ఉండేందుకు సవాలక్ష జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. రోడ్‌ నంబర్‌ ఫార్టీ ఫైవ్‌ లో వాళ్ల కారు స్టార్టయి ఇక్కడికొచ్చేంత వరకూ ఎన్నో వెహికల్స్‌ దాటినా...వాళ్లని ఫాలో అవుతోంది మాత్రం మన వెహికిలే. ఆ విషయం తెలుసుకోవడానికి తెలివైన వాళ్లే కానక్కర్లేదు. వ్యూ మిర్రర్‌ లోంచి చూస్తే చాలు’’

‘‘అందుకే...ఆ కారు ఆగిందంటావా?’’

‘‘అయి ఉండొచ్చు. ఎందుకైనా మంచిది. మనం మన కారును కాస్త పక్కకి ఆపితే బాగుంటుంది’’ అంటూ సైడ్‌ తీసుకుని బ్రేక్‌ వేసి కారు ఆపాడు సిద్దార్థ.

ముందు ఆగిన కార్ లోంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. విశాలమైన రోడ్డును ఆ చివర్నుంచి ఈ చివరి వరకూ చూపుల్తో ఓ సారి కొలిచారు. ఆ తర్వాత రోడ్డు దిగారు.

‘‘వాళ్లెందుకు ఆగారో అర్ధమైంది’’ అన్నాడు తేజ.

‘‘వెధవలకి లఘు శంక’ ’నవ్వాడు సిద్దార్థ. అయిదు నిముషాలైనా వాళ్లు కారు స్టార్ట్‌ చేయలేదు. ఓ వ్యక్తి మాత్రం సెల్‌ లో ఎవరితోనో మాట్లాడుతూ కారు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు.

‘‘బహుశా...కిడ్నాప్‌ చేసిన అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాలో...అనే విషయమై సందిగ్ధత నెలకొని ఉంటుంది. అందుకే, ఇన్‌స్ట్రక్షన్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్లున్నారు’’చెప్పాడు తేజ.

‘‘పక్కా ప్లాన్‌ లేకుండా కిడ్నాప్‌ చేస్తారనుకోను. కాకపోతే...ఎందుకో కారాపారు. ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్లున్నారు’ ’అన్నాడు సిద్దార్థ. సిద్దార్థ వాక్యం పూర్తయిందో లేదో...ముందు కారు కదిలింది.

‘‘కమాన్‌...ఛేజ్‌’’అన్నాడు తేజ. సిద్దార్థ కారు యాక్సిలేటర్‌ ని బలంగా నొక్కాడు. వాళ్లనే ఫాలో అవుతున్నట్లు అనుమానం రాకుండా నెమ్మదిగా కారు నడుపుతున్నాడతడు. ఒక్క ఊదుటున వేగంగా వెళ్లి ముందు కారును ఓవర్‌ టేక్‌ చేయడం లేదు. అలాగనీ...బాగా స్లోగా నడపడం లేదు. కను చూపు వలయం నుంచి దుండగుల కారు తప్పి పోకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇంతలో సడన్‌గా ముందు వెళ్తున్న ఆ కారు హైవే నుంచి కిందికి దిగి పొలాల మధ్య సన్నటి ఎర్రటి రాదారిని ఎంచుకుంది. అంటే...అక్కడెక్కడో దుండగుల రహస్య స్ధావరం ఉందన్న మాట...సిద్దార్థ అనుకున్నాడు. 

 

..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam