Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Aalu Tomato Curry - Very Easy Method.

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్థ యాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

బదరీనాధ్-3

మరణించిన వారికి యిక్కడ జరిపే పిండప్రదానం వారి ఆత్మలను పుణ్య లోకాలకు చేరుస్తుందని మన హిందువుల నమ్మకం . ఈ నమ్మకం యెప్పుడు నుంచి వుంది అంటే జవాబు దొరకలేదు గాని సత్యకాలం నుంచి యిక్కడ పిండప్పదానాలు జరుగుతున్నాయని మాత్రం మన వేదాలలో వుంది .

ఈ పిండప్రదానాలు అలకనంద వొడ్డున వున్న బ్రహ్మకపాలం అనే ప్రదేశం లో జరుపుతారు . దీనికి సంభందించి ప్రచారం లో వున్న కధ యేమిటంటే బ్రహ్మ సృష్టి జరిపేటప్పుడు తనకు సహాయంగా వుండేందుకు ఓ సహాయకుని యివ్వమని కోరగా , విష్ణు మహేశ్వరులు సరస్వతీ దేవి ని సృష్టించి ఆమెని బ్రహ్మ కు సహాయకురాలిగా వుండమంటారు , బ్రహ్మ ఆమె అందానికి ముగ్ధుడై ఆమెని కామ దృష్టితో చూడగా ఆమె బ్రహ్మ దృష్టి నుంచి తప్పించు కొనుటకై బ్రహ్మ కుడివైపున నిలబడుతుంది , బ్రహ్మ శిరస్సుకు కుడివైపున ఓ శిరస్సు పుడుతుంది అలా బ్రహ్మకు నాలుగు శిరస్సులు పుడతాయి , సరస్వతి ఆకాశమున దాగుండగా ఆమెను చూచేందుకు బ్రహ్మకు ఓ శిరస్సు తలపైన కూడా పుడుతుంది , విష్ణుమూర్తి బ్రహ్మ కామదృష్టికి కలత చెంది తన చక్రంతో ఆ శిరస్సును ఖండిస్తాడు , ఊర్ధ్వముఖంగా చూస్తున్న శిస్సుకాబట్టి ఆ శిరస్సు పడిన ప్రదేశంలో మానవులు చనిపోయిన వారికి పిండప్రదానంచేస్తే వారికి ఊర్ధ్వ లోక ప్రవేశార్హత కలుగుతుందని విష్ణుమూర్తి బ్రహ్మ కు వరమిస్తాడు .

ఊర్ధ్వ శిరస్సు ఖండన జరుగగానే బ్రహ్మ లోని కామ వికారాల నాశనం జరుగుతుంది .

ఈ ప్రదేశం లో చనిపోయిన జ్ఞాతులకే  కాక స్నేహితులకు , భృత్యులకు , పశుపక్ష్యాదులకు , ఆ చుట్టుపక్కల తిరుగుతున్న అనామకమైన ఆత్మలకు కూడా పిండప్రదానం చెయ్యమంటారు యిక్కడి ఆచార్యులు .

బ్రహ్మ కపాలంతో బదరీనాధ్ లోని ముఖ్యమైన ప్రదేశాలు పూర్తయినట్లే .

ఇక్కడ నుండి  ఆకాశం నిర్మలంగా వుండే రోజు నీలకంఠ పర్వత దర్శనం ఓ అద్భుతం అని చెప్పుకోవాలి . సూర్యుని కిరణాలు పడి బంగారు రంగులో మెరిసే మేరువుని చూడడం అద్భుతం కాక మరేమిటి ? . కాని యీ దృశ్యం సాధారణంగా కనిపించదు , పగలు సాధారణంగా ఆకాశం  మబ్బులు కమ్మి వుండడం వల్ల .

బదరీ కోవెల వెనుకవైపుగా వున్న కాలిబాట ద్వారా సుమారు నాలుగు కిలోమీటర్లు వెళితే ' చరణ పాదుక ' చేరుకుంటాం .

