Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tiruppaavai

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

'ఆముక్తమాల్యద'

తన కుమార్తె దుస్థితికి కారణము ఏమిటో  తెలియజేయుమని విష్ణుచిత్తులవారు శ్రీ హరిని  కోరాడు. దానికి నేరుగా సమాధానం యివ్వకుండా శ్రీహరి ఒక భక్తుడి కథను చెబుతున్నాడు. ఈ  సన్నివేశం వరాహపురాణం లోది నిజానికి. వరాహపురాణం లో వరాహమూర్తిగా ఉన్న శ్రీహరి  తనను భూదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈ కథను చెబుతాడు. నిజానికి ఆముక్తమాల్యద గ్రంథకథతో సంబంధం లేని ఈ కథను ఒక సందేశాన్ని యివ్వడానికి, భారతీయ చింతనలోని ఔన్నత్యాన్ని వెల్లడి చేయడానికి యిక్కడ పొందుపరిచాడు శ్రీకృష్ణదేవరాయలు.  శ్రీహరి కొనసాగిస్తున్నాడు తన భక్తుని కథను. విష్ణుచిత్తులవారు వింటున్నారు.'జన్మచేత ఛండాలుడు ఐనప్పటికీ, గుణము చేత ఉత్తముడైన ఆ 'మాలదాసరి' తన చెక్కిళ్ళ మీదుగా ఆనందబాష్పాలు కారుతుండగా, రాళ్ళు కరిగేలా  నా కీర్తనలు పాడి, ఆనంద తాండవం చేసి, తన భుజాలకున్న బరువులను ప్రక్కన పెట్టి, ఎండను, గాలిని, ఆకలిని లెక్క చేయకుండా అలా బ్రాహ్మీ ముహూర్తమునుండి మిట్ట మధ్యాహ్నం దాకా ఒళ్ళు పులకలెత్తుతుండగా అలా నా సేవ చేసేవాడు.'

అట్లు దడవుగ గొల్చి సాష్టాంగమెరగి 
గర్భమంటపి గడిగిన కలకజలము 
లోని రాతొట్టి నిండి కాలువగ జాగి 
గుడి వెడలి వచ్చునది శూద్రు డిడగ గ్రోలి 

అలా ఎంతో సేపు కొలిచి, సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, స్వామివారి గర్భగుడిని  కడిగినప్పుడు జాలుగా బయటకు వచ్చే నీటిని ఒక శూద్రుడు యిస్తే తీర్థం లాగా  తీసుకుని మైమరచిపోయేవాడు. శూద్రుడు తీర్థం యివ్వడం ఎందుకంటే ఇతను  పంచముడు, అతనికన్నా పై స్థాయి అని భావింపబడే వాడు తీర్థం యిచ్చేవాడు.పాఠక మిత్రులు ఈ సన్నివేశాన్ని, ఈ కథను త్వరపడి నిర్ణయింప వద్దు. ఆ నాటి  సమాజాన్ని, ఈనాటికీ సమాజంలో ఉన్న చెడును విమర్శిస్తున్నాడురాయలు. అది  ఈ సన్నివేశం పూర్తి అయితేనే తెలుస్తుంది. రాయలు కవి, వీరుడు, ఆధ్యాత్మిక తత్త్వవేత్త, చిత్రకారుడు, సంగీతకళా కోవిదుడు, యివన్నీ మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప మానవతావాది, సంఘసంస్కర్త! ఈ ఆశ్వాసము యిందుకు ఉదాహరణ. యిలా బ్రాహ్మీముహూర్తంలో ఆలయం ముందుకు వచ్చి, మిట్టమధ్యాహ్నం ఎండ నెత్తి మీదికి వచ్చేదాకా, పాడి, ఆడి ఆనందంగా వెళ్ళిపోయేవాడు ఆ మహానుభావుడు. యిలా జరుగుతుండగా, ఒకనాడు ఒక విచిత్రం జరిగింది.

  
అద్దమరే యద్దాసరి 
యద్దండ బిడాలగాహితాలయక కృకవా
కూద్దండరవము విని చను 
ప్రొద్దాయె నటంచుఁ బాడఁ బోవుచుఁ ద్రోవన్ 

ఒకనాడు అర్థరాత్రి ఒక పిల్లి అతను కోళ్ళను ఉంచే గూటిలోకి జొరబడింది. పిల్లిని చూసిన భయముతో కోళ్ళు అరిచాయి. ఆ అరుపులను తెల్లవారు ఝాము సూచనగా  కోళ్ళు కూయడం అని పొరబడ్డాడు ఆ భక్తుడు.  నిజానికి తెల్లర బోయేముందు కూసే  కోడి కూతలకు భయముతో అవి అరిచే అరుపులకు తేడా ఉంటుంది, కానీ అంత  తీరుబడిగా, తెలివిగా గమనించే లౌక్యం కూడా లేని అమాయకుడు అతను అని  చెబుతున్నాడు రాయలవారు. సరే, తెల్లవారుతున్నది, కోళ్ళు కూస్తున్నాయి, నేను  స్వామి సేవకు వెళ్ళాల్సిన సమయం ఐంది అనుకుని, ఎప్పటిలాగే తన సరంజామా  మొత్తము భుజానికి ఎత్తుకుని బయలుదేరాడు. 

మరులుఁ దీఁగె మెట్టి యిరు లన్న నో యని 
యెడు తమిస్రఁ గాడుపడి పొలంబు 
లెల్లఁ దిరిగి తూర్పు దెల్ల నౌతరి నొక్క 
శూన్యగహనవాటిఁ  జొచ్చి చనుచు

ఆ చీకటిలో 'మరులు తీగె'ను తొక్కాడు. 'మరులు మాతంగి తీగె' అని ఒక పిచ్చిగా  అల్లుకుపోయే అడవి తీగ ఉంటుంది. దాన్ని తొక్కితే దారి తప్పి అక్కడక్కడే తిరుగుతారు అని ఐతిహ్యం. ఆ తీగెను తొక్కడంతో, ఆ చిమ్మచీకటిలో దారి  తప్పాడు. ఎలాంటి చిమ్మ చీకటి అనే విషయాన్ని చమత్కారంగా అతిశయోక్తిగా వర్ణిస్తున్నాడు. 'ఓ చీకటీ' అని పిలిస్తే, 'ఓ' అని బదులిచ్చే సంసిద్ధమైన కటికచీకటి అది. దారితప్పి, పొలాలు, బీళ్ళు, అన్నీ తిరిగి, తిరిగి, తూరుపు తెలతెలవారేముందు ఒక నిర్జనమైన, భయంకరమైన అడవిలో ప్రవేశించాడు. విరిగిన గోడలలో చిట్టిరేగు, ఉత్తరేణి, కసింద, కోరింద పొదలు, తుప్పలు క్రిందికి పెరిగి ఉన్నాయ్. వాటిక్రింద కూలిన గోడలకున్న బొరియలలో పందికొక్కులు బొరియలు చేసుకుని గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయ్. పాడుబడ్డ బావులు, ఎండిన చెత్త, పెంట దుర్గంధాన్ని వెలువరిస్తున్నది. ఆ చెత్త చాటున, ఆ పొదల మధ్యన కడుపు ఎండి నకనక లాడుతున్న అడవిపిల్లులు చిన్న జంతువులకోసం మాటు వేసి చూస్తున్నాయ్. ఎటు చూసినా శిథిలమైన గోడలు, పొదలు, దుర్గంధం,క్షుద్ర జంతువులు, ఉన్న చిట్టడవిని దాటాడు. దారి తెలియక తిరుగుతున్నాడు. 

అపమార్గత నరుగుచు మా
ర్గపు ధామార్గవపుఁ గంటకంబులఁ గాళ్ళన్
విపరీతత నూడ్చుచు నే
రుపున న్బల్లేరు లీడ్చి త్రోయుచుఁ జనుచున్    

అలా దారి తప్పి, ఉత్తరేణి ముళ్ళు, పల్లేరు కాయలు కాళ్ళలో గుచ్చుకుని సలుపుతుంటే వాటిని కిందికి తుడిచి, దులిపి, వదిలించుకుంటూ, తీసి పారేస్తూ ఆగాగి కలయజూస్తూ, భయంకరమైన అడవిలోకి ప్రవేశించిన ఆ మాలదాసరి కనులకు ఎదురుగా ఒక భయంకరమైన దృశ్యం ఎదురయ్యింది.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు        

మరిన్ని శీర్షికలు
poootarekula festival