Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

పర్యాటకం - కర్రా నాగలక్ష్మి

paryatakam

లదాక్ చూద్దాం రండి

మూడో మారు అమర్ నాధ్ యాత్ర ప్లాను చేసుకున్నప్పుడు అంటే  2003 సంవత్సరంలో అన్నమాట ' లదాక్ ' కూడా వెళదాం అని అనుకున్నాం , అప్పట్లో నెట్ లు గట్రా లేకపోవడం వల్ల మా ఆడపడుచు భర్త ఆర్మీ లో కల్నల్ కావడం తో అతను సేకరించిన సమాచారం ప్రకారం ఆర్మీ వారి వాహనాలు తప్ప వేరే వాహనాలను అనుమతించరు . లడాక్ వెళ్లడానికి కావలసిన అనుమతి తీసుకున్నాడు . అంతకు ముందు జరిగిన , జరుగుతున్న చొరబాటు దారుల దాడులు చాలా యెక్కువ గా వుండడం వల్ల కూడా అప్పట్లో భద్రతాచర్యలు పటిష్ఠంగా వుండేవి .

అయితే లదాక్ వెళ్లడానికి హిమాచల్ ప్రదేశ్  లోని మనాలి , నాధు లా మీదుగా పర్యాటకుల కొరకు వాహనాలు నడుస్తున్నాయని మాకు అప్పుడు తెలీదు .

కశ్మీరు నుంచి ఆర్మీ వారి కట్టుదిట్టమైన భద్రతల మధ్య మా ప్రయాణం ఆర్మీ వారి వాహనాలమీద ప్రయాణించి బాల్టాల్ చేరేం . బాల్టాల్ లో కాలుష్య రహిత అమరగంగ పక్కన చదునైన ప్రదేశం లో ఆర్మీ వారి టెంటులో మా నివాసం . అమర్ నాధ్ యాత్ర బాల్టాల్ మీదుగా చేసుకున్నాం , మా అదృష్టమేమిటంటే మేం వెళ్లిన అన్ని సార్లు కూడా గుహంత యెత్తున వున్న లింగాన్ని దర్శించుకున్నాం . మాతో కూడా వున్నది కల్నల్ గారు కాబట్టి మాకు రాచమర్యాదలు జరిగేయి . అమర్ నాథుని దర్శనం తరువాత వేడి వేడి రోటి కూర తో భోజనం చేసి  తరువాత వేడి వేడి పాయసం తిని వెన్నెలలో విహరిద్దామని బయటికి రాగానే మిలిటరీ జవాను బయటికి పోకూడదు అని హెచ్చరించేరు . ' రాత్రి బయట యెంత గొడవ వినిపించినా టెంటు బయటకి రాకూడదు ' అని కూడా చెప్పేరు .

బాగా అలసిపోయి శరీరాలకి వేడివేడి భోజనం దొరకడంతో మంచి నిద్ర పట్టింది . ఓ రాత్రి వేళ బయట పెద్దపెద్ద కేకలు యెవరెవరో పరుగెడుతున్న శబ్దాలు రావడంతో పూర్తిగా తలపై నుంచి రజ్జాయి కప్పుకొని కళ్లు మూసుకొని భగవన్నామ స్మరణ చేసుకుంటూ వుంటే నిద్ర పట్టేసింది . మరునాడు తెలిసిన విషయం యేమిటంటే రాత్రి పూట యెటువంటి అలికిడి బయట వినబడ్డా గేటు దగ్గర కాపలా వుండే సిపాయి పెద్దగా అరచి మిగతా సైనికులను అప్రమత్తం చేస్తాడు , సైనికులు వారి వారి ఆయుధాలతో ఫైరింగ్ చెయ్యడానికి రెడీగా నిలుచుంటారు . ఆ అలికిడి మనషుల వల్ల అయితే వారిని ఆనాటి సంకేత పదం అడుగుతారు , అవతలవారు ఆపదం చెప్పగలిగితే మిత్రులని గేటు తెరుస్తారు . కాని పక్షంలో కొన్ని ప్రశ్నలు వారిని అడుగు తారు వారి ప్రవర్తన గాని , మాటలు గాని అనుమానాస్పదంగా వుంటే వారిని హెచ్చరిస్తారు , ఆ వచ్చిన వారు కవ్వింపు చర్యలు చేస్తే కాల్పులు కూడా జరుపుతారు అని .

