Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చెలియా చిత్రసమీక్ష

cheliya movie review

చిత్రం: చెలియా 
తారాగణం: కార్తీ, అదితిరావు హైదరీ, లలిత, శ్రద్ధ శ్రీనాథ్‌, రుక్మిణి విజయ్‌కుమార్‌, ఢిల్లీ గణేష్‌, ఆర్‌జె బాలాజీ, శివకుమార్‌ అనంత్‌, విపిన్‌ శర్మ, హరీష్‌ రాజ్‌ తదితరులు. 
సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌ 
సినిమాటోగ్రఫీ: రవివర్మన్‌ 
దర్శకత్వం: మణిరత్నం 
నిర్మాతలు: మణిరత్నం, శిరీష్‌ 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 7 ఏప్రియల్‌ 2017 

క్లుప్తంగా చెప్పాలంటే

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్‌ జెట్‌ పైలెట్‌గా పనిచేస్తుంటాడు వరుణ్‌ (కార్తీ). కార్గిల్‌ యుద్ధ సమయంలో వైద్యురాలు లీల (అదితిరావు హైదరీ)తో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. అయితే అనుకోకుండా ఇద్దరి మధ్యా విభేదాలు పెరుగుతాయి. ఇంకో వైపున యుద్ధం జరుగుతున్న సమయంలో అనుకోకుండా పాకిస్తాన్‌ భూభాగంలోకి వరుణ్‌ నడుపుతున్న ఫైటర్‌ జెట్‌ వెళుతుంది. అక్కడే వరుణ్‌ని పాకిస్తాన్‌ అదుపులోకి తీసుకుంటుంది. పాకిస్తాన్‌ జైల్లో బందీ అయిన వరుణ్‌, తిరిగి భారతదేశానికి ఎలా వచ్చాడు? ప్రియురాలు లీలని ఎలా కలుసుకున్నాడు? ఇద్దరి మధ్యా మళ్ళీ ప్రేమ చిగురించిందా? అసలు ఈ ఇద్దరి మధ్యా విబేదాలకు కారణమేంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

కార్తీ మంచి నటుడు. ఇది కొత్త మాట కాదు, పాతదే. ఏ పాత్రలో నటించాల్సి వచ్చినా, అందులో జీవించేస్తాడు. ఫైటర్‌ జెట్‌ పైలట్‌ పాత్రలోనూ అలాగే ఒదిగిపోయాడు. ప్రేమికుడిగానూ జీవించేశాడు. భావోద్వేగాల్ని పండించే సందర్భాల్లో కార్తీ నటన సింప్లీ సూపర్బ్‌. అదితిరావు హైదరీ చాలా అందంగా కనిపించింది. నటిగానూ మంచి మార్కులేయించుకుంది. ఇద్దరి పెయిర్‌ తెరపై చూడ్డానికి బాగుంది. నటనలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. అయితే సరదా సరదా పాత్రల్లో ఇప్పటిదాకా కనిపించి చూసేవారినీ హుషారెక్కించిన కార్తీ, ఆఫీసర్‌ పాత్రలో బిగుసుకుపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

ఇలాంటి కథల్ని టచ్‌ చేయాలంటే అది మణిరత్నంకి మాత్రమే సాధ్యమేమో. కథ మరీ కొత్తదేమీ కాకపోయినా, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మణిరత్నం. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. అక్కడక్కడా ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్‌ హైలైట్‌. అత్యద్భుతంగా లొకేషన్స్‌ని చూపించారు సినిమాటోగ్రాఫర్‌. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి హెల్పయ్యాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని భావోద్వేగాల నడుమ తెరకెక్కించడం, దానికి దేశభక్తి అనో, ఇరు దేశాల మధ్య యుద్ధం అనో, రెండు మతాల మధ్య ఘర్షణ అనో ఏదో ఒక కాన్‌ఫ్లిక్ట్‌ని కలపడం మణిరత్నం సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో అది బాగా వర్కవుట్‌ అయ్యింది. ఈ సినిమాలోనూ అంతే. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. తెరపై చూస్తున్నంతసేపూ అద్భుతమైన లొకేషన్లలో మనమూ విహరించేస్తాం. సినిమాని రిచ్‌గా తెరకెక్కించడమే కాదు, సన్నివేశాలు సూటిగా గుండెకు తాకేలా చెయ్యడంలో మణిరత్నం దిట్ట. అయితే సన్నివేశాల్లో సాగతీత ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది. ఈ సినిమాలోనూ ఆ సాగతీత అక్కడక్కడా ఇబ్బంది పెట్టింది. ఓవరాల్‌గా సినిమా ఓ మోస్తరు ఫీల్‌ని మిగుల్చుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

భావోద్వేగాలు కలగలసిన రొమాంటిక్‌ యుద్ధం

అంకెల్లో చెప్పాలంటే: 3/5 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka