Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

Raja Music Muchchatlu

ఒకే చిత్రంలో వేర్వేరు పాత్రలు
ప్రముఖ నటుడు చలపతి రావు తో 'దాన వీర శూర కర్ణ'  లో ఎన్టీఆర్ నాలుగైదు పాత్రలు వేయించారట. 'ప్రేక్షకులు గుర్తు పట్టేస్తారు అన్నగారూ' అని అంటే 'ఏం ఫర్వాలేదు బ్రదర్' అని పట్టుబట్టి మరీ వేయించారటాయన. ఆ రోజుల్లో అటువంటివి చాలా సహజంగా జరిగేవి. 'మాయాబజార్' లో ఘటోత్కచుణ్ణి చూసి మూర్చపోయిన ద్వారపాలకుడి గానూ, రేలంగికి అనుచరుడి గానూ బాలకృష్ణ నటించినట్టు ....

1960ప్రాంతాల్లో దాదాపు అందరు హీరోలతోనూ నటించిన టాప్ హీరోయిన్ రాజశ్రీ  ఆమె తొలి రోజుల్లో ఏవీయమ్ వారి ఆర్టిస్ట్. అంచేత వారు తీసిన 'భూకైలాస్'  చిత్రంలో జమున చెలికత్తెలలో ఒకరుగా నటించింది. ఆ చిత్రంలో జమునపై చిత్రీకరించిన 'అందములు విందులయే అవని ఇదేనా' పాటలో ఆమె ప్రముఖంగా కనిపిస్తుంది. అంతేకాదు రావణాసురుణ్ణి ఆవహించడానికి మహావిష్ణువు పంపించిన మాయగా కూడా నటించిందామె. మాయ గా నటించిన సన్నివేశాల్లో ఆమెను పెద్ద తెరపై గుర్తుపట్టొచ్చు.

దళం - జలం - సమంజసం
ప్రభాస్ హీరోగా 'రాఘవేంద్ర' అనే సినిమా 2003 లో వచ్చింది. అందులో 'నమ్మిన నా మది మంత్రాలయమేగా' అనే పాట బాగా హిట్ అయింది. ఆ పాట పల్లవి లో 'నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా తుంగా దళాల సేవా తులసి దళాల పూజా అందుకో' అని వినిపిస్తుంది.

నిజానికి తుంగ (భద్ర) అనేది జలం,  తులసి అనేది దళం  అలా కాకుండా 'తుంగా దళాల సేవా తులసి దళాల పూజా' అని వుండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. (తుంగా జలాల సేవ, తులసీ దళాల పూజ అని వుండటం కరెక్ట్)

వెంటనే ఆ పాటను రాసిన వేటూరి వారి దగరికి వెళ్ళి అడగడం జరిగింది. ఆయన నమ్మలేక పోయారు. టేపు వినిపించాను. 'నా ఖర్మ కాలిపోయిందయ్యా ' అంటూ నుదుటి మీద అరచేత్తో ఠప ఠప ఠప ఠప మని కొట్టుకున్నారు. "నేనెంత శుభ్రంగా రాస్తానో నీక్కూడా తెలుసు కదా ... మళ్ళీ అసిస్టెంట్ లతో రాయిస్తారు. సగం తప్పులు వీటి వల్లే జరిగిపోతుంటాయి. పోనీ ఫెయిర్ చేశాక చూపిస్తారా అంటే మళ్ళీ ఉరుకులు పరుగులు. మన తల రాత బాగులేనప్పుడు చేతి రాత ఎంత బాగుండి ఏం లాభం ?" అంటూ తెగ మథనపడిపోయారు వేటూరి. కావాలంటే ఆ పాటలో ఆ లైన్లు విని చూడండి. 
 






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
aaditya hrudayam - vn adithya