కాలిబాట స్థానికుల యిళ్ల పక్కగా వెళుతుంది , స్థానికులు వేడి టీ తాగి వెళ్లమని నవ్వుతూ ఆహ్వానించడం ఆశ్చర్యం కలిగిస్తుంది . ఇంటి పక్కన వున్న జాగాలో కాయగూరలు సాగు చేస్తూ , కాస్త యెక్కువ జాగా వున్నచోట గోధుమ లాంటి పంటలు పండించు కుంటూ వుంటారు స్థానికులు . వారు చేసే కొన్ని హెచ్చరికలను కూడా మనం పట్టించుకోవాలి .

కొన్ని ' అవదూత ' ల ఆశ్రమాలు వుంటాయి వాటి పక్కగా గాని , వాటిలోపలకి వెళ్లడం గాని చెయ్యకూడదని చెప్తారు .

అలాగే ఓ రెండు కిలో మీటర్లు వెళితే అక్కడ కాస్త పక్కగా ఓ ఆశ్రమం , ఓ బోర్డు దాని మీద ఓ హెచ్చరిక , ఆ ఆశ్రమం అఘోరీలదని , యాత్రీకులకు ప్రవేశం నిషిద్దమని , ఒక వేళ ప్రవేశిస్తే జరిగే పరిమాణాలకు బాధ్యత యాత్రీకులదేనని రాసి వుంటుంది .

అఘోరీలు క్షుద్రోపాసకులని , నరబలులు యిస్తారని , నర మాంసభక్షణ చేస్తారని యిక్కడ చెప్పుకుంటారు .

అఘోరీ ల ఆశ్రమం పక్కనుంచి కొండమీద చిన్న సేలయేటి వొడ్డున సాగుతుంది మన నడక . చల్లని ప్రశాంతమైన వాతావరణం లో నడక అలవాటు లేని మనకి కాస్త ఆయాసాన్నిచ్చినా యెంతో ఆహ్లాదాన్ని కూడా యిస్తుంది . ఎవరో బాగా చెయ్యతిరిగిన తోటమాలి వేసి , కాపాడుతున్నట్లుగా వుండే పచ్చిక మీద నడక అలసటను మరిపిస్తూ  ముందుకు వెళ్లమని ప్రోత్సహిస్తూ వుంటుంది . పచ్చికలో చతికిలబడి ఆకాశాన్ని దూరంగా వున్న కోనిఫర్ వృక్షాలను చూస్తూ వుంటే చెయ్యతిరిగిన చిత్రకారుడి కళాఖండాలను చూస్తున్నట్లుగా వుంటుంది . అక్కడే గుడిశ నిర్మించుకొని మిగతా జీవితాన్ని గడిపెయ్యాలని అనిపించక మానదు .

ఎక్కడా జన సంచారం కనిపించక మనకి కాస్త భయం పుడుతుంది . మొత్తం మన ప్రయాణం లో ఒకరో యిద్దరో కొండల వెనుకాల గ్రామాలలో నివసించే వారు కనిపిస్తే గొప్పే . ఒకవేళ కనిపిస్తే నవ్వుతూ యిక్కడేమీ భయం లేదు హాయిగా  ' చరణ పాదుక ' ని దర్శించుకొని వెళ్లమని చెప్తారు .

ఓ రెండుగంటలలో ఆడుతూ పాడుతూ మా నడక ముగించి ' చరణ పాదుక ' చేరుకున్నాం . అక్కడ ఓ రాతి మీద చెక్కిన రెండు పాదాల గుర్తులను ' చరణ పాదుక ' అని అంటారు .

విష్ణుమూర్తి వైకుంఠం నుంచి యిక్కడకు వచ్చినప్పుడు మొదటగా అడుగు పెట్టిన ప్రదేశమని అంటారు . అవి విష్ణుమూర్తి పాదాల గుర్తులని అంటారు .

విష్ణుమూర్తి పాదాల గుర్తులు కావచ్చు కాకపోవచ్చు , కాని ఆ ప్రశాంతమైన ప్రదేశంలో నడక మనసుని , శరీరాన్ని సేదతీర్చి పోజటివ్ యెనర్జీని యిచ్చిందనటం లో యెటువంటి అతిశయోక్తీ లేదు .

ఓ గంట సేపు ఆ ప్రకృతి సౌదంర్యాన్ని తిలకంచి వెనుతిరిగేం .

బదరీనాధుని మందిరాన్ని ఆనుకొని అలకనంద వొడ్డున నడిచి ఓ అరకిలో మీటరు వెడితే ఓ సిమెంటుతో కట్టిన చెప్టా దానిపైన కట్టిన చిన్న ఫెన్సింగు మద్యన రోజూ పూజ నిర్వహిస్తున్న ఆనవాలు కనిపిస్తాయి . విష్ణుమూర్తి చిన్న పిల్లాడుగా పార్వతికి దొరికిన ప్రదేశం యిదే అనే బోర్డు కనిపిస్తుంది . అక్కడనుంచి వూరిలోకి వెళితే నవదుర్గ మందిరం , శివకోవెల వుంటాయి . ఈ కోవెలలో దశరా నవరాత్రులు చాలా శోభాయమానంగా జరుపుకుంటారు .

నవదుర్గ మందిరాన్ని దర్శించుకొని బయటికి వచ్చేక అక్కడ వున్న చిన్న బోర్డు మమ్మల్ని ఆకర్షించింది , బోర్డుమీద విశ్వామిత్రుడు తపస్సచేసుకున్న ప్రదేశం అదేనని , అక్కడకి అర కిలో మీటరు దూరంలో అతని ఊరువులనుంచి  ఊర్వశి ఉద్భవించిన ప్రదేశం వుందని రాసి వుంది . దాని ప్రకారం అక్కడకు వెళ్లేం , అక్కడ చిన్న రాతి మందిరం వుంది , యే విగ్రహమూ లేదు , కాని నిత్య పూజలు జరుగుతున్న ఆనవాళ్లు మాత్రం వున్నాయి . ఏ మైనా పురాతన మందిర దర్శనం పుణ్యాన్నిస్తుందనే నమ్మకంతో దండం పెట్టుకొని వెనుతిరిగేం .

ఇవి బదరీనాధుని కోవెల చుట్టుపక్కల వున్న దర్శనీయ స్థలాలు .

బదరీ గ్రామానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ' మానా ' గ్రామం భారతదేశం లోని ఆఖరి గ్రామంగా చెప్తారు , దీని తరువాత సుమారుగా సామాన్య ప్రజలు నివసించే  గ్రామాలు లేవనే చెప్పుకోవాలి . అక్కడనుంచి టిబెట్టు సరిహద్దు వరకు  వున్న సుమారు 18 కిలోమీటర్ల భూభాగం మిలిటరీ వారి ఆధీనంలో వుంది .

మానా గ్రామం వరకు కార్లు టాక్సీలు వెళతాయి . మానా చేరుకొనే ముందర రోడ్డు మీద పడుతూ నాలుగు ధారలు ( ఫాల్స్ ) కనిపిస్తాయి , వీటిని వేద ధారలు అంటారు ( ఋగ్వేద , యజుర్వేద , సామవేద , అధర్వణ ) దూరంగా వీటికి వ్యతిరేక దిశలో పడుతూ కనిపించేది ' వసుధార ' అని అంటారు . రద్దీని బట్టి సుమారుగా వేద ధారలు దాటగానే పార్కింగు లో వాహనాలను నిలిపి వేస్తారు , అక్కడ నుండి మానా గ్రామానికి నడకన చేరుకోవాలి .

చలికూడా యెక్కువగా వుండడం వల్ల అక్కడ వున్న టీ దుకాణం రద్దీగా కనిపిస్తుంది , యిదే భారతదేశపు ఆఖరి టీ దుకాణం అని రాసిన బోర్డు కూడా రద్దీకి కారణమేమో ? , అక్కడ నుండి పైకి యెక్కితే ఒక కిలో మీటరు దూరాన గణేశ గుహ చేరుకుంటాం , వ్యాసుడు మహాభారతాన్ని వినాయకునకు వినిపించగా  వినాయకుడు మహాభారతాన్ని రచించిన ప్రదేశం యిది . ఇక్కడ పూర్వం చాలా చిన్న మందిరం వుండేది కాని యిప్పుడు మందిరాన్ని పెద్దది  చేసి యాత్రీకులు కూర్చొని సేదతీరేందుకు వీలుగా పెద్ద అరుగులు నిర్మించేరు .

అక్కడ నుంచి సుమారు ఒకటిన్నర కిలో మీటర్లు  యెగుడు దిగుడు నడక దారిలో వెళితే వ్యాస గుహ చేరుకుంటాం . నడక కష్టమే , యిక్కడ కొండ నిటారుగా వుండి  బాగా ఆయాసం కలుగుతుంది . వ్యాస గుహ చేరుకోడానికి చిన్న రాతి కొండ యెక్కాలి . గుహలో చీకటిగా వుండి పదినుంచి పదిహేను మంది కూర్చోగలిగేంత జాగా వుంటుంది .

నూనె దీపాల వెలుగులో వ్యాసుడి విగ్రహం , రామానుజాచార్యుల విగ్రహం ( ఖచ్చితంగా తెలీదు ) విగ్రహాలు వుంటాయి . అక్కడ యెప్పుడూ ఒక పూజారి వుండి యాత్రీకులకు బదరీనాధుని గురించి , భాగవతం , మహా భారతాలనుంచి చిన్నచిన్న కథలను వినిపిస్తూ వుంటారు . ఇప్పుడు వారి పుత్రులు యాత్రీకుల సందేహాలకు సమాధానాలు యిస్తున్నారు . ఆ గుహ లో కూడా చాలా హాయిగా ప్రశాంతంగా వుంటుంది . అక్కడ నుంచి కిందకి దిగితే సరస్వతీ నది ప్రవహిస్తున్న ప్రదేశం చేరుతాం . సరస్వతీ నదికి దగ్గరగా వెళ్లాలంటే సరస్వతీనదిని దాటాలి , దాటడానికి వీలుగా పెద్ద రాయి పడి వుంటుంది , దీనిని ' భీమ్ పూల్ ' అని అంటారు . స్వర్గారోహణ సమయంలో భీముడు కుంతి , ద్రౌపతి  సరస్వతీ నదిని దాటేందుకు వీలుగా యీ రాతిని పడవేసేడని , అందుకే దీనిని భీమ్ పూల్ అని అంటారని స్థానికులు చెప్తారు . ఇక్కడ సరస్వతీనది చాలా వేగంగా పెద్ద శబ్దం తో ప్రవహిస్తూ అక్కడే ఆశ్చర్యంగా అంతర్వాహిని అయిపోతుంది . మానససరోవరం నుంచి వస్తున్న ధార వొకటి అలాగే కొండలలోంచి పడుతున్న మరో రెండు ధారలను చూడొచ్చు . చిన్న కొండగుహలో వున్న సరస్వతీ మాత ( నది) విగ్రహం వుంటుంది .

సరస్వతీ నది అంతర్వాహినిగా మారడానికి మన వాళ్లు యీ కథ చెప్పారు . వ్యాసుడు మహాభారతం రచించేటప్పుడు తన వాక్ప్రవాహానికి తగ్గట్టుగా రాయగలిగే వారిని యిమ్మని భగవంతుని  కోరగా భగవంతుడు వినాయకుడు తప్ప వేరెవరూ రాయలేరని వ్యాసునకు చెప్పగా వ్యాసుడు గణేశుని ప్రసన్నుని చేసుకొని మహాభారత రచనలో తనకు సహకరించ వలసినదిగా కోరుతాడు , సహకారం అందిస్తానన్న వినాయకుడు వ్యాసుడు చెప్పడం ఆపినా , అతను చెప్పేది వినిపించక పోయినా రాయడం ఆపేస్తానని షరతు విధిస్తాడు . వినాయకుడి షరతుకు వ్యాసుడు తన సమ్మతిని తెలియ జేస్తాడు . కాని సరస్వతీ నది హోరు చాలా యెక్కువగా వుండడంతో  సరస్వతీ నదిని నిశ్శబ్దంగా ప్రవహించమని విన్న విస్తాడు , యెన్ని విన్నపాలు చేసినా సరస్వతీనది హోరు తగ్గించుకోక పోవడంతో వ్యాసుడు సరస్వతీనదిని అంతర్వాహిని కమ్మని శపించుతాడు . అప్పటినుండి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తోంది .

ఈ ప్రదేశం నుంచి వసుధార చాలా చక్కగా కనిపిస్తుంది . అక్కడనుండి సుమారు అయిదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది . వసుధార ను అయిదు కిలో మీటర్ల దూరం నుంచి చూస్తేనే అంద అందంగా వుంది , దగ్గరగా వెళ్లి చూడాలని అనిపించి అక్కడ నుండి నడక ప్రారంభించేం . సుమారు కిలోమీటరు తరువాత లక్ష్మీ దేవి మందిరం వచ్చింది , చాలా చిన్న మందిరం , యిక్కడ నుండి లక్ష్మీ గంగ పుట్టి , బదరీనాధుని పాదాల వద్దకు చేరి అలకనందగా పిలువబడుతూ కిందకి ప్రవహిస్తోంది .

అంతా పచ్చిక నేలే కాని నడక కాస్త కష్టంగా వుండి ఆయాసం కలుగ జేస్తోంది అయినా ముందుకే అడుగులు వేసేం , మరో అరకిలో మీటరు నడిచేక కుంతి సమాధి , మరో అరకిలోమీటరు దూరంలో వున్న ద్రౌపతి సమాధి చూసుకున్నాం , ఆ పైన ప్రయాణం చెయ్యాలంటే పర్మిట్ కావాలి , మావద్ద అలాంటివి లేక పోవడంతో వెనుతిరిగేం . నిర్మానుష్యమైన ప్రదేశాలలో పచ్చికలో తిరగడం చాలా నచ్చింది .

వెనుతిరిగి మానా గ్రామం చేరుకున్నాం , ఆ గ్రామంలో కేదార్ నాధ్ మందిరాన్ని పోలిన ( ఉత్తరాంచల్ లో చాలా మందిరాలు యిలాగే వుంటాయి ) మందిరం చూసేం , అది ఘంటాకర్ణుని మందిరం . మానా ప్రజలు ఘంటాకర్ణుని దేవుడిగా పూజిస్తారు .

మానా గ్రామ ప్రజలు ' మంగోలియా ' దేశానికి చెందిన ఆటవిక జాతికి చెందిన వారట . కష్టపడి పనిచేసే జాతి .

మానా లో వున్న మిలిటరీ స్థావరంలో వున్నప్పుడు అక్కడ వుండే జవాను అక్కడకి మరో మూడు కిలో మీటర్ల దూరంలో వున్న ప్రదేశానికి తీసుకు వెళ్లేడు , అక్కడ సరస్వతీ నది చాలా ఉధృతంగా యెక్కడో కిందన ప్రవహిస్తోంది , కర్రవంతెన మీద నిల్చుని వున్న మాకు హోరు , చాలాకిందన ప్రహిస్తున్న నది కనిపించేయి . ఆ అనుభూతి మాటలకు అందనిది అంతే . కార్లు అక్కడ వరకు వెళతాయి కాని ఆ భాగం మిలటరీ వారి ఆధీనం లో వుంది కాబట్టి యాత్రీకులను అనుమతించరు . గణేశ గుహ నుంచి ఉత్సాహవంతులు కాలినడకన అక్కడకు వెళ్లడం కనిపించింది .

ఈ క్షేత్రం 108  దివ్యదేశాలలో ఒకటే కాకుండా 8 ' స్వయం వ్యక్త ' క్షేత్రాలలో ఒకటి .

ప్రస్తుతం బదరీనాధ్ మందిర తలుపులు తెరిచేరు , అక్టోబరు వరకు యాత్ర జరుగుతుంది ఆలస్యం యెందుకు బయలుదేరండి యాత్రకి , నేను సూచించిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా యాత్ర చేసుకు రండి .  

మరిన్ని శీర్షికలు
chamatkaram