Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand

మరుగున పడుతున్న మన తెలుగు పండగలు  (మార్గశిర లక్మీపూజ)

 ప్రతీవారం చదివే ఉత్తరాఖండ్ గురించి కాకుండా యీ వారం మనం మార్గశిర మాసం గురించి , మన పొరుగు రాష్ట్రమును 'ఒడిస్సా ' లో లక్ష్మిపూజ గురించి ' కొల్హాపూరు మహలక్ష్మి మందిరం గురించి చదువుదాం .

 పైవారం యధావిధిగా మన ఉత్తరాఖండ్ వ్యాసాలు చదువుదాం .

' మాసాలలోకెల్ల పవిత్రమైన మార్గశిర మాసములలో కొలువైవుందును నేను ' అని స్వయంగా మహాలక్ష్మి చెప్పిన మార్గశిరమాసం గురించి యీ రోజు తెలుసుకుందాం .  హిందూ పంచాజ్ఞం ప్రకారం తొమ్మిదవ మాసమైన మార్గశిరమాసం గురించి చెప్పుకుందాం . 

దేవతలు దానవులూ క్షీరసముద్రాన్ని మధించినపుడు కామధేనువు , కల్పతరువు , ఐరావతం , ధన్వంతరి , చంద్రుడు మొదలయిన వాటితో పాటు లక్ష్మీదేవికూడా ఉద్భవించిందట . విష్ణుమూర్తిని వివాహమాడి అతని హృదయంలో స్థానంపొందిన క్షీరసముద్రరాజతనయ అష్టైశ్వర్యములకు అధిపతి అయింది . 

మహాలక్ష్మి పాలకడలినుంచి మార్గశిరమాసంలో పున్నమికి ముందుగా వచ్చే గురువారంనాడు ఉద్భవించిందట , అందుకే మార్గశిరమాసం అంటే మహాలక్ష్మికి  ప్రీతికరమైనది .

మార్గశిరమాసంలో గురువారంనాడు మహాలక్ష్మి పూజలు చేయడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం .

మార్గశిరమాసం లో వచ్చే ముఖ్య పండగలను గురించి కూడా తెలుసుకుందాం . మార్గశిర శుక్ల షష్ఠి శివుని అవతారమైన ' ఖండోబా ' ఉద్భవం జరిగింది . 

మార్గశిర శుక్ల యేకాదశి ని ముక్కోటి యేకాదశి ,  ఆ రోజు అన్ని విష్ణమందిరాలలోనూ ఉత్తరద్వారం లోంచి  దర్శనం చేసుకొని తరిస్తారు భక్తులు . ఈ రోజును  గీతాజయంతిగా జరుపుకుంటారు . అంటే యీ రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసేడు . అందుకే గీతాజయంతి అంటారు .

మరునాడు అంటే ద్వాదశినాడు ప్రాతఃకాలంలో స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి భక్తులు పాపాలను పోగొట్టుకుంటారు .

మార్గశిర పున్నమి దత్తాత్రేయజయంతిగా హిందువులు జరుపుకుంటారు .

దక్షిణాదిరాష్ట్రాలలోనే కాక ఉత్తరాది రాష్ట్రాలలో మార్గశిరమాసాన్ని యెంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు . మార్గశిరమాసంలో  పంటలు యింటికి రావడం వల్లకూడా ప్రాముఖ్యత వచ్చిందేమో ? 

ఉభయ తెలుగు జిల్లాలో కాక మహారాష్ట్ర , కర్నాటక , ఒరిస్సా , వెస్ట్ బెంగాలులలో మార్గశిర లక్ష్మివారం లక్ష్మీ పూజలు నిర్వహించడం కనిపిస్తుంది .

ఈ మాసంలో వచ్చే అన్ని గురువారాలూ అంటే నాలుగు గురువారాలు నాలుగు రకాలుగా అమ్మవారి అలంకరించి పూజలు చేస్తారు . మూడవవారం కుంచాన్ని ( ధాన్యాన్ని కొలిచే కొలమానం ) అలంకరించి పూజలు నిర్వహిస్తారు . అలా చేస్తే లక్ష్మీదేవి కృపవలన పంటలు సమృద్దిగా పండి యెక్కువగా ధాన్యం యింటికి వస్తుందని నమ్ముతారు . 

పున్నమి ముందు వచ్చేవారం కలశ పెట్టి పూజ చేస్తారు . పూజా విధానం , నైవేద్యం వరలక్ష్మీ వ్రతాన్ని పోలి వుంటుంది .