బాల్టాల్ నుంచి కార్గిల్ కి వెళ్లేందుకు దారి బందు అయింది అన్నారు . సరే మరోరోజు ఆ టెంటులోనే వున్నాం . మరునాడు కూడా ప్రయాణం లేదని తెలిసింది . మా కోసం కేటాయించిన హెల్పరు కల్నల్ గారితో రహస్యం గా చొరబాటు దారులకు సైనికులకు కాల్పులు జరుగుతున్న విషయం చెప్పడం విన్నాను . చిన్నగా కాల్పులు శబ్దాలు వినబడుతున్నాయి , మేమున్న ప్రదేశానికి కాల్పులు జరుగుతున్న ప్రదేశానికి మధ్య ఒక యెత్తైన పర్వత అడ్డు అంతే .

సర్వసదుపాయాలూ పొందుతూ చిన్న చిన్న గుట్టలు యెక్కుతూ సోన్ మార్గ్ లో తిరుగుతూ మూడురోజులు గడిపిన తరువాత మా ప్రయాణం మొదలయింది . చిన్న బస్సులో చాలా యిరుకుగా కూర్చున్నాం , సుమారు రెండువందలో అంతకన్నా యెక్కువో మిలిటరీ ట్రక్కులు , కొన్ని  మేం కూర్చున్న చిన్న బస్సులలాంటివి ఒకదాని వెనుక ఒకటి చాలా నెమ్మదిగా కదులుతూ ప్రతీ గంటకీ ఓ అరగంట టీ బ్రేకు మధ్యలో రెండుగంటలు లంచ్ బ్రేకుతో ప్రయాణిస్తున్నాం .

రహదారి మధ్యలో అక్కడక్కడ రహదారి నిర్మాణం లో , శతృవుల కాల్పుల వల్ల ప్రాణాలు కోల్పోయిన సైనికుల జ్ఞాపకార్దం నిర్మించిన చిన్న జ్ఞాపకాల దగ్గర సైనికులు ఆగి శ్రద్దాంజలి ఘటించడం  వారిమీద మరింత గౌరవం కలిగింది .

యెత్తైన కొండలమీద మెలికల తిరిగిన దారి , పిచ్చిగాలులు , చలి , మాట్లాడుతూ వుంటే నోట్లోంచి పొగలు వస్తున్నాయి . వేడివేడి టీ తాగితే ప్రాణం లేచి వస్తోంది . కొండల మధ్య ప్రవహిస్తున్న సింధునది పచ్చగా ప్రవహిస్తూ కనిపిస్తూ వుంటుంది . ఎన్నో కొండలు చూసేం , రాతికొండలు , దేవదారు , కోని ఫర్ లాంటి పొడవైన చెట్లు , మధ్యస్థంగా వుండే చెట్లు తో వున్న కొండలు కాని యివి మట్టికొండలు పచ్చని మట్టి కొండలు . ఎటువంటి మొక్కలు కూడా లేవు . అందుకే యీ కొండల దిగువున  ప్రవహిస్తున్న నదీ నీరు కూడా పచ్చగావుంది .

సాయంత్రం నాలుగుకి ద్రాస్ చేరేం . అక్కడ కొండవాలులలో స్థానికులు అంటే గొర్రెల కాపరుల నివాసాలు యివతల వైపున ఆర్మీ వారి తాత్కాలిక ఆవాసాలు వున్నాయి .

ఆర్మీ ఆఫీసర్ల కొరకు సర్వసదుపాయాలూ కల గదులు సిపాయిలకు  టెంట్లు , యింతమందికి సరిపడా భోజనాల యేర్పాటులకు తగ్గట్టు కిచెన్ వున్నాయి . ఇక్కడ కూడా చీకటి పడ్డ తరువాత బయట యెవరూ తిరుగరాదు అనే ఆంక్షలతో పాటు సైరన్ శబ్దం వినగానే బంకర్లలోకి వెళ్లాలనే హెచ్చరికలు చేసేరు . సూర్యాస్తమయం దగ్గర పడుతున్నకొద్దీ చలి విపరీతంగా పెరగసాగింది దానికి తోడు పిచ్చి గాలులు . ద్రాస్ పాకిస్థాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా వుండడం తో తెల్లవార్లూ కాల్పులు జరుగుతూనే వున్నాయి .

