ఒకప్పుడు సంచలన దర్శకుడనిపించుకున్న తేజ, ఇప్పుడు దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. వరుస వైఫల్యాలు వస్తుండడంతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్న తేజ, ‘1000 అబద్ధాలు’ అనే సినిమా తెరకెక్కించాడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు, సాయిరాం శంకర్ ఈ సినిమాలో హీరో.
సినిమా విడుదలకు ఎప్పుడో సిద్ధమయ్యిందిగాని, రిలీజ్ డేట్ మాత్రం ఫిక్సవడంలేదు. ఫిక్సయినా, ఆ డేట్ చాలా తేలిగ్గా మారిపోతోంది. జులై 12న సినిమా వస్తుందనుకున్నారు ఆ డేట్ మారిపోయింది.. తేజ మాట అబద్ధమైపోయింది. జులై 19 డేట్ అనుకున్నారు.. అదీ కార్యరూపం దాల్చలేదు. సినిమా విడుదల కాలేదు.
టైటిల్‌లో పెట్టిన ‘1000 అబద్ధాలు’ సంగతెలా ఉన్నా, డేట్లు మారుతుండడం ద్వారా రిలీజ్ విషయంలో తేజ అబద్ధాలు చెబుతున్నాడని సినీ వర్గాల్లో సరదా సరదాగా అనుకుంటున్నారు. ఏదేమైనా ఇంకో అబద్ధం ఆడకుండా ‘1000 అబద్ధాలు’ సినిమాని తేజ వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మంచిది.
|