రాజస్థాను , హిమాచల్ ప్రదేశ్ , జమ్ము - కశ్మీరు తరవాత ఉత్తరా ఖండ్ గురించి తెలుసుకుందాం .
2000 వ సంవత్సరం లో నవ్వంబరు తొమ్మిదిన అప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో భాగంగా వున్న పదమూడు జిల్లాలను విడగొట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం గా యేర్పరిచేరు . ఉత్తరాఖండ్ రాష్ట్రంతన సరిహద్దులను టిబెట్ , నేపాలు , ఉత్తరప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ లతో పంచుకుంటోంది .
ప్రతీ హిందువు తన జీవితకాలంలో ఒకసారైనా చార్ధామ్ యాత్ర చెయ్యాలని కోరుకుంటాడు . ఆ చార్ధామ్ లు వున్నది యీ రాష్ట్రం లోనే . ఈ రాష్ట్రాన్ని దేవభూమి అని కూడా అంటారు .వేదకాలం నుంచి కూడా యీ ప్రాంతం గొప్పతనం మన హిందూ పురాణాలలో వర్ణింపబడింది .
ఉత్తరా ఖండ్ రాష్ట్రం గరేవాల్ , కుమావు విభాగాలుగా విభజించేరు . కొంతకాలం ఉత్తరాంచల్ గా వ్యవహరించినా వేదకాలం నాటి నుండి వున్నఉత్తరాఖండ్ పేరునే ఖరారు చేసేరు . వేదకాలంలో గరేవాల్ ని కేదారఖండం గానూ , కుమావుని మానసఖండం గానూ వ్యవహరించేవారు .
మహా భారతకాలంలో ఉత్తరాఖండ్ లోని కొంత భాగం ' పాంచాల ' దేశానికి , కొంతభాగం
కురు ' రాజ్యానికి చెంది వుండేవట . చరిత్రలోకి వస్తే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం లో యీ రాజ్యాన్ని పరిపాలించిన ' కునిందాస్ ' వంశపురాజులు శైవాన్ని ప్రాచుర్యం లోకి తెచ్చి యెన్నో శైవ మందిరాలను పునఃనిర్మించేరు .అశోకుడి కాలంలో యీ ప్రాంతం లో బౌద్దమతం ప్రాచుర్యం లో వుండేదని యిక్కడ దొరికిన ఆధారాలవల్ల చరిత్తకారులు గుర్తించేరు .
ఈ రాష్ట్ర ముఖ్యనగరం ' డెహ్రాడూన్ , యీ రాష్ట్రం యొక్క హై కోర్టు నైనితాల్ లో వుంది .
ఈ రాష్ట్రంలో యెక్కువ ప్రాంతం శివాలిక్ పర్వతశ్రేణులూ , హిమాలయ పర్వత శ్రేణులు ఆక్రమించుకొని వున్నాయి . గరేవాల్ విభాగంలో డెహ్రాడూన్ , యమునోత్రి , గంగోత్రి , కేదార్ నాథ్ , బదరీనాథ్ వున్నాయి , కుమావు విభాగంలో నైనితాలు , రాణీఖేత్ , అల్మోడా , జాగేశ్వర్ , భాగేశ్వర్ లు వున్నాయి .
గరేవాల్ విభాగానికి వెళ్లాలంటే హరిద్వార్ మీదుగానే వెళ్లాలి . దేశరాజధానికి సుమారు 220 కిలో మీటర్ల దూరం లో వుంది హరిద్వార్ , హరిద్వార్ కి దేశం నలుమూలలనుంచి రైలుసర్వీసులు వున్నాయి . ఢిల్లీ నుంచి బస్సు , టాక్సీ సర్వీసులు కూడా వున్నాయి . హరిద్వార్ కి అతి దగ్గరగా వున్న విమానాశ్రయం ' జోలీగ్రంథ్ ' విమానాశ్రయం డెహ్రాడూన్ , సుమారు 40కిలోమీటర్లు .
హరిద్వార్ అంటే గంగాస్నానం గుర్తొస్తుంది . ప్రతీ రోజూ గంగాస్నానం కోసం హిందువులు వేల సంఖ్యలో వస్తారు . వైశాఖ , శ్రావణ , కార్తీక , మాఘ , పాల్గుణ మాసాలలో లక్షల సంఖ్యలోయాత్రీకులు గంగలో స్నానాలు చేసి తమ పాపాలను పోగొట్టు కుంటారు . యేడాది పొడవునా వచ్చే యాత్రీకుల అవుసరాలు తీర్చాడానికి అన్ని తరగతులవారికి అందుబాటులో భోజన , వసతి సౌకర్యాలు వున్నాయి . ఎన్నో ఉచిత భోజన వసతి సౌకర్యాలుకలుగజేసే ఆశ్రమాలు వున్నాయి . గూగులమ్మ నడిగితే యెన్నో అలాంటి ఆశ్రమాల విలాసాలు దొరకు తాయి . వాటిలో ఉచితంగా వుండొచ్చు , కొన్ని ఆశ్రమాలు విరాళాలు స్వీకరిస్తాయి .అలాంటి ఆశ్రమాలలో భోజన సదుపాయాలు చాలా బాగుంటాయి . అలాగే చిన్న నుంచి అయిదు నక్షత్రాల వసతులు అందించే హోటల్స్ వరకు కూడా వున్నాయి .