ఇక్కడ మనం కాస్త ద్రాస్ లోయ గురించి కూడా తెలుసుకుందాం . ఈ పట్టణాన్ని ' లడాక్ ' కి ప్రవేశద్వారం అనికూడా అంటారు . ద్రాస్ లోయ ' జోజిల్లా ' కనుమ దగ్గర నుంచి మొదలవుతుంది . భారతదేశానికి వాణిజ్యానికి వచ్చే అరబ్బులు యీ మార్గం గుండా  ప్రయాణించేవారు . ఈ ప్రాంతంలో మంచు తుఫానులు తరచు సంభవించడం తో వ్యాపారస్థులు యీ లోయలో చిక్కుకు పోయేవారు . ద్రాస్ పట్టణ వాసులు వ్యాపారస్థులకు ఆశ్రయం యిచ్చి వారిని ఆదుకుని అతిధి మర్యాదలు చేసేవారు . స్వాతంత్రం అనంతరం భారతదేశ సరిహద్దు  రక్షణ భారం వహించే ఆర్మీ వారు సంవత్సరంలో హిమపాతం యెక్కువగా వుండే నెలలలో మైదానాలకు వచ్చి వసంతకాలంలో తిరిగి పర్వతప్రాంతాలకు వెళ్లేవారు . అలాగే 1999 లో భారత సైనికులు ద్రాస్ లోని తమ స్థావరాలకు వెళ్తూ వుండగా అవి పొరుగు దేశ సైనికుల ఆధీనంలో వున్నట్లు గ్రహించేరు . దానిని కార్గిల్ యుధ్దం గా పేర్కొంటారు . భారత సైనికుల ధాటికి తట్టుకోలేక శతృసైనికులు ఆయుధాలను విడిచి పారిపోయేరు . ఆ పోరులో భారత దేశ సైనికులు కూడా వీరమరణం పొందేరు . వారి జ్ఞాపకార్ధం NH-1D రహదారి మీద ద్రాస్ కి  సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ' తోలోలింగ్ ' పర్వతం పైన వార్ మెమోరియల్ నిర్మించేరు . మేం వెళ్లినప్పుడు తాత్కాలిక నిర్మాణం చూసేం .

ద్రాస్ లో పోస్టింగులో వున్న సైనికులను చూస్తే చెయ్యెత్తింది జైహింద్ చెప్పకుండా వుండలేం .

ద్రాస్ నుంచి అమర్ నాధ్ గుహ కి మూడు రోజులు నడక ద్వారా చేరుకోవచ్చు .

1999 తరువాత యేడాది పొడుగునా భారత సైనికులు యీ ప్రాంతాన్ని కాపలా కాస్తున్నారు .

అమర్ నాధ్ యాత్ర నాకు యెంత తృప్తి నిచ్చిందో అంతకు పదిరెట్లు ద్రాస్ యాత్ర కూడా తృప్తి నిచ్చింది . అక్కడ మంచు లింగాన్ని చూస్తే యిక్కడ సజీవంగా తిరుగుతున్న దేవీ దేవతలను చూసేను . మహిళా బెటాలియన్ని చూసి యెంతో ఆనందం పొందేను . తెల్ల వార్లూ కాల్పులు శబ్దాలు వినిపిస్తూనే వుంది . అవి శతృదేశపు కవ్వింపు చర్య అని అక్కడి ఆఫీసర్లు చెప్పేరు . మన సైనికులుకు బులెట్ తగిలితే తప్ప తిరుగు కాల్పులు చెయ్యమని కూడా చెప్పేరు .

శతృదేశపు బులెట్లు తగిలిన ప్రదేశాలు కూడా చూపించేరు .

మళ్లా పొద్దున్నే టీ ఫలహారాలు చేసుకొని వాహనాలు బయలు దేరే చోటికి వెళ్లేం . అక్కడ నుంచి ఆర్మీ వారి ట్రక్కులు మాత్రమే నడుస్తాయని తెలిసింది .

మరిన్ని శీర్షికలు
achaaram