Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మిస్టర్‌ చిత్రసమీక్ష

mister movie review

చిత్రం: మిస్టర్‌ 
తారాగణం: వరుణ్‌ తేజ, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌, నాజర్‌, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్‌, రఘుబాబు, ఆనంద్‌, పృద్వీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు. 
సంగీతం: మిక్కీ జె మేయర్‌ 
సినిమాటోగ్రఫీ: కె.వి. గుహన్‌ 
దర్శకత్వం: శ్రీను వైట్ల 
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు 
నిర్మాణం: లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్‌ 
విడుదల తేదీ: 14 ఏప్రియల్‌ 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 

ఓ ఊరి పెద్ద పిచ్చయ్యనాయుడు (నాజర్‌), అతనికి విదేశాల్లో ఉండే మనవడు చై (వరుణ్‌ తేజ). చై, మీరా (హెబ్బా పటేల్‌)తో ప్రేమలో పడతాడు. స్పెయిన్‌లో మీరాని ప్రేమలో పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయితే మీరా, తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానంటుంది. ఇండియాకి వెళ్ళిపోయిన ప్రేమ, కొన్నాళ్ళ తర్వాత తన ప్రేమకు ఇబ్బందులొచ్చాయంటూ చైకి ఫోన్‌ చేస్తుంది. మీరా ప్రేమను గెలిపించేందుకు వచ్చిన చైకి చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) పరిచయమవుతుంది. చై, మీరా ప్రేమను గెలిపించాడా? చంద్రముఖితో చై పరిచయం ఎలాంటి పరిణామాలు దారితీసింది. ఊరి పెద్ద, తన తాత పిచ్చయ్యనాయుడికి ఎదురైన సమస్యల్ని చై ఎలా పరిష్కరించాడు? వంటివన్నీ తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే 

నటుడిగా తొలి చిత్రం 'ముకుంద'తోనే మంచి మార్కులేయించుకున్నాడు వరుణ్‌. రెండో సినిమా 'కంచె'లోనూ అంతే. 'లోఫర్‌' కోసం కొత్తగా మాస్‌ క్యారెక్టర్‌ని ట్రై చేశాడు. ఈ సినిమాలో ఇంకా కొత్తగా ప్రయత్నించాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. చాలా సన్నివేశాల్లో వరుణ్‌ నటనకి ఫిదా అవుతాం. ఓవరాల్‌గా వరుణ్‌ ఈ సినిమాని పూర్తిగా తన భుజాల మీద మోసేందుకు ప్రయత్నించాడు. ఆ హైటూ, ఆ పర్సనాలిటీ అన్నీ 'చై' పాత్రకు సూటయ్యాయి. వరుణ్‌ 'చై' పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగా అతనికి ఇదొక ప్రత్యేకమైన చిత్రం అని చెప్పక తప్పదు. 

హెబ్బా పటేల్‌ క్యూట్‌గా హాట్‌గా గ్లామరస్‌గా కనిపించింది. నటన పరంగా ఓకే. లావణ్య త్రిపాఠి తన సహజమైన గ్లామర్‌తో అలరిస్తుంది. నటనలోనూ తన మార్క్‌ చూపించింది. విలన్‌ పాత్రలో నికితిన్‌ ధీర్‌ పాత్రకు మంచి మార్కులే పడతాయి. నాజర్‌ ఇలాంటి పాత్రల్లో ఒదిగిపోవడం మామూలే. మిగిలిన తారాగణమంతా సినిమాకి తగ్గట్టుగా బాగానే చేశారు. 

ఈ తరహా సినిమాలు దర్శకుడు శ్రీనువైట్లకు కొట్టిన పిండి. అయితే ఇందులో ఒక కథ కాదు, చాలా కథలున్నాయి. దాంతో, కొంచెం కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. స్క్రీన్‌ప్లే పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. డైలాగ్స్‌ ఓకే. ఎడిటింగ్‌కి ఇంకాస్త పని పెట్టి ఉండాల్సింది. పాటలు బాగున్నాయి. వినడానికీ, తెరపై చూడ్డానికీ పాటలు చాలా అందంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు బలం. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. నిర్మాణపు విలువలు చాలా చాలా చాలా బాగున్నాయి. ఎక్కడా రాజీ పడని వైనం అభినందనీయం. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. 

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంటుంది. సరదా సరదాగా సాగిపోయే పస్టాఫ్‌ ముగిశాక, సెకెండాఫ్‌లో కథ వేగం పుంజుకుంటుందిగానీ, కథలో కుప్పలు తెప్పలుగా మలుపులు వచ్చిపడ్తాయి. బోల్డన్ని పాత్రలు తెరపై కన్పిస్తూ, వెళ్ళిపోతూ కొంత గందరగోళానికి గురిచేస్తాయి. అయితే కథలో ఆడియన్స్‌ ఊహలకు తగ్గట్టుగానే సన్నివేశాలు కన్పిస్తుండడంతో కొత్తదనం ఫీలయ్యేందుకు ఆస్కారం లేకుండా పోయింది. రెండు వైఫల్యాల తర్వాత శ్రీనువైట్ల ఏమాత్రం రిస్క్‌ చేయలేదుగానీ, ఆ రిస్క్‌ చేయకపోవడంలోనే 'బోరింగ్‌' అనే భావనకు ఆస్కారమేర్పడింది. ఓవరాల్‌గా సినిమా రిచ్‌గా తెరకెక్కడం, హీరోయిన్ల గ్లామర్‌, హీరో పెర్ఫామెన్స్‌, వీటికి తోడు పబ్లిసిటీ, కాస్తంత కామెడీతో ఓకే అనిపిస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

ఓకే మిస్టర్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka