Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
alaa..ilaa

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట  ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు 
అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణిస్తున్నాడు పరమశివుడు.

విహితమతిం బరిచారక 
సహస్రమయి పితృయుగంబు సంభావించున్
గృహమేధివతంసము నిజ 
మహిళామణి యప్రతీపమతిఁ దోడ్పడగన్                   (కం)

తన బుద్ది అనుకూలించగా, వేలమంది సేవకులపెట్టు తానొక్కడే అయి, తన  తల్లిదండ్రులను యజమానులలాగా తనను ఒక సేవకుడిలాగా భావిస్తూ, ఆ ఉత్తమ  గృహస్థు సేవించేవాడు. ఆయన భార్య ఎదురాడకుండా, అనుకూలవతియై భర్తకు  తోడ్పడేది. 

ఆపాదమస్తకంబు నంటు నూనియఁ గాచి
నయముగా నుద్వర్తనంబొనర్చు
జలకమార్చు నఖంపచ స్వచ్ఛజలముల
దడియొత్తుఁ గడు మెదుగుడులఁ బొదివి 
లఘు ధౌతవసన పల్లవములు గట్టించు 
శిరసార్చు మ్రుడులీల సురటి విసరి 
చేయూఁత యొసఁగి వేంచేయించు లోనికి 
ద్వారావతి గలంతిఁ దానె యొసగుఁ                (సీ)

దెలుపు సంధ్యాసమాధి విధి ప్రయుక్తి 
నగ్ని వేల్పించు విష్ణుసహస్రనామ 
పాఠమొనరించుతఱిఁ దోడుపడు గురునకుఁ 
గవలువోకుండఁ బుత్రుఁడో కలువకంటి          (తే)

చక్కగా నూనెను కాచి ఆపాదమస్తకమూ అంటుతాడు. నెమ్మదిగా తనే స్వయముగా  నలుగుపెట్టి, గోరువెచ్చని శుభ్రమైన నీటితో స్నానం చేయిస్తాడు. మెత్తని గుడ్డలతో  స్వయముగా తానే తడిని ఒత్తుతాడు, తుడుస్తాడు. నెమ్మదిగా విసనకర్రతో విసిరి  తలకున్న తడిని ఆరుస్తాడు. ఉతికిన మెత్తని, పలుచని వస్త్రములను కట్టిస్తాడు.

చేయూతతో లోపలికి తోడుకుని వస్తాడు. చెంబును అందిస్తాడు, జలముతో నింపి, సంధ్యా విధులను తెలిపి, చేయిస్తాడు. అగ్నిని వ్రేల్పిస్తాడు. విష్ణుసహస్రనామ  పాఠము చేసేప్పుడు క్రమము తప్పకుండా, మధ్యలో ఒకవేళ పొరపాటు దొర్లితే  సరిజేసి, సహాయము చేస్తాడు. ఓ కలువకంటీ, పార్వతీ! ఈ విధముగా పుండరీకుడు  తన తల్లిదండ్రులను సేవించేవాడు.

చూపు చాలమి వివిధ రూపోపకరణ 
వితతిఁ దడవాడు జనకునానతి శిరమునఁ 
దాల్చి నిద్దంపు బుద్దిఁ దద్దారకుండు 
చక్రహస్తార్చనమున కుపక్రమించు.               (తే)

చూపు ఆనకపోవడంతో తన తండ్రి వివిధములైన పూజా ఉపకరణములను ఉపయోగించడంలో  తడబడుతుంటే, ఆ కుమారుడు తన తండ్రి ఆజ్ఞను శిరసావహించి, చక్కని బుద్ధితో చక్రహస్తుని  అర్చనకు పూనుకుంటాడు.

అభిషేకమొనరించు నాకాశవాహినీ 
జననకారణ పాదజలరుహునకు 
వైచుఁ దోమాలియ వైజయంతీకాంతి 
వలయిత వక్షఃకవాటునకును 
గౌశేయమర్పించుఁ గాంచనమయ పటీ
పల్లవావృత కటీబంధురునకుఁ 
జందనంబలఁదు నీళేండిరా కుచకుంభ 
సంగి కుంకుమ పంకిలాంగునకును             (సీ)

రత్నహారంబు సాతు నిర్యత్నసిద్ద 
కౌస్తుభోదర్చి రాభిరామ కంధరునకు 
ధూపకల్పన మున్నుగా దీపమిచ్చుఁ 
దెరవ! యాతఁడు త్రైలోక్యదీపకునకు   (తే)

ఆకాశావాహినీ జన్మకారణములైన పాద పద్మములకు అభిషేకము చేస్తాడు. ఆకాశావాహిని  అంటే గంగ, దేవగంగ. గంగకు విష్ణుపాదోద్భవ, విష్ణు పాదములనుండి పుట్టినది అని పేరు.గోలోక బృందావనంలో ఆది శ్రీకృష్ణుడు ఒక గోపికతో రాసక్రీడలాడుతుంటే రాధాదేవి చూస్తుంది. భయముతో, సిగ్గుతో ఆ గోపిక అక్కడే కరిగి ఆయనపాదములమీదబడి నీరవుతుంది. గంగ అవుతుంది. యిది పురాణ రహస్యము. దానిని యిక్కడ ధ్వనిస్తున్నాడు  తెనాలి రామకృష్ణుడు. అంతేగాక, వామనావతారములో పెరిగిన త్రివిక్రముడు ఆకాశానికి 
తన పాదాన్ని తన్నిపెట్టినపుడు ఆయన పెద్దనవ్రేలు పొడుచుకుని ఆకాశానికి చిల్లి పడి, ఆకాశగంగ ఆ పాదమునుండి కారుతూ యిలకు దిగింది, కనుక కూడా విష్ణుపాదములనుండి పుట్టినది.

వైజయంతీమాలప్రభలు చుట్టుకున్న వక్షఃస్థలం మీద తోమాల వేస్తాడు. బంగారుచిగురులాంటి  వస్త్రమున్న నడుముకు వస్త్రాన్ని చుడతాడు. నీళా, లక్ష్మీవక్షస్థలములకున్న కుంకుమ అంటిన  శరీరానికి చందనాన్ని పూస్తాడు. అనాయాసంగా కౌస్తుభమణి వచ్చి అలంకరించిన మెడలో  రత్నహారాన్ని వేస్తాడు. ముందు ధూపమిచ్చి, ఆ తరువాత దీపమిస్తాడు ముల్లోకాలను దీపింపజేసే  మహానుభావునికి. తెరవా! ఓ అతివా! ఈవిధముగా ఆతడు శ్రీహరిని అర్చిస్తాడు అని పుండరీకుని  శ్రీహరి అర్చనావిధానాన్ని తెలుపుతున్నాడు పరమశివుడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
navvunaaluguyugaalu