Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Feel the Fear Short film

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda biography seventh part

రామకృష్ణ పరమహంస నిర్యాణం :
రామకృష్ణునకు కంటంలో వ్రణం లేచింది. చికిత్స నిమిత్తం ఆయన కలకత్తా వెళ్లారు. ఆయన సతీమణి మాతృశ్రీ శారదాదేవి కూడా కలకత్తా వెళ్ళింది. ఆ సమయం లో రామకృష్ణుని శిష్యులందరూ గురుసేవ కోసం అక్కడకు వెళ్లారు. ఎవరెన్ని సపర్యలు చేస్తున్నా, ఎంత వైద్యం జరుగుతున్నా రామకృష్ణుని వ్యాధి ముదిరిపోతోంది కానీ, తగ్గడం లేదు. ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం కోసం ఆయన బసను కాశీపుర వనానికి మార్చారు. అక్కడ కూడా ఆయన వ్యాధి నయం కావడం లేదు. అయినా రామకృష్ణుడు నిత్యమూ నరేంద్రునకూ, ఇతర శిష్యులకూ వేదాంత రహస్యాలనూ - వారి కర్తవ్యాన్ని భోదిస్తూ కాలం గడిపేవాడు.

ఇక్కడ వున్నప్పుడు కూడా నరేంద్రునికి ఎన్నో సార్లు ధ్యానం వల్ల బాహ్యస్మృతి తప్పిపోవడం తటస్థించినది. ఇదంతా గమనించిన రామకృష్ణుడు ఒక సందర్భంలో తన శిష్యులతో నరేంద్రుని గురించి ప్రస్తావిస్తూ అతడు స్వచ్చంద మరణం పొందగలడనీ, తానెవరో తెల్సుకున్న మరుక్షణంలో అతడు శరీరాన్ని దాచుకోవటానికి ఇష్టపడడనీ, తన ఆధ్యాత్మిక శక్తి వల్ల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి తీరతాడని, పేర్కొన్నాడు.

అంతకంతకు పరమహంస ఆరోగ్యం క్షీణించసాగింది. ఒకరోజు నరేంద్రుని పిలిచి ఒక కాగితంపై "నరేంద్రుడు ఇతరులకు బోధచేస్తాడని" వ్రాసి అది అతని చేతికిచ్చాడు. తాను అలాచేయలేనని నరేంద్రుడు చెప్పగా, నీవు చేసి తీరుతావని రామకృష్ణుడు నొక్కి చెప్పారు. తన నిర్యాణానికి కొద్దిరోజుల ముందు రామకృష్ణుడు నరేంద్రుని పిలిచి తదేక దృష్టితో అతనిని చూస్తూ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు.

దానితో ఏదో ఒక మహాశక్తి తనలో ప్రవేశిస్తున్నట్లునరేంద్రునికి తోచింది. కొద్దిసేపటిలో నరేంద్రుడు కూడా బాహ్యస్మృతిని కోల్పోయాడు. తిరిగి స్పృహరాగానే రామకృష్ణుని కళ్ళ నుండి నీళ్ళు కారడాన్ని నరేంద్రుడు చూసి ఆశ్చర్యంగా ఆయన్ని ప్రశ్నించాడు. దానికాయన "నాయనా! నేను నా ఆధ్యాత్మిక సంపత్తి నంతా నీకు ధారపోశాను. ఈ శక్తి వల్ల ప్రపంచంలో నీవు ఘనకార్యాలు సాధించగలవు" అని బదులు చెప్పాడు. ఒక మహాతపస్వి తన యావత్ శక్తినీ, శిష్యునకు ధారపోశాడంటే ఆ మహనీయుని త్యాగ మెటువంటిదో ఊహించుకోవచ్చు.

ఇది జరిగిన నాలుగు రోజులకే 1886 వ సంవత్సరం ఆగష్టు 16 వ తేదీన రామకృష్ణ పరమహంస నరేంద్రుని పిలిచి అంత్యోపదేశమిచ్చి నిర్యాణాన్ని పొందారు. నరేంద్రుడు, ఇతర శిష్యులూ కూడా విచార సాగరంలో మునిగిపోయారు.

రామకృష్ణ మఠ సంస్థాపన
రామకృష్ణుని నిర్యాణంతో నరేంద్రునకు గురువు కొరత ఏర్పడింది. అయితే మిగిలిన శిష్యులకు మాత్రం రామకృష్ణుడే తన వారసునిగా ప్రకటించిన నరేంద్రుడు ఉన్నాడు కదా! అతని నాయకత్వం క్రింద వారంతా బారానగరానికి వెళ్లి పరమహంస చిత్రపటాన్ని, ఒక చిన్న అద్దె ఇంటిలో ప్రతిష్టించి రోజూ ప్రార్ధనలు చేసేవారు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రామకృష్ణ మాఠానికి యి బారానగర మఠమే పునాది.

ఇలా నరేంద్రుని ఆధిపత్యం క్రింద 1886 నుంచి 1892 వరకూ ఈ మటం బారానగరంలో వుంది. తర్వాత అది "ఆలంబజార్" కు మార్చబడి 1897 వరకు అక్కడ వుంది. తర్వాత అది గంగానది ఒడ్డున కల ఒక వనంలోకి మార్చబడింది. ఆ తర్వాత బేలూరులో  నరేంద్రుడు స్వయంగా ఆర్జించిన ప్రదేశానికది మార్చబడి రామకృష్ణ మటంగా ఈరోజు వర్ధిల్లుతున్నది. రామకృష్ణుని అస్థికలను నరేంద్రుడే స్వయంగా తలపై పెట్టుకుని వచ్చి అక్కడ స్థాపించాడు. రామకృష్ణ సేవాసంఘం కూడా నరేంద్రుడు నెలకొల్పిన మహత్తర సంస్థయే.

మరిన్ని శీర్షికలు
smt. bhanumati ramakrishna biography