Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్ధయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand

రాణీఖేత్ 

దేశ రాజధాని ఢిల్లీకి సుమారు 360 కిలోమీటర్ల దూరం లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుమావు ప్రాంతంలో వున్న వేసవి విడిది రాణీఖేత్ .

ఢిల్లీ నుంచి కాఠ్గోదాం వరకు ట్రైను తరువాత బస్సుగాని కారులో గాని ప్రయాణంచి చేరుకోవచ్చు లేదా  ఢిల్లీ నుంచి టాక్సీ లో  ప్రయాణంచి చేరుకోవచ్చు . 

ఢిల్లీ నుంచి టాక్సీ లో బయలుదేరితే గజియాబాదు , మురాదాబాదు , రామ్ నగరు , హలద్వాని , భీమతాల్ మీదుగా రాణి ఖేత్ చేరుకోవచ్చు 

సుమారు 1800 మీటర్ల యెత్తున వుండడం వల్ల  వేసవిలో చల్లగా ఆహ్లాదంగా వుండే రాణిఖేత్ వాతావరణం నవ్వంబరుకి అతిచల్లగా అంటే ఒకటి రెండు డిగ్రీలకు పడిపోతుంది . డిస్సంబరు , జనవరిలలో హిమపాతం జరుగుతుంది .

కుమావు ప్రాంతాన్ని పరిపాలించిన రాజా సుధార్ దేవ్  తన రాణి పద్మినీ దేవికి యీ భూభాగాన్ని కానుకగా యివ్వటం వల్ల దీనిని రాణి ఖేత్ ( రాణిగారి తోట అని అర్దం ) అని పిలివసాగేరు . కాని యిక్కడ కోటలాంటిది గాని వాటి అవశేషాలుగాని లేవు . 

కనుచూపు మేర వరకు పరచుకొని వున్న పెద్దపెద్ద పచ్చిక మైదానాలతోను ,  పైను , దేవదారు వృక్షాలతో కూడిన అడవులు వాటి వెనుకగా మంచుతో కప్పబడ్డ హిమాలయా పర్వతాలతోను చెయ్యతిరిగిన చిత్రకారుడు చిత్రించిన చిత్రం లా వుంటుంది . శీతాకాలంలో అయితే యెటు వైపు చూసినా తెల్లగా పడ్డ మంచుతో పర్యాటకులకు కనువిందు కలిగిస్తూ వుంటుంది .

రాణి ఖేత్ చాలాకాలం నేపాల్ రాజుల పరిపాలనలో వుండి కుమావు రాజ్య సైనికాధికారి కాశీనాథ్ అధికారి పరాక్రమం వల్ల కుమావులో వినీలమైంది . అతని పేరు మీదుగా ' కాశిపూర్ ' పట్టణ నిర్మాణం జరిగింది . 

బ్రిటిష్ రాజ్ లో యిక్కడ కుమావు రెజిమెంట్ ప్రధానకార్యాలయం స్థాపించబడింది . బ్రిటిష్ వారి పరిపాలనలో యీ ప్రదేశం వేసవి విడిదిగా తీర్చదిద్దబడింది . 1900 లలో రాణి ఖేత్ ని భారదేశపు వేసవి ముఖ్యపట్టణం గా చెయ్యాలనే ప్రతిపాదన కూడా వచ్చింది . 1901 లో సిమ్లాని వేసవి రాజధానిగా చేసేరు . 

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత యిక్కడ రెండు ఆర్మీ స్థావరాలు నిర్మించబడ్డాయి . 1824 మీటర్ల యెత్తున రాణి ఖేత్ రిడ్జ్ , 2116 మీటర్ల యెత్తున చౌబటియా రిడ్జ్ . 

మేం కల్నల్ గార్తో వెళ్లేం , వారి గెస్ట్ హౌసు యెత్తైన కొండమీద వుండడంతో దిగువున లోయ , దూరంగా అడవి , అడవి వెనకాల కాంచన జంగ మొదలైన మంచుతో కప్పబడ్డ పర్వతాలు యెంత బావున్నాయో , ప్రొద్దుట సూర్యుడి కిరణాలు పడి వెండికొండలు బంగారు కొండలుగా కన్పించటం ఆశ్చర్యాన్ని కలుగజేసేయి . బంగారుకొండలు చూస్తూ పొగలు కక్కుతున్న టీ తాగడం ఓ అనుభూతి , రాత్రి చలిపెరగడంతో వేడిగా వున్న రొట్టెలు తినలేకపోడం కూడా అనుభూతే .

