Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..... http://www.gotelugu.com/issue230/637/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

(గత సంచిక తరువాయి)... అయితే అందులోని తేడాని ఆమె ఫ్రెండ్స్ ఎవరూ చెప్పలేదు. మనసు బాగోలేదు కదాని వదిలేశారు. అప్పటికి స్టేట్ గేమ్స్ విశాఖ పట్నంలో జరగటానికి సరిగ్గా తొమ్మిది రోజులు  టైమ్ మాత్రమే వుంది.


*********

ఎనిమిది రోజులు గడిచాయి. ప్రతి రోజూ నరకాన్ని తలపింప జేస్తోంది. నిలుచున్నా, కూర్చున్నా, పడుకున్నా, తింటున్నా ఒకటే ఆలోచనలు.

ఆ ఆలోచనల నిండా ఆకాష్.

ఎన్నో సార్లు ఆలోచనల్లోనే ఎందుకిలా చేశావంటూ అతన్ని నిలదీసి అడిగింది. సమాధానం శూన్యం.

రెండు సార్లు ఆకాష్ ఫోన్ చేశాడు.

ఓ సారి ముభావంగా మాట్లాడి ఒంట్లో బాగా లేదని చెప్పి ఫోన్ పెట్టేసింది.

ఇంకో సారి లేనని చెప్పించింది.

అప్పుడు లక్కీగా అశోక్ ఇంట్లో లేడు. ఉంటే డౌట్ వచ్చి వుండేది.

ఈ బాధకి తోడు అన్నయ్య ఆఫీసులో శ్రీధర్ అనే అతన్ని ఏవో పనుల మీద సంతకాల కోసం తన దగ్గరకి పంపించే వాడు అశోక్....

అతని చూపు, ప్రవర్తన తనకి అంతగా నచ్చడం లేదు. అతను చాలా నమ్మకమైన మనిషంట!

అలాంటి మనిషి మీద అన్నయ్యకి ఏమని రిపోర్ట్ చెయ్య గలదు.

ఆకాష్ నీ అలాగే నమ్మింది....

చివరికి ఏమయింది....?

ఎవరికీ చెప్పుకో లేని బాధని అనుభవిస్తోంది. చివరికి ఇతనూ అంతేనేమో! అందుకే అన్నయ్యకి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అనుకుంది.
తను టోర్నమెంట్ కి వెళ్ళాల్సిన తేదీ దగ్గర పడిన కొద్దీ అన్నయ్య ముభావంగా వున్నట్లు డౌట్ వస్తోంది.

తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే అన్నని అనుమానించాల్సి వస్తున్నందుకు తనని తనే తిట్టుకుంది. కానీ అశోక్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు?
ఇది వరకటిలా తనని ఎంకరేజ్ చెయ్యడం లేదు.

మనసంతా దిగులుగా మారి పోయింది. ఒక పక్క ఆకాష్ గురించి బాధ మనసుని పిండేస్తోంది. క్యాంపస్ లో మణిబిందు ఎదురయితే తల వంచుకుని వెళ్ళి పోతోంది తను.

కొంతలో కొంత అదృష్టం ఏంటంటే...

మణి బిందు ప్రాక్టీస్ చేసే స్టేడియం వేరు. లేక పోతే అక్కడ కూడా హింసే!

క్షణ క్షణం గుర్తొచ్చి బాధ పెట్టే ఆకాష్ తాలూకు జ్ఞాపకాల నుంచి తట్టుకో లేక ఆమె మనసు నలిగి పోతోంది.

అయినా కాలం మన కోసం....మన గాయాలు మానడం కోసం ఆగదు. దాని పని అది చేసుకుంటూ వెళుతుంది.

వైజాగ్ వెళ్ళడానికి గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి సీట్లో కూర్చున్న దగ్గర్నుంచీ తన పక్క సీటు వంకే తదేకంగా చూస్తూ కూర్చుంది.
అక్కడ ఆకాష్ కనిపిస్తున్నాడు!

చెన్నై వెళ్ళినప్పుడు ఇలాగే అనుకోకుండా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడూ అలాగే కనిపిస్తాడా? వెర్రిగా ఏడుపు వస్తోంది. అతి ప్రయత్నం మీద ఆపుకుంటోంది.

