Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

మన దేశంలో నూటికి 90 పాళ్ళు , law abiding citizens  లోకే వస్తారు. కానీ వచ్చిన గొడవల్లా ఆ మిగిలిన  10 పాళ్ళ ప్రాణులతోనే. వీళ్ళని చూసి, మిగిలినవారు కూడా , ఎందుకొచ్చినగొడవా అని, అదేబాటలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కొంచం ఓపికా సహనం లాటివి చూపిస్తే, అందరూ హాయిగా ఉండొచ్చుగా.  ప్రస్థుతం అదే లేదు. ఎక్కడచూసినా ప్రతీదానికీ కంగారే.దీనికి ముఖ్యకారణం, కొంత తల్లితండ్రులది కూడా.

ప్రతీదీ ఠక్కుమని అయిపోవాలి. ఏ విషయం చూడండి, పిల్లలని వారిదారిన వారిని పెరగనీయొచ్చుగా, అబ్బే మార్కెట్ లో వచ్చే ప్రతీదీ కుక్కేయడం. వాడిక్కావలిసినదేదో వాడిని చేయనీయొచ్చుగా, అలా కాదు మన పిల్లాడు నెంబర్ ఒన్ గానే ఉండాలి, మన చిన్నతనంలో ఎలా బలాదూర్ గా తిరిగినా సరే.



అంతదాకా ఎందుకూ, పంటలు వాటిదారిన వాటిని పండనిస్తే బాగుంటుందేమో కదా, అయినా సరే ఏవేవో fertilizerలూ, pesticideలూ వేసేసి, నాలుగు నెలలలో పెరిగవలసినదానిని రెండే నెలలలో మార్కెట్ లోకి తెచ్చేయడం. తీరా తెచ్చిన తరువాత, వాటిని స్వతసిధ్ధంగా పండనిస్తారా అంటే, మళ్ళీ అదేదో కార్బైడ్లో ఏవో వేసి, వాటికి పండు రంగు తెప్పించి, మనకేమో రోగాలు తెప్పించడం.

మన రోడ్లమీద ట్రాఫిక్కు లైట్లని ఉంటూంటాయి. మరీ మహానగరాల్లో తప్ప , అవి లక్షణంగా పనిచేసినట్టు ఎక్కడా వినలేదు. పోనీ అలాగని ట్రాఫిక్కేమైనా తక్కువా అంటే అదీ కాదు, ఏదో మరీ చిన్న చిన్న గ్రామాలు తప్ప, ఎక్కడచూసినా స్కూటర్లూ, కార్లూ, ఆటోలూనూ. ట్రాఫిక్కు సిగ్నల్స్ ఉన్నంతవరకూ, లేదా ఏ పోలీసో ట్రాఫిక్కుని కంట్రోల్ చేస్తున్నంతసేపూ ఫరవాలేదు కానీ, కర్మ కాలి ఆ సిగ్నల్స్ ఆగిపోయాయా, ఇంక చూడండి, ఎవడికి వాడే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దూరిపోతాడు. అన్నివైపులనుండీ ఒకే టైములో గాడీలన్నీ వచ్చేసరికి , చివరకి అందరూ చిక్కడిపోతారు. పోనీ అలాటి టైములో ఏ పోలీసైనా ఉంటాడా అంటే, అప్పుడే వాడు అదృశ్యం అయిపోతాడు. కొద్దిగా సహనం ఉపయోగిస్తే, అందరూ హాయిగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళుండేవారు. మీకేమిటండీ, పనీ పాటా లేదు, అంతంత ట్రాఫిక్కులో చిక్కడిపోతామని ఎవరైనా అనుకుంటామా ఏమిటీ, ఏదో ఇంటికెళ్ళాలని ఖంగారు కానీ. అదే చెప్తూంట, ఆ ఖంగారునే కొద్దిగా మార్పు చేసి, ఓపిక/సహనం గా మారిస్తే అందరూ సుఖపడేవారు కదా. ఏదో ఒక్కడే బుధ్ధిమంతుడిలా ఆగితే అయే పని కాదు, అందరిలోనూ మార్పు రావాలి. దానికి ముందుగా self discipline అని ఒకటి అలవాటు చేసికోవాలి. ఇలాటివన్నీ చెప్పడం శులభమే, కానీ ఆచరణలోకి వచ్చేసరికే కష్టం అవుతుంది.

అలాగే రైల్వే పట్టాలు దాటడం ఒకటీ. స్టేషన్లలో అవేవో ఓవర్ బ్రిడ్జీలుంటాయి, కానీ అంతదూరం వెళ్ళి, దాటే ఓపికుండదు. రైల్వే ట్రాక్కు అంటే పట్టాలు దాటడంలో అదేదో అలౌకికానందం ఉందనుకుంటాను. ఏ లెవెల్ క్రాసింగో అయితే అనుకోవచ్చు, కానీ స్టేషన్లలో కూడా పట్టాలు దాటే ప్రబుధ్ధులని చూస్తూంటాము. ఇదిగో వీళ్ళే ఆ వందలో మిగిలిన ఇద్దరు ప్రాణులూనూ.

రాజకీయాల్లో అయితే ఏక్ దం ఉల్టా. ఓపికా సహనం ఉన్న నాయకులు ఏ ఇద్దరో ముగ్గురో ఉంటారు. మిగిలినవాళ్ళందరికీ, ఎప్పుడు ఎన్నికలలో పెట్టిన ఖర్చు , ఎలా ఈ అయిదేళ్ళలోనూ సంపాదిస్తామా అనే ఖంగారు. వీళ్ళు చేస్తూన్న నిర్వాకాలకి రెండోసారి ఎన్నికయ్యే అవకాశాలు లేవు, బహుశా అదో కారణం అయుండొచ్చు,

ప్రెవేటు కాలేజీల యాజమాన్యాలను చూడండి, చట్టంలో ఏదో లొసుకు తెలిసికుని, వారి కోటాల్లో సీట్లివ్వడానికి కోట్లరూపాయలు వసూలు చేయడం.

ఇంక తిండి పదార్ధాలవిషయమైతే అడగక్కర్లేదు. ఇడ్లీపిండి దగ్గరనుండి ప్రతీదీ ఇన్స్టెంటే (instant). మినప్పప్పూ బియ్యం నానపెట్టి , పిండిగా రుబ్బడం ఉత్త టైం వేస్ట్. చివరకి ఉప్మా కూడా ఇదేకోవలోకి చేరిపోయింది. చెప్పుకుంటూ పోతే, వీటికి అంతేలేదు. బతికుండాలికాబట్టి  ఊపిరి పీలుస్తున్నారు కానీ,  దానిక్కూడా ఏదో సాధనం ఉంటే దానితోనే పనికానిచ్చేవారేమో. అదృష్టవశాత్తూ ఆ వెంటిలేటర్లేవో మరీ అవసాన దశలోనే ఉపయోగిస్తారు. ఎప్పుడో నిత్యవాడకంలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉందేమో అన్నా ఆశ్చర్యంలేదు.

ఇంక మాతృత్వం విషయానికొస్తే, అదికూడా టెక్నాలజీ ధర్మమా అని, అవేవో సరొగేట్  ( Surrogate)  పధ్ధతులు ఈరోజుల్లో ఫాషనైపోయాయి. ఎవడుపడతాడూ, తొమ్మిదినెలలూ, హాయిగా ఇంకోరి గర్భం అద్దెకొస్తూంటే. ఇలా ప్రతీదీ instant  యుగం అయిపోయింది…

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
chitram bhalarevichitram