Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uttarakhand

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaaram

సాధారణంగా ఈరోజుల్లో,  ఆనాటి మాటలేమైనా చెప్తే, మన " యువతరం " .  " అంతా ఏమిటో పాతచింతకాయ పచ్చడిలా , మరీ వాటినే పట్టుకు వేళ్ళాడుతూ కూర్చుంటే ఎలా... మారాలి కాలంతో పాటూ... " అని కొట్టిపారేస్తూ,   " జ్ఞానబోధ " చేయడం చూస్తూనే ఉంటాం. అయినా మొండిఘటాలు చేస్తూనే ఉంటారు.. చెప్పడం మన డ్యూటీ అనుకుంటూ. ఈరోజుల్లో ఎక్కడ చూసినా " అంతర్జాల మహిమ" కదా..  ఇంట్లోపెద్దలు ఎంత చెప్పినా, ఓసారి గూగులమ్మని అడిగితేనే కానీ, అంత సులభంగా ఒప్పుకోరు. ఇంక ఆ గూగులమ్మేమో, ఏదో అమెరికాలో కనిపెట్టిన విశేషమోకానీ చెప్పదాయె. పైగా ఆ విషయాలన్నీ, ప్రాచీనకాలంలో మన ఋషులు ఏనాడో చెప్పారూ అన్నా కూడా ఒప్పుకోరు. ఎంతైనా పెరటి చెట్టు మందుకి ఉపయోగించదుగా..శంఖంలో పోస్తేనే తీర్థం, ఆ గూగులమ్మ చెప్పిందే వేదం. అదేమీ తప్పుకాదు. ఇదివరకటి రోజుల్లో, " మెదడు" ని ఉపయోగించేవారు, ఈరోజుల్లో, ఆ మెదడుకి విశ్రాంతి ఇచ్చి, చేతిలో ఉన్న  smart phone  ని ఓ నొక్కునొక్కుతున్నారు.. No issue..

ప్రస్థుత విషయం ఏమిటయ్యా అంటే,   ఓ కుటుంబంలో ఉండే పిల్లల విషయం. అంటే ఒక్కో కుటుంబంలో ఎంతమంది పిల్లలుండాలీ అని. ఇదివరకటి రోజుల్లో, ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంత సౌభాగ్యమూ అనుకునేవారు, తమ ఆర్ధిక స్థోమతతో  సంబంధం లేకుండా. ఆరోజుల్లో మన తల్లితండ్రులు అలా అనుకోకపోతే, ఇప్పుడు నేనూ ఉండేవాడినికాదూ, 60 ఏళ్ళపైబడ్డ  ఎవరూ ఉండేవారు కాదు.. కనీసం ఓ అయిదారుగురు పిల్లలుంటేనే కానీ, తోచేదికాదు ఆరోజుల్లో. అలాటివి విన్నప్పుడు మన యువతరం... "  अरे बाप रे... इत्ना बच्चा.."  అని ఆశ్ఛర్య పడిపోడం. వారిమధ్య సంబంధబాంధవ్యాలు ఎలా ఉండేవీ అన్నది, ప్రస్థుతం, అప్రస్థుతం. పెళ్ళిళ్ళు కూడా చిన్నవయసులోనే అయిపోయేవి. కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలూ etc..  అవీకూడా లక్షణంగానే ఉండేవి, ఎక్కడో అక్కడా ఇక్కడా తప్పించి. ఆరోజుల్లోనూ పిల్లలు ఉద్యోగరీత్యా దేశవిదేశాల్లో ఉండేవారు. అయినా ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా, ఓ పండగొచ్చినా, అందరూ  తప్పనిసరిగా కలిసేవారు " నిత్యకల్యాణం పచ్చతోరణానికి " ప్రతీకగా ఉండేది వాతావరణం.ఇంట్లో ఎంతమందిపిల్లలుంటే అంత గర్వంగా భావించేవారు. మరి ఈ పిల్లలందఱూ పెరిగిపెద్దదయ్యేదెట్లా అని అడిగినా, " ఏదో ఆ నారు పోసినవాడే నీరూ పోస్తాడులెద్దూ.. " అని నవ్వేసేవారు. మనం పెరిగిపెద్దవలేదూ వారి ఆశీర్వచనంతో?

కానీ కాలక్రమేణా, జనాల్లో కోరికలూ, ఏదో ఉధ్ధరించేద్దామని ఊహలూ మొదలయ్యాయి. ఇంట్లో అంతమంది పిల్లలుంటే, వీళ్ళని పెంచేదెట్లా అనేసికుని, 70 వ దశకం తరువాత, ఉండాలికాబట్టి ఓ పిల్లా, తనకి తోడుగా ఉండడానికి ఓ పిల్లో, పిల్లాడో చాలూ, అనే పరిస్థితిలోకి వచ్చేశారు. ఒకలా చూసుకుంటే అదీ సరైన పధ్ధతిగానే కనిపించింది.. ముందర ఆడపిల్ల పుడితే, ఇంకోసారి ప్రయత్నం చేసి, ఓ మొగపిల్లాడు పుట్టాడా సరే సరి, లేకపోతే ఇద్దరు చాలనుకునేవారు.. మరీ ఎక్కడో తప్ప, ఇంటికి ముగ్గురూ, అంతకన్నా ఎక్కువా  పిల్లలుండడం చాలా అరుదు.ఈరోజుల్లో ఓ పిల్లనో పిల్లాడినో పెంచిపెద్దచేసి మంచి చదువులు చెప్పించడానికి లక్షల్లో ఖర్చవుతోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూండడం వలన ఎలాగోలాగ బాగానే వృధ్ధిలోకి తెస్తున్నారు. కానీ రోజులు గడిచేకొద్దీ, ఒక్కరితోనే సరిపెట్టేసికుంటున్నారు. ఆ ఉన్నవాళ్ళనే బాగా పెంచితే చాలూ అనుకుంటున్నారు.  No problem...

అప్పుడెప్పుడో న్యూస్ పేపరులో ఓ వార్త  చదివిన తరువాత నవ్వొచ్చింది. అలాగే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారి  ఉవాచ... " నేటి తరం కుటుంబ నియంత్రణ పద్ధతులను పక్కన పెట్టి.. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో క్రీడా అవగాహణ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనన మరణాల రేటు సమానంగా ఉంది. దీంతో రాబోయే కాలంలో యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని.. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు చెప్పారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి సంతరించుకున్నాయి.  అకస్మాత్తుగా నాయుడుగారికి    ఇంత  జ్ఞానోదయం ఎలా  అయిందబ్బా?  ఎంతైనా రాజకీయ దురంధరులాయె. తనకు ఎలాగూ సమస్యలేదుకదా, పోతే ప్రజలే మట్టికొట్టుకుపోతారూ, అంతేసిమంది సంతానాన్ని పెంచలేకా, తనూ,  తనకున్న కొడుకూ చల్లగా ఉంటే చాల్లెద్దూ అనా?

చెప్పడమంటే చెప్పేశారు కానీ, ఈరోజుల్లో ఒక్క పిల్లో, పిల్లాడో పుట్టించడానికే టైముండడం లేదాయె, అధవా టైమంటూ ఉన్నా, 40 ఏళ్ళకి మగాళ్ళూ, 35 ఏళ్ళకి ఆడవారూ, పెళ్ళిళ్ళు చేసికుంటూన్న ఈ రోజుల్లో  , అంత వయసొచ్చిన తరువాత, వచ్చే శరీరమార్పులతో, అదికూడా కష్టతరమైపోతోంది.. కిం కర్తవ్యమ్ ?  ఓవైపునేమో,  దేశ సమస్యలకన్నిటికీ జనాభా వృధ్ధే కారణమంటారు, ఇంకోవైపునేమో నాయుడు గారేమో ఇలా మాట్టాడుతున్నారు ఎలాగబ్బా?

మొత్తానికి భూమి గుండ్రంగానే ఉందనీ, ఉంటుందనీ తేలిపోయింది. ఇంకా ఎన్నెన్ని మార్పులొస్తాయో చూడాలి...

సర్వేజనా సుఖినోభవంతూ

మరిన్ని శీర్షికలు
weekly horoscope september29th to october5th