జర్నీ చేస్తున్నంత సేపూ బాధ పడుతూనే వుంది. ఒక్క జర్నీ ఏంటి? తను స్వయంగా విషయం తెలుసుకున్న తర్వాత నుంచీ ఈ గుండె భగ భగా మండుతూనే వుంది.

ఒక మనిషిని ఇంకో మనిషి మోసం చేయడం ఇంత సులువా అనిపిస్తోంది.

ఆకాష్!!

ఎందుకు చేశావీ పని....??

కొన్ని వేల సార్లు అతన్ని ప్రశ్నించింది.

సమాధానం లేదు.

రాత్రంతా కంటి మీద కునుకు లేదు. తెల్ల వారిన తర్వాత ఏడున్నరకి వైజాగ్ స్టేషన్ లో ట్రెయిన్ దిగారు.

హోటల్ మేఘాలయలో రూమ్స్ బుక్ చేశారు. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యారు.

ఆ రోజు మధ్యాహ్నం మూడింటికి డ్రా తీస్తారు. మర్నాటి నుంచి గేమ్స్ బిగినవుతాయి.

మధ్యాహ్నం భోజనాలయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని పోర్ట్ స్టేడియంకు బయలు దేరారు.

అప్పటికే అన్ని జిల్లాల జట్లు చేరుకున్నాయి.

తన చిరకాల ప్రత్యర్ధి కృష్ణా జట్టు కెప్టెన్ తన వంక చూసి పలకరిస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వింది.

ఆ నవ్వులో ఎంత స్వచ్ఛత...?

కల్మషం అనేదే లేదు....

కీర్తనకి హాయిగా అనిపించింది. దగ్గర కెళ్ళి కరచాలనం చేసింది.

ఫైనల్స్ తో సహా మొత్తం నాలుగు మ్యాచ్ లు.

నాలుగు రోజుల్లో ఫలితం తేలి పోతుంది.

పూల్`ఎ, పూల్`బి కింద విడగొట్టి పోలీస్ గ్రౌండ్స్ లోనూ, పోర్ట్ స్టేడియం లోనూ ఒకేసారి ఆడించారు.

లీగ్ మ్యాచ్ లోనూ, క్వార్టర్ ఫైనల్స్ లోనూ ప్రతిభ ఉన్న జట్టు ఎదురు పడలేదు. ఆడుతూ పాడుతూ మ్యాచ్ లను గెలిచింది హైదరాబాద్ జట్టు.

సెమీస్ లో ఖమ్మం జట్టుని ఓడించిన కృష్ణా, వైజాగ్ జట్టుని ఓడించిన హైదరాబాద్ ఫైనల్ లోకి అడుగు పెట్టాయి.

ఖమ్మం జట్టు కూడా పోరాట పటిమని ప్రదర్శించి ప్రేక్షకులని ఆకట్టుకుంది.

అప్పుడే తమ జట్టు లోని లోపాలను కీర్తన గమనించింది. తనతో సహా అందరి లోనూ అలసత్వం ప్రవేశించింది.

ఆత్మ విశ్వాసం హెచ్చు మీరటం మూలం గానో ఏమో తెలీడం లేదు కానీ, తన ఆట తీరు కూడా మారి పోయింది. కారణం ఏమిటో తెలుస్తోంది.
కాన్సంట్రేషన్ కుదరడం లేదు....!

మాటి మాటికీ ఆకాష్ గుర్తొస్తున్నాడు. మనసంతా బాధగా వుంటోంది. 

ఎవ్వరూ లేని ఓ చీకటి గదిలో దుప్పటి ముసుగు పెట్టుకొని పడుకుండి పోవాలనిపిస్తుంది.

ఎప్పుడూ లేని విధంగా వాలీబాల్ ని డామినేట్ చేసే ఆలోచనలు పెరిగి పోయాయి.

వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీడం లేదు. మర్నాడే ఫైనల్స్ అనగా టీమ్ అంతా రూంలో సమావేశమయ్యారు.

అన్య మనస్కంగానే మాట్లాడుతోంది కీర్తన.

‘‘కృష్ణా టీమ్ మనకి ఐదేళ్ళుగా తెలుసు. ఆంధ్రాలో గట్టి పోటీ ఉందంటే వీళ్ళ నుంచే....’’ ఒకమ్మాయి అంది. 

