Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముక్కు పచ్చలారని కాశ్మీరం - కర్రానాగలక్ష్మి

( జమ్ము ---4 )



సుమారు మూడు వేల సంవత్సరాల పూర్వం యీ ప్రాంతాన్ని పరిపాలించే సూర్య వంశ రాజైన అగ్నిలోచనుని కి పద్దెనిమిది మంది పుతృలు , వారిలో పెద్దవాడైన బహులోచనుని పేరు మీద కట్టించిన కోట యిది . రెండవ పుతృడైన జంబులోచనుని పేరు మీద జమ్మునగరాన్ని నిర్మించేడు . 1585 లో అప్పటి రాజు , కపూర్ దేవ్ మనుమడు అయిన అవతార దేవ్ యీ కోటకు మరమ్మత్తులు చేయించేడు . ఈ కోటలో కాళికా దేవి మందిరం , వుద్యానవనం చూడదగ్గవి .

19 వ శతాబ్దంలో మహారాజా గులాబ్ చంద్ కాలంలో యీ కోటలో కాళికాదేవి మందిర నిర్మాణం చేపట్టాడు . ఆ మందిరం అతని పుతృడైన రంజిత్ సింగ్ పరిపాలనా కాలంలో పూర్తి చెయ్యబడింది . ఈ విగ్రహం రామజన్మభూమి అయోధ్య నుంచి తెప్పించి ప్రతిష్ఠించేరు . సుమారు 325 మీటర్ల యెత్తున నిర్మించ బడింది యీ మందిరం . మిగతా కోట పాడుబడిపోయింది . ఇది రాష్ట్ర ప్రభుత్వం వారిచే హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది . ఇక్కడనుంచి ' ముబారక్ మండి ' అనే మరొక హెరిటేజ్ సైట్ వరకు రోప్ వే నడప బడుతోంది .

మందిర ముఖ్య ద్వారానికి యెడమ వైపున వున్న తటాకంలో భక్తులు స్నానాలు చేసుకొని దేవిని ఆరాధించుకుంటారు .తెల్లపాలరాతి కట్టడం . ' బావె మాత ' అని స్థానికులు యీ అమ్మ ని పిలుస్తారు . జమ్ము ప్రజలు యీమెని గ్రామ దేవతగా పూజిస్తారు .

చైత్ర నవరాత్రులు , దేవీనవరాత్రులలో ' బహు మేలా ' నిర్వహిస్తారు . ప్రతీ  ఆదివారం  , గురువారలలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు .

ఈ కోట యెన్నో యుధ్దాలతోను , రెండు భూకంపాలతోను క్షతికి గురైంది .

ముబారక్ మండి ----

1824 లో నిర్మింపబడిన  రాజ భవనాన్ని  ' ముబారక్ మండి ' అని అంటారు . డోగ్రా రాజుల పరిపాలన వుండి 1925 వరకు రాజులు నివాస భవనంగా వుండేది . మహారాజా హరిసింగ్ 1925 లో జమ్మునగరానికి వుత్తరంగా వున్న హరినివాస్ కి తన నివాసాన్ని మార్చుకున్నాడు . ముబారక్ మండి జమ్ము కోట లో మధ్యభాగాన నిర్మించ బడింది . తావి నది వొడ్డున వున్న భవనం . ఈ భవనం చాలా మటికి కూలిపోయింది . ఈ భవనం రాజస్థాన్ , మొఘల్ , , యురోపియన్ శిల్పకళలు మేళవించి నిర్మింపబడింది .

నాలుగు అంతస్తులలో నిర్మింప బడిన ' గోల్ ఘర్ ' ప్రస్తుతం మిగిలివుంది .

ఈ భవనం మొత్తం 36 సార్లు అగ్ని ప్రమాదాలకు గురియైంది . 1980 లో ఒకసారి , 2005 లో ఒకసారి సంభవించిన భూకంపాలకు సుమారు పూర్తిగా కూలిపోయింది . దీనిని రాష్ట్ర ప్రభుత్వం వారు హెరిటేజ్  సైట్ గా గుర్తించేరు .  ఇక్కడ నుంచి బహు కోట  అనే మరొక హెరిటేజ్ సైట్ వరకు రోప్ వే నడప బడుతోంది .

రణభీరేశ్వర్ మహదేవ మందిరం----

ఉత్తరభారతం దేశం లో అతి పెద్ద శివ మందిరంగా పేరుపొందిన రణభీరేశ్వర్ మహదేవ మందిరం 1883 లో మహారాజా రణభీర్ సింగ్ ద్వారా నిర్మింపబడింది . ఈ మందిరం డోగ్రా జాతి వారి ఆధ్వర్యంలో వుంది . గర్భగుడిలో నల్లరాతితో నిర్మించి యెనిమిది అడుగుల శివలింగం అద్భుతం గా వుంటుంది . ఈ మందిరం లో నంది , గౌరి , వినాయకుడు , కుమార స్వామి విగ్రహాలు వున్నాయి . ఇవికాక సుమారు 15 సెంటిమీటర్ల నుంచి 36 సెంటిమీటర్ల పొడవు వున్న 12 స్పటిక లింగాలు వున్నాయి . ఇన్ని స్పటిక లింగాలు కల ఒకేవొక మందిరం యిదేనేమో ! ఈ మందిరం గోడలలో సుమారుగా 1 లక్షా 25 వేల నర్మదానది నుంచి తెచ్చిన శాలిగ్రామాలు వున్నాయి .

  అమర్ మహల్ పేలస్ ----

1890 లో డోగ్రా రాజైన అమర్ సింగ్ ప్రెంచ్ ఆర్కిటెక్ట్ సహాయంతో నిర్మించిన భవనం . కరణ్ సింగ్  యీ భవనాన్ని సంగ్రహాలయంగా వుపయోగించుకొనేందుకు  ' హరి తారా ఛారిటబుల్ ట్రస్ట్ ' కి అప్పగించేరు . ఇందులో డోగ్రా రాజుల దుస్తులు , చిత్రపటాలు , ఆయుధాలతో పాటు సుమారు 125 కిలోగ్రాముల బంగారం సింహాసనం కూడా వుంది . ఈ సంగ్రహాలయంలో పహాడి , కాంగ్రా చిత్రాల నమూనాలు , అతి దుర్లభమైన గ్రంధాలు సుమారు 25 వేల వరకు నిక్షిప్తం చెయ్యబడ్డాయి  .

హరి నివాస్ పాలెస్----

త్రికూట పర్వతాలలో తావి నదికి యెదురుగా అప్పటి రాజైన హరిసింగ్ 1895 లో నిర్మాణం మొదలు పెట్టబడింది . దగ్గర దగ్గర 1925 లో పూర్తిచెయ్యబడి  , రాజ నివాసాన్ని ముబారక్ మండి నుండి హరినివాస్ కి మార్చబడింది . అప్పటినుండి యీ భవనం రాజ నివాసంగా వుంది . తరువాత రాజా హరిసింగ్ తన నివాసాన్ని బొంబాయికి మార్చుకొని రాజ భవనాన్ని మూసివేసేరు . 1990 లో హరి నివాస పేలస్ ని హెరిటేజ్ హోటల్ గా మార్చేరు .

అమర సింగ్ పేలస్ , హరి నివాస పేలస్ రెండూ పక్కపక్కగా వుంటాయి .

మళ్లా వారం మరిన్ని విశేషాలతో మీ ముందుంటా అంత వరకు శలవు .

మరిన్ని శీర్షికలు
alaa..ilaa