గురువారం పూజకు యింటి యిల్లాళ్లు సూర్యోదయానికి పూర్వమే మేల్కొని తలస్నాన మాచరించి ముంగిళ్లను ముగ్గులతో అలంకరించి యిల్లు శుభ్రంగా తుడిచి అలికి ముగ్గులు పెట్టుకొని రకరకాలపూవులతో అమ్మవారి పూజచేసి ధూపదీపాలతో అమ్మవారికి శోడశాపచారాలు చేసి నైవేద్యం సమర్పించి మంగళాహారతులిచ్చి కధ చెప్పుకొని అక్షింతలు జల్లుకుంటారు . 

మరి యీ మార్గశిర లక్ష్మిపూజ కధ తెలుసుకుందాం .

చాలా కాలం కిందట ఒకవూర్లో ఒక బ్రాహ్మణ కుటుంబం వుండేది . ఇల్లాలు చాలా గయ్యాళి , ఆమె మాటకు యెదురు చెప్పే సాహసం ఆ యింట్లో యెవరికీ లేదు . అతి ధనవంతురాలవటం వల్ల ఆమె యెవరినీ లెక్కచేసేదికాదు . శుచిశుభ్రం పాటించేదికాదు . ఆమె కి ఒకకూతురు , కొడుకు . కూతురు తల్లిలా కాక మృదుభాషి , దైవభక్తి కలది . తల్లికి తెలియకుండా పెరట్లో చెట్టుకింద పూజలు చేసుకొనేది . ప్రతీ సంవత్సరం లానే మార్గశిరమాసం లో గురువారం వచ్చింది , కూతురు లక్ష్మి పూజ చెయ్యాలని తల్లిని పూజాసామగ్రి కొనవలసినదిగా కోరుతుంది . అహంకారి అయిన తల్లి కూతురును పూజనీ కూడా నానా మాటలు అని పూజచేయరాదని చెప్పి కూతురును యింటికి వచ్చిన పంటకు కాపలా వుంచి చెరువుకి వెళ్తుంది . లక్ష్మీదేవి పూజాసామానులమ్మే ఆమెగా వేషం వేసుకొని ఆ వూరిలో యే యిల్లు శుచీశుభ్రంగా వుందో , యెవరు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారో చూసే నిమిత్తం వస్తుంది .

ఆమెను చూసిన కూతురు కాస్త ధాన్యం యిచ్చి పూజా సామగ్రిని తీసుకొని పెరట్లో చెట్టుకింద లక్ష్మీపూజ చెయ్యడం లో మునిగి పోతుంది . చెరువునుంచి వచ్చిన తల్లి పంటకు కాపలా వుంచిన కూతురు కనబడక కోపంతో పెరటిలోకి వచ్చి చూడగా కూతురు పూజాసామగ్రితో లక్ష్మీదేవిపూజ చేస్తూండడం చూసి లక్ష్మీదేవి విగ్రహాన్ని కాలితో తన్ని కూతురును యీడ్చుకొని వచ్చి పూజాసామగ్రి అమ్మిన ఆమెను వెతికి పట్టుకొని చిదకబాది కూతురు యిచ్చిన ధాన్యాన్ని తీసుకుని పూజా సామగ్రిని విసిరేస్తుంది  .

లక్ష్మీదేవి తల్లి మీద అలిగి ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటుంది . కాని తన భక్తురాలయిన కూతురు ఆ యింటవున్నంతవరకు తానేమీ చెయ్యలేనని తెలిసిన లక్ష్మీదేవి కూతురు వివాహమయి ఆమె అత్తవారింటికి పోగానే లక్ష్మీదేవి ఆయింటిని విడిచి వెళ్లిపోతుంది . లక్ష్మీదేవి వెళ్లిపోగానే ఆ యింట దరిద్రదేవత ప్రవేశిస్తుంది . ఆ కుటుంబం తినడానికి తిండిలేక కట్టుకొనేందుకు బట్టలు లేక నానా యిబ్బందులు పడసాగేరు . కొడుకుని దీన స్థితిలో చూడలేని తల్లి కొడుకును కూతురివద్దకు పంపుతుంది . 

తన యింటికి వచ్చిన తమ్ముని దీన స్థితికి కన్నీరు కార్చి కట్టుకుందుకు మంచిబట్టలు యిచ్చి తినడానికి పిండివంటలు పెట్టి కొన్నాళ్లుంచుకొని తిరిగి తమ్ముడిని  పంపేస్తూ యెలాగైనా తల్లికి కొంత సొమ్మును చేరవెయ్యాలని ఆలోచన చేస్తుంది కూతురు .  మార్గమధ్యంలో దోపిడీ దొంగలబారిన పడకుండా సొరకాయ లో సొమ్ములు దాచి జాగ్రత్తగా సొరకాయ తల్లికి మాత్రమే యివ్వమని చెప్పుతుంది . అక్క సొరకాయ యెందుకు యిచ్చినదీ తెలియని తమ్ముడు మార్గ మధ్యలో సొరకాయ పక్కన పెట్టుకొని చెట్టునీడలో సేదతీరుతూ వుండగా లక్ష్మీదేవి గ్రద్దరూపంలో వచ్చి సొరకాయను యెత్తుకుపోయి కూతురు పెరట్లో పడవేస్తుంది . 

బరువు తగ్గిందని సంతోషించిన తమ్ముడు వూరుచేరి అక్క సొరకాయ యిచ్చినట్లు , దానిని గ్రద్ద యెత్తుకు పోయిన వైనం తల్లికి చెప్తాడు . తిండికి లేని తమకు సొమ్ములు పంపకుండా సొరకాయ యెందుకిచ్చినట్లో అర్దం కాని తల్లి సొరకాయ గ్రద్ద యెత్తుకు పోయినందుకు సంతోషిస్తుంది .

కొంత కాలం తరువాత తండ్రిని కూతురుని అడిగి కాస్త సొమ్ము తెమ్మని  పంపుతుంది తల్లి , తండ్రిని చూసిన కూతురు అతనికి స్నానం చేయండి మంచిబట్టలు యిచ్చి తినడానికి మంచి భోజనం యేర్పాటు చేస్తుంది . కూతురనుంచి సహాయం అర్ధించడానికి మనసువొప్పని తండ్రి కొద్దిరోజులు గడిచేక  వూరికి బయలుదేరుతాడు . వయసుమళ్లిన తండ్రికి చేతికర్రలో బంగారం నింపి యెక్కడా కర్రను విడిచిపెట్టొద్దని   తండ్రిని హెచ్చరిస్తుంది కూతురు .

ధనాన్ని యిస్తుందనుకున్న కూతురు చేతికర్ర యివ్వడం తో నిరాశగా వెనుతిరిగిన తండ్రి మార్గమధ్యంలో చెట్టుకిందన నిద్రపోతూవుండగా గ్రద్దరూపంలో వచ్చిన లక్ష్మీదేవి ఆకర్రను తెచ్చి కూతురు యింటి ముంగిలిలో పడవేస్తుంది . 

కూతురు ధనం పంపుతుందని యెదురు చూస్తున్న తల్లి జరిగింది విని నిట్టూర్చి తినిడానికి యేమీలేక రోజులు భారంగా గడిపి ఒకరోజు కూతురు దగ్గరకు తానే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది .

ఆమె కూతురింటికి వచ్చేసరికి మార్గశిరమాసం వస్తుంది , కూతురు తల్లి చేత లక్ష్మీ పూజచేయించడానికి ప్రయత్నంచగా తల్లి ఓ మారు చద్దన్నం తినేసి , మరోమారు నూనె తలకు శరీరానికి రాసుకొని పూజకు అర్హతలేకుండా చేసుకుంటుంది . ఆఖరువారం తల్లి కొంగును తన కొంగుకి కట్టుకొని తిప్పుకుంటూ పూజకు కూర్చోగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగిపోతుంది . కూతురు కారణం అడుగుగా లక్ష్మీదేవి కూతురుకు ఆమె చిన్నతనాన ఆమె తల్లి చేసిన అపచారం గుర్తుచేసి ఆమె చేసే పూజను తాను స్వీకరించనని చెప్తుంది . కూతురు పరిపరివిధాలుగా ఆమెను స్థుతించగా కరుణించిన కరుణామయి మార్గశిరమాసంలో చెయ్యకూడని పనులు చెప్పి పుష్యమాసంలో ఓ గురువారం పుట్టింటి వారి భోగభాగ్యాలకొరకు ఆడపిల్లలు లక్ష్మీ పూజచేసుకొని అమ్మవారికి పూర్ణం నైవేద్యంగా సమర్పిస్తే  పుట్టింట యెప్పుడూ లక్ష్మీకటాక్షం వుంటుందని శలవిస్తుంది . పుష్యమాసం రాగానే కూతురు గురువారం నాడు యధావిధిగా లక్ష్మీపూజచేయగానే ఆమెపుట్టిల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది . ఆనాటినుండి తల్లికూడా దురుసు ప్రవర్తన మానుకొని వినయవిధేయతలతో వుంటూ లక్ష్మీ పూజ యధావిధిగా చేసుకుంటూ లక్మీకటాక్షం పొందింది . 

