Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sabhaku namaskaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - -సాయి కృష్ణ పొన్నగంటి

తిక్క :పొన్నగంటి సాయి కృష్ణ గారూ మీపై నమస్కారాలు మోపితే భరిస్తారా?
తొక్క:
కారాలు మిరియాలు కాదుగాబట్టి నిశ్చింతగా భరిస్తానండీ బాబూ!

తిక్క : వెదురుతో కార్టూన్లు వేసి బంగారు తాపడం పెట్టి పత్రికలకు పంపుతే పబ్లిష్ అవుతాయా?
తొక్క:
బంగారం మాత్రం స్వీకరించి, వెదురు తిరుగుటపాలో వచ్చేస్తున్నాయ్. అయినా, ఈ రహస్యం ఎలా స్మెల్ చేశారు? మీరు డిటెక్టివ్ కూడానా!!


తిక్క : పెట్రేగిపోతున్న వల్ల మీ కార్టూన్లకు ఒనగూడే ప్రయోజనం ఏమైనా ఉందని భయపడుతున్నారా?
తొక్క:
అవునండీ - అవును, ఈ డెంగ్యూ, చికుంగున్యా దోమలు పెట్రేగినప్పుడు ఓ పాతిక కార్టూన్లకు అయిడియాలు ఒనగూరినట్లు గుర్తు. అందుకే అలాంటి దోమలంటే భయ్యం!!

తిక్క : అంతర్జాతీయ బహుమతులు ఎందుకు వదిలెయ్యలేకపోతున్నారు?
తొక్క:
ప్రైజులకు తుమ్మ గమ్మేసి ఇస్తున్నారు. చేతులకు అతుక్కుపోయాయి.. అందుకే వదల్లేకున్నా!

తిక్క : మీ కార్టూన్లలో ఆల్బెర్ట్ ఐన్ స్టీన్ సంతకం ఎందుకుండదు?
తొక్క:
మేమేం బ్రదర్స్ కాదండీ..ఆయన ప్రయోగాలు ఆయనవి, నా కార్టూన్లు నావి..నా కార్టూన్లలో ఆయన సంతకం చేస్తే నేనొప్పుకోను.

తిక్క : పాత సినిమాల కన్నా మీ కార్టూన్లే కొత్తగాగా ఉంటాయట కదా?
తొక్క:
అయ్యా తిక్కగారూ, ఈ విషయం బయట అనకండేం, పాత సినిమాలలో కామిడీని తీసి కొత్త పేపర్ల మీద వేస్తూంటానండీ నేను.. నా ఫోజు వెనక హిస్టరీ అదేమరి!

తిక్క : కొత్త కొత్త సబ్జెక్టులపై  తెగ కార్టూన్లేస్తూంటారు కదా, ఇంతకీ మీరు రోజుకెన్ని కార్టూన్లు తింటూంటారు?
తొక్క:
భలే ప్రశ్న వేశారు. ఉదయాన్నే కార్టూ సెన్సిటివ్ పేస్టు తింటా..బ్రేక్ ఫాస్ట్గా దోశె విత్ కార్టూన్ చట్నీ. లంచ్ లో కార్టూన్ ఫ్రైడ్ రైస్ లాగించేస్తాను. నైట్ కార్టూన్ హైడ్రేట్స్ వున్న బుక్ షేక్ తీసుకుంటాను!

తిక్క : అమెరికన్లలో మీకున్న  పరపతి పోవడానికి మీరు చూసిన మొదటి సినిమానే కారణమా?
తొక్క:
అవునండీ టిక్కెట్ కొనకుండా ప్రొజెక్టర్ రూం లోంచి చూడడం వల్ల ఆ ప్రమాదం ఏర్పడింది.


తిక్క : కార్టూన్ ఎంత పెద్ద సైజులో ఉండాలి?
తొక్క:
పాఠకుడి గుండె నిండేంత సైజు...మోతపెట్టేంతటి నవ్వు పుట్టించగల సైజు...!


తిక్క : మీ కార్టూన్లు ఎలాంటి వాతావరణానికీ చెడకుండా ఉండాలంటే ఏ ఇంకు వాడాలి?
తొక్క:
హాస్యరసంతో చేసిన బ్లాక్ ఇంక్ ను మెదడులోంచి ఊరిన చెమటతో చేర్చి తర్వాత వాడాలి.

