Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ..http://www.gotelugu.com/issue185/530/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

( గతసంచిక తరువాయి) 

అక్కడ  మరో  విశేషం కూడ గమనించాడు ధనుంజయుడు. ఆ రాతి కట్టడంలో ఎక్కడా కాంతులు చిందే మణులు నిక్షిప్తం చేయ బడ లేదు.  చీకట్లను పొగొట్టేందుకు స్తంభాలకు తగిలించిన కాగడాలు సదా మండుతూంటాయి. అక్కడ కొన్ని గదుల్లో బంధీలున్నారు. వాళ్ళలో కొందరు రాక్షసులు మిగిలిన వారెవరో తెలీదు. కాని చాలా గదులు కాళీగానే వున్నాయి.

ఆ చెరసాలకు ఒక రాక్షసాంగన అధికారిణి గావటం విశేషం. ప్రవేశ ద్వారం పక్కనే ఆమె అధికారిక కార్యాలయం వుంది. ధనుంజయుని తీసుకొచ్చిన సమయానికి ఆమె అచట లేదు. గొని వచ్చిన రాజ భటులు ధనుంజయుని చెర సాల భటులకు వప్పగించి వివరాలు చెప్పి వెళ్ళి పోయారు. చెరసాల రాక్షస భటులు ధనుంజయుని ఒక గది లోకి నెట్టి తలుపులు మూసారు. లోన ఎత్తుగా వున్న ఒక తిన్నె మీద నడుం వాల్చాడు ధనుంజయుడు. ఆలోచనల్లో సమయం తెలీ లేదు. చాలా సేపటి తర్వాత చెర సాల అధికారిణి అయిన రాక్షస కన్య అక్కడి కొచ్చింది. అశ్వం దిగి నేరుగా తన కార్యాలయంలో కూచుంది. ధనుంజయుని గురించి తెలీగానే అతడ్ని తన ముందుకు తీసుకు రమ్మని ఆజ్ఞాపించింది.

ఆ అధికారణి పేరు చిత్రిక.

తల మీద గుప్పెడు ఎత్తున పెరిగిన రెండు కొమ్ములను బట్టి ఆమె రాక్షస యువతి అనుకోవాలి గాని చూడ్డానికి అందమైన యువతి లాగే వుంది. వీర విద్యల్లో ఆరితేరిన కన్య అగుట చేత ఆ చెరసాలను నిర్వహించు బాధ్యత ఆమెకు వప్పగించబడింది. మిగిలిన రాక్షస యువతుల్లా వికారంగా లేదామె. ఎప్పుడూ సైనిక దుస్తులే ధరిస్తుంది. కాని సదా మధిర సేవిస్తుంది. నడుంకి ఒరలో కృపాణం చేతిలో కొరడాతో సంచరించటం ఆమె అలవాటు. యువతి అయినా ఆమెను చూస్తే చాలు రాజ భటులు కూడ జంకుతారు. అంతకు ముందే ధనుంజయుని గురించి కొంత విని వుంది. అందుకే తక్షణం అతడ్ని చూడాలని భటుల్ని పంపించింది. కాని వాళ్ళు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు.

‘‘ఏమైనది? బందీ ఎక్కడ?’’ కోపంతో గద్దించింది.

‘‘తను రానంటున్నాడమ్మా. తనతో మాట్లాడాంటే మీరు అక్కడికి రావాలట’’ అన్నారు భటులు.

ఆ మాటలకు చిత్రిక కోపంతో మండి పడింది. వెంటనే కొరడా అందుకుని విస విసా ధనుంజయుని గది ముందుకు వెళ్ళింది. అక్కడ ఏమి రభస చేస్తుందోనన్న జంకుతో భటులు ఆమె వెంట వెళ్ళ లేదు.

గది లోన తిన్నెమీద`

నిర్లక్ష్యంగా కూచున్న ధనుంజయుని చూడగానే చిత్రిక కోపం ఒక్క సారిగా ఆవిరై పోయింది. మదన తాపం ఆరంభమైంది. ధనుంజయుని రూపు రేఖా విలాసాలకు, రాజసానికి ముగ్ధురాలవుతూ తాళం తీసి గది లోకి నడిచింది. తన డాంబికాన్ని వదులు కోకుండా` ‘‘ఏమి నీ ధైర్యం? ఇచట నీవు బందీవని మరిచితివా? నా సమక్షమునకు రమ్మని కబురంపిన రానంటివట? అంత తెంపరి తనమా?’’ అంటూ గద్దించింది.

‘‘నీ నామ ధేయమేమి?’’ ఆమె మాటల్ని పట్టించు కోకుండా సూటిగా చూస్తూ ప్రశ్నించాడు ధనుంజయుడు.

‘‘చిత్రిక’’ చెప్పింది.

‘‘రాక్షస యువతివా?’’

‘‘రాక్షస కన్యను.’’

‘‘ఇచట స్త్రీలు కూడ సైన్యమున పని చేతురా?’’

‘‘అవును. అనేక మంది యువతులు సైన్యంలో విధులు నిర్వహిస్తుంటారు’’

గొలుసు శబ్ధం చేస్తుండగా`

తిన్నె దిగి నిలబడ్డాడు ధనుంజయుడు.

‘‘చూడు చిత్రికా. సేవ గొనుటే గాని సేవించు అలవాటు లేని సుక్షత్రియ వంశం మాది. నను ఎవరూ శాసింప జాలరు. నీవు నా ముందు అధికార దర్పము చూప కుండుట మంచిది. వెళ్ళుము’’ అన్నాడు.

చిత్రిక మందహాసం చేసింది. ఆమె ఎద భారాలు బిగువై కంచుకం పిట పిట లాడింది. కళ్ళలో యువ్వనపు మెరుపు మెరిసింది.

‘‘ఆహాఁ! నరుడవైన నేమి. ఆ అనంగుని తపించు సుందర పురుషుండవు. జూడగానే నా మనసున మరులు రేపి కామ పీడితు రాలిని జేసినావే..., ఏ దేశ రాకుమారుండవు?’’ అంది చిత్రిక.

‘‘అది నీకు అవసరమా?’’ గంభీరంగా అడిగాడు ధనుంజయుడు.

‘‘అవసరమే గదా... నా మది దోచిన వాడివి. ఎలాగూ యిచట నీకు చెర వాసము తప్పదు. నను వివాహము చేసుకొనుము. ఈ చెర వాసము తప్పించి నిను మా గృహమునకు గొని పోదును. మనము సురత క్రీడ దేలి యవ్వన మధుర్యాన్ని చవి చూడ వచ్చును.’’
ధనుంజయుడు చిత్రిక మాటలకు చిన్నగా నవ్వాడు.

‘‘అసంభవము చిత్రికా... జరగని వాటికి ఆశ పడకుము. నీవు రాక్షస కన్యవు, నేను మానవుడను...’’

‘‘అయిన నేమి?’’ అంటూ అతడి మాటలకు అడ్డు వచ్చింది చిత్రిక.

‘‘సద్బ్రాహ్మణుడు, బ్రహ్మ మానస పుత్రుడగు పులస్త్య బ్రహ్మ తన కుమారునికి మా రాక్షస కన్య  కైకసి నిచ్చి వివాహము చేయ లేదా? ఆ దంపతులు రావణ బ్రహ్మకు జన్మ నీయ లేదా? అంత దేనికి, పాండవ ద్వితీయుడు భీమ సేనుడు మా రాక్షస కన్య హిడింబను వివాహ మాడి ఘటోత్కచునికి జన్మ నీయ లేదా? నీవు నన్ను వరించుట లో తప్పే మున్నది? నా పొందు నీకు విందు సుమా’’ అంటూ నవ్వింది.
‘‘చిత్రికా... మనకు పొసగదు. నీ కోరిక తీరనిది. ఇక నీవు వెళ్ళ వచ్చును’’ అన్నాడు ధనుంజయుడు.

ఆమె వెళ్ళ లేదు.

చిన్నగా అతడి ముందు కొచ్చి నిల బడింది.

భుజాల మీద చేతు లేసి కుడి కాలు లేపి అతడి నడుంని చుట్టేస్తూ హత్తు కొని కళ్ళ లోకి ఆకలిగా చూసింది.

‘‘వివాహమున కిచ్చ లేకున్న ఏమాయె. ఒక పరి నా కోరిక తీర్చుము. నా కామ దాహమును పోద్రోలుము. నిను గాంచ గనే నా ఎదలో రగిలిన యవ్వన చిచ్చును చల్లార్చుము. నీ బిగి కౌగిట స్వర్గమును తలపించుము. అది చాలును’’ అంటూ తన ఎద భారాలను ధనుంజయుని ఛాతీకి అది మేస్తూ కౌగిలి బిగించి అధర చుంబనానికి తల పడింది.

అదిరి పడుతూ ధనుంజయుడు ఒక్క తోపులో చిత్రికను వెనక్కి నెట్టేసాడు. ఆ విసురుకు చిత్రిక తూలుతూ వెళ్ళి గుమ్మం ముందు పడింది. అంతే`

నిప్పులు కురిసే కళ్ళతో భుజంగంలా చివ్వున లేచి నిలబడింది చిత్రిక` ‘‘ఏమిరా మానవా...  కోరి వచ్చితినని ఇంత చులకనా? నా కోరిక తిరస్కరించి నను అవమానించి ఘోర తప్పిదము జేసినావు. నా కోరిక తీర్చకున్న ఇప్పుడే నిను సంహరించెద’’ అంటూ బెదిరించింది.

‘‘ఆహాఁ! చంప గలవేమో ప్రయత్నించు చూడము’’ అన్నాడు ధరహాసంతో ధనుంజయుడు.

‘‘నరుడివి... మానవుడివి నీకింత అహంకారము, తల పొగరు పనికి రాదు. నను తిరస్కరించి నందుకు పై లోకమున చింతించెదవు గాక. నర మాంస భక్షణ జేసి చాలా దినము లాయె. నిను జంపి నీ రక్త మాంసములతో విందారగించెద. ఆ విధముగా నిను నాలో ఐక్యము గావించెద’’ అంటూ సర్రున ఖడ్గాన్ని దూసి రాక్షస బలంతో ధనుంజయుని తల నరకడానికి వేగంగా మీదకు వచ్చేసింది.

ధనుంజయుడు ఆమె ఖడ్గ ప్రహరాన్ని తన చేతి గొలుసులతో తిప్పికొట్టి అదే వేగంతో బలంగా ఆమె ముఖం మీద కొట్టాడు. గొలుసుల దెబ్బకు దిమ్మ తిరిగి గింగిరాలు తిరుగుతూ పోయి గుమ్మంలో పడింది.

‘‘స్త్రీల, బాలల, వృద్ధుల్ని హింసింప రాదు, చంప రాదను నియమము గల వాడిని గాబట్టి బ్రతికి పోయావ్. ఇకనయినా నీ అహంకారము విడిచి ఆవలకు పొమ్ము’’ అంటూ హెచ్చరించాడు.

ఆమెకు వెళ్ళే ఉద్దేశం లేదు.

చివ్వున లేచి రౌద్రంగా చూసింది.

‘‘నన్నే కొట్టిన నీ ఆగడానికి శిక్ష తప్పదు. చావు తప్పదు’’ అంటూ పెద్దగా అరిచి తన రాక్షస సిబ్బందిని పిలిచింది. అక్కడ ఏం జరిగిందో అర్థం గాక పోయినా ఈటలు, బళ్ళాల వంటి తమ మారణాయుధాల్ని ఎక్కు పెట్టి బిల బిలా పరుగు లెత్తు కొచ్చే సారు ఇరవై మంది రాక్షస భటులు. చిత్రిక లేచి నిల బడి కృరంగా చూసింది.‘‘ఇక నీకు చావు తప్పదురా నరుడా. సుక్షత్రియుడవు గదా. నీ రక్త మాంసము బహు రుచి కర ముగ ఉండును’’ అంటూ తన భటుల్ని చూసింది.ఆమె మాటలకు ఉలికి పడ్డాడు ధనుంజయుడు.

‘‘రుచి... రుచి కర ముగ... తన మిత్రుడు యక్షుని పేరు ఇలాంటిదే గదా... అవును... రుచికుడు’’ ఆహా మిత్రమా గుర్తు వచ్చినది. నీ పేరు గుర్తు కొచ్చినది’’ అనుకుంటూ ఆనంద పడి పోయాడు. ఈ లోపల`

‘‘ఈ నరుడ్ని కౄరంగా వధించండి’’ అంటూ తన భటులకు ఆజ్ఞాపించింది చిత్రిక. ‘‘ఈ దినమున నర మాంస భక్షణతో విందారగించెదము గాక. పొగరు తేలిన వీడి మాంసము అమిత రుచి కరముగ వుండును. ఊఁ... చంపండి’’ అనరిచి ఆజ్ఞాపించింది భటులకు.

తన మీద కొస్తున్న రాక్షస భటుల్ని అటు యిటు బాది చెదర గొడుతూ చిత్రికను చూసాడు ధనుంజయుడు` ‘‘చిత్రికా! నాకు శత్రువుగా మారినను మహోపకారమే జేసినావు. కృతజ్ఞుడను...’’ అంటూ పైకి చూసి` ‘‘హే యక్ష ప్రముఖా... మిత్రమా రుచికా... ఎక్కడున్నావయ్యా. బిరాన వచ్చి నాకీ పాతాళ చెర వాసము తప్పించి భూ లోకము చేర్చుము’’ అంటూ బిగ్గరగా అరిచాడు.

అంతే`

పెద్ద మెరుపు మెరిసింది.

కనులు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని చూడ లేక వెర్రి కేకలు వేస్తూ విరుచుకు పడి పోయారు రాక్షస భటులు. రాక్షస కన్య చిత్రిక భయంతో గోడలకు ఒదిగి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ మెరుపుల వెంబడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు యక్షుడు రుచికుడు.

‘‘ఆహాఁ! మిత్రామా. ఎన్ని దినములకు నేను గురుతుకు వచ్చితిని. మిక్కిలి ఆనందముగ నున్నది.’’ అంటూ వచ్చి ధనుంజయుని కౌగిలించుకున్నాడు. అప్పుడే అతడి సంకెళ్ళను చూసి ఆశ్చర్య చకితు డయ్యాడు. అక్కడి భటులను కారా గారాన్ని చూసి కోపోద్రుక్తుడయ్యాడు.

‘‘ఏమిది... ఏమి చూస్తుంటి? మహా వీరుడవి. నిను సంకెళ్ళతో బంధించిన శత్రువు లెవరు? అసలు ఈ పాతాళ లోకమునకు, ఈ కారాగారమునకు ఎటుల వచ్చితివి?’’ అని ప్రశ్నిస్తూ తృటిలో ధనుంజయుని సంకెళ్ళను గడ్డి పోచలను త్రెంచినట్టు త్రెంచి అవతల పడేసాడు.

‘‘అదంతయూ పిమ్మట వివరించెద గాని మిత్రమా. ముందు నను భూ లోకమున మత్స్య దేశ మందలి శివ నాగ పురమున గల గుట్ట మీది శివాలయమునకు చేర్చుము’’ అంటూ అర్థించాడు ధనుంజయుడు.

‘‘అది ఎంత పని మిత్రమా. కాని నిన్నీ తెరంగున బంధించిన వారికి బుద్ధి చెప్ప వలె గదా’’ అంటూ గది లోకి వెళ్ళి వెనక గోడను బలంగా తన్నాడు. అంతే` ఆ రాతి గోడ తునాతునకలుగా పగిలి పోయి అవతల ఎడారి లోకి మార్గం ఏర్పడింది.

‘‘రమ్ము మిత్రమా. కొద్ది సేపు అలా నిల బడి చూడుము.’’ అంటూ ధనుంజయుని బయటికి పంపించి లోపలి కెళ్ళాడు. అప్పటికే చిత్రికతో సహా రాక్షస భటలు ప్రాణ భయంతో చెర సాల ముఖ ద్వారం వైపు పరుగెత్తారు. రుచికుడు మిగిలిన గదుల తలుపు పగల గొట్టి బంధీలను బయటకు తరిమాడు. పిమ్మట తన శరీరాన్ని అనూహ్యంగా పెంచేస్తూ కారా గారం పై కప్పును బలంగా మోదటంతో ఆ భాగం పిడుగు పాటుకు గురైనట్టుగా కిర కిర లాడుతూ కూలి పోయింది. 

 

( రుచికుడి సాయంతో బంధ విముక్తుడై తనదారిన తాను ధనుంజయుడు వెళ్ళిపోతే అతడి మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న మణిమేఖల భవిష్యత్తేమిటి......వచ్చేవారం....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్