‘‘నేషనల్ గేమ్స్ ముందు జరుగుతున్న మ్యాచ్ ఇది. మనం గెలిచినా, ఓడినా నేషనల్ గేమ్స్ కి  అడ్డంకి కాక పోవచ్చు. కానీ ఇది ప్రెస్టేజ్ క్వశ్చన్. మానసికంగా ఓడి పోతాం. అందుకే స్టేట్ లెవల్ గేమ్ కదాని నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తగా ఆడాలి. వాళ్ళు ప్రతీకారం కోసం రగిలి పోతున్నారు. మనకి నేషనల్ గేమ్ ఫేవరేట్ హోదా ఒత్తిడి తెచ్చి పెడుతుంది. దాన్ని అధిగమించాలి’’ ఇంకో అమ్మాయి అంది.

కీర్తన ఏవో ఆలోచనల్లోకి జారి పోవడం చూసి ఒకమ్మాయి విసురుగా ఏదో అనబోయి ఆగి పోయింది.

కీర్తన తమ కెప్టెన్....

ఇన్నేళ్ళ నుంచీ పన్నెండు మందీ పరస్పర సహకారంతో మెలుగుతూ విజయాలను సాధించారు. ఆటలో పరిపూర్ణత గల కీర్తన, తమ ఆట లోని బలహీనతలను సరి దిద్దడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంది.

ఇంత వరకూ ఈ గేమ్ లో ఇండియా మొత్తం మీద ఆమె కన్నా బాగా ఆడే వాళ్ళు లేరు.

అలాంటి కీర్తన ఇలా డల్ గా మారి పోవడం వాళ్ళకి అంతు బట్టడం లేదు.

ఆకాష్ కోసమా?? అనుకున్నారు. ఏవయినా అంటే ఇంకా డిప్రెస్ అవుతుందని వూరుకున్నారు.

*********

మర్నాడు సాయంత్రం నాలుగు గంటలు....

పోర్ట్ స్టేడియం జనాలతో కలకల్లాడుతోంది.

స్టేట్ వాలీ బాల్ ఛాంపియన్ షిప్ కోసం కృష్ణా జట్టు, హైదరాబాద్ జట్టు పోటీ పడుతున్నాయి.

ముందు టాస్ వేశారు.

కీర్తన టాస్ గెలిచి సర్వీస్ తీసుకుంది.

కృష్ణా కెప్టెన్ కోర్టు ఎంచుకుంది. ఎండ ముఖం మీద పడకుండా వుండే కోర్టు ఎంచుకుంది ఆమె. రిఫరీ విజిల్ వేయడంతో ఎవరి స్థానాల్లో వాళ్ళు నిల్చున్నారు. రైట్ డిఫెన్స్ లో వున్న కీర్తన బాల్ తీసుకుని బాక్ లైన్ అవతల నిల్చుంది.

అందరి చూపులూ ఆమె మీద నిలిచాయి. ఊపిరి భారంగా పీల్చి తల పైకెత్తి బాల్ పైకి ఎత్తే పొజిషన్ చూసుకుంది. తలెత్తే సరికి కళ్ళ లోకి సూర్య కిరణాలు చొచ్చుకు పోయాయి. కళ్ళు చిట్లించి చూసింది. నాలుగు దాటుతున్నా సూర్యుడు ప్రచండం గానే వున్నాడు. ఆకాశం తెల్లగా వుంది.

ఆకాశం.....తెలుపూ.....

ఆకాష్....తెలుపే....కానీ మనసే తెల్లనిది కాదు. దిగులు మేఘం కమ్ముకుంది.

రిఫరీ మళ్ళీ విజిల్ వేశాడు. ఉలిక్కి పడి తేరుకుని యాంత్రికంగా బాల్ పైకి విసిరి అర చేత్తో చరిచింది. రాకెట్ వేగంతో దూసుకు పోవాల్సిన సర్వీస్ పేలవంగా వెళ్ళి నెట్ కి కొట్టుకుంది.

ఆమె సర్వీస్ డౌన్....

ఫ్రెండ్సంతా ఆశ్చర్యంగా చూశారు. ప్రత్యర్ధి జట్టు ముసి ముసిగా నవ్వుకుంది. 

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi