Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్ధయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand

వైధ్యనాధ్ , భాగేశ్వర్

ఉత్తరాఖండ్ ని దేవభూమి అని అంటారు . ఇక్కడ ప్రతీ జిల్లాలోనూ మనకి ప్రాచీనమైన మందిరాలు కనిపిస్తాయి . శిల్పకళ పెద్దగా లేకపోయినా మందిరాలు చాలా ప్రాముఖ్యత కలిగినవి . కొన్ని మహాభారత కాలానికి చెందినవి  , మరికొన్ని చారిత్రాత్మక విలువలు కలిగినవి కావడంతో ప్రాముఖ్యతను పొందాయి . ఈ వారం కొన్ని అలాంటి మందిరాలను గురించి తెలియజేస్తాను .  ముందుగా మనం భాగేశ్వర్ జిల్లాలోని మందిరాలను గురించి తెలుసుకుందాం .

భాగేశ్వర్ జిల్లా ఢిల్లీ నుంచి సుమారు 470 కిలోమీటర్లదూరంలో వుంది . ఇక్కడకి రావడానికి కాఠ్ గోదాం వరకు ట్రైను సౌకర్యం వుంది . అక్కడనుంచి బస్సులు , టాక్సీలలో  ప్రయాణంచి చేరుకోవచ్చు .

భాగేశ్వర్ చేరడానికి సుమారు 200 కిలోమీటర్లు కొండలపై ప్రయాణించవలసి రావడంతో యీ ప్రదేశం పర్యాటకుల యిష్టమైన  స్థలంగా గుర్తింపబడలేదు . ఈ మధ్యకాలంలో ప్రజలు యేకాంత ప్రదేశాలు వెతకడం వలన , కాస్త రోడ్లు బాగు పడడంతోనూ పర్యాటకుల రాకపోకలు పెరిగాయనే చెప్పాలి . దీని వలన యెన్నో మరుగున వుండిపోయిన అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకుల దృష్టిలోనికి వచ్చేయి .  అయితే భాగేశ్వర్ కి యింకా రావలసినంత ప్రాముఖ్యత రాలేదనే చెప్పాలి
ముందుగా మనం ఢిల్లీకి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో వున్న వైధ్యనాధ్ మందిర సముదాయాల గురించి చెప్పుకుందాం . శివుడు ఆరోగ్యప్రదాతగా పూజలందుకున్న ప్రదేశం యిది . చాలా ప్రదేశాలలాగానే యిక్కడవున్న కోవెల పేరుమీదుగానే యీ వూరుకూడా బైధ్యనాధ్ గా పిలువబడుతోంది . భాగేశ్వర్ మరియు వైధ్యనాధ్ ల దారులు చీలే కూడలి దేశవిదేశ ట్రెక్కర్లతో చాలా హడావుడిగా వుంటుంది . ఇక్కడ నుంచి ' సుందరదుంగ ' , ' పిండారి గ్లేషియర్ల ' కు ట్రెక్కింగు దారులువున్నాయి .

ఆల్మోడా నుంచి భాగేశ్వర్ కి వెళ్లే రోడ్డుమీద గోమతీ నదీ తీరాన వున్న మందిర సముదాయం . దీనిని పదకొండవ శతాబ్దంలో  కతూరియా రాజులచే నిర్మింపబడ్డా , యీ మందిరాలలో వున్న విగ్రహాలు తొమ్మిదవ శతాబ్దానికి చెందినవిగా గుర్తించేరు .ఈ ప్రాంతాన్ని కతూరియా రాజవంశస్థులు పరిపాలించేరు , అప్పట్లో ఈ నగరాన్ని ' కరవీరపురం ' గా పిలిచేవారు కాలక్రమేణా దీనిని కార్తికేయపురంగా పిలువసాగేరు . ఈ మందిరనిర్మాణానంతరం దీనిని బైధ్యనాధ్ గా పిలువ సాగేరు . ఒక బ్రాహ్మణ స్త్రీ కోరికమీద కతూరియా రాజులు యేకరాత్రిలో యీ మందిరాలను నిర్మించినట్లు  చెప్తారు . గర్భగుడికి వెళ్లేదారిలో మహంతు గదికి పక్కగా యీ బ్రాహ్మణ స్త్రీ మూర్తిని చూడొచ్చు . సముద్రమట్టానికి సుమారు 1,130 మీటర్ల యెత్తులో వున్న యీ మందిరంలో పార్వతీ దేవి నల్లరాతి విగ్రహం చూడముచ్చటగా వుంటుంది . మందిరాన్ని చేరుకోడానికి వున్న రాతి మెట్లు కతూరియా రాణి నిర్మించేరు . గోమతి తీరాన చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో దట్టమైన అడవులలో వున్న యీ మందిర సముదాయాలు అహ్లాదాన్ని కలుగ చేస్తాయి . సాధారణంగా దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారు యిక్కడ శివుడికి అభిషేకాదులు నిర్వహించి ఆరోగ్యాన్ని పొందుతూ వుంటారు . ఈ 18 మందిరాల సముదాయం లో శివ పార్వతుల మందిరాలే కాక నృత్య గణపతి , కార్తికేయ , నృసింహ , బ్రహ్మ , మహిషాసుర మర్ధిని , సప్తనర్తక , కుబేర , సూర్య గరుడ మందిరాలు వున్నాయి .

మందిర పరిసరాలు చాలా హ్లాదకరంగా వుంటాయి . ఎంతసేపు గడిపినా వదలి రావాలనిపించవు . వైధ్యనాధ్ మందిరాలకు సుమారు 2 కిలో మీటర్ల దూరంలో మరో మహిమాన్వితమైన మందిరం వుంది , చాలా మంది యింత దూరం రావడానికి యిష్టపడరు . అందుకే యీ అద్భుత మైన మందిరం మరుగున పడిపోయింది .

ఈ మందిరాన్ని ' కోట బ్రమరీదేవి మందిరం ' అని ' కోట్ క మందిర్ ' అని కూడా వ్యవహరిస్తారు . దేవీ భాగవతం లో యీ బ్రమరీదేవి గురించి వర్ణనవుంది . ఈ మందిరం కతూరియా రాజులచే నిర్మింపబడింది . ఈ దేవి రాజుగారి కోటను , రాజ్యాన్ని రక్షిస్తుందని నమ్మేవారు . ఆదిశంకరాచార్యులవారు హిందూమతాన్ని పునఃస్థాపన చేసేటప్పుడు చేసిన దేశాటనలో ఒకరోజు యీ మందిరంలో బసచేసి బదరీనాధ్ వెళ్లేరని స్థానికులు చెప్పేరు .

ఈ మందిరంలో అమ్మవారిని వెనుకవైపున దర్శించుకోవాలి . పూజారులు రోజుకొకసారి అమ్మవారికి అభిషేకం , అలంకారం చేసేటప్పుడు మాత్రమే అమ్మవారిని యెదురుగా దర్శిస్తారు . మిగతా భక్తులు అమ్మవారి వీపుభాగాన్ని మాత్రమే దర్శించుకోవాలి . ప్రతీయేటా నందాష్టమి , రాధాష్టమి , పన్నెండేళ్ల కొకసారి జరిపే మహా రాజ రధాయాత్ర లలో అమ్మవారిని ముందు వైపునుంచి దర్శించుకోవచ్చు .

ఈ అమ్మవారిది సాత్విక రూపం . కతూరియా రాజులను ఓడించి రాజ్యానికి వచ్చిన నేపాలు రాజులు అమ్మవారి కి జంతుబలులు యివ్వటం ఆచారంగా చేయగా ' ఏనిమల్ ప్రొటెక్షన్ సొసైటీ ' వారి చొరవతో హైకోర్టు జంతుబలులను నిషేధించింది .

భాగేశ్వర్ ------

ఢిల్లీకి సుమారు 470 కిలోమీటర్ల దూరంలో వున్నాయి యీ భాగేశ్వర మందిర సముదాయాలు . ఈ మందిరాలు వుండటం వల్ల యీ నగరాన్ని కూడా భాగేశ్వర్ పేరుమీదుగా పిలువ సాగేరు . ఉత్తరాఖండ్ రాష్ట్రం యేర్పడ్డ తరువాత భాగేశ్వర్ జిల్లాగా కూడా గుర్తింపబడసాగింది .

