Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tunterview

ఈ సంచికలో >> శీర్షికలు >>

తిరుప్పావై - వనం వెంకట వరప్రసాద రావు

tiruppaavai
తిరుప్పావై 

తిరుప్పావై -4  వ పాశురం తాత్పర్యము.

గంభీర స్వభావుడవైన  ఓ పర్జన్యదేవుడా! వర్ష నిర్వాహకుడా! నీవు నీ దాతృత్వములో,  నీ ఔదార్యంలోఏమాత్రమూ సంకోచము చూపించవద్దు. గంభీరమైన సముద్రమధ్యంలోకి  వెళ్లి, ఆ సముద్రపు నీటిని పూర్తిగా త్రాగి, గర్జించి, ఆకాశమంతా వ్యాపించి, సకల 
జగత్కారణభూతుడైన ఆ ఆ శ్రీమన్నారాయణుని  దివ్యవిగ్రహములాగా నీలివర్ణపు  శరీరముతో, ఆ పద్మనాభుని విశాలసుందర బాహుయుగళిలో, కుడిచేతిలోని చక్రములాగా మెరిసి, ఎడమచేతిలోని శంఖములాగా ఉరిమి, ఆయన శార్ఙధనుస్సు నుండి వెలువడిన బాణముల వర్షమా అన్నట్లు, లోకమంతా సుఖించేట్లు, మేము  సంతోషంగా మార్గశిరస్నానం చేసేట్లు వర్షింపుమయ్యా!  

ధీరుడవగు మేఘుడ గం
భీరుడ దయతోడజొచ్చి భీకర జలథుల్
పూరణముగ పారణమున
ధారలుగా వర్షములిడి దయజూపగదే

ఘనముగ గగనము నిండుచు
ఘన దేహుడు సకలములకు కారణు కరణిన్
ఘన సుందర దేహము గొని
ఘన గర్జన లురుము లిడుము ఘనవర్షములన్

చక్రపు మెరుపుల చక్రివి,
చక్రముగ పరిక్రమించి చక్రపు వర్షం
బౌక్రమమున, శంఖివి ధ్వని
విక్రమమున, శార్ఙమనెడి వింటిగ బరగన్

విల్లది హరి విల్లుయునది
జల్లుల గొని యతనిశరపు చల్లని ఝల్లుల్
చిల్లులు పడినదిగ నభము
చెల్లగ భువి నాకమనగ జేయగ కరుణన్ 

స్నానము లాడుచు మేమిదె
గానము జేసెదము హరిని, కమ్మని సుధలన్
పానములవి యతని కథలు,
మానక నీ వర్షములవె మా హర్షములున్

తిరుప్పావై-5 వ పాశురము తాత్పర్యము:

ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడు, నిత్యము భగవంతుని సంబంధమును కలిగిన  ‘ఉత్తరదేశములోనిమధురకు’ నాయకుడు, పరిశుద్ధమైన అగాధమైన జలమును కలిగిన యమునానదీతీరములో ఉండేవాడు,  గోపవంశామున ప్రభవించిన మంగళ దీపము 
అయినవాడు, తన తల్లి యశోద గర్భమును ప్రకాశింపజేసిన కుమారుడై తల్లిచే తాటితో కట్టుబడి దామోదరుడు అని పిలువబడినవాడు అయిన శ్రీకృష్ణ భగవానునివద్దకు   మార్గశిరస్నానముతో పవిత్రులమై వచ్చి, పరిశుద్ధములగు పుష్పములతో అర్చించి, అంజలి ఘటించి, పలుకులతో కీర్తించి, మనసారా ధ్యానించినచో మన పూర్వజన్మల  సంచిత పాపరాశియు,ఆగామి పాపరాశియు అగ్నిలోపడిన దూదివలె భస్మమైపోతాయి.  కనుక భగవానుని నామములను కీర్తింపుడు. 