తిక్క : రైతురాజ్యం పోక ముందే మీ కార్టూన్ల కాలం వస్తుందా?
తొక్క:
తలిశెట్టి రామారావు గారి రాజ్య వారస్తం కొనసాగుతూనే వుంది. కలాలు పట్టి పత్రికల దున్నుతున్న వారసులు మెరుస్తున్నారు కాబట్టి నా కార్టూన్ల కాలం వచ్చేసినట్టేనని భావిస్తున్నాను..

తిక్క : పరిస్థితులు మారిపోతున్నాయి, కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి మీరింకా కార్టూన్లు తీసెయ్యడంలేదెందుకు?
తొక్క:
రెండు రాష్ట్రాల ప్రజల ప్లేట్లలో భోజనం, పత్రికలలో కార్టూన్ల శాఖను తీసెయ్యలేం....నోచాన్స్ ఎటాల్...!!!

తిక్క : పడవలో ఉన్నప్పుడు కార్టూన్ ఐడియాలొస్తే, ఫ్లైట్ లో కార్టూన్లు వేయొచ్చంటారా?
తొక్క:
బ్రెయిను - హ్యాండు ఫ్రెండ్షిప్పు వున్నంతవరకూ - ఇవేమీ అడ్డుకావు!!!

తిక్క : ఏ చూర్ణంతో ఒక మంచి కార్టూన్ ఏర్పడుతుంది?
తొక్క:
ఓ ఐడియా చూర్ణాన్నే మార్చేస్తుంది!! ఏ చూర్ణమని చెప్పగలము?

తిక్క : మీ కార్టూన్లన్నీ జాంబవంతుడు కట్టకట్టి అటకమీద వేసేసాడు కదా, మళ్ళీ మీతో ఎవరు వేయిస్తున్నారు ?
తొక్క: 
జాంబవంతుని అల్లుడు, శ్రీకృష్ణుడు అందుకే నా పేరు వెనుక పిల్లనగ్రోవి పెట్టుకొని గుర్తుంచుకొన్నా...


తిక్క : పౌరాణిక గాధల్లో మీ కార్టూన్లు ఎవరూ చూడలేదు, వాటిపై మీ సంతకం లేకపోవడం వల్లనా?
తొక్క:
లేదండీ- పౌరాణిక  కాలానికి తగ్గట్టు 3డీ కార్టూన్లు వేయలేకపోయాను- అందుకు!!

తిక్క : మీ కార్టూన్ల వల్ల అమెరికాలో ప్రజాస్వామ్యానికి ప్రమాదమట కదా?
తొక్క:
అవునట, ఒబామా మీ చెవిలో చెబుతూంటే ఆకాశవాణి మార్మోగించేసింది....

తిక్క : శుభలగ్నం సినిమాలో మంచి మంచి సీన్స్ ఉన్నాయి కానీ, మీ కార్టూన్లు వినిపించలేదెందుకని?
తొక్క:
ఆ టైంలో సౌండు బాక్సు రిపేరు వచ్చింది మరి...

తిక్క : పరాయి పాలనలో మగ్గుతున్న వారికి మీ కార్టూన్లెందుకు నచ్చవు?
తొక్క:
ఎందుకంటే నా కార్టూన్లు హాస్యంలో మగ్గుతాయి కనుక!!

తిక్క : మీ తుంటర్వ్యూ గురించి ఒబామా మీతో ఏం అన్నారో ఎవరికైనా తెలుసా?
తొక్క:
తెల్లపావురం ఎగురవేసి శాంతి- శాంతి అని కేకలేసారు. కోట్ల మంది టీ.వీ లో చూశారు. అది నేను కల్లో చూశాను. బహుశా కల్లో చూసినోళ్ళకి తెలిసి వుంటుంది.

తిక్క : మీ ఊళ్ళో ఎన్ని రాజ్యాలున్నాయో చూసుకోకుండా కార్టూన్లెందుకు గీసేసారు?
తొక్క:
రెండు రాష్ట్రాలే కాదు, ఈ దేశం, సర్వ ప్రపంచం ఇవన్నీ ఇవన్నీ నా భాగ్యం పెన్నే నా ఆయుధం..నవ్వే నా లక్ష్యం..( ఎవరో అక్కడక్కడ దభ్ మని పడిపోయిన శబ్దం...)
ఉప్చ్......తిక్క తిక్క అంటూనే డొక్క ముక్క చేసి చంపుకు తిన్నారు కదయ్యా తిక్కరాజా....నీకేం తక్కువ తిక్క లేదండీ సుమీ నా మెదడునే దత్తత తీసుకున్న శ్రీమంతుడు మీరు..!!

 

మరిన్ని శీర్షికలు
tiruppaavai