గంగా నదికి కుంభ మేళా జరిగే ప్రదేశాన్ని ' హరి కీ పౌడీ ' అని అంటారు . హరిద్వార్ లో యెన్నో ఘాట్లు వున్నా స్నానం మాత్రం హరి కీ పౌడీ లోనే చెయ్యాలని అంటారు . సాయంత్రం జరిగేగంగా హారతి కూడా హరి కీ పౌడీ లోనే జరుగుతుంది . ఎందుకు హరి కీ పౌడీ కి యింత ప్రాముఖ్యత వుంది అంటే అమృతమథనం సమయంలో పాల సముద్రం నుంచి ఉధ్బవించినఅమృతాన్ని నాగులకు యిచ్చి తల్లిని దాస్య విముక్తిని గావించి తిరిగి ఆ అమృత భాండాన్ని వాయు వేగంతో నాగులనుంచి తీసుకొని విష్ణుమూర్తి దగ్గరకు బయలు దేరుతాడు గరుత్మంతుడు ,ఆ వేగానికి కొన్ని అమృతబిందువులు భూమి పైన చిందుతాయి , అలా కొన్ని అమృత బిందువులు హరిద్వార్ లో హరి కీ పౌడీ అనే చోట గంగానదిలో పడ్డాయని ఆ ప్రదేశం లో స్నానంచేసినవారి పాపాలు నాశనమవడమే కాక దీర్ఘకాలిక రుగ్మతలు తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడింది .
హరిద్వార్ లో యెన్నో స్నానఘట్టాలు వుండగా మరి యీ హరి కీ పౌడీ ని యెలా గుర్తిస్తాం అంటే గంగ వొడ్డున పెద్దపెద్ద స్నానఘట్టాలు , పెద్ద అరుగులు , గంగాదేవి మందిరం వున్నప్రదేశమే , అంతేకాదు దూరం నుంచి చూసినా కనిపించే గంటస్థంబం వున్న ప్రాంతమని గుర్తుంచుకుంటే సరి .
పరమశివుని వేసవి రాజధానిగా వుండేదట యీ హరి కీ పౌడీ , శివుడు యిక్కడకు వచ్చేటప్పుడు దేవీదేవతలు శివుని స్వాగతించడానికి ఓ స్వాగత ద్వారం నిర్మించేరట దానిని హరిద్వార్అని పిలువసాగేరు , కాలాంతరాన యేర్పడ్డ నగరాన్ని హరిద్వార్ అని పిలువసాగేరు .
హరి కీ పౌడీ లో ముఖ్యంగా చేయవలసినది గంగా స్నానం , సాయంత్రం యిక్కడ జరిగే గంగా హారతిని చూడడం .
హరిద్వార్ లో చూడతగ్గ ప్రదేశాలేంటో చూద్దాం .ద్వాపరయుగంలో మహాభారత కాలంలో దౌమ్య ముని ధర్మరాజుకు హరిద్వార్ లో వున్న పంచతీర్థాల గురించి చెప్తాడు . అవి 1) ఖంకల్ లో సతీదేవి ఆత్మత్యాగం చేసుకున్న ప్రదేశం , 2)కుశావర్తం ఘాట్ ( కంఖల్ ) , 3) హరి కీ పౌడీ , 4) బిల్వతీర్థం అంటే మానస దేవి మందిరం వున్న ప్రాంతం 5) నీలతీర్థం అంటే ఛండీ మందిరం వున్న పర్వతం .
హరిద్వార్ కి సుమారు 7 కిలో మీటర్ల దూరంలో వున్న ' కంఖల్ ' గురించి ముందుగా తెలుసుకుందాం .
హరిద్వార్ నుంచి షేర్డ్ ఆటోలు , సిటీ బస్సులు , ఆటోలు , టాక్సీ ల సౌకర్యం వుంది . రానూ పోనూ కూడా మాట్లాడు కోవచ్చు
కంఖల్ చేరేక బయటకు కనిపిస్తూ పెద్ద సతీ దేవి చితిలో ఆత్మహుతి చేసుకుంటున్న విగ్రహం వుంటుంది . లోపల ఓ పక్కగా మందిరాలు , మరో పక్కనుంచి గంగా ఘాట్ కి దారికనిపిస్తాయి . ఈ ఘాట్ నే కుశావర్త తీర్థం అని అంటారు , వీలున్నవాళ్లు యిక్కడ స్నానాదులు చేసుకొని గంగామాతకు పసుపు కుంకుమ సమర్పించి హారతి యిస్తారు . అలా చేస్తే గంగామాతవారిని సుమంళీభవ అని ఆశీర్వదిస్తుందనేది భక్తుల నమ్మకం . వీలు లేనివాళ్లు నీళ్లు తలపై జల్లుకొని పసుపు కుంకుమ సమర్పించి గంగామాత ఆశీర్వాదం అందుకోవచ్చు .
ఆ ప్రాంగణం లో పెద్ద వటవృక్షం వుంటుంది ఆ వృక్షం దక్షయజ్ఞానికి ప్రత్యక్ష సాక్షి . ఆ చెట్టు మొదట్లో కాండం , వూడలు కలిసి వినాయకుని ఆకారం యేర్పడి వుంటాయి . చెట్టుమొదట్లో చిన్న చిన్న శివలింగాలు వుంటాయి . ఈ వటవృక్షాన్ని తప్పక దర్శించుకోండి .
మందిరం మూడు భాగాలు వుంటుంది మొదటది దక్షుడు యజ్ఞం చేసిన యాగకుండం , రెండవది సతీ దేవి ఆత్మహుతి చేసుకున్న కుండం , మూడవది దక్షునిచే ప్రతిష్టింప బడ్డశివలింగం వున్న మందిరం .
దక్ష యజ్ఞం గురించి తెలుసుకుందాం . దక్ష ప్రజాపతి కుమార్తె సతీ దేవి తండ్రి అభీష్టానికి విరుద్దంగా శివుని వివాహ మాడుతుంది . దక్షుడు యాగం చేయతలబెట్టి సర్వ దేవీదేవతలను , మునులను , ఋషులను అహ్వానిస్తాడు , కాని శివుని , సతీ దేవిని ఆహ్వానించడు . సతీ దేవి తండ్రి యాగానికి పోవాలనే కుతూహలమును కొద్దీ శివుడు వారించినా వినక యాగానికి వస్తుంది . యాగ సమయంలోఅథిధుల సమక్షం లో దక్షుడు శివుని అవమానించడం తో తట్టుకోలేని సతీదేవి యోగాగ్నిని సృష్టించుకొని అందులో ప్రాణ త్యాగం చేసుకుంటుంది .
సతీ దేవి ప్రాణత్యాగం చేసుకున్నదని విన్న శివుడు కోపోద్రేకుడై తన జటను తీసి నేలపై పడవేయగా అందులోంచి వీరభద్రుడు అవతరిస్తాడు , వీరభద్రుడు , గణాలతో కలసి దక్షుడిసేనలను పరాజితులను చేసి దక్షుని శిరస్సు ఖండించి అదే అగ్ని కుండం లో పడవేస్తాడు . శివుని వుగ్రరూపం చూచి ముల్లోకాలు భయకంపితులు కావడం చూసిన దేవతలు శివునివుగ్రరూపం ఉపసంహరించు కొనవలసినదిగా కోరుతారు , దేవతల కోరిక మేరకు శాంతించిన శివుడు సతీదేవి దేహాన్ని వెతుకుతూ వెళతాడు . దక్షునికి మేక శిరస్సును అమర్చి ప్రాణం పోస్తారుదేవతలు . దక్షుడు శివుని క్షమార్పణలు చెప్పుకొని ఆ ప్రదేశంలో లింగ ప్రతిష్ట చేస్తాడు .
సతీదేవి యాగకుండం లో ప్రవేశించి సొరంగ మార్గం ద్వారా గంగానది వొడ్డున నిర్జన ప్రదేశం లో యోగసమాధి లో ప్రాణత్యాగం చేస్తుంది . సతీదేవి ప్రాణత్యాగం చేసిన ప్రదేశం హరిద్వార్లో పార్కింగ్ ప్లేస్ కి పక్కగా వున్న మాయా దేవి మందిరం . ఈ కథ ప్రభుత్వం వారిచే వ్రాయబడిన బోర్డు కూడా అక్కడ వుంది . యోగ సమాధిలో సతీదేవి వుండి పోయింది కాబట్టి యీమందిరాన్ని మాయా దేవి మందిరమని , గ్రామాన్ని మాయాపురి అని అంటారు . ఈ మందిరాన్ని తప్పక హరిద్వార్ లో దర్శించుకోవాలి .
1800 లలో కట్టిన మందిరాన్ని 1960 లో పునః నిర్మించేరు . 2000 లలో యీ మందిరానికి చాలా మార్పులు చేర్పులు చేసేరు . ప్రస్తుతం ప్రతీ సారి యేదో వొక కొత్తకట్టడం యిక్కడకనిపిస్తోంది . ఈ వ్యాసం మీరు చదివే సమయానికి మేం హరిద్వార్ లో వుంటాం .
కంఖల్ లో యింకా చూడదగ్గ ప్రదేశాలు రామకృష్ణ మిషన్ ఆశ్రమం , 102 పడకల ఆసుపత్రి మిషన్ ఆధ్వైర్యంలో నడప బడుతోంది .
అమృతానందమయి మా యొక్క సమాధి మందిరం కూడా చూడొచ్చు .
హరిద్వార్ లో మిగతా దర్శనీయ స్థలాల వివరాలు వచ్చేవారం చదువుదాం , అంత వరకు శలవు .
|