2018 జూన్‌లో తన కుమారుడు మోక్షజ్ఞ నటించబోయే సినిమా ప్రారంభమవుతుందని నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రకటించారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ ఈ ప్రకటన చేశారు. హీరోగా తెలుగు తెరపై వెలిగిపోయేందుకు వీలుగా ముందుగానే మోక్షజ్ఞ నటనలో తర్ఫీదు పొందాడట. ఫైట్స్, డాన్స్‌లలో అత్యున్నతమైన ప్రతిభ చూపుతున్నాడని సమాచారమ్. ఎప్పటినుండో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని వార్తలు వస్తున్నప్పటికీ, నందమూరి వంశం నుండి వస్తున్న రాకుమారుడు అంటే ఆ వంశం పేరు ప్రతిష్ఠలు నిలబెట్టేవాడవ్వాలి. రూపంలోనూ, నటనలోనూ ఓ స్థాయిలో ఉండాలి.
అందుకు తగ్గట్లుగానే తనను తాను మలచుకునే ప్రయత్నాల్లో ఉన్న కారణంగా మోక్షజ్ఞ ఎంట్రీకి ఇంత కాలం పట్టిందట. అయితే మరి ఈ నందమూరి రాకుమారుడికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే దర్శకుడెవరనేది అందిలోనూ మెదులుతోన్న ప్రశ్న. అయితే బాలయ్య వందో చిత్రం అయిన 'శాతకర్ణి'ని తెరకెక్కించిన క్రిష్‌కే ఆ ఛాన్స్ దక్కేలా ఉంది. దర్శకుడు క్రిష్, మోక్షజ్ఞ కోసం అందమైన ప్రేమకథ రూపొందించాడని తెలియవస్తోంది. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా సమయంలోనే క్రిష్‌కి, బాలయ్య హామీ ఇచ్చాడట మోక్షజ్ఞ తెరంగేట్రంపై. బాలయ్య అంటే మాస్, క్రిష్ అంటే క్లాస్. బాలయ్య అభిమానులు మెచ్చే మాస్ కథాంశంతోపాటుగా, తన ట్రేడ్ మార్క్ క్లాస్ టచ్ ఇచ్చి క్రిష్, మోక్షజ్ఞకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని ఆశిద్దాం.
|