 కంటోన్మెంటులోనే కుందేళ్ల పెంపకం , అంగూరా ( కుందేలు వెంట్రుకలతో తయారుచేసే ఉన్నిని అంగూరా అంటారు ) శాలువలు , స్వెట్టర్ల తయారి , ఆషియానా ఆద్వైర్యంలో తయారవుతున్న తివాసీలు చూడ్డానికి వెళ్లేం , బాగా నడుపుతున్నారు , మంచి వెరైటీ శాలువలు వున్నాయి . ఏవి కొన్న జ్ఞాపకం లేదు . అప్పుడు యీ ప్రాంతాలలో ATM లు వుండేవి కావు , అందుకనే మేం కొన లేక పోయామేమో ? .

రాణి ఖేత్ కి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో వున్న  తొమ్మిది కన్నాల గోల్ఫ్ కోర్స్ ఆసియా ఖండపు అతియెత్తైన గోల్ఫ్ కోర్స్ గా పేరుపొందింది .  

కంటోన్మెంటులోనే వున్న శివకోవెల చూసుకొని బిన్సర్ మహదేవుని కోవెలకు బయలుదేరేం .

సుమారు రాణి ఖేత్ నుండి 18 కిలోమీటర్లు , ప్రయాణం యెంతబాగా జరిగిందంటే చెప్పలేను . రోడ్లు చిన్నవయినా చాలా చక్కగా వున్నాయి . మిలటరీ వారి ఆద్వైర్యంలో వుండటం వల్ల రోడ్లు యెటువంటి గతుకులు లేకుండా వున్నాయి . ప్రకృతి గురించి అయితే చెప్పనే అఖ్ఖరలేదు . ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పైను , ఓక్ , దేవదారు వృక్షాలతో , కనుచూపు మేర వరకు పరచుకొని వున్న పచ్చికతో ఒక్కసారి కారుదిగి పచ్చికలో పరుగెత్తాలని అనిపించింది . మనసు వుండబట్టక కారు రోడ్డుపక్క ఆపుకొని కొంత దూరం పచ్చికలో నడిచి ఆనందపడ్డాం .

బిన్సార్ మందిరం అడవి మధ్యలో వుంది . చాలా పురాతనమైన మందిరం . అయితే యీ మందిరం కూడా కేదార్ నాధ్ మందిరాన్ని పోలివుంది కాని దీనిని ఆర్కియాలజికల్ వండర్ అని అంటారు . ఈ మందిరాన్ని కతూరియా వంోసానికి చెందిన రాజు. తన తండ్రి 'బిందు సారుని '  జ్ఞాపకార్థం పదవ శతాబ్దం లో నిర్మించి నట్లు స్థానికుల కధనం . గర్భగుడిలో శివలింగంతో పాటు పార్వతి , వినాయకుడు , మహిషాసుర మర్ధని విగ్రహాలు వున్నాయి . మహిషాసుర మర్ధిని విగ్రహం తొమ్మిదవ శతాబ్దానికి చెందినట్లుగా దేవనాగరిలో చెక్కిన శిలాశాసనాలు వున్నాయి . 

చుట్టూరా అడవి , కొండలపై నుంచి జారుతున్న జలపాతాలతో వున్న ప్రాంతం మంచి పిక్ నిక్ స్పాటు అని చెప్పొచ్చు . ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోడానికి కూడా చాలా బాగుంటుంది . ఈ మందిరానికి కాస్త దూరంలో బిన్సార్ ఆశ్రమం వుంది .

యీ మందిరంలో వైకుంఠ చతుర్దశికి మేలు జరుగుతుంది , ఆ రోజు భక్తులు దీపాలను అరచేతులో వుంచుకొని పూజలు నిర్వహిస్తారు . 

ఈ మందిరాన్ని ఒకరోజులో నిర్మించేరుట . మందికి 15 సంవత్సరాలకు ముందు వెళ్లినప్పుడు పాత మందిరాన్ని చూసేను . ఈ మధ్యన వెళ్లినప్పుడు కొత్తకట్టడాలు రావడం , పాత మందిరం నేలమట్టమవడం చూసేం , చాలా బాధకలిగింది . స్వయంగా విశ్వకర్మ పాండవులు అజ్ఞాత వాసంలో వున్నప్పుడు నిర్మించినట్లు  స్థానికుల కథ . కథలు యేమి చెప్పినా మందిరం చాలా పురాతనమైనది అన్నది నిజం . పేరు ప్రతిష్టలు కలవారు యీ మందిరాన్ని కూల్చి కొత్తకట్టడాలు నిర్మించడం నిజం .

ఇక్కడ అడవులలో చిరుతలు , అడవిపిల్లులు , నక్కలు , యెర్ర నక్కలు , కోతులు , యెర్రమూతి కోతులు , కొండముచ్చులు , లేళ్లు , సాంబారు లేళ్లు , ముళ్లపందులు వుంటాయి . కాని మనకు కనిపించేవి మాత్రం లేళ్లు , కోతులు , కొండముచ్చులు , యెర్రమూతి కోతులు మాత్రమే . 

ఈ ప్రాంతాలను యెన్ని మార్లు చూసినా తనని తీరదు . అందుకే రెండురోజులు శలవులు దొరికితే యీప్రాంతాలకు వెళ్లిపోయేవారం .

రాణిఖేత్ నుంచి ఆల్మోడా వెళ్లేదారిలో రాణిఖేత్ కి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ' కతరమల్ ' సూర్యదేవాలయం వుంది . కోసి గ్రామానికి 1.5 కిలో మీటర్ల దూరం , ఆల్మోడాకి 12 కిలో మీటర్ల దూరం .రోడ్డుకి కాస్త పక్కగా యెత్తైన గుట్టమీద వుంది . 800 సంవత్సరాలకు పూర్వం నిర్మింపబడిన మందిరం . ఈ మందిరాన్ని ' కతర మల్లు ' అనే కతూరియా వంశానికి చెందిన రాజు నిర్మించేడు . సూర్యదేవాలయమే కాక శివపార్వతుల మందిరం లక్ష్మీ నారాయణ మందిరం కూడా వుండేవట . నగషీ చెక్కిన కర్ర తలుపులను , చాలా మటికి శిల్పాలను కూడా ఢిల్లీ మ్యూజియం కి తరలించేరు . సూర్య విగ్రహాన్ని దొంగిలించేరుట . ప్రస్తుతం యిక్కడ యేమీ లేవు , అన్నీ పోయేక ప్రభుత్వం కళ్లు తెరచి సంరక్షిత మందిరంగా తీర్మానించింది , అయినా మందిరానికి ఒరిగింది యేమీ లేదు . 

కోణార్కులోలానే యిక్కడ కూడా విగ్రహంలేదు కాని ప్రతిరోజూ సూర్యుడి కిరణాలు గర్భగుడిలోని పీఠం పైన పడతాయట , ఆ సమయంలో పూజారి నిత్యపూజ నిర్వహించి నివేదిన చేస్తారుట . పడతాయట , చేస్తారట అని యెందుకన్నానంటే మేం మాకళ్లతో యివి చూడలేదు . మేం వెళ్లి నప్పుడు ప్రతీ మారు మూడు దాటేది , మందిరంలో యెవ్వరూ వుండేవారుకారు . పూజ జరిగింది అనడానికి నిదర్శనంగా పూలు కాస్త ప్రసాదం అక్కడ వుండేవి . చాలా చిన్న మందిరం , రాళ్లు పేర్చి వున్నట్లుగా వున్న మందిరం . వీకీ పీడియా ప్రకారం కోణార్కు సూర్యదేవాలయం మొదటి స్థానంలో వుండగా యిది రెండవస్థానంలో వుంది అని వుంది , మరి పాతదేవాలయం పడిపోతే యిలా రాళ్లుపేర్చి కట్టారేమో  తెలీదు . ఏదో దారిలో వుంది కాబట్టి వెళ్లడంగాని ప్రత్యేకంగా అక్కడకి వెళ్లేంత గొప్పమందిరం మాత్రంకాదు .

 పై వారం ఉత్తర ఖండ లోని మరికొన్ని ప్రదేశాగురించి పరిచయం చేస్తానని మనవి చేస్తూ అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam