అక్కినేని వారింట పెళ్లి బాజా మోగింది. ఈ నెల 6వ తేదీన అక్కినేని నాగ చైతన్య, సమంతల వివాహం, అతి ముఖ్యమైన అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి అతిధులు నూరు మందే. చైతన్య వైపు నుండి, సమంత వైపు నుండి అతి ముఖ్యమైన బంధు మిత్రుల మధ్య వీరి వివాహం గోవాలో జరిగింది. 6 వతేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం, 7 వతేదీన క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చై, శామ్ ఒక్కటయ్యారు. దగ్గుబాటి కుటుంబ సభ్యులు, అక్కినేని కుటుంబ సభ్యులతో సహా ముఖ్యమైన స్నేహితులు ఈ వేడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీత్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, సురేష్‌బాబు, సమంత ఆనందంగా చేసిన డాన్సులు మొత్తం వివాహ మహోత్సవానికే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. పెళ్లి దుస్తుల్లో నాగ చైతన్య, సమంతలు ధగ ధగా మెరిసిపోయారు. వివాహానంతరం 'సమంత రూత్ ప్రభు', అనే తన పేరును 'సమంత అక్కినేని'గా మార్చుకుంది ముద్దుగుమ్మ సమంత. ట్విట్టర్‌లో సమంత అక్కినేని అన్న పేరు చూసి అక్కినేని అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. సమంతకు అత్యంత సన్నిహితులైన వెన్నెల కిషోర్, చిన్మయి దంపతులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా హైద్రాబాద్‌లో ఈ నెలాఖరున రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ నెల 15నుండి సమంత, నాగ చైతన్యలు వారి వారి సినిమాల్లో బిజీ కానున్నారు.
|