Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
narudadonaruda movie review

ఈ సంచికలో >> సినిమా >>

సుమంత్ తో ఇంటర్వ్యూ

interview with sumanth
అంద‌రూ పెళ్లి చేసుకోవాల‌న్న రూలేం లేదు క‌దా?- సుమంత్‌
 
హీరోలంతా బిజీ బిజీగా ఉన్నారు. ఒకొక్క‌రి చేతుల్లో రెండు మూడు సినిమాలున్నాయి. అయినా ఈ స్పీడు స‌రిపోవ‌డం లేదు. యేడాదికి క‌నీసం మూడు సినిమాలైనా చేయాల‌న్న ఉద్దేశంతో స్పీడు పెంచి దూసుకుపోతున్నారు. అయితే.. వీళ్ల‌మ‌ధ్య సుమంత్ ప్ర‌యాణం కాస్త భిన్నంగా క‌నిపిస్తోంది. ఆయ‌న‌కు క‌థ న‌చ్చిన‌ప్పుడు, తోచిన‌ప్పుడు, అన్నీ కుదిరిన‌ప్పుడు సినిమా చేస్తుంటాడాయ‌న‌. అందుకే సినిమా సినిమాకీ చాలా గ్యాప్ వ‌స్తుంటుంది. రెండేళ్ల త‌ర‌వాత సుమంత్ నుంచి ఓ సినిమా వ‌స్తోంది. అదే.. న‌రుడా - డోన‌రుడా. బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ట‌యిన విక్కీ డోన‌ర్ కి ఇది రీమేక్‌. ఈ శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సుమంత్‌తో చేసిన చిట్ చాట్ ఇది.
 
* హాయ్ సుమంత్‌..
- హాయ్‌...
 
* చాలాకాల‌మైంది క‌ల‌సి..
- అవునండీ. నాకూ అంద‌రిలా త్వ‌ర త్వ‌ర‌గా సినిమాలు చేయాల‌ని ఉంటుంది. కానీ మంచి క‌థ దొర‌కాల‌న్న‌దే నా కండీష‌న్‌. అది దొర‌కడానికి ఇంత టైమ్ ప‌ట్టింది.
 
* నిజంగా మ‌న‌కు మంచి క‌థ‌లు లేవంటారా?
- లేవ‌ని కాదు.. ఉన్నాయి. కానీ అవి స‌రైన చోటికి చేర‌డం లేదు. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌కు లోటు లేదు. కానీ.. అలాంటి ఫ‌క్తు సినిమాలు నేను చేయ‌లేను. 
 
* విక్కీడోన‌ర్ లాంటి కాన్సెప్టులే బెస్ట్ అంటారా..?
- బెస్ట్ అని చెప్ప‌ను.. కానీ ఎట్‌లీస్ట్ మ‌న త‌ర‌పునుంచి ఏదోటి కొత్త‌గా ట్రై చేయ‌డానికి వీలుంటుంది క‌దా?  అందుకే ఇలాంటి ప్ర‌య‌త్నాలు అడ‌పాద‌డ‌పా అయినా జ‌ర‌గాలి.
 
* కానీ ఇది కూడా రీమేక్‌నే క‌దా, ఇక్క‌డ ఇలాంటి క‌థ‌లు దొర‌క‌వా?
- దొర‌క‌డం లేదు. అస‌లు ఇలాంటి కాన్సెప్టులే ఆలోచించ‌డం లేదు. 2012లోనే ఈ సినిమా చూశా. చాలా బాగా న‌చ్చింది. అప్ప‌టికి రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న‌లేదు. ఎవ‌రైనా ఈ త‌ర‌హా వెరైటీ, బోల్డ్ స‌బ్జెక్టులు చెబితే చేద్దామ‌నిపించింది. కానీ.. అంద‌రూ రొటీన్ క‌థ‌లే చెప్పారు. ఈ సినిమానే మ‌నం ఎందుకు రీమేక్ చేయ‌కూడ‌దు? అనిపించింది.  జాన్ అబ్ర‌హాంని అడిగితే రీమేక్ రైట్స్ ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేద‌ని చెప్పాడు.. సో.. వెంట‌నే తీసేసుకొన్నా. 
 
* స్పెర్మ్ డొనేష‌న్ అంటే.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎక్కుతుందా?  ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి దూర‌మైపోతారేమో?
- నిజానికి ఇది బోల్డ్ స‌బ్జెక్టే. అయితే దాన్ని చాలా లైట‌ర్ వేలో తీశాం. స‌న్నివేశాల‌న్నీ వినోదాత్మ‌కంగా సాగుతాయి. క్లైమాక్స్ భావోద్వేగాల‌తో సాగుతుంది.
 
* అయితే జ‌నం ఇది మ‌సాలా సినిమా అనుకొనే ప్ర‌మాదం ఉంది క‌దా?
-  అందుకే చెబుతున్నా.. ఇది ఇంటిల్లిపాదీ చూడ‌ద‌గిన చిత్రం. మ‌సాలా సన్నివేశాలేం లేవు. క‌నీసం ఒక్క లిప్ లాక్ సీన్ కూడా లేదు.. (నవ్వుతూ)
 
* నాగార్జున గారికీ ఈ క‌థ బాగా న‌చ్చింద‌నుకొంటా.. వెంక‌టేష్ బాగా ప్ర‌మోష‌న్ చేస్తున్నారు..
-  ఓ ప‌దేళ్ల క్రితం నాగ్ మావ‌య్య‌కి ఈ క‌థ చెబితే క‌చ్చితంగా చేసేవారు. ఎందుకంటే ఆయ‌న కొత్త త‌ర‌హా క‌థ‌ల్ని, సినిమాల్నీ ఎప్పుడూ ప్రోత్స‌హిస్తూనే ఉంటారు. ఇక వెంక‌టేష్ మావ‌య్య‌కి విక్కీడోన‌ర్ కాన్సెప్ట్ బాగా న‌చ్చింది. అందుకే.. ప్ర‌మోష‌న్ చేయ‌డానికి ఆయ‌నే ముందుకొచ్చారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు..
 
* ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లూ మీరే స్వ‌యంగా చూసుకొన్నార్ట‌...
- అవునండీ. ప్రొడ‌క్ష‌న్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని విష‌యాల్లోనూ ఇన్ వాల్వ్ అయ్యా. అలాగైతేనే అవుట్ పుట్ క‌రెక్ట్‌గా వ‌స్తుంద‌ని నా న‌మ్మ‌కం. ఈ సినిమాకి ప‌నిచేసిన‌వాళ్లంతా దాదాపుగా కొత్త‌వాళ్లే. వాళ్లు ఫ్రెష్ ఐడియాస్‌తో వ‌చ్చారు. కొత్త‌వాళ్ల‌తో ప‌ని చేయ‌డంలో ఓ తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. అది ఈ సినిమాకి ప్ల‌స్ అయ్యింది.
 
* భవిష్య‌త్తులో డైరెక్ష‌న్ కూడా చేస్తారా..?
- అబ్బే.. అంత సీన్ లేదు. ప్రొడ్యూస‌ర్‌గా నాలుగు మంచి సినిమాలు చేసుకొంటే చాలు.  
* నాగ‌చైత‌న్య‌, అఖిల్‌లు పెళ్లి చేసేసుకొంటున్నారు.. మ‌రి మీరెప్పుడు చేసుకొంటారు?
- వాళ్ల పెళ్లికి వెళ్తా... హ‌డావుడి చేస్తా. కానీ నేను మాత్రం చేసుకోను. అంద‌రూ పెళ్లిళ్లు చేసుకోవాల‌న్న రూలేం లేదు క‌దా? ఇలా నాకు హ్యాపీగానే ఉంది.
 
* ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు పిల్ల‌ల‌పై మ‌న‌సు పోలేదా?
- లేదు.. ఎందుకంటే సినిమా సినిమానే, జీవితం జీవిత‌మే.
 
* కొత్త క‌థ‌లు త‌యారు చేసుకొంటున్నారా?
- అది నా చేతుల్లో లేదు. ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు కొత్త ఆలోచ‌న‌ల‌తో రావాలి. నాకు మాత్రం వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాల్ని చేయాల‌ని ఉంటుంది. విల‌న్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని వుంది. అయితే అలాంటి క‌థ‌లు రాయ‌డం అంత ఈజీ కాదు. ఇమేజ్‌ని ప‌క్క‌న పెట్టి న‌టించాలి. చిరంజీవి, మోహ‌న్‌బాబులాంటి హీరోలు కూడా విల‌న్ పాత్ర‌ల్లో రాణించిన‌వాళ్లే. న‌టుడిగా నిరూపించుకోవాలంటే అలాంటి పాత్ర‌లు ఒక్క‌సారైనా చేయాలి.
 
* ఇక ముందు స్పీడు పెంచుతారా.. లేదంటే ఇలానే ఆచి తూచి సినిమాలు చేస్తారా?
- యేడాదికి ఒక్క సినిమా అయినా చేయాలి. అలాగ‌ని అంకెల కోసం చేయ‌కూడ‌దు క‌దా. మంచి క‌థ వ‌స్తే ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆగ‌ను.

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
megastar in katamarayudi shooting set