అప్పటి నుంచి మహిళలు మార్గశిరమాసంలో అన్ని లక్ష్మివారాలు లక్ష్మీదేవికి యధాశక్తి పూజా నైవేద్యాలు చేసుకొని పుష్యమాసంలో ఓ గురువారం పూజానైవేద్యాలతో మార్గశిరలక్ష్మీపూజ పూర్తిచేస్తారు .

మన పొరుగు రాష్ట్రం మైన ఒడిస్సాలో మార్గశిర లక్ష్మి వారాలు యెలా జరుపుకుంటారో తెలుసుకుందాం .

మనకి అమావాస్యతో నెల అంతమయితే వారికి పున్నమితో అంతమవుతుంది , అంటే వారికి నెలమొదలయిన 15 రోజులకు మన నెల మొదలవుతుంది . మనకి మొదటి మార్గశిర లక్ష్మివారం  వచ్చేసరికి వారికి మూడో వారం వస్తుంది .

మార్గశిర లక్ష్మివారం పూజకు రెండు మూడు రోజులనుంచే హడావుడి మొదలవుతుంది . ఇల్లు శుభ్రంగా కడిగి ముగ్గులు వేస్తారు . గుమ్మంలో యెర్రమన్నుతో గాని పేడతోగాని అలికి తెల్లని రుబ్బిన బియ్యంపిండితో ముగ్గులు వేస్తారు . ఆ ముగ్గులలో తామరపువ్వు , దీపం , మీనం , లక్ష్మి దేవి పాదాలు తప్పకుండా వుంటాయి . లక్ష్మీదేవిని కొత్త ధాన్యంతోనూ , రకరకాలపూలతోనూ అలంకరించి పూజలు చేస్తారు . అమావాస్య తర్వాత వచ్చే గురువారం ' మాణొబొస  గురుబారొ ' గా జరుపుకుంటారు . ఆ రోజు బియ్యం కొలిచే కొలత కొత్తవెదురుతో చేసిన బుట్ట ( కుంచం అనుకోవచ్చు ) పసుపుకుంకుమలతో అలంకరించి కొత్తధాన్యం పోయిన పీటమీద వుంచి నిండా కొత్త ధాన్యం పోసి దానిపైన పసుపుతో కడిగిన మూడు తమలపాకులను వుంచి పూలు కాయలతో అలంకరించి పూజలు చేసి కొబ్బరి , బెల్లం , బియ్యం తో చేసిన పదార్ధాలను నివేదిస్తారు . పూజ తరువాత ' బలరామదాసు ' రచించిన ' మహలక్ష్మీ పురాణ పారాయణ చేస్తారు ' 

ఈ వ్రతాన్ని అన్ని జాతులవారూ చేస్తారు . 

ఈ వ్రతకథ గురించి కూడా తెలుసుకుందాం .

మార్గశిర లక్ష్మివారం కథ పూరీ జగన్నాథుని మందిరంతో ముడిపడివుంది .

వివాహసమయాన జగన్నాథుడు మహాలక్ష్మి కి ఒకవరం యిస్తాడు . ఆ వరం ప్రకారం మహాలక్ష్మి మార్గశిరమాసంలో గురువారం నాడు ఆమెకు నచ్చిన యింట్లో ఆథిధ్యం స్వీకరించవచ్చు, ఆ విషయమై జగన్నాథుడు లక్ష్మిని ప్రశ్నించరాదు . అలా ప్రశ్నించిన రోజున ఆమె తన పుట్టింటికి వెళ్లిపోతుంది . 

ప్రతీ సంవత్సరం మార్గశిరమాసంలో అమ్మవారు అన్ని వీధులు తిరిగి శచిశుభ్రంగా వున్న యింట నైవేద్యం స్వీకరించి వచ్చేది . లక్ష్మీదేవి యెవరింటపడితే వారింట నైవేద్యం స్వీకరించడం యిష్టంలేని బలభద్రుడు ( జగన్నాథుని అన్న ) తమ్ముడితో తన అసమ్మతిని తెలియజేస్తూ వుంటాడు . ఓ లక్ష్మివారం నాడు మహాలక్ష్మి శుచిశభ్రంగా వున్న యిల్లువెతుకుతూ వూరిచివరనున్న హరిజనవాడకు వెళ్తుంది , అక్కడ ' శ్రియ ' అనే హరిజనమహిళ చాలా శుచిగా భక్తి శ్రద్ధలతో పూజ చెయ్యడం చూసి ముగ్ధురాలయిన లక్ష్మీదేవి ఆమె యింట ఆథిధ్యం స్వీకరించి వస్తుంది . విషయం తెలుసుకున్న బలభద్రుడు జగన్నాథుని లక్ష్మీదేవిని దండించమని అడుగుతాడు జగన్నాటక సూత్రధారి నవ్వి వూరుకుంటాడు . చేసుకుంటే యెంతమందయినా భార్యలు వస్తారని కాని అన్నదమ్ములు రారని వాదించి అమ్మవారిని మందలించమంటాడు . 

లక్ష్మీదేవి విలువ తెలియజెయ్యాలని జగన్నాథుడు లక్ష్మీదేవిని మందలిస్తాడు . జగన్నాథుడు మహాలక్ష్మి కి యిచ్చిన మాట తప్పడం వల్ల మహాలక్ష్మి యిల్లువిడచి వెళ్లిపోతుంది .

మహాలక్ష్మి వెళ్లిపోవడంతోనే జగన్నాథుడి అన్ని సంపదలూ అతనిని విడిచి వెళ్లిపోతాయి . దొంగలు పడి అన్ని వస్తువులూ పోయి కట్టుబట్టలతో మిగులుతారు బలభద్రుడు , జగన్నాథుడు . 

మహాలక్ష్మి విడిచి పోవడంతో ఆమెతో పాటు వారికళ కూడా వారిని వీడిపోవడంతో సామాన్యమానవులుగా కనబడడం వల్ల వారిని యెవరూ పోల్చుకోలేరు . సామాన్య మానవులను తలచి పూజారులు వారిని మందిరం లోంచి బయటకు తరిమేస్తారు . తినడానికి యేమీ దొరకక పెద్దపూజారి యింటికి వెళతారు జగన్నాథుడు , బలభద్రుడు . పూజారి తల్లి వారికి వడ్డన చెయ్యగా వారి చెయ్యతగలగానే మొత్తం ఆహారం మాయమవడంతో ఆమె వీళ్లు మాయగాళ్లని వూరినుండి తరిమేస్తుంది . అలా పన్నెండు సంవత్సరాలు తినడానికి తిండిలేక కట్టుకోడానికి బట్టలేక వూరూరా తిరుగుతారు . 

పన్నెండు సంవత్సరాల తరువాత సముద్రం వొడ్డున వున్న ఓ యింటామె అన్నసత్రం వేసిందని తెలుసుకొని అక్కడకి వస్తారు . కులం తెలియని యింటామె యిచ్చే ఆథిధ్యం స్వీకరించ నిరాకరించిన బలభద్రుడు స్వయంపాకం యిప్పించమని తానే వండుకుంటానని అంటాడు . ఎంతసేపు పొయ్యిమీద వుంచినా అన్నం వుడకకపోవడంతో బలభద్రుడు విసిగిపోయి పొయ్యిలో నీళ్లుపోసి యింటామె వడ్డించినది తింటానని అంటాడు . దాసి యిద్దరినీ లోనికి తీసుకు వెళ్లి వడ్డన చేస్తుంది . భోజనానంతరం ' ఛెనాపుఢొపిట్టా '( యీ తీపి వంటకం ఛెన్నా అంటే పాలవిరుగుతో చేస్తారు . ఇది ఒరిస్సాలో ప్రసిధ్ద వంటకం , ఒక్క ఒరిస్సాలో మాత్రమే దొరకుతుంది . మహాలక్ష్మికి యిష్టమైన వంటకం) వడ్డిస్తారు దాసీలు . అది చూడగానే బలభద్రునికి మహాలక్ష్మికి చేసిన అవమానం వల్లే యిన్ని కష్టాలు అనుభవించినట్లుగా అని పిస్తుంది . జగన్నాథునితో అదే విషయం చెప్పి పశ్చాత్తాపం చెందుతాడు , మహాలక్ష్మి యెక్కడున్నా వెళ్లి క్షమార్పణ అడుగుతానని అంటాడు . జగన్నాటకసూత్రధారి ముసిముసిగా నవ్వి ఆలస్యమెందుకు చెప్పమంటాడు . ఏది మహలక్ష్మి అని బలభద్రుడు అడుగుగా ఆ ఇల్లు మహలక్ష్మిదేనని చెప్తాడు జగన్నాథుడు . దాసీలు అన్నదమ్ములను మహలక్ష్మి దగ్గరకు తీసుకు వెళతారు . క్షమార్పణ చెప్తున్న బలభద్రుని వారించి పాదాభివందనం చేస్తుంది మహాలక్ష్మి . పన్నెండేళ్ల తరువాత జగన్నాథుడు మహాలక్ష్మి బలభద్రుల సమేతంగా ఆలయ ప్రవేశం చేస్తాడు . అందుకే పూరీ ఆలయంలో పన్నెండేళ్ల కొకసారి  విగ్రహాలు మార్చే అనవాయితీ వచ్చింది .

లక్ష్మీ పురాణం లో మార్గశిర లక్ష్మివారం  చెయ్యకూడని పనులేమిటో వివరంగా చెప్తారు , దీని తెలుగు అనువాదం మనకి యు-ట్యూబులో దొరుకుతుంది .

మార్గశిర లక్ష్మీపూజ , వ్రతకథ తెలుగు వారిది ఒరియా వారిది తెలుసుకున్నాం కదా , యిప్పడు మనదేశం లోనే వున్న మహాలక్ష్మి మందిరం గురించి తెలుసుకుందాం .

మహాలక్ష్మి కి మనదేశంలో  ' కొల్హాపూర్ ' లో మందిరం వుంది . మహారాష్ట్ర లో సతారా జిల్లాలో వుంది యీ కొల్హాపూర్ .  హైదరాబాదు నుంచి సుమారు 585 కిలోమీటర్లు . రైలు సదుపాయం , బస్సు సదుపాయం కూడా వుంది . హైదరాబాదు నుంచి NH - 50 మీద ప్రయాణంచి కొల్హాపూర్ చేరుకోవచ్చు . పూనా నుంచి సుమారు 230 కిలోమీటర్లు , యిక్కడనుంచి కూడా రైలు , బస్సు , టాక్సీ సదుపాయాలు వున్నాయి . బోంబె బెంగుళూరు హైవే మీద ప్రయాణం చాలా చక్కగా సాగుతుంది . 50 , 60 కిలోమీటర్లు సహ్యాద్రి పర్వతాలపై సాగుతుంది ప్రయాణం , యెండాకాలంలో తప్ప మిగతా కాలాలలో చల్లగా కొండలపైనుంచి ప్రవహించే జలపాతాలను చూస్తూ సాగే ప్రయాణం మరువలేనిది . పూనా నుంచి వెళ్లేవారికి సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణానంతరం వచ్చే ' నారాయణ గావ్ ' లో వున్న వేంకటేశ్వర మందిరం ప్రత్యేక ఆకర్షణ . ముందు వేంకటేశ్వర దర్శనం చేసుకొనితరవాత కొల్హాపూరు వెళుతూ వుంటాం . 

ఈ మందిరం ఓ చిన్న పర్వతం పైన నిజకంపెనీ వారు నిర్మించి నడుపుతున్న మందిరం . ఇక్కడిపూజారులు కూడా తెలుగు వారు కావడం విశేషం . ఈ మందిరం తిరుమల వేంకటేశ్వర మందిరాన్ని తలపింపజేస్తూ వుంటుంది . ఈ మందిర విశేషాలు మరోమారు చెప్పుకుందాం .     కొల్హాపూరు బస్సుస్టాండుకు 5 నిముషాల నడక దూరంలో వుంటుంది మందిరం . కొల్హాపూరు పట్టణం పంచగంగ అని పిలువబడే పవిత్ర నదీతీరాన వుంది . మందిరం చుట్టూరా బురుజులతో కోటగోడ ఆకారంలో కట్టి వుంటుంది . కోటద్వారం దాటగానే కుడివైపున వుంటుంది మందిరం .

పాత రాతి కట్టడం అని చూడగానే తెలిసిపోతుంది . మందిరం 7వ శతాబ్దానికి చెందింది కాగా అమ్మవారి విగ్రహం సుమారు 6 లేక 5 వేల సంవత్సరాలకు పార్వందిగా గుర్తించేరు . బయట హోమాలు అవి జరుగుతూ పెద్ద మంటపం , లోపల గర్భగుడిలో అమ్మవారు . అమ్మవారి విగ్రహం 40 కిలోల విలువైన రాతితో చేసిన విగ్రహం , అయితే యీ రాయ యేమిటి అనేది తెలియరాలేదు కాని నవరత్నాలలో ఒకటి అని మాత్రం అంటారు . పెద్ద రాతి అరుగు మీద వుంటుంది అమ్మవారి విగ్రహం . చక్కగా పట్టుచీర కట్టి సర్వాంలంకారాలతో కళకళ లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ వుంటుంది అమ్మవారు . 

పూర్వం యీ పట్టణం కరవీరపురం గా ప్రసిధ్ద పొందింది . అందుకే యీమెని కరవీరపురనివాసిని , అంబామాయి అని కూడా వ్యవహరిస్తూ వుంటారు . 

గర్భగుడిలో లోపల అమ్మవారి ముఖ్య విగ్రహానికి ముందు యెడమ వైపున పార్వతీదేవి విగ్రహం వుంటుంది , యిక్కడ అమ్మవారికి చీర , రవికల బట్టతో పాటు పసుపుకుంకుమ గాజులు మొదలయినవి సమర్పిస్తూ వుంటారు . మహాలక్ష్మి దర్శనానంతరం బయటకు వెళ్లేదారిలో సరస్వతి విగ్రహం కనువిందు చేస్తుంది . అమ్మవారి విగ్రహం సుమారు మూడడుగులు వుంటుంది . గోడకు రాతి శ్రీచక్రం , విగ్రహానికి వెనుకగా ఆమెవాహనమైన సింహం , కిరీటంగా వేయితలల శేషనాగు దానిపైన శివలింగం వుంటాయి . నాలుగు చేతులలో గద , మ్హలుంగఫలం , ఢాలు , పాత్ర వుంటాయి . అంటే యిక్కడ గర్భగుడిలో ముగ్గురమ్మలు కొలువై వున్నారు . యీ ముగ్గురినీ దర్శించుకొని బయటకు వచ్చేక మందిర ప్రాంగణం లో వున్న రాధాకృష్ణ , గణేశ , విఠోబా రుక్మిణి విగ్రహాలను , శివుడు , మహిషాసుర మర్ధిని స్థలవృక్షాన్ని దర్శించుకుంటాం . ఇందులో కొన్ని పురాతనమైనవి , కొన్ని చాలా కొత్తవి . 

ఇక్కడ అమ్మవారు పార్వతి లక్ష్మి కలయిక గా కనిపిస్తుంది .స్థలపురాణం పరిశీలనతో అది నిజమే అనిపిస్తుంది . ఇక్కడ అమ్మవారి విగ్రహం పడమర ముఖంగా వుంటుంది , 

విష్ణుమూర్తికి వైకుంఠం కన్న యీ క్షేత్రం యెంతో ప్రీతికరం . జగదంబ కరవీరపురాన్ని తన అరచేతిలో పెట్టుకొని నాలుగు వైపులా కాపలా కాస్తూ వుంటుందట . అందుకే మహా ప్రళయకాలంలో కూడా యీక్షేత్రం మిగిలి వుంటుందని యీ క్షేత్రాన్ని అవిముక్తక్షేత్రంఅని అంటారు . దర్శనానంతరం ప్రసాద కూపను యిస్తారు , అది తీసుకొని కాస్తదూరంలో వున్న భోజనశాలకు వెళ్లేం . అక్కడ రెండురకాల కూరలు పప్పు , పులుసు , పచ్చడి , పులిహోర , రెండురకాల తీపి పదార్ధాలతో భోజనం చాలా రుచిగా శుచిగా వుంది . అక్కడ యివ్వదల్చుకున్నవారు మందిర్ ట్రస్టువారికి డొనేషన్ యివ్వొచ్చు . దానికి ప్రతిగా లక్ష్మీదేవి డాలరు ప్రసాదం యిస్తారు .

ఈ మందిరంలో నిత్యపూజలతో పాటు లక్ష్మివారం , శుక్రవారం పౌర్ణమిలకు విశేషపూజలు జరుగుతాయి . ఈ మందిరంలో జరిగే మరో విశేష వుత్సవం యేమిటంటే కిరణోత్సవం .  అమ్మవారి కి యెదురు వున్న కిటికీలోంచి అస్తమించే సూర్యకిరణాలు అమ్మవారి విగ్రహం మీద పడతాయి . ఇలా యేడాదిలో మూడు మార్లు జరుగుతాయి . ప్రతీ సంవత్సరం మార్చి 21 న తిరిగి సెప్టెంబరు 21 న , రధ సప్తమినాడు , ఫిబ్రవరి 1 న నవంబరు 11 న  జరుగుతాయి . అయితే ఫిబ్రవరి 1 న నవంబరు 11 న అస్తమించే సూర్యుని బంగారు కిరణాలు అమ్మవారి ఛాతీని తాకుతాయి . ఫిబ్రవరి 2 న నవంబరు 12న అమ్మవారి శరీరమంతటా తాకుతాయి సూర్యకిరణాలు . అదే  ఫిబ్రవరి 3 న నవంబరు 13న అమ్మవారి పాదాలపై పడతాయి సూర్యకిరణాలు . ఆ రోజులలో వేలాది భక్తులు వచ్చి ఆ అపురూప సన్నివేశాన్ని దర్శించుకుంటారు . ఆస్థికులు దీనిని అమ్మవారి కృప అని చెప్పుకుంటే నాస్థికులు మందిరనిర్మాణం కావించిన శిల్పి యొక్క పనితనంగా చెప్పుకుంటారు . ఏది యేమైనా ఆ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆదృశ్యం వర్ణనాతీతం అనిమాత్రం చెప్పుకుంటారు . రథసప్తమి నాడు సూర్యకిరణాలు అమ్మవారి శరీమంతటా తాకుతాయి .

ఇప్పుడు స్థలపురాణం చెప్పుకుందాం .

కొల్హాపూరు మహలక్ష్మి సతీదేవి యొక్క అష్ఠాదశ పీఠాలలో ఒకటిగా చెప్తారు . ఇక్కడ సతీదేవి కన్ను పడిందట , అందుకే అమ్మవారి కళ్లు కాంతులీనుతూ వుంటాయి . అంతే కాకుండా బృగుమహర్షి కోపోద్రేకంతో లక్ష్మీ వాసమైన విష్ణుమూర్తి ఛాతీ యెడమవైపున తన్నటంతో కోపించిన లక్ష్మి భూలోకానికి వచ్చి కరవీర వృక్షాలతో నిండిన యీ అడవిలో తపస్సుచేసుకోసాగింది . చాలాకాలం తపస్సుచేసుకొని కోపం చల్లారేక వైకుంఠానికి వెళ్లగా అక్కడ విష్ణుమూర్తిని కానక వెతుకుతూ భూలోకానికి వస్తుంది అప్పటికే విష్ణుమూర్తి శ్రీనివాసునిగా అవతరించి లక్ష్మీదేవి ఛాయయైన పద్మావతిని పెళ్లాడుతాడు . పద్మావతి తన ఛాయయని యెరుగని లక్ష్మి విష్ణుమూర్తి పై కోపించి తిరిగి కరవీరపురానికి వెడలిపోతుంది , తిరిగి తపస్సు చేసుకుంటుంది . విగ్రహం వలె చలించకుండా తపస్సుచేసుకుంటున్న స్త్రీ లక్ష్మీదేవి అని యెరుగని జనులు ఆమెకు నీడను కల్పిస్తారు , లక్ష్మీదేవి కరవీరపురవాసులకు వారు యెల్లప్పుడూ సిరిసంపదలతో తులతూగుతూ వుంటారనే వరం యిచ్చి శిలగా మారిపోతుంది .

ఈ విషయం లక్ష్మీపురాణం లోనూ , విష్ణు పురాణం లోనూ , వేంకటేశ్వర వైభవంలోనూ ప్రస్తావించేరు . 

తిరుమల యాత్ర చేసుకున్న తరువాత విధిగా కొల్హాపూరు మహాలక్ష్మిని దర్శించుకోవాలి లేకపోతే వారి యాత్ర పూర్తికాదు . 

మార్గశిర మాసంలో మహాలక్ష్మిని గురించి స్మరించుకుంటూ పాఠకులకు తెలియజేసే అవకాశం కలిగింది నా భాగ్యంగా తలుస్తూ వచ్చేవారం వరకు మీ దగ్గర శలవు తీసుకుంటున్నాను .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam