గత సంచిక లోని నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి ... http://www.gotelugu.com/issue221/618/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/
( గతసంచిక తరువాయి ).. సడెన్ గా ఆమెని వదిలేసి లేచి నిలబడి ఆ చీకట్లోనే పచార్లు చేశాడు.
అతనికి ఎందుకో అప్పటికప్పుడు సిగరెట్ తాగాలన్న కోరిక కలిగింది. ఆకాష్ కి స్మోక్ చేసే అలవాటు లేదు. టీనేజ్ క్యూరియాసిటీతో ఓసారి తాగాడు. కానీ అంతగా టెంప్ట్ చేయ లేదది.
కానీ యిపుడు...
ఈ సమయంలో....
శరీరాన్ని వేధించే ఏదో బాధ నుంచి రిలీఫ్ పొందడానికి తాగాలనిపిస్తోంది.
ఏదో వలయంలో చిక్కుకు పోతున్నట్లుగా వుంది. ఎన్ని పనులు? ఎంత డబ్బు!....అన్నీ వదిలేసి ఇలా ఎందు కోసం....? ఏదో గుర్తొచ్చింది. కేవలం అందు కోసమేనా? ఈ అమ్మాయంటే ఏ అభిప్రాయమూ లేదా....?
మనసంతా సంఘర్షణతో నలిబిలి అవుతోంది. తట్టుకో లేక పోతున్నాడు. ముందు ఈ చీకటి నుంచి వెలుగు లోకి వెళ్ళాలి.
‘‘కీర్తనా! వెళదామా?’’ హఠాత్తుగా అతని గొంతు వినిపించింది.
అతని ఆకారం వంక చూస్తూ, యింతకు ముందు తామిద్దరి మధ్యన జరిగిన సంఘటనని తల్చుకుని ఆశ్చర్యానికి లోనవుతోంది.
‘‘వెళదామా....?’’ ఇసుకలో పడిన కెమెరాని తీసి దులుపుతూ అడిగాడు.
‘‘ఊ....!’’ లేచి నిలబడిరది.
బట్టల నిండా యిసుకే! అతను ఫ్యాంటూ షర్ట్ కి అంటిన యిసుకను దులుపుకుంటున్నాడు.
అది చూసి ఆమె కూడా డ్రస్ ని దులిపింది.
బట్టలు యింకా తడీ పొడి గానే వున్నాయి. యిలా వెళితే ఫ్రెండ్స్ దగ్గర యింకేమయినా వుందా...? కానీ తప్పదు.
అతను కారు పార్కింగ్ వైపు నడవడం చూసి అనుసరించింది. అతను అంత సేపూ మౌనం గానే వున్నాడు.
కార్ లో కూడా ముభావం గానే వున్నాడు. జరిగిన దానికి బాధ పడుతున్నాడేమో....! అవును మరి... జరిగింది ఏమయినా తక్కువ విషయమా? అనవసరంగా యిద్దరం టెంప్టయ్యాం.
‘‘అయాం సారీ!’’ హోటల్ దగ్గర దిగాక అంది.
‘‘ఎందుకు?’’ మామూలు గానే అన్నాడు.
ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలీ లేదు కీర్తనకి.
ఆమె తటపటాయింపు చూసి, ‘‘అన్నీ మర్చి పోయి రెస్ట్ తీసుకో. తల స్నానం చేసి బాగా తుడుచుకో! జలుబు చేస్తుంది’’ చెప్పాడు.
తలూపింది. ‘‘వెళతాను, గుడ్ నైట్’’ లిఫ్ట్ దగ్గరకి రాగానే చెప్పాడు.
కాసేపు తటపటాయించి ‘‘మెట్లెక్కి వెళదామా?’’ సంకోచంగా అంది. ఆమె మనసు అర్ధమయింది. ఆ మనసుకి మరి కాసేపు తనతో గడపాలనుంది.
‘‘సరే!....’’ మెల్లగా మెట్లెక్కడం ప్రారంభించారు.
‘‘టూ డేస్ తర్వాత మ్యాచ్ కదా?.... ఈ టూ డేస్ కలవను’’ చెప్పింది.
ఎందుకనని అడగ లేదతను. ఆమే చెప్పింది. ‘‘డిస్టర్బ్ అవుతాను. కాన్సన్ ట్రేషన్ పోతుంది’’ అని.
అభావంగా ఆమె వంక చూశాడు. అతని కళ్ళలో భావమేదో అర్ధమయ్యీ కానట్లుంది. అంటే తను కలవక పోవడం యితనికి బాధని కలిగిస్తుందా! పోనీ కలుద్దామా...? అంటే ఈరోజు జరిగిన సంఘటనే తనని అంత తొందరగా వదిలి పెట్టేట్లు లేదు.
యిక రేపూ ఎల్లుండీ కూడా యితనితో గడిపితే టీమ్ అంతటికీ తను ద్రోహం చేసినట్లే. అసు తను మద్రాస్ వచ్చింది టోర్నమెంట్ కోసం. ఆకాష్ తో షికార్లు కోసం కాదు. దృఢంగా అనుకుంది.
తన రూం దగ్గరకి రాగానే ‘సీయూ’ చెప్పింది. అతను లిప్టు ఎక్కే వరకూ ఉండి రూంలోకి వచ్చేసింది. ఇంకా వాళ్ళెవరూ రాలేదు.
రిసెప్షనిస్ట్ ఫోన్ మెసేజ్ పంపించింది. తమ టీమ్ వాళ్ళంతా ఫస్ట్ షో సినిమా చూసి వస్తారట అని.
కొంతలో కొంత నయం. టైమ్ చూసుకుంది. ఏడున్నరయింది. గబ గబా తల స్నానం చేసేసి, నైట్ డ్రస్ వేసుకుని రూం సర్వీస్ కి ఫోన్ చేసింది.
వేడి వేడి డిన్నర్ రూంకే సర్వ్ చేయ బడింది. భోజనం చేసి మంచం మీద వాలి నెక్ట్స్ గేమ్ లో అనుసరించ బోయే వ్యూహం గురించి ఆలోచించింది.
రేపూ, ఎల్లుండి స్టేడియం కి వెళ్ళి మిగతా వాళ్ళ మ్యాచ్‌లు అబ్జర్వ్ చేయాలి. ఈ రోజంతా మిస్ చేసింది. ఇక ముందు అలా కాకూడదు.
నిద్రతో కళ్ళు మూతలు పడ్డాయి. మధ్యలో ఎప్పుడో ఫ్రెండ్స్ రావడం, సెకండ్ కీతో తలుపు తెరచి లోపలికి వచ్చి తనని గురించి జోకు వేసుకోవడం, ఏమీ తెలీనంత గాఢ నిద్ర లోకి జారుకుంది కీర్తన.
పై ఫ్లోర్ లో ఆకాష్ మాత్రం నిద్రకి దూరమై బాల్కనీ లో ఛెయిర్ వేసుకుని మెరిసి పోతున్న ఆకాశం వంక చూస్తూ జరిగినదాన్ని తల్చుకుంటూ జరగ బోయే దాని గురించి ఆలోచిస్తూ ఆ రాత్రంతా జాగారం చేశాడు.
*****************
మృదులా దేవి పుట్టింటి కొచ్చి నెల రోజులయింది. ఆమెకి యింకా కదిలే ఉద్దేశ్యం లేనట్లు మరదళ్ళు గమనించారు.
ఆమెకి వండి వడ్డించడం, సకల మర్యాదలూ చేసి ఒదిగొదిగి గడపడం వాళ్ళకి ప్రాణ సంకటంగా వుంది.
కానీ తప్పదు....
తాము ఇంత తిండి తిని, ఈ మాత్రం సుఖంగా నైనా ఉన్నామూ అంటే, అది తమ భర్తల ప్రయోజకత్వం కాదు. ఆడ పడుచు చలవ అనుకోగానే ఎదురు తిరిగే మనసు కూడా కాస్తంత శాంతిస్తుంది.
కానీ మృదులా దేవి చెలాయించే అధార్టీని భరించడం కొంచెం కష్టమే!
అందరూ తన కనుసన్నలలో మెదలాలనుకునే మనిషి ఎవరు ఎదురు తిరిగినా ఆమెకు నచ్చదు.
జగన్నాధం ఒక్కడే ఆమెతో ధైర్యంగా మాట్లాడ గలడు. అనుకున్నది సాధించగలడు.
ఇంతకాలం ఫార్మాస్యూటికల్స్ నష్టాల్లో ఉందని చెప్పి చాలా మిగుల్చుకున్నాడు. అందులో కొంత మృదులా దేవి కూడా బ్యాంక్ లో తన పేరు మీద వేసుకుంది.
బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి ఆ కంపెనీని అశోక్ హేండోవర్ చేసుకునే సరికి, చేతిలో పైసా డబ్బు రాక ఒకటే చిరాగ్గా ఉంది.
ఇంత వరకూ కూడబెట్టిన దాంతో బతకొచ్చు గానీ, ఇక ముందు జల్సాలకి డబ్బులు చాలవు.
అదీ కాక ఆ అశోక్ ఇంతటి తోనే వదిలి పెడతాడని కూడా లేదు. ఆస్థులన్నింటినీ స్వాధీనం చేసుకుని పెత్తనం వెలగ బెడతాడేమో! కుంక వాడి ఆటలు సాగనివ్వ కూడదు అని ఇంటిల్లి పాదీ గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఇంటికి రావడంతోనే ‘‘అక్కయ్యా....!’’ అంటూ హడావిడిగా వచ్చాడు జగన్నాధం.
మరదళ్ళతో కలిసి సినిమాకి వెళదామని ప్లాన్ వేసుకుని తయారవుతున్న మృదులా దేవి...
‘‘ఏంటి తమ్ముడూ....అంత కంగారు?’’ మొహానికి మేకప్ సరి పోయిందా లేదా అని అద్దంలో చూసుకుంటూ అడిగింది.
‘‘అక్కడ పిల్లల మీద సంసారం వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. వాళ్ళ యిష్టా రాజ్యంగా వుందక్కడ’’ ఆవేశంగా అన్నాడు.
‘‘ఏమయిందిప్పుడు?’’ తాపీగా అంది.
‘‘ఏమయిందా? ఆ కీర్తన ఏవో ఆటంటూ చెన్నై వెళ్ళిందట...అలా బరి తెగించి ఒక్కతే అక్కడికీ, ఇక్కడికీ తిరగడం మాన్పించమని చెప్పానా లేదా?’’ ఏదో పెత్తనం అంతా తనదే అయినట్లు రంకెలు వేస్తున్నాడు.
‘‘చెన్నై వెళ్ళిందా?’’ భృకుటి ముడుస్తూ అంది.
‘‘ఆ...నిన్న ఏదో పనుండి అటు వైపుకి వెళ్ళాను. ఒక సారి చూసి వద్దాం అని ఇంటికి వెళ్ళాను. నీ కొడుకు వాళ్ళ నాన్నకి అన్నం తినిపిస్తున్నాడు. కీర్తన లేదా? అంటే ఇదుగో ఈ సంగతి చెప్పుకొచ్చాడు.’’
‘‘ఆహా!....’’ తల పంకిస్తూ అంది.
‘‘అలా వూరుకుంటే ఇంకా పేట్రేగి పోతారు.....’’ రెచ్చ గొడుతూ అన్నాడు.
‘‘ఏం చేయనురా! ఇప్పుడంతా వాడి పెత్తనమే అయి పోయింది. చెల్లెల్ని ఏదన్నా అంటే నా మీద విరుచుకు పడతాడు. ఏదన్నా అంటే సవతి తల్లి సరిగా చూడదన్న అపవాదు ఒకటి! నా కడుపున ఒక కాయ కాస్తే వాళ్ళని చూసుకుని అయినా ఆ ఇంట్లో ధైర్యంగా ఉందామూ అంటే, ముసలాయన మూల పడటంతో దేవుడు ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు’’ రాని కన్నీళ్ళను ఒత్తుకుంటూ అంది.
మనస్సులో ఎంత అక్కసు వున్నా, ఆడ పడుచు కష్టాలు వినే సరికి నిజమే అనిపించింది మరదళ్ళకి.
‘‘ఎందుకండీ వదిన గారిని ఏడిపిస్తారు....? మీకు చేతనైన సాయం చెయ్యండి. అంతే తప్ప ఆవిడ మనసుని బాధ పెట్టొద్దు....’’గట్టిగా అంది జగన్నాధం భార్య.
‘‘నేనేమన్నానే! తన మంచి కోసమే కదా చెప్పాను’’ జగన్నాధం తగ్గి పోయి అన్నాడు.
‘‘వాడేం అన లేదులే! ఏదో నా బాధ కొద్దీ....’’ అంటూ తమ్ముణ్ణి వెనకేసుకొస్తుంటే....
‘‘వీళ్ళ మధ్యలో కల్పించుకో కూడదు....’’ అంటూ లెంపలు వేసుకున్నారు మరదళ్ళు.
‘‘ఒక సారి అశోక్ కి ఫోన్ చేస్తాను.....’’ ఏదో ఆలోచిస్తూ అంది మృదులా దేవి.
‘‘ఆ....గుడ్ ఐడియా! ఫోన్ చేసి గట్టిగా వార్నింగివ్వు!’’ జగన్నాధం కసిగా అన్నాడు. అనుకున్నదే తడవుగా ఇంటికి ఫోన్ చేసింది. ఇంట్లో లేడతను.
ఆఫీసుకి చేసింది. అక్కడ దొరికాడు.
మృదులా దేవి గొంతు వినగానే..
‘‘పిన్నీ! బాగున్నావా?’’ మర్యాద పూర్వకంగా పలకరించాడు.
‘‘ఆ! బాగానే వున్నాను. ఏం చేస్తున్నారు?’’ అంది.
ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలీలేదు అశోక్ కి.
‘‘ఆఫీసులో వున్నాను’’ అప్రయత్నంగా అన్నాడు.
‘‘అది తెలుసులే....! అందుకేగా ఇక్కడికి చేసింది. కీర్తన ఏం చేస్తోంది?’’ పెడసరంగా అంది.
ఆమె మాట తీరుకి చివ్వున ఆవేశం ఉప్పొంగింది. అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు.
అతను మౌనంగా వుండి పోయే సరికి
‘‘కాలేజీకి వెళ్ళిందా?’’ ఏమీ ఎరగనట్లు అడిగింది. |