మాయలనుత్తర మథురను
ఆయమునా తీరమునను అచ్చెరువొందన్
నాయకునిగ చెలగిన శుభ
దాయకునిక గొలుతుమెలమి దక్షునినొకనిన్

వ్రజమున మంగళ దీపము
ప్రజననముగ ప్రజ్ఞ ప్రభుత ప్రజ్జ్వలమగుతన్
నిజముగనాతని చరణపు
రజమున గద కర్మ జన్మ రహితములగుతన్

మోదముగొని తల్లికి దా
మోదరుడై కట్టుబడెను మోక్షమునిచ్చెన్
పోదము నావికుడు మనల
నాదరమున దరికి జేర్చు నావయు నతడే 

పుష్పములు అహింస, శమము
పుష్పములు దయ క్షమ జ్ఞాన పుష్పము దలపన్ 
పుష్పములు తపము ధ్యానము
పుష్పము గదసత్య మివియె పుష్పములమరన్ 

చేయుదమతనికి పూజలు
బాయుద మెనుకటివి ముందు పాపము లిపుడున్
జేయుచు తెలియగలేనివి
హాయిగ నవి దూదియగును అగ్నులయందున్ 

వీడుద మితరపు సంగతి
పాడుద మతడే మన గతి పతియని పడతుల్
గూడుడి మన మతని శరణు
వేడెద మిక జలకమాడి వేకువయందన్ 

తిరుప్పావై-6 వ పాశురము తాత్పర్యము  

పక్షులు కూడా మేల్కొని కూస్తున్నాయి. గరుడగమనుని ఆలయంలో పెద్ద తెల్లని శంఖం చేస్తున్నధ్వనులు కూడా వినబడలేదా? ఓ పిల్లా! మేలుకొనవమ్మా! పూతన స్తనములందలి  విషమును ఆరగించిన, ‘దొంగబండి’ని కీళ్ళు విరిగిపడేట్లు కాలితో తన్ని పొడిచేసిన, పాలసముద్రములోశేషశయ్యపై యోగనిద్రలో నెలకొనియున్న జగత్కారణభూతుని మునులు  యోగులు మనసులలోనిలుపుకుని, మెల్లగా లేచి ‘ హరి’ ‘హరి’ యని చేస్తున్న పెద్ద ధ్వని  మాలో ప్రవేశించి మా శరీరాలను, మనసులను, ఆత్మలను చల్లబరచినది!       

పరగెను ద్విజముల రవళులు
గరుడగమను దేవళమున ఘనముగ ధ్వనులన్
బరగెను తెల్లని శంఖము
తరుణీ వినదగదె నిదుర తగదిక లెమ్మా! 

పూతన యను కపటి విషపు
పూతల చనుబాలు గొనిన పూర్వపు శిశువున్
పోతరుడౌ శకటాసురు
నాతురుడై తన్ని చంపి నట్టి పరంబున్

పాలసముద్రమునందున
లీలగ గొని యోగనిద్ర లిఛ్చగ జగముల్
ఖేలగ సృజియించి పిదప
కూలగ ఘటియించు ఘనుని కొలిచెదమనుచున్ 

మనముల మననముల వశత
తనువులు పులకెత్తి నగుచు తాదాత్మ్యమునన్
జను యోగుల సడివిని మే
మును వడి మెళకువనుగలిగి మురిపెము గొనుచున్ 

తానములాడుచు మనమును
గానములను హరిని గొలువగా పరమనుచున్,
మానిని! నిను గొంపోవుట
కై నరుదెంచితిమి తెలివి గైకొనవమ్మా! 

తిరుప్పావై 7వ పాశురము తాత్పర్యము  

భరద్వాజపక్షులు పరస్పరము ఒకటి కలుసుకుని ‘కీచు కీచు’మని మాట్లాడుకుంటున్న ధ్వనులను వినలేదా? ఓ పిచ్చిదానా! పరిమళములను వెలువరిస్తున్న కేశపాశములను  కలిగిన గోపికలు కవ్వములతో పెరుగును చిలుకుతున్నప్పుడు వారి చేతులకున్న 
కంకణముల ధ్వనులు వారి మెడలలో ఉన్న ఆభరణముల ధ్వనులతో కలిసి విజ్రుంభించి ఆకాశానికి తాకుతున్న ధ్వని కూడా వినబడలేదా? ఓ నాయకురాలా! సమస్తపదార్ధముల  లోపలా బయటా నారాయణుడై వ్యాపించి, శ్రీకృష్ణుడై జన్మించి ‘కేశి’ అనే రాక్షసుడిని  సంహరించిన సర్వేశ్వరుని పాడుచుండగా వినికూడా పడుకున్నావా? ఓ తేజశ్శాలినీ!  తలుపు తెరువుమమ్మా!  

పరవశ భరధ్వజుల రస   
భరితములగు ధ్వనులు చెవుల బడలేదో సం
బరముగ చిలికెడు తరి విరి
పరిమళముల కురియు కురుల పాశములు విడన్

రోదసికెగబాకు శుభద
నాదములిడు కంకణములు నాతుల గళముల్
మోదములగు యాభరణము
లా దధి కడవలను చిలుకు లాడెడు వేళన్

కవ్వపు సడి కడవల సడి
మువ్వల సడి అలల నెగయు ముదితల నగవుల్
నివ్వటిలుచు నుండెడి సడి
అవ్వ! వినక వెఱ్రివగుదె అందరు నవ్వన్ 

నాయకివగు రమణీ! నా
రాయణుడిట గలిగెను బహిరంతరమందున్
బాయని కళ యగుచు మన క
మాయకముగ కృష్ణుడగుచు మాయల గొనుచున్

కేశిని జంపిన వానిన్,
క్లేశము లణచు హృషికముల కీశు నధీశున్,
నాశము చెందని పుణ్యపు
రాశిని గొలచుటకు తెరచి రమ్మిక గడియన్!

తిరుప్పావై 8 వ పాశురము తాత్పర్యము: 

తూరుపుదిక్కున ఆకాశము తెల్లవారుచున్నది. చిన్న చిన్న బీళ్ళలో మేయడానికి  విడువబడినగేదెలు మేతకు పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరూ మన వ్రతస్థలమునకు బయలుదేరి వెళ్ళుటయేప్రయోజనమని వెళ్తుండగా వారిని ఆపి,నిన్ను పిలుచుకుని పోవుటకు వచ్చి నిలుచున్నాము. కుతూహలురాలవైన ఓ పిల్లా! లేవవమ్మా! తన పాటలు పాడి, ‘పర’ను పొంది, మాయగుఱ్ఱపు రూపంలో వచ్చిన ‘కేశి’యనే రాక్షసుడి నోటిని చీల్చిచంపినవాడు,  చాణూర ముష్టికులనే మల్లులను చంపినవాడు, దేవాదిదేవుడిని  చేరి సేవించినచో ‘అయ్యయ్యో’ అని బాధపడి, మన బాధలనువిని విచారించి మనమీద కృపను చూపుతాడు.    

తూరుపు తెలతెలవారెను
దారుల బీడుల పశువులు దవ్వుల మేయన్
దారులబడి పోయెదమను
వారల, బాలల, పడతుల వారలు పోవన్ 

ఆపితిమి కుతూహలమును 
నోపని నెరజాణ యిటుల నొప్పవు నిదురల్
మాపటికగు లేవవె యిక 
శ్రీపతి గుణముల భజనలు శీఘ్రము నగుతన్ 

పరను గొనగ పరముని నగ
ధరు పదముల భజనల గొనదగునిక కేశిన్
హరియించిన మల్లుర ధర
గరిపించిన కేశవుడతి కరుణలు గురియన్ 

తరుణులు  అయయో మీరిటు
లరుదెంచితిరని కరుణను లాలనగొనుచున్
పరిపరి మన కుశలమరసి
భరియించును మనలనతడు బాధల దీర్చున్

తిరుప్పావై-9 వ పాశురము తాత్పర్యము 

పరిశుద్ధమైన, నవవిధ మణులతో నిర్మింపబడిన మేడలో, చుట్టునూ దీపములు వెలుగుచుండగా,అగరుదూపము మఘుమలాడుచుండగా సుఖశయ్యపై నిద్రించుచున్న ఓ అత్తకూతురా! మణి  కవాటపు తీయవమ్మా! ఓ అత్తా! నీవైననూ ఆమెను లేపవమ్మా! నీ కుమార్తె మూగదో, చెవిటిదో, లేక మానసిక జాడ్యము కలిగినదా? లేక ఎవరైనను కదలకుండా కావలి ఉన్నారా? లేక గాఢ నిదుర పట్టునట్లు మంత్రం వేశారా? ‘ మహా మాయావీ! మాధవా! వైకుంఠవాసా!’ అని అనేక నామములతో కీర్తించి నీకుమార్తెను మేలుకొల్పుము.    

పరిశుద్ధము నవమణిమయ 
విరచిత భవనమున గొనుచు విష్ణుని స్మరణల్ 
పరిమళముల అగరు పొగలు
మెరిసెడు దీపపు వెలుగుల మేలిమి శయ్యన్    

మేనును మరచిన నిదురల 
మేనమరదలా తెరువుము మేలగు గడియన్
మేనత్తా నీవైనను 
మానవతీ గడియతెరచి మము దయగనవే!

తీగలు సాగు నిదురలో 
మూగదొ చెవిటిదొ కొమరిత ముద్దుల పట్టిన్
ఈ గతి నిదురలు గొన తన    
కాగదిఁ మంత్రము నిడితివొ కావలి గలదో

మాయావీ! మాధవ! శుభ
దాయీ! వైకుంఠవాస! దానవహారీ!
చేయూతల నిడు మనుసడి 
చే యీ నిదురలు తొలగగ జేయవె కరుణన్!

తిరుప్పావై-10 వ పాశురము తాత్పర్యము 

మేము రాకముందే నోమును నోచి, దాని ఫలితముగా సుఖానుభవమును పొందిన తల్లీ! తలుపును తెరువకపోతే తెరువకపోదువు గాక! పరిమళములతో నిండిన తులసీ మాలలతో అలకరించుకున్న కిరీటము గల నారాయణుడు ఏమీ లేని మావంటివారము మంగళము పాడినచో ‘పర’ అను పురుషార్థమును ఒసంగెడి పుణ్యమూర్తి, ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నోటిలో పడవేయగా ఆ కుంభకర్ణుడు నిదురలో నీచే ఓడింపబడి తన సొత్తైన ఈ గాఢ నిద్రను నీకు ఇచ్చినాడా? అంత అధికమగు నిద్ర మత్తును వదలని ఓ తల్లీ! మాకందరికీ శిరోభూషణమైన దానా! నిదురనుండి లేచి, మైకమును వదలించుకుని తేరుకుని వచ్చి తలుపును తీయవమ్మా! నోరు తెరిచి మాట్లాడవమ్మా!ఆవరణమును తొలగించి నీ దర్శనమును ఈయవమ్మా!నోమును నోచిన దానవు మరు దెంచుటకు మునుపు మేలగు సుఖమున్ స్వామిని పొందిన దానవులేమా గడియను విడువుము లేవవె పలుకన్  

పరిమళముల యలల నెగయు
సిరి తులసీ మాలికలొరసినమకుటమునన్
మెరిసెడు హరి పాడిన తన
పర మంగళ గీతములను పర మనకొసగున్

వేడుకఁ పుణ్యశరీరుని 
పోడిమిఁ ఘటకర్ణుడు తను బొలయక మునుపే
చూడగ తను గతమున నీ
కోడిన నువు వాడి నిదుర గొని కప్పముగన్  

మొద్దగు పెద్దగు నిదురల
ముద్దుల జవరాల విడుము ముద్దగు అరుదౌ 
కద్దగు కులభూషణమా!
పొద్దగునది గడియ తెరువ పోయెద మమ్మా

(కొనసాగింపు వచ్చే వారం)

**వనం వేంకట వరప్రసాదరావు 
మరిన్ని శీర్షికలు
sahiteevanam