ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, 125 ప్రపంచ భాషల్లో గజల్స్ పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. ప్రపంచంలో ఇన్ని భాషలు ఒకే వ్యక్తి గొంతులో పలకడం అనేది ఓ అద్భుతం. కేవలం గజల్స్ ఆలపించడమే కాక, సామాజిక బాధ్యతతో వ్యవహరించడం ఆయన గొప్పదనం.
రాజకీయాలతోనూ గజల్ శ్రీనివాస్‌కి ప్రత్యక్ష సంబంధాలున్నాయి. కాంగ్రెసు పార్టీలో ఇటీవలే చేరారాయన. ఓ వైపు గజల్స్ ఆలపించడం, ఇంకో పక్క రాజకీయాలు, వీటితోపాటే సినిమాలు చేస్తూ గజల్ శ్రీనివాస్ బిజీగా ఉంటున్నారు. ‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన గజల్ శ్రీనివాస్, జంధ్యాల ఆఖరి చిత్రంలోనూ ఇదివరకు నటించారు.
ఇకపై ప్రతి సంవత్సరం రెండు సినిమాలలో ఖచ్చితంగా నటించాలనే నియమం పెట్టుకున్నారట గజల్ శ్రీనివాస్. ఆ సినిమాలు కూడా సామాజిక బాధ్యతతో తెరకెక్కేవిగా ఉంటేనే వాటిల్లో నటిస్తానంటున్నారాయన. సినిమాల్లో నటన ద్వారా పాపులారిటీ పెంచుకోవాలని కాకుండా, వాటి ద్వారా సమాజానికి మంచి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఆ పని చేస్తున్నారు.
గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు. ‘నచ్చావులే’ ఫేం మాధవీలత ఆయన సరసన నటిస్తోంది. పదహారణాల అచ్చ తెలుగు సినిమా ఇది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను చూపించడంతోపాటు, సమాజానికి మంచి మెసేజ్ ఈ సినిమాతో ఇవ్వబోతున్నారట.
|