గోమతి , సరయు పుణ్యనదుల సంగమ ప్రదేశంలో వున్న నగరం .

భాగేశ్వర్ నగరం కొండలు , జలపాతాలు , పచ్చిక మైదానాలు , హిమనీనదాలు , మందిరాలతో కూడుకొని వున్న నగరం కావడంతో ప్రకృతి అందాలకు అంతేలేదు . ఈ నగరం సరయు , గోమతి నదీ సంగమ ప్రాంతంలో వుంది . ఈ జిల్లా కుమావు టిబెట్ ల మధ్య వుండడం వల్ల ' భోటియ ' వ్యాపారులు తరచుగా యీ నగరానికి వారి వూలు వుత్పాదనలను ( వులెన్స్ ) తెచ్చి విక్రయిస్తూ వుండేవారు . 1965 లో జరిగిన చైనా యుధ్దానంతరం యీ దారి మూసివేసేరు .
భాగేశ్వర్ నగరం యిక్కడ ప్రతీయేటా జనవరి నెలలో జరిగే ' ఉత్తరాయణి ' యాత్ర కు ప్రసిధ్ది చెందింది . ఈ యాత్రకు కుమావు ప్రాంతం నుంచి సుమారు 15,000 మంది వస్తూవుంటారు .శివ పురాణం లో మానసఖండం లోనూ , స్కంధ పురాణం , మార్కండేయ పురాణం లోనూ భాగేశ్వర్ గురించిన వివరాలు వున్నాయి . శివపురాణం ప్రకారం శివుని ప్రధానగణమైన ' ఛండీషుడు ' యీ మందిరాన్ని నిర్మించినట్లు  వుంది . మార్కండేయ పురాణం ప్రకారం మార్కండేయుడు యీ భాగేశ్వర ప్రాంతాలలో తపస్సు చేసుకుంటూ వుండగా శివుడు పులి రూపంలో అతనికి దర్శనమిచ్చి , యిక్కడి ప్రకృతినచ్చి  యీ ప్రాంతాలలో పులిరూపంలో సంచరిస్తూ వుండగా కైలాసాన శివుడు కానరాక పార్వతీ దేవి వెతుకుతూ యిక్కడకు వచ్చి తానుకూడా ఆడపులి రూపంలో తిరుగాడిందట . శివుడు వ్యాఘ్రరూపంలో తిరుగాడిన యీ ప్రాంతాలను వ్యాఘ్రేశ్వరంగా పిలువసాగేరు . కాలాంతరంలో యిది భాగేశ్వర్ గా మారింది .

భాగేశ్వర్ కి కుడివైపున భిలేశ్వర్ , యెడమవైపున నీలేశ్వర్ పర్వతాలు , ఉత్తరాన సూర్య కుండ్ , దక్షిణాన అగ్నికుండ్ వున్నాయి . సుమారు 24 మందిరాల సముదాయం . ఉత్తరాంచల్ మందిరాలలో విష్ణు మహేశ్వరులకు సమానమైన ప్రాముఖ్యతను యిచ్చినట్లు కనబడుతుంది . విష్ణు , లక్ష్మి , గణపతి , కుబేర మందిరాలు కూడా చూడొచ్చు .యీ మందిరాలు సుమారు యేడవ శతాబ్దానికి చెందినవి . ఇప్పుడున్న  మందిరం మాత్రం 1450 లో ' రాజా లక్ష్మి చాంద్ ' నిర్మించినట్లు గా చెప్తారు .మందిరం నుంచి సరయు , గోమతుల సంగమప్రదేశం చూడొచ్చు . దూరంగా నదులపై కట్టిన వంతెన కనబడుతూ వుంటుంది . వంతెనకు వెనుకగా పచ్చని అడవి వాటివెనుకాల యెత్తైనకొండలు కనువిందు చేస్తాయి

మళ్లావారం మరిన